మద్యం మరణాలకు మీదే బాధ్యత!

YS Jagan Mohan Reddy's public letter to CM Chandrababu - Sakshi

ముఖ్యమంత్రికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ

మీ కారణంగానే ముదునూరి సుబ్బమ్మ మృతి

లక్షల కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలా తాగిస్తున్నది మీరే..

బెల్టుషాపుల రద్దు సంతకం ఏమైంది? తొలి సంతకాలకు అర్థం ఏమిటి? 

సాక్షి, హైదరాబాద్‌ : పశ్చిమగోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తూ అసువులు బాసిన ముదునూరి సుబ్బమ్మ మరణానికి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని, అందుకు పూర్తి బాధ్యత ఆయనే వహించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన శ్రీరంగ నీతులకు పూర్తి భిన్నంగా రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా సరఫరా అవుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గద్దె నెక్కగానే చంద్రబాబు చేసిన తొలి సంతకాలకు అర్థం ఏమిటని జగన్‌ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఖరిని తూర్పారబడుతూ జగన్‌ ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు. లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..

సుబ్బమ్మ మరణం మీ దుర్మార్గ ఫలితం.. 
‘పశ్చిమ గోదావరి జిల్లా పత్తేపురం గ్రామంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తూ మరణించిన ముదునూరి సుబ్బమ్మ గారికి నా తరపున, మా పార్టీ తరపున నివాళులు అర్పిస్తున్నాం. ఈమె మరణానికి కారణం–నేరుగా మీరే ముఖ్యమంత్రి గారూ... గ్రామం మధ్యలో.. తమ ఇళ్ళ మధ్యన, మీ ప్రభుత్వ ఆశీర్వాదాలతో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తుంటే పత్తేపురం గ్రామస్తులు కొన్నాళ్ళుగా నిరసన తెలుపుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు పత్తేపురం ఆందోళన ఒక సూచిక మాత్రమే. రెండు రోజుల క్రితం చెరువులో దిగి... సుమారు 20 మంది మహిళలు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. వారిలో ముదునూరి సుబ్బమ్మ కూడా ఒకరు. మీ ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురై ఆమె మరణించారన్న విషయం గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారు. కాబట్టి ఈమెది సహజ మరణమా? లేక మీ దుర్మార్గం వల్ల సంభవించిన మరణమా? 

తొలి సంతకం అంటే అర్ధం తెలుసా? 
బెల్టుషాపుల రద్దుకు సీఎం కాగానే సంతకం పెడతా అని మీరు ఎన్నికలకు ముందు చెప్పారు. మొదటి సంతకాలకు అర్థం ఏమిటి ముఖ్యమంత్రి గారూ...? దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్‌ ఫైలు మీద సంతకం పెడితే దాని అర్థం ఆరోజు నుంచి రైతులందరికీ ఉచిత విద్యుత్‌ లభిస్తుందనే. కరెంటు బకాయిలు రద్దు అంటే మొత్తంగా కరెంటు బకాయిలు అన్నీ ఆ క్షణం నుంచి రద్దు అయ్యాయనే. కానీ మీరు పెట్టిన సంతకానికి అర్థాలు వేరు. పూర్తిగా, బేషరతుగా వ్యవసాయ రుణ మాఫీ అని ప్రకటించి... రూ .87,612 కోట్ల వ్యవసాయ రుణాలకు ఇప్పటికి కేవలం రూ.12 వేల కోట్లు కూడా ఇవ్వలేదు. రైతుల వడ్డీలు, చక్రవడ్డీలు లెక్క వేస్తే అవే మీ రుణమాఫీ కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ ఉన్నాయి. బెల్టు షాపులన్నీ రెండో సంతకంతో రద్దు అన్నారు. బెల్టు షాపులు రద్దు కాలేదు సరికదా.. గ్రామాల్లో నివాసాల మధ్య, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, స్కూళ్ళ పక్కన మద్యం షాపులకు నాలుగు రెట్లు అనుమతులిచ్చిన ప్రభుత్వం మీదే.

మద్యాన్ని తగ్గించే విధానాన్ని తయారు చేయాలి..
ఒక్క రోజులో ఏ ప్రభుత్వమూ మద్యాన్ని పూర్తిగా నిషేధించలేదు. దేశ వ్యాప్తంగా ఒక విధానం తీసుకువచ్చేలా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ అంగీకారానికి రావాలి. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేయాలి. ఒకప్పుడు సిగరెట్‌ తాగే వారు చాలా ఎక్కువ శాతం ఉండేవారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం, మీడియా భారీ స్థాయిలో ప్రచారం చేపట్టిన తర్వాత దాన్ని చాలావరకు తగ్గించగలిగాం. దేశవ్యాప్తంగా మద్యాన్ని తగ్గించి కుటుంబాల్లో సంతోషాన్ని, అనుబంధాల్ని పెంచే ‘మద్య నిరుత్సాహ విధానా’న్ని తయారు చేయాలన్నది మా ఉద్దేశం. ఇలాంటి ఆలోచనలు మీకు కలగకపోగా, విచ్చలవిడిగా మద్యం అమ్మి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి కుటుంబానికీ మీరు చేస్తున్న ద్రోహం తరతరాల పాటు కుటుంబాల మీద దుష్ప్రభావం చూపుతుంది. తాగుతున్నది ప్రజలైనా ఇన్ని లక్షల కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలా తాగిస్తున్నది మీరు. నేరం చేసినవాడికంటే చేయించిన వాడికి ఎక్కువ శిక్ష ఉండాలన్న ప్రకారం మీకు ఏ శిక్ష విధించినా తక్కువే కదా? పద్ధతి మార్చుకోండి చంద్రబాబుగారూ...  – వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top