నేడు విశాఖ నగరంలోకి ప్రజా సంకల్ప యాత్ర

YS Jagan Prajasankalpa Yatra into Visakhapatnam city today - Sakshi

గాజువాక మినహా సిటీలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల మీదుగా సాగనున్న పాదయాత్ర 

వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ఉవ్విళ్లూరుతున్న విశాఖవాసులు

నేడు వైఎస్సార్‌సీపీలోకి నేదురుమల్లి రామ్‌కుమార్‌

సాక్షి, విశాఖపట్నం : ప్రజాకంటక పాలనపై సమరభేరి మోగిస్తూ రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల మీదుగా ఉత్తరాంధ్రలోకి అడుగిడిన ప్రజా సంకల్ప యాత్ర శనివారం మహావిశాఖ నగరంలోకి అడుగుపెడుతోంది.  గ్రేటర్‌ విశాఖ పరిధిలోని 66వ వార్డులో కొత్తపాలెం వద్ద నగరంలోకి ప్రవేశిస్తున్న పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికేందుకు మహానగర వాసులు ఉవ్విళ్లూరుతున్నారు. తమ కష్టాలు తెలుసుకుని.. కన్నీళ్లు తుడిచేందుకు ఎండనక వాననక పాదయాత్రగా వస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అఖండ స్వాగతం పలికేందుకు విశాఖ నగరం ముస్తాబైంది. కొత్తపాలెం మొదలుకుని నగర పరిధిలో పాదయాత్ర సాగే దారుల్లో అడుగడుగునా స్వాగత ద్వారాలు, భారీ ఫ్లెక్సీలు, వైఎస్సార్‌సీపీ జెండాలు, తోరణాలతో మహానగరం సిద్ధమైంది. అలుపెరగని మహా పాద యాత్రికుడి అడుగులో అడుగు వేసేందుకు విశాఖ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

ఈ నెల 14వ తేదీన గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 188.6 కిలోమీటర్లు పూర్తిచేసుకుని శనివారం విశాఖలోకి అడుగిడుతోంది. గ్రామీణ జిల్లాలో మూడు పట్టణాలు, 15 మండలాల మీదుగా పాదయాత్ర చేసిన జననేతకు ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. నర్సీపట్నం మొదలుకుని.. సబ్బవరం వరకు జరిగిన ఏడు బహిరంగ సభల్లో జన కెరటాలు ఎగసిపడ్డాయి. జననేత ఇచ్చిన హామీలు.. భరోసా.. వారిలో కొండంత స్థైర్యాన్ని నింపాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో నగర పార్టీ అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్, పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు తైనాల విజయకుమార్, పార్లమెంటు కోఆర్డినేటర్‌ ఎంవీవీ సత్యనారాయణ, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లతో కలిసి విస్తృత ఏర్పాట్లు చేశారు. గాజువాక మినహా సిటీలోని మిగిలిన అన్ని నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగేలా రూట్‌ మ్యాప్‌ తయారుచేశారు. కొత్తపాలెం వద్ద శంఖం పూరిస్తున్న జననేత భారీ కటౌట్‌తో కూడిన స్వాగత ద్వారం విశేషంగా ఆకట్టుకుంటోంది. వైఎస్‌ జగన్‌ శనివారం నగరంలోకి అడుగు పెట్టే సమయంలోనే కోటనరవకాలనీ వద్ద మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌ తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరనున్నారు. 

9న కంచరపాలెం మెట్ట వద్ద భారీ బహిరంగ సభ
మహానగర పరిధిలో ఆదివారం భారీ బహిరంగ సభ జరగనుంది. కంచరపాలెం మెట్ట వద్ద నిర్వహించ తలపెట్టిన సభకు విశాఖ నగర పరిధిలో నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. సభ జరిగే ప్రాంతాన్ని శుక్రవారం పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్‌ కమిటీ కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, పార్టీ నగర అధ్యక్షుడు మళ్ల విజయప్రసాద్‌ తదితరులు పరిశీలించారు. ఇదిలా ఉండగా సిరిపురం జంక్షన్‌లోని విజ్ఞాన్‌ స్కూల్‌ సైట్‌లో 10వ తేదీన బ్రాహ్మణుల ఆత్మీయ సదస్సు, 12న ముడసర్లోవ (బీఆర్‌టీఎస్‌) రోడ్డులో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సులు జరగనున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top