బాబును సీఎం సీట్లో కూర్చోబెట్టి మేము రోడ్డున పడ్డాం..

Ys jagan praja sankalpa yatra in east godavari district - Sakshi

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎదుట వాపోయిన కాపు మహిళలు

ముద్రగడనూ మంచం పట్టేలా చేశాడు

నాలుగేళ్లు ఏమీ చేయకుండా ఇప్పుడు హంగామా.. అందుకే బాబును నమ్మలేం.. జగన్‌ మాటనే నమ్ముతాం

రూ.10 వేల కోట్లు ఇస్తానన్న జననేతకు కాపు మహిళల సత్కారం

దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న జనం.. రైతు రుణమాఫీ లేదు, ఫీజు రీయింబర్స్‌మెంటూ లేదు..

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబును ముఖ్యమంత్రి సీట్లో కూర్చో బెట్టినందుకు మేము రోడ్ల మీదకు రావాల్సి వచ్చింది. బాబు ఇస్తానన్న రిజర్వేషన్లు ఎక్కడ అని అడిగినందుకు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని నానా ఇక్కట్లు పెట్టి మంచం పట్టేలా చేశాడు చంద్రబాబు. ఆయన మాటలు ఇంతకాలం నమ్మి మోసపోయాం’ అని కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు మహిళలు, ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆయన మాటలు నమ్మే ప్రసక్తే లేదని, మీ వెంటే నడుస్తామని స్పష్టీకరించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గురువారం 227వ రోజు వైఎస్‌ జగన్‌ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు శివార్లలోని తాటిపర్తి క్రాస్‌ నుంచి చెందుర్తి వరకు పాదయాత్ర కొనసాగించారు.

ఈ సందర్భంగా పలువురు కాపు మహిళలు జగన్‌ను కలిసి తమ సామాజిక వర్గానికి రూ.10 వేల కోట్లు ఇస్తానని చెప్పినందుకు హర్షం వ్యక్తం చేశారు. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. ఆయనతో పాటు అడుగులో అడుగు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు ఇవ్వకపోగా, కాపు కార్పొరేషన్‌కు ఏటా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లలో 5 వేల కోట్లు ఇవ్వడానికి బదులు కేవలం రూ.1,340 కోట్లు ఇచ్చి మోసం చేశారంటూ మండిపడ్డారు.

నాలుగేళ్లు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పుడు కాకుండా ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవాలని అనుకున్నప్పుడే అసెంబ్లీలో తీర్మానం అంటూ హడావుడి చేసి కేంద్రానికి పంపారన్నారు. కాపులకు మొదటి నుంచి అండగా నిలిచిందీ జగనే అన్నారు. వైఎస్‌ జగన్‌ హామీని తాము మనస్పూర్తిగా విశ్వసిస్తున్నామని చెప్పారు. జగన్‌కు అభినందనలు తెలిపిన వారిలో రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, శ్రీదేవి, చిట్నీడి సత్యవతి, పోలిశెట్టి పద్మావతి, జక్కంపూడి విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.
 
మా పరిస్థితి దారుణమయ్యా..
రాష్ట్రంలో కౌలు రైతులను ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని పలువురు జగన్‌కు ఫిర్యాదు చేశారు. పంటలు గిట్టుబాటు కాక, పరపతి సౌకర్యం లేక, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు తెచ్చిన అప్పులు తీర్చలేక ఈ ప్రాంతంలో కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శిస్తే ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని ప్రజా ప్రతినిధులు, అధికారులు అటు వైపే చూడడం లేదని ఏకే మల్లవరం గ్రామానికి చెందిన కౌలు రైతు పాలెపు జోగిరాజు (మూడేళ్ల క్రితం మృతి చెందాడు) భార్య నూకరత్నం వాపోయారు.  
 
ఇది దయలేని ప్రభుత్వం..
ఈ ప్రభుత్వానికి అసలు మానవత్వమే లేదని, నిర్దయగా వ్యవహరిస్తోందని వివిధ వర్గాల ప్రజలు వాపోయారు. రుణమాఫీ కాకపోవడంతో కొత్తగా పంట రుణాలు కూడా ఇవ్వడం లేదని గొల్లప్రోలు రైతులు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వచ్చిన డబ్బు వచ్చినట్టు బ్యాంకుల వాళ్లు వడ్డీలకే జమ చేసుకుంటున్నారని వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక చదువుల్ని మధ్యలోనే ఆపాల్సి వస్తోందని ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థులు జగన్‌కు చెప్పారు. వైఎస్సార్‌ పుణ్యాన ఎంతో మంది పేద కుటుంబాల విద్యార్థులు ఇంజినీర్లు, డాక్టర్లు అయితే ఇవాళ చదువు మధ్యలోనే మానుకోవాల్సి వస్తోందని వాపోయారు. దివ్యాంగుల పట్ల కూడా ఈ ప్రభుత్వం కనికరం చూపడం లేదని, పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. తాటిపర్తి శివార్లలో పిఠాపురం, విజయవాడకు చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు.
 
జగన్‌ సీఎం అయితే మా ఇల్లు పూర్తవుతుంది  
పేద కుటుంబానికి చెందిన నేను, నా కోడలు ఇంటి రుణానికి దరఖాస్తు చేసుకున్నాం. మంజూరైంది.. ఇల్లు కట్టేసుకోండని చెప్పడంతో నిర్మాణ పనులు మొదలు పెట్టాం. ఎంతకీ బిల్లులు మంజూరు కాలేదు. అధికారులను అడిగితే పట్టించుకోలేదు. అప్పు తెచ్చిన సొమ్ముతో స్లాబ్‌ వరకు నిర్మించాం. భర్త, కొడుకు ఇద్దరూ చనిపోయారు. ఈ ప్రభుత్వం పేదవాళ్లకు చేసే సాయం ఇదేనా? జగన్‌ వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం.      
– కూనిశెట్టి చక్రమాణిక్యం  

వైఎస్సార్‌ పుణ్యమా అని ఎంతో మంది పేదలు ఇంజినీర్లయ్యారు 
ఇంజినీరింగ్‌ విద్య అంటే మాలాంటి పేదోళ్లు చదివేది కాదనుకునేవాళ్లం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం పుణ్యమా అని ఎంతో మంది పేద విద్యార్థులు ఇంజనీర్లు అయ్యారు. నేను 2015లో చేబ్రోలులోని ఆదర్శ ఇంజినీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో చేరాను. ఇప్పుడు ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాను. వైఎస్సార్‌ ఆ రోజుల్లో ఈ పథకాన్ని ప్రారంభించి ఉండకపోతే ఈ ప్రభుత్వాలు మాకు చదువుకునే అవకాశం కల్పించేవి కాదన్నది వాస్తవం.      
– సోమిశెట్టి మణి వెంకటరామ్‌

ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోలేదయ్యా..
నా భర్త జోగిరాజు 2015లో నాలుగు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పంట సాగు చేశాడు. హుద్‌హూద్‌ తుపాన్‌ వల్ల సార్వ పంట ఈనిక దశలో దెబ్బతింది. పంట పెట్టుబడి, ఇంటి ఖర్చు కోసం చేసిన అప్పు మొత్తం రూ.7.60 లక్షలు మిగిలింది. ఎలా చెల్లించాలో దిక్కుతోచక నా భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ, అధికారుల ద్వారా ఎలాంటి సాయం అందలేదు. వాళ్ల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. తాటాకింట్లో ఉంటున్నాం.     
– పాలెపు నూకరత్నం 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top