వెలమలకు ప్రత్యేక కార్పొరేషన్‌

YS Jagan Promises to Velama communities Representatives - Sakshi

వెలమ సంఘాల ప్రతినిధులకు వైఎస్‌ జగన్‌ హామీ

సహకార రంగంలోని చక్కర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని భరోసా

ఉద్యోగాల విప్లవం హామీతో నిరుద్యోగుల హర్షం  

గిట్టుబాటు ధరల్లేవని అన్నదాతల ఆవేదన 

తిత్లీ పరిహారం ఇవ్వలేదని వినతులు 

మనందరి ప్రభుత్వంలో అందరికీ మంచి జరుగుతుందని ప్రతిపక్ష నేత హామీ

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వెలమ కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని తనను కలిసిన వెలమ సంఘాల ప్రతినిధులకు వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 318వ రోజు సోమవారం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో సాగింది. రాగోలు నుంచి ప్రారంభమైన పాదయాత్ర.. దుసిక్రాస్, బావాజీపేట, రాగోలుపేట, గట్టుముడిపేట, వంజంగి, వాకాలవలసక్రాస్, లంకాంక్రాస్‌ మీదుగా నందగిరిపేట వరకు సాగింది. జగన్‌ రాకతో ఊరూరా పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు ఆయనకు తమ సమస్యలు చెప్పుకొన్నారు. ఉద్యోగాల్లేక వలసపోతున్నామని నిరుద్యోగులు, గిట్టుబాటు ధరల్లేవని అన్నదాతలు, చంద్రబాబు హయాంలో మూతబడిన చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించాలని చెరకు రైతులు.. ఇలా పలు సమస్యలను ఆయనకు చెప్పుకున్నారు. మనందరి ప్రభుత్వం వచ్చాక అందరికీ మంచి జరుగుతుందని వైఎస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు.   

వెలమలను ఆదుకోండి 
పాదయాత్ర ప్రారంభంలో వెలమ కులానికి చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు వైఎస్‌ జగన్‌ను కలిసి తమకూ కార్పొరేషన్‌ ఏర్పాటుచేయాలని కోరారు. జాతీయ వెలమ యూత్‌ (శ్రీకాకుళం), బీసీ వెలమ సంక్షేమ సంఘం (విజయనగరం జిల్లా), వెలమ కార్పొరేషన్‌ జేఏసీ (విశాఖ) ప్రతినిధులు ఈ మేరకు వినతిపత్రాలిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వెలమల అభివృద్ధికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు. తాము ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అసెంబ్లీ, పార్లమెంటు సీట్లివ్వాలని, ప్రతి జిల్లాలో వెలమ సంక్షేమ భవనాలను నిర్మించి హాస్టల్‌ వసతి కల్పించాలని కోరారు. వెలమలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని వైఎస్‌ జగన్‌ వారికి హామీ ఇవ్వడంతో ఆయా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. జగన్‌ను కలిసిన వారిలో వెలమ సంఘాల ప్రతినిధులు టి.సత్యనారాయణ, బండారు సతీష్‌కుమార్, డి.రామ్‌ప్రసాద్, సిరిపురపు గౌరీశంకర్, కోరుపోలు సత్యారావు, నర్సింగరావు తదితరులున్నారు.  

ఆమదాలవలస చక్కెర ఫ్యాక్టరీని అటకెక్కించారయ్యా.. 
ఆమదాల వలస చక్కెర ఫ్యాక్టరీని ఈ చంద్రబాబు ప్రభుత్వం చంపేసిందని, దానిని కాపాడండయ్యా.. అంటూ వందలాది మంది చెరకు రైతులు వైఎస్‌ జగన్‌ను కోరారు. ఏటా 60, 70 టన్నుల చెరకుతోలే రైతులు సైతం నేడు ఎందుకూ కొరగాకుండాపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి జగన్‌ స్పందిస్తూ.. మనందరి ప్రభుత్వం వచ్చాక సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని భరోసా ఇచ్చారు.  

మత్స్యకారులకు న్యాయం చేయండి... 
చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు చంద్రబాబు ఇస్తానన్న రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వడం లేదని మత్స్యకార సంఘం ప్రతినిధులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ 173వ నంబర్‌ జీవో జారీచేసి.. ఇప్పుడు ముగ్గురు సభ్యులతో కమిటీ అంటూ చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. తమకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు.. గుజరాత్‌లో మాదిరిగా తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక మినీ ఫిషింగ్‌ జెట్టీని నిర్మించాలని కోరారు.  

నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారన్నా.. 
జాబు రావాలంటే బాబు రావాలని చెప్పి తమను దారుణంగా మోసం చేశారని నిరుద్యోగ సంఘాలు జగన్‌కు ఫిర్యాదుచేశాయి. తాము రోడ్ల మీదికొచ్చి ఉద్యమాలు చేస్తుంటే.. తాటతీస్తాం, జైళ్లకు పంపిస్తాం.. అంటూ చంద్రబాబు ప్రభుత్వం బెదిరిస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధిచెబుతామన్నారు. మనందరి ప్రభుత్వం రాగానే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తానని జగన్‌ వారికి హామీ ఇవ్వడంతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.  

నారాయణపురం కుడి కాల్వను ఆధునికీకరించాలి
నారాయణపురం కాల్వను ఆధునికీకరించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని పలువురు రైతులు కోరారు. గొర్రెలకు బీమా సౌకర్యం కల్పించాలని యాదవులు, తిత్లీ తుపానుకు నష్టపోయి∙వంగ పంటకు పరిహారం ఇవ్వలేదని కూరగాయల రైతులు ఫిర్యాదు చేయడంతో పాటు.. పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలపై పలు ఫిర్యాదులొచ్చాయి. అప్పటికప్పుడు పరిష్కరించదగిన సమస్యలను పరిశీలించాలని తన వ్యక్తిగత సిబ్బందిని ఆదేశిస్తూ.. ప్రభుత్వపరంగా చేయాల్సిన వాటిని ఎలా చేయవచ్చో చూడాల్సిందిగా తన కార్యాలయ సిబ్బందికి సూచిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు. 

వైఎస్సార్‌ తర్వాత రైతును పట్టించుకున్న వారే లేరయ్యా.. 
అయ్యా.. వైఎస్సార్‌ తర్వాత రైతులను పట్టించుకునే నాథుడు లేకుండాపోయాడు. దగ్గర్లో వంశధార నది ఉన్నా మా పొలాలకు నీరు రాదు. నారాయణపురం ఎడమ కాలువ ద్వారా మా తోటాడ గ్రామానికి సాగునీరందడం లేదు. ఆమదాలవలసలో చెరుకు ఫ్యాక్టరీ మూత పడడంతో కొనుగోలు సక్రమంగా జరగక రైతులకు గిట్టుబాటు ధరలు రావడంలేదు. మీరొచ్చాక.. సాగునీటి సమస్యలు తీర్చి.. చెరకు ఫ్యాక్టరీని తెరిపించాలన్నా..     
– తోటాడ గ్రామానికి చెందిన రైతులు, ఆమదాలవలస మండలం 

డీఎస్సీ పోస్టుల్లో కోతపెట్టారు 
అన్నా.. ఈ ప్రభుత్వం డీఎస్సీలో పోస్టులకు కోత పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల పోస్టులుంటే అరకొరగా ఏడు వేల పైబడి పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏంటీ? ఇప్పుడు వీరు చేస్తున్నదేంటి? నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్నా.  
– దాసరి చరణి, రాగోలు గ్రామం, శ్రీకాకుళం జిల్లా.

వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమని మా పింఛన్‌లు తొలగించారన్నా.. 
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమని మా పింఛన్‌లు నిలిపేశారన్నా.. వైఎస్సార్‌ హయాంలో నాకు పింఛన్‌ వచ్చేది. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్‌ ఇవ్వడం లేదు. రిక్షా కూలి అయిన నా తండ్రిని చూసి కూడా ఈ పాలకులు కనికరం కూడా చూపడం లేదన్నా.. మీరు అధికారంలోకి వచ్చాక మాకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం.  
– పోలాకి నీలవేణి, దివ్యాంగురాలు, రాగోలుపేట. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top