61వ రోజు పాదయాత్ర డైరీ

ys jagan prajasankalpayatra dairy 61th day - Sakshi

ప్రజలు ఆర్థికంగా నష్టపోతే.. ఆదుకునే తీరు ఇదేనా?

13–01–2018, శనివారం 
నెన్నూరు,
చిత్తూరు జిల్లా

ఉదయం కొద్దిదూరం నడవగానే పేదవాని కష్టార్జితం ఏ విధంగా మందిపాలవుతోంది.. అనే దానికి నిదర్శనం ఎదురైంది. కుప్పంబాదూరు గ్రామానికి చెందిన బత్తల సుబ్రహ్మణ్యం అనే అగ్రిగోల్డ్‌ బాధితుడు వచ్చి ‘అయ్యా.. నేను అగ్రిగోల్డ్‌లో చేరాను. నా బంధువులు, పరిచయస్తులు దాదాపు వంద మందిని చేర్పించాను. నేను రూ.5 లక్షలు కట్టి, మిగతా వారితో రూ.10 లక్షలు కట్టించాను. ఇప్పుడు నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. డబ్బు కట్టిన వారు రోజూ ఇంటి వద్దకు వచ్చి కూర్చుంటున్నారు. టెన్షన్‌తో షుగర్, బీపీ కూడా వచ్చాయి. ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. పిల్లల ముఖాలు చూసి, మంచి రోజులు వస్తాయన్న ఆశతో బతుకుతున్నాను’అని కన్నీటి పర్యంతమయ్యాడు.

అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు వింటుంటే కడుపు తరుక్కుపోతోంది. నోరు కట్టుకుని, రూపాయి రూపాయి కూడబెట్టి కూతురి పెళ్లికో, కొడుకు చదువుకో అక్కరకు వస్తాయనే గంపెడాశతో అగ్రిగోల్డ్‌లో దాచుకుంటే చివరికి ‘ఈనగాచి.. నక్కల పాలైనట్లు’తయారైంది. అగ్రిగోల్డ్‌లో బాధితులు మన రాష్ట్రంలోనే 9 లక్షల మందికి పైగా ఉన్నారు. వారిలో అత్యధికులు కూలీలు, చిన్న, సన్నకారు రైతులు, కార్మికులు, మధ్యతరగతి జీవులే. జీవిత కాలం కష్టపడి సంపాదించిన డబ్బు ఇక రాదన్న బెంగతో దాదాపు 200 మంది తుదిశ్వాస విడిచారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మిన్నకుండిపోవడంలో ఆంతర్యమేంటి? తక్షణం రూ.1,100 కోట్లు విడుదల చేస్తే.. దాదాపు 80శాతం మంది బాధితులకు ఉపశమనం కలుగుతుందని తెలిసి కూడా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? గతేడాది నేను అగ్రిగోల్డ్‌ బాధితులకు బాసటగా.. వారి దీక్షా శిబిరాన్ని సందర్శించిన వెంటనే ఈ ప్రభుత్వం హడావుడిగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి కూడా ఇద్దరికో, ముగ్గురికో తప్ప పరిహారంఇవ్వలేదంటే వీరికున్న చిత్తశుద్ధి అర్థమవుతోంది. తన పాలనలో ప్రజలు ఆర్థికంగా మోసపోతే ఒక ప్రభుత్వం ఆదుకునే తీరు ఇదేనా? మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1,100 కోట్లు విడుదల చేసి 80 శాతం మంది బాధితులకు తక్షణ ఉపశమనం కల్గించాలన్న నా సంకల్పం మరింత దృఢమైంది.  

రాష్ట్రంలోని అతి పెద్ద చెరువులలో ఒకటైన రాయల చెరువు వెంబడి నడుస్తున్నప్పుడు ఒక గొప్ప అనుభూతికి లోనయ్యాను. ఈ చుట్టుపక్కల ఏడు మండలాల భూగర్భ జలాలకు ఆధారమైన చెరువది. దాదాపు 500 సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయలు తవ్వించారట. వారి దార్శనికతకు అచ్చెరువొందాను. కరువు నివారణకు, భావితరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెరువులు తవ్వించిన నాటి పాలకుల తీరుకు, రెయిన్‌ గన్నులు, ఇంకుడు గుంతలంటూ.. ప్రజలను మభ్యపెడుతూ, ఓట్ల కోసమే ఆలోచిస్తున్న నేటి నాయకుల సంకుచిత రాజకీయ ఆలోచనలకు ఎంత వ్యత్యాసమో కదా! 

 సంజీవపురం వద్ద రాయవ్వ అనే 67 ఏళ్ల అవ్వ కలిసింది. ఆమెది మనసుకు కష్టం కలిగించే బాధ. 40 ఏళ్ల కిందటే ఆమె భర్త చనిపోయాడట. కూతురు కూడా చనిపోయిన విషాదం ఆమెది. ఆ అవ్వకు నాన్నగారి హయాంలో వితంతు పింఛన్‌ వచ్చేదట. ఇప్పుడా పింఛన్‌ ఆపేశారట. కాసేపటికే బలిజపల్లి హరిజనవాడకు చెందిన బుజ్జమ్మ అనే ఓ అక్క తన పదేళ్ల కొడుకుని ఎత్తుకుని వచ్చింది. ఆ బిడ్డ పుట్టుకతోనే మూగ, చెవుడు అట. వందశాతం వైకల్యం ఉన్నట్టు డాక్టర్లు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారట. అయినా పింఛన్‌ రావడంలేదని ‘వచ్చేలా చెయ్యన్నా..’అంటూ అర్జీ ఇచ్చింది. పుట్టుకతో మూగ, చెవుడు అయిన పిల్లాడికి ఆపరేషన్‌ చేయించకపోవడమేగాక, పింఛన్‌ కూడా ఇవ్వకపోవడం చాలా దారుణం. ఇలా ఇంటికొకటి ఇచ్చే పింఛన్‌లకే దిక్కు లేకపోతే.. బాబుగారు సరికొత్తగా ఇప్పుడు ఇంట్లో ఇద్దరు, ముగ్గురు అర్హులున్నా ఇస్తామంటున్నారు. ఆయనకు ఈ అర్హులు కనిపించలేదా? ఇక రెండు పింఛన్‌ల సంగతి నమ్మేదెలా? నాలుగేళ్లు గడిచిపోయి.. ఇక ఏడాదిలో ఎన్నికలు వస్తాయనగా ఇప్పుడు ఇన్ని డ్రామాలా? 

నడవలూరు వద్ద పదవీవిరమణ చేసిన పారామిలిటరీ బలగాల సంఘ నేతలు కలిశారు. మిలిటరీతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమను ఎక్స్‌సర్వీస్‌మన్‌లుగా గుర్తించాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచించినా.. రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని వాపోయారు. దేశ సరిహద్దులలోనూ, అంతర్గతంగానూ ప్రాణాలొడ్డి దేశరక్షణకై పోరాడుతున్న బలగాల పట్ల మానవత్వంతో ఆలోచించాల్సిన బాధ్యత పాలకులకు ఉండాలి కదా. వారి త్యాగాలకు ఈ ప్రభుత్వం ఇచ్చే విలువ ఇదేనా?

చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని ఎన్నికల ముందు మాటిచ్చి, ఆదుకునే మార్గాలు కళ్ల ముందు కనిపిస్తున్నా.. పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి? ఆ ఆస్తులపై మీ బినామీల, మంత్రుల కన్ను పడటమే కారణం కాదా?


రాయలచెరువు వద్ద జగన్‌తో సెల్ఫీ దిగుతున్న ఆంజనేయస్వామి వేషధారి 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top