పోలవరం, అమరావతి.. అబద్ధపు సినిమాలు

YS Jagan Mohan Reddy Slams CM Chandrababu On Polavaram And Amaravati - Sakshi

ప్రాజెక్టు పునాదులు పూర్తి కాకుండానే జాతికి అంకితమా? 

రాజమహేంద్రవరం సభలో చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ధ్వజం 

అమరావతి శాశ్వత నిర్మాణానికి ఒక్క ఇటుకా వేయలేదు 

నాలుగేళ్లుగా అవినీతి, అక్రమాలు, మోసాలు, కుట్రలు 

ఇంతటి దుర్మార్గమైన దోపిడీ పాలన ఎక్కడా ఉండదు 

మోసం చేయడంలో బాబు పీహెచ్‌డీ పొందారు 

ఆయన మెదడు క్షుద్ర ప్రపంచం.. నోరు అబద్ధాల ఫ్యాక్టరీ 

ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని వర్గాల వారినీ ముంచేశారు 

మన ప్రభుత్వం రాగానే అందరినీ ఆదుకుంటాం

మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ తీసుకున్నారు.పోలవరం ప్రాజెక్టు తన కల అని, చైనాలోని త్రీగోర్జెస్‌ డ్యాం కంటే గొప్పదని చెబుతున్నారు.  మీ సమక్షంలో ఆయన్ను ఒకటే మాట అడుగుతున్నా. అయ్యా చంద్రబాబూ.. 1995 నుంచి 2004 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నావు. పోలవరం నా కల అంటున్న నువ్వు ఆ సమయంలో ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదు?   

చంద్రబాబుకు దేవుడంటే భక్తి లేదు, భయం లేదు. గోదావరి పుష్కరాల పేరిట అక్షరాలా రూ.2 వేల కోట్ల విలువైన పనులంటూ అవినీతికి పాల్పడ్డారు. రోడ్లు, లైట్లు, ఘాట్ల నిర్మాణం పేరు చెప్పి నామినేషన్‌ పద్ధతిలో పనులన్నీ తన బినామీలకు ఇప్పించుకుని ఇష్టానుసారం రేట్లు పెంచుకున్నారు. దేవుని సొమ్మును కూడా దోచేసిన వ్యక్తి ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడేనా?   

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నాలుగేళ్ల పాలనలో ప్రజలకు పోలవరం, అమరావతి అనే రెండు అబద్ధపు సినిమాలను చూపించడం తప్ప మరేమీ చేయలేదని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగిస్తూ విచ్చలవిడిగా దోపిడీ కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 187వ రోజు మంగళవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్‌ సమీపంలో జరిగిన సభలో అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇసుకేస్తే రాలనంతగా సభకు హాజరైన జనం సమక్షంలో ఆయన చంద్రబాబు దోపిడీ పురాణాన్ని, అబద్ధాలను, మోసాలను ఎండగట్టారు. చంద్రబాబు ప్రజలకు చూపిస్తున్న సినిమాల్లో ఒకటి అమరావతి, పోలవరం ప్రాజెక్టు మరొకటని అన్నారు. ఈ రెండింటిలో ఏ మాత్రం పురోగతి లేకపోయినా ప్రజలకు భ్రాంతిని కలుగ జేస్తున్నారని, పునాదులు పూర్తి కాకుండానే పోలవరాన్ని జాతికి అంకితం చేసినట్లుగా మభ్య పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..  

అభివృద్ధి జరిగిపోతోందని భ్రాంతి కలిగిస్తున్నారు.. 
‘‘నాన్నగారి హయాంలో పోలవరం ప్రాజెక్టు పరుగులు తీసిందని నేను ఈ జిల్లాలో అడుగుపెట్టగానే ఇక్కడి వారు నాతో చెప్పారు. ఇవాళ నత్త నడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు అమరావతి, పోలవరం ప్రాజెక్టు అంటూ అబద్ధాల సినిమాలు చూపిస్తున్నారు. మూడు నెలల కొకసారి.. ఆరు నెలలకొక సారి గ్రాఫిక్స్‌ చూపించి, అదిగో సింగపూర్, అదిగో రాజధాని, అదిగో మైక్రోసాఫ్ట్, అదిగో ఎయిర్‌బస్‌ అంటాడు. అదే అమరావతి అంటారు. పోలవరం ప్రాజెక్టు సినిమాలో అయితే కాస్త ఎక్కువ కలెక్షన్లు రాబట్టడానికి వారం, వారం ప్రతి సోమవారం పోలవరం అంటాడు. ఇలా నాలుగు సంవత్సరాలుగా రెండు సినిమాలు చూపిస్తున్నారు. విషయం ఏమిటంటే... అమరావతి అనే సినిమాలో నాలుగేళ్లయినా శాశ్వత నిర్మాణాలకు ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పడలేదు. కానీ ఏదేదో జరిగి పోతుందన్నట్లుగా చాలా గొప్పగా సినిమా చూపిస్తూ ప్రజలకు భ్రాంతిని కలిగిస్తాడు.

పోలవరం పునాదులు దాటి ముందుకు కదలని పరిస్థితి. ఇవాళే మనం చూశాం. తాను కొత్తగా ఒక పదం కనుగొన్నట్లుగా... ‘డయా ఫ్రం వాల్‌’ అట.. డయాఫ్రం వాల్‌ అంటే కేవలం పునాది గోడ. ఆ పునాది అయిందని చెప్పి ఇవాళ చంద్రబాబు జాతికి అంకితం చేస్తున్నాడు. నిజంగా పోలవరం పరిస్థితి ఎలాగుందంటే.. 36 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేరకు కాంక్రీట్‌ పని జరగాల్సి ఉండగా కేవలం 6, 7 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు మాత్రమే జరిగిన పరిస్థితి. కానీ ప్రోగ్రెస్‌ రిపోర్టు పేరు చెప్పి పోలవరం ప్రాజెక్టు పనులు 56 శాతం మేరకు పూర్తయ్యాయని ఊదరగొడుతున్నారు. ఈ 56 శాతం పనుల్లో 70 శాతం పోలవరం కుడి కాలవ, ఎడమ కాలువ పనులున్నాయి. ఈ పనుల్లో 90 శాతం పూర్తయింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే కదా అని చంద్రబాబును అడుగుతున్నాను.  

వడ్డి వీరభద్రరావు ఆరోజు పోరాటం చేశారు 
పోలవరం పట్ల చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి్ద లేదనేది గతంలో కడియం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన వడ్డి వీరభద్రరావు చేసిన పోరాటం చూస్తే తెలుస్తుంది. 1985, 1994ల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన వడ్డి వీరభద్రరావు గారు ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నన్నాళ్లూ పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోండి.. పూర్తి చేయండి.. అని చంద్రబాబును అడగని రోజు లేదని చెప్పారు. అయినా చంద్రబాబు ఏ మాత్రం పట్టించుకోలేదు. చంద్రబాబు తీరును చూసి వీరభద్రరావు ఢిల్లీ వరకూ 3000 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర చేసి పోలవరం ప్రాజెక్టును నిర్మించాలని ఢిల్లీలోని ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కోరారు. ఇటు చంద్రబాబు ప్రభుత్వానికి, అటు ఎన్డీయే ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు విషయంలో మేలుకొలుపు జరుగుతుందని ఆయన ఈ యాత్ర చేశారు. అయినా కూడా చంద్రబాబులో ఎలాంటి స్పందనా కనిపించక పోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి ఆ తర్వాత దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టుపై చూపిన ప్రేమకు ముగ్ధుడై కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఇదే మాట ఎన్నో సందర్భాల్లో వీరభద్రరావు చెప్పారు. దీన్ని బట్టి పోలవరంపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలిసి పోతుంది. ఆ తర్వాత కూడా వైఎస్‌ పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే చంద్రబాబు ఆటంకాలు కలిగిస్తుంటే.. చూడలేక ఆయన వైఖరికి నిరసనగా వీరభద్రరావు పోలవరానికి వెళ్లి గుండు గీయించుకున్న విషయం మనందరికీ తెలుసు. ఈ ప్రాజెక్టు పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని బాబు పోలవరం అంచనా వ్యయం రూ.58 వేల కోట్లుగా నిర్ణయించారు. ఇంకా అంచనా వ్యయాన్ని విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మళ్లీ ప్రజల చెవుల్లో పూలు పెట్టే యత్నం చేస్తున్నారు. వైఎస్‌ చలువ వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఈ రోజు వరకూ రూ.13,500 కోట్లు ఖర్చు చేస్తే.. రూ.58 వేల కోట్ల రూపాయల్లో ఈ మొత్తాన్ని తీసేస్తే... మరో రూ.44,500 కోట్లు అవసరం ఉంటుంది. ఇంత డబ్బు ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును రేపటి సంవత్సరానికి పూర్తి చేస్తానని బాబు నమ్మించాలని చూస్తున్నారు. నువ్వు అసలు మనిషివేనా చంద్రబాబూ?   

పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని బలిగొన్నారు 
గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు సినిమాలో హీరోగా కనిపించాలని ఆరాటపడి 29 మంది ప్రాణాలను బలిగొన్నారు. ఆయన వీఐపీ ఘాట్‌లో స్నానం చేయకుండా మామూలు ప్రజలు స్నానం చేసే పుష్కరఘాట్‌కు వచ్చి సాధారణ ప్రజలను స్నానాలకు పోకుండా ఆపేయించారు. ఆ తరువాత సినిమాలో బాగా కనిపించాలని ఒక్కసారిగా గేట్లు తెరిచేసి ప్రజలందరినీ ఒక్కసారిగా వదలి వేశారు. దీంతో జరిగిన తొక్కిసలాటలో 29 మంది మరణించారు. 29 మందిని బలితీసుకున్న చంద్రబాబు అనే విలన్‌ సీఎంగా ఉండటానికి అర్హుడేనా?  ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టగానే చంద్రబాబు గోదావరి నదిలో ఇసుకను దోచేస్తున్నారని ఇక్కడి ప్రజలు నాదృష్టికి తెచ్చారు. ‘గోదావరికి అటువైపు మంత్రి కె.ఎస్‌.జవహర్, బూరుగుపల్లి శేషారావు ఇసుక దోపిడీ చేస్తూంటే.. ఇటువైపు మా ముసలాయన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మా ఎంపీ మురళీమోహన్‌లు బాధ్యత గల స్థానాల్లో ఉంటూ చంద్రబాబుకు లంచాలు ఇస్తూ ఇసుకను దోచుకుంటున్నారు. ఇందులో వాళ్లింత తీసుకుని కలెక్టర్లకు ఇంత ఇచ్చి, చిన్నబాబుకు ఇంత, పెద్దబాబుకు ఇంత ఇచ్చి ఇసుక దోపిడీ చేస్తున్నారు’ అని చెప్పారు. వేమగిరి, గాయత్రి, ధవళేశ్వరం, సీతానగరం, వాటర్‌వర్క్స్‌ ర్యాంపుల నుంచి ప్రతి రోజూ తమ కళ్ల ముందరే వేల లారీలు ఇసుక తీసుకుని పోతున్నాయని చెబుతున్నారు. కలెక్టర్‌ ఈ దోపిడీపై ఏమీ మాట్లాడరని, పోలీసులు దగ్గరుండి దీనిని ప్రోత్సహిస్తారని చెబుతున్నారు.  

అవినీతిలో రాష్ట్రం నంబర్‌ వన్‌  
 2014లో ఇదే జిల్లాలో 19 అసెంబ్లీ స్థానాలుంటే ఏకంగా 14 స్థానాలు ఆయనకే ఇచ్చారు. ఆ తర్వాత నైతిక విలువలు మరిచిపోయి ఇదే జిల్లాలోని వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొనుగోలు చేశాడు. మొత్తంగా 19 మంది ఎమ్మెల్యేలుంటే 17 మంది చంద్రబాబు పంచన చేరారు. అంతమంది ఎమ్మెల్యేలు ఇచ్చిన ఈ జిల్లాకు ఈ నాలుగేళ్ల పాలనలో చంద్రబాబు ఏం చేశాడు? అధికారం కట్టబెట్టిన ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దేశంలోనే అన్నింటికన్నా అవినీతి రాష్ట్రం ఏది అంటే అది ఆంధ్రప్రదేశే. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌(ఎన్‌సీఏఈఆర్‌) 2016 రిపోర్టులో మొత్తం 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అవినీతిలో నంబర్‌ వన్‌ అని తేల్చింది. ఏపీ కంటే బీహార్‌ మేలని జపాన్‌కు చెందిన మాకీ అసోíసియేట్స్‌ సంస్థ చంద్రబాబును కడిగేసి నితీశ్‌కుమార్‌ దగ్గరకు వెళ్లిపోయింది.  

నోరు తెరిస్తే అబద్ధాలే 
ఈ పెద్ద మనిషి పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగం ఉండదు. చట్టం వర్తించదు, నీతి, న్యాయం, ధర్మం, మానవత్వం ఉండవు. దయ, కరుణ అనే పదాలకు అర్ధం తెలియని మనిషి చంద్రబాబు. ఆయన నోరు అబద్ధా్దల ఫ్యాక్టరీ. మెదడు క్షుద్ర ప్రపంచం. రాక్షస పాలనకంటే దుర్మార్గపు పాలన సాగిస్తున్నాడు. నాలుగేళ్లుగా రాజధాని భూముల్లో స్కాములు, విశాఖ భూముల్లో స్కాములు, పోలవరం, ఇసుక, మట్టి, మద్యం స్కాములు, చివరకు కరెంటు కొనుగోలు, బొగ్గు కొనుగోలులోను అవినీతే. గుడి భూములు కూడా వదలకుండా తినేస్తున్నారు. పైన చంద్రబాబు తినేస్తుంటే కింద ఆయన ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాకు అప్పగించాడు.  

రైతులు, అక్కచెల్లెమ్మలను ముంచేశాడు 
రైతుల వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు అన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని ఇంటికి రప్పిస్తానని ఊదరగొట్టిన ఈ పెద్ద మనిషి అక్షరాలా 63 శాతం వ్యవసాయంపై ఆ«ధారపడిన రైతన్నలను, 50 శాతంగా ఉన్న అక్క చెల్లెమ్మలను అడ్డగోలుగా ముంచేశాడు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్న ఈ పెద్ద మనిషి జాబు ఇవ్వలేదు. ప్రతీ నిరుద్యోగికి నెల నెల రూ.2 వేలు ఇస్తానన్న దానికి కూడా శఠగోపం పెట్టాడు. అంతో ఇంతో ఉద్యోగాలు వచ్చే ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారు. మద్యం నిషేధిస్తామని చెప్పి.. ఊరూరా బెల్టు షాపులు పెట్టారు. ఇవాళ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం, ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలు కావడంలేదు. ప్రతీ కులాన్ని, వర్గాన్ని మోసం చేశారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి అంటే అది జగన్‌ ఒక్కడి వల్లే కాదు. జగన్‌కు మీ అందరి తోడు కావాలి. చంద్రబాబులాంటి వ్యక్తిని పొరపాటున క్షమిస్తే..  ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజికారు, ఓటుకు రూ.3 వేలు ఇస్తానంటాడు. రూ.3 వేలు ఇస్తే వద్దు అని మాత్రం అనొద్దండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లోంచి దోచేసిన సొమ్మే అది. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి’’ అని జగన్‌ అన్నారు.  

ఆరోగ్యశ్రీలో సమూల మార్పులు చేస్తాం..
- ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.  
వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం.  
కిడ్నీ, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం.  
మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ ఉచితంగా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు చేయిస్తాం. 
క్యాన్సర్‌ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి క్యాన్సర్‌ వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. దీంతో వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్పు చేస్తాం.   
ఆపరేషన్‌ పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తాం.  

అశేష జనవాహినికి కృతజ్ఞతలు 
నేనిక్కడి నుంచి చూస్తుంటే.. ఎక్కడా ఖాళీ స్థలం కనిపించడం లేదు. ఇసుకేస్తే రాలనంతగా ఇవాళ జనం నాతో కలిసి అడుగులో అడుగు వేశారు.మీలో ఏ ఒక్కరికీ కూడా ఇలా నడిరోడ్డుపై నిలబడాల్సిన అవసరం లేదు. ఈ ఎండలో,ఈ వానలో నాతో నడవాల్సిన పని లేదు. వాన,చెమట, ఎండ, దుమ్ము, ధూళిని మీరు పట్టించుకోకుండా నాపై ప్రేమ, ఆప్యాయత చూపించినందుకు అందరికీ  శిరస్సు వంచి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నా.    
 – వైఎస్‌ జగన్‌  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top