జననేతకు జైకొట్టిన జగ్గంపేట

Ys jagan praja sankalpa yatra in east godavari district - Sakshi

వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు జననీరాజనం

పోటెత్తిన మహిళలు, యువత, విద్యార్థులు

దారిపొడవునా సమస్యలు చెప్పుకున్న వివిధ వర్గాల ప్రజలు

బెల్లం తయారీ గిట్టుబాటు కావడం లేదని వాపోయిన రైతులు

ఎకరాకు రూ.10 వేలు నష్టపోతున్నామన్న చెరకు రైతులు

అందరి కష్టాలు ఓపికగా విన్న ప్రతిపక్ష నేత.. ఆదుకుంటామని భరోసా

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలను వింటూ, వారికి భరోసా కల్పిస్తూ.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాగిస్తున్న ప్రజాసంకల్పయాత్రకు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గంలో పార్టీ ఫిరాయింపుదారుల గుండెలు గుభేల్‌మనిపించేలా ఆదివారం 223వ రోజు పాదయాత్రకు జనసంద్రం పోటెత్తింది. ఉదయం పాదయాత్ర ప్రారంభానికి ముందే శిబిరం వద్దకు జనం భారీగా తరలివచ్చారు.

ఓ వైపు జల్లులు పడుతున్నా జగన్‌ తన పాదయాత్రను యథాతథంగా ప్రారంభించారు. జననేతకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతూనే తమ బాధలు చెప్పుకోవడానికి వర్షంలోనూ బారులుతీరారు. చిన్నా, పెద్దా, వృద్ధులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల వారు జగన్‌ను కలిసి సమస్యలు చెప్పుకున్నారు. రామవరంలో గతంలో ఎన్నడూ లేనిరీతిలో మహిళలు, యువత రోడ్లపైకి వచ్చారు. జగన్‌తో మాట్లాడాలని, కరచాలనం చేయాలని ఉవ్విళ్లూరారు. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వృద్ధులను పలకరిస్తూ.. వారి సమస్యలు ఆలకిస్తూ.. వారికి మరింత భరోసా కల్పిస్తూ జగన్‌ ముందుకు కదిలారు.

కిర్లంపూడి మండలం గోనేడలో జనసందోహం పోటెత్తింది. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి వచ్చినప్పుడు జనం ఇలా బయటకు వచ్చారని, మళ్లీ ఇప్పుడే అలాంటి దృశ్యాలను చూస్తున్నామని పలువురు పేర్కొన్నారు. మా అండ మీకేనంటూ ప్రజలు పాదయాత్రలో జగన్‌తో పాటు అడుగులు వేశారు. గోనేడ దాటేందుకు దాదాపు గంట సమయం పట్టిందంటే జనాభిమానం ఏ మేర ఉందో స్పష్టమవుతోంది. గోనేడ – తామరాడ మధ్య ఏలేరు కాలువ వంతెనపై నుంచి యాత్ర సాగినప్పుడు ఏలేరు పోటెత్తిందా అన్నట్లుగా జనం కనుచూపు మేర కనిపించారు.  

ఆయిల్‌ పామ్‌ రైతులు పిప్పి.. పిప్పి..
రామవరం శివార్లలో ఆయిల్‌ పామ్‌ రైతులు వైఎస్‌ జగన్‌కు వారి కష్టాలు చెప్పుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణంలో 70 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందని, అయినా తమకు అన్యాయమే జరుగుతోందని వివరించారు. ఏపీలోని ఫ్యాక్టరీకి, తెలంగాణలోని ఫ్యాక్టరీకీ నూనె రికవరీలో 2 శాతం తేడా ఉందని, ఏపీ రైతులు టన్నుకు రూ.1000 వరకు నష్టపోతున్నట్టు తెలిపారు. ఈ లెక్కన ఈ ఏడాది సుమారు రూ.140 కోట్లు నష్టపోయారన్నారు.

తెలంగాణ ఆయిల్‌ ఫెడ్‌లో నూనె రికవరీ 18.43 శాతం ఉంటే ఏపీలో 16.40 శాతం ఉన్నట్లు చూపుతున్నారని జగన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై తమకు న్యాయం చేయడంతో పాటు కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశం కల్పించాలని విన్నవించారు. ఇలా దారిపొడవునా వందలాది మంది జననేతతో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉపాధి హామీ పథకంలో 12 ఏళ్లుగా పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు జననేతను కలిశారు. కనీస వేతన చట్టం ప్రకారం రూ.18 వేలు ఇప్పించేలా చూడాలన్నారు. ఏపీ పంచాయితీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

తమకు గుర్తింపు ఇవ్వడంతో పాటు నిలిచి పోయిన కమ్యూనిటీ పారా మెడిక్స్‌ శిక్షణను కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ఆర్‌ఎంపీలు విన్నవించారు. ప్రభుత్వం టెట్‌ను మాత్రమే పదేపదే నిర్వహిస్తూ టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను మాత్రం ఇవ్వడం లేదని నిరుద్యోగ టీచర్‌ అభ్యర్థులు వాపోయారు. టెట్‌ కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని న్యాయస్థానాలు, ఎన్‌సీటీఈ చెప్పినా దానికి వెయిటేజీ ఇస్తూ విద్యార్థులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. అందరి సమస్యలు విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.  

మా బతుకే చేదు.
‘బెల్లం తీపే గానీ మా బతుకులు మాత్రం చేదేకదయ్యా.. వ్యవసాయదారుని బతుకంతా అమ్మబోతే అడవి, కొనబోతే కొరివిగా మారింది. చెరకు పంట గిట్టుబాటు కావడం లేదు. చెరకు నరికి గానుగాడించి బెల్లం తయారు చేస్తుంటే కిలో బెల్లాన్ని రూ.30, రూ.35లకు కూడా వ్యాపారులు మా దగ్గర కొనడం లేదు’ అని రామచంద్రాపురం వద్ద చెరకు రైతులు జగన్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు కామిశెట్టి వీరభద్రం, గంధం వెంకట రమణ, నాగమిల్లి నాగబాబు తదితరులు బెల్లం తయారీ విధానాన్ని జగన్‌కు వివరించారు. బెల్లం తయారీకి అవుతున్న ఖర్చు, దక్కుతున్న ధర, మార్కెట్‌కు తరలింపు.. కష్టనష్టాలను వారు జననేతకు వివరించారు.

పది కిలోల బెల్లానికి రూ.400 వరకు ఖర్చవుతుంటే చేతికి రూ.300, రూ.350 కూడా రావడం లేదని వాపోయారు. ఈ లెక్కన ఎకరాకు  రూ.20 వేల నుంచి రూ.25 వేలు నష్టపోతున్నామని చెప్పారు. కిలో బెల్లానికి కనీసం రూ.50 ఇవ్వాలని, ఎగుమతికి అనుమతించాలని కోరారు. వైఎస్‌ హయాంలో నంబర్‌ వన్‌ బెల్లాన్ని క్వింటా రూ.6 వేలకు కూడా అమ్మి లాభపడ్డామని చెప్పారు. అనంతరం వీరవరం శివార్లలో మర్లోవ, పెద్దాపురం మండలం సిరివాడ గ్రామాలకు చెందిన చెరకు రైతులు జగన్‌ను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఎకరా చెరకు సాగు చేయడానికి (కౌలుతో కలిపి) సగటున రూ.70 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు.

సగటు దిగుబడి 35 టన్నుల దాకా వస్తుందని, రేటు మాత్రం రూ.2750 నుంచి రూ.2,830 మధ్య ఉంటోందన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే తమకు మంచిధర వచ్చిందని వివరించారు. చెరకును నరికి ఫ్యాక్టరీకి పంపించడానికి రూ.1000–రూ.1200 ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరంలో చెరకు పండిస్తే ప్రస్తుతం రూ.10 వేలు నష్టపోవాల్సి వస్తోందని, వ్యవసాయం ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని వాపోయారు. రైతుల సమస్యలపై మరింత అధ్యయం చేసి ఆదుకుంటామని జగన్‌ హామీ ఇచ్చారు.

దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకోవడం లేదయ్యా...
రాష్ట్రంలో వేలాది మంది దివ్యాంగులు నాలుగేళ్లుగా నరకం చూస్తున్నారు. వైకల్యంతో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇస్తున్న రూ.1500 పింఛను గొప్పదిగా చెబుతున్నారు. పెరిగిన ధరలు, వైకల్యం బాధలతో పోల్చుకుంటే ఆ డబ్బులు ఏ పాటికీ సరిపోవడం లేదు. ఆ పింఛన్‌ను కూడా కొందరికే ఇస్తున్నారు. కదలలేని దివ్యాంగులను క్యాంపుల పేరుతో కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు.
– షేక్‌ ఆలీ, అఖిల భారత వికలాంగుల హక్కుల సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు

 
వైఎస్‌ హయాంలో ఉద్యోగాలు పొందాం..
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రకటించిన 2008 డీఎస్సీ పుణ్యమా అని నేను, మా చెల్లి విజయ.. ఇద్దరం స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు సాధించాం. ప్రస్తుతం నేను పిఠాపురం మండలం రాపర్తి హైస్కూల్‌లో, మా చెల్లి గోకవరం హైస్కూల్‌లో ఉద్యోగం చేస్తున్నాం. వైఎస్‌ ఆలోచనా విధానం వల్ల మా లాంటి కుటుంబాల వారికి మేలు జరిగింది. ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ జగ్గంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారని తెలిసి పిఠాపురం నుంచి ఆయన్ను కలిసేందుకు నా భర్త, పిల్లలతో కలిసి వచ్చాను. మీ నాన్నగారి వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నామయ్యా అని జగన్‌కు కృతజ్ఞతలు చెప్పాం. ఆయన చిరునవ్వుతో మా చిన్నారిని ఆశీర్వదించారు.     
– మాసా స్వరాజ్య సుధ

పింఛన్‌ రూ.3 వేలు ఇస్తామన్నారు..  
నేను పేద కుటుంబానికి చెందిన వాడిని. షుగర్‌ వ్యాధి కారణంగా ఏడాదిన్నర క్రితం నా కాలు తీసేశారు. అప్పటి నుంచి పనికి వెళ్లలేకపోతున్నాను. ప్రస్తుతం రూ.వెయ్యి పింఛను ఇస్తున్నారు.. కుటుంబ పోషణ కష్టంగా మారిందయ్యా.. అని జగన్‌కు చెప్పుకున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో వచ్చే మన ప్రభుత్వంలో రూ.3 వేలు పింఛను ఇస్తామని చెప్పారు. ఆయన వస్తే మా లాంటి వాళ్లకు మేలు జరుగుతుందన్న నమ్మకం కలిగింది.
–  సానబోయిన శ్రీను

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top