నాగావళిపై జనం పరవళ్లు 

YS Jagan Prajasankalpayatra in Palakonda And Rajam constituency - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు జన నీరాజనం 

రాజాం నియోజకవర్గంలో ఘన స్వాగతం 

దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న ప్రజలు 

అన్నీ కష్టాలేనని వాపోయిన అన్నదాతలు 

హామీలేవీ అమలు చేయలేదని బాబుపై మండిపాటు 

అందరి కష్టాలు ఓపికగా విని ధైర్యం చెప్పిన జగన్‌  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి:  ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 309వ రోజు శనివారం శ్రీకాకుళం జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలాది మంది ప్రజల నీరాజనాల మధ్య సాగింది. మధ్యాహ్నానికి పాలకొండ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసి, రాజాం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సంకిలి వద్ద నాగావళి నదిపై ఉన్న బ్రిడ్జి వద్ద స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు జగన్‌కు ఘన స్వాగతం పలికారు.  తమ ప్రాంతానికి జగనన్న వస్తున్నాడని భారీ సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు తరలి వచ్చారు. ఆనందోత్సాహాలతో హడావుడి చేశారు. వంతెనపై కనుచూపు మేర జనమే. దారి పొడవునా చిన్న గ్రామాలే ఉన్నప్పటికీ జనం భారీగా గుమి కూడటంతో జగన్‌ యాత్ర నిదానంగా సాగింది. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, అడిగిన వారందరితో కాదనకుండా సెల్ఫీలకు అవకాశం కల్పిస్తూ ఆయన ముందుకు సాగారు.  

ఇష్టానుసారం పింఛన్లు తొలగించారయ్యా.. 
సంతకవిటి మండలంలో వందల సంఖ్యలో అర్హులైన వృద్ధుల పింఛన్లు తొలగించారని, వారంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులనే ఉద్దేశంతోనే జన్మభూమి కమిటీలు ఇలా చేశాయని బాధితులు జగన్‌కు ఫిర్యాదు చేశారు. ‘అయ్యా.. అకారణంగా మా పింఛన్లు తొలగించారు. మాకు అన్ని అర్హతలున్నప్పటికీ అన్యాయం చేశారు. నువ్వు ముఖ్యమంత్రి కాగానే జన్మభూమి కమిటీలను రద్దు చేయాలయ్యా’ అని పలువురు వృద్ధులు జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎం.సీతారాంపురానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ బూత్‌ కమిటీ సభ్యుడైనందున జన్మభూమి కమిటీ సభ్యులు దాడి చేసి కొట్టారని జగన్‌కు ఫిర్యాదు చేశారు. నాగావళికి ప్రతి ఏటా వచ్చే వరదల వల్ల వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందడం లేదని గోపాలపురం, బుక్కురు, తంపటపల్లి, మంగళపురం, అన్నవరం, పాలకొండ రైతులు జగన్‌కు చెప్పుకుని వాపోయారు. తాము డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించుకున్నప్పటికీ ఇప్పటికీ కాంట్రాక్టు పద్ధతిలోనే ఉంచారని, ఇది అన్యాయమని ఎంపీహెచ్‌ఎస్‌ ఉద్యోగులు జగన్‌ దృష్టికి తెచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారని పలు చోట్ల మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థినులు జగన్‌ దృష్టికి తెచ్చారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు. అంతకు ముందు ఆయన ఓ అభిమాని రూపొందించిన ‘అలుపెరుగని యోధుడు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

విజయ స్థూపానికి శంకుస్థాపన 
ఇచ్ఛాపురం రూరల్‌: రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర   శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలో ముగియనున్న సందర్భంగా లొద్దపుట్టి వద్ద ‘విజయ స్థూపం’ నిర్మాణ పనులకు ఆ పార్టీ నేతలు శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ పాదయాత్ర చరిత్రాత్మకమని, ప్రజల గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ వేస్తున్న అడుగులు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, దమన నీతి, దుర్మార్గపు రాజకీయం, వంచనపై గునపాల్లాంటివన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాడు ప్రజా సంకల్ప యాత్రతో సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించి తెలుగు ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయారని చెప్పారు.  అదే స్ఫూర్తితో వైఎస్‌ జగన్‌.. చంద్రబాబు దుర్మార్గపు పాలనను కూకటి వేళ్లతో పెకిలించడానికే ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ ధర్మాన ప్రసాదరావు, ఉత్తరాంధ్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాసరావు, పార్టీ నేతలు సాయిరాజ్, డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, పేడాడ తిలక్, గొర్లె కిరణ్‌కుమార్, నర్తు రామారావు, పిలక రాజ్యలక్ష్మి, కాయల వెంకటరెడ్డి, ఇప్పిలి లోలాక్షి, జామి జయ  పాల్గొన్నారు.

ఉపాధితో వ్యవ‘సాయం’ చేయండి   
అయ్యా.. నాది బూర్జ మండలం తోటవాడ. గ్రామాల్లో ప్రస్తుతం ఉపాధి హామీ పనులు పూర్తి స్థాయిలో జరగడం లేదు. మరో పక్క రైతులకు వ్యవసాయం భారంగా మారుతోంది. రైతులు బాగు పడాలంటే వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేసేలా చూడంది. ప్రస్తుతం వ్యవసాయ పెట్టుబడులు, కూలీ ఖర్చులు భారంగా మారాయి. వ్యవసాయం వదిలేద్దామనే దుస్థితి నెలకొంది. మీరు ఈ పరిస్థితి మార్చాలి. 
– దూబ కృష్ణమూర్తి  

కక్షతో పింఛన్‌ తొలగించారు..   
అయ్యా.. నాది పాలకొండ మండలం గోపాలపురం. గతంలో నాకు రూ.200 పింఛను నెల నెలా వచ్చేది. టీడీపీ ప్రభుత్వం రాగానే నేను వైఎస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుడిననే కక్షతో వృద్ధాప్య పింఛన్‌ను తొలగించింది. 73 ఏళ్ల వృద్ధుడిని, అర్హుడిననే విషయాలను పక్కన పెట్టి జన్మభూమి కమిటీ ఇలా చేసింది. మీరు సీఎం అయితేనే ఈ పరిస్థితి మారుతుంది.  
– యలకల గురువునాయుడు 

‘చెత్త’ సమస్యపై సర్కారు నిర్లక్ష్యం    
దశాబ్ధాల కాలంగా చెత్త కుప్ప మధ్య జీవిస్తున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం పట్టించుకోలేదు. పాలకొండ పట్టణంలో సేకరించిన చెత్తను మా వీధి పరిసరాల్లో డంప్‌ చేస్తున్నారు. దీంతో వందల కుటుంబాలు త్రీవ ఇబ్బందులు పడుతున్నాయి. రాజకీయ కక్షలతో అర్హుల పింఛన్లు అన్యాయంగా తొలగించారు. వీధిలైట్లు, గృహాల మంజూరు, సంక్షేమ పథకాల వర్తింపులో కూడా తీవ్ర అన్యాయం జరుగుతోంది.     
– యందవ మరియదాసు, కస్పావీధి, పాలకొండ.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top