జగన్‌ అనే మీ బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి

YS Jagan Mohan Reddy promises more development - Sakshi

ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి 

వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే గొప్ప పరిపాలన అందిస్తా  

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా..వ్యవస్థలో మార్పు తీసుకొస్తా..

నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లోనూ  నాన్నగారి ఫొటోతో పాటు నా ఫొటో సైతం ఉండాలి  

గత 20 రోజులుగా రాజకీయాలు పూర్తిగా దిగజారాయి  

పత్రికలు, టీవీ చానళ్లు బాబుకు అమ్ముడుపోయాయి

చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోమార్పు కోసం ఓటేయండి

నెల్లూరు, నంద్యాల, కల్యాణదుర్గం, హిందూపురంలో వైఎస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం

పిల్లలను బడికి పంపిస్తే చాలు అక్కచెల్లెమ్మలకు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాం.ఎన్ని రూ.లక్షలు ఖర్చయినా సరే పిల్లలను ఇంజనీర్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను అభివృద్ధి చేస్తాం. చదువులు పూర్తి చేసుకున్న యువతకు ఉద్యోగాలు ఇస్తాం. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తాం – కల్యాణదుర్గం సభలో వైఎస్‌ జగన్‌

సాక్షి, నెల్లూరు/సాక్షి ప్రతినిధి, కర్నూలు/సాక్షి ప్రతినిధి, అనంతపురం/అనంతపురం:  ఈ ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేయాలని, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 2004 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి అవకాశం ఇస్తే ప్రతి పేదవాడి గుండెలో చెరగని ముద్ర వేశారని, చనిపోయిన తర్వాత కూడా ప్రజల మనస్సుల్లో బతికే ఉన్నారని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీని గెలిపిస్తే రాజన్న రాజ్యం మళ్లీ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. జగన్‌ అనే మీ బిడ్డకు ఒక్క అవకాశం ఇస్తే గొప్ప పరిపాలన అందిస్తానని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, మార్పును చేసి చూపిస్తానని పేర్కొన్నారు. చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లోనూ నాన్నగారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫొటోతో పాటు తన ఫొటో సైతం ఉండాలన్నదే తన కోరిక అని పునరుద్ఘాటించారు.  జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నెల్లూరు పట్ణణం, కర్నూలు జిల్లా నంద్యాల, అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, హిందూపురంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. పేదల ఇళ్ల నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడుతున్న వ్యక్తిని ముఖ్యమంత్రి అనాలా? లేక రాక్షసుడు అనాలా? అని చంద్రబాబుపై మండిపడ్డారు. జగన్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే...  

నెల్లూరు సభలో..బాబుకు లంచాలు.. పేదలకు తిప్పలు  
నెల్లూరు ప్రాంతానికి తాగునీరు, సాగునీరు అందించే నెల్లూరు బ్యారేజ్‌ నిర్మాణాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రారంభించారు. దాదాపు సగం పనులు పూర్తిచేశారు. కానీ, ఆయన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును పట్టించుకోలేదు. నెల్లూరు సమీపంలోని వెంకటేశ్వరపురంలో ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. పేదల ఇళ్ల నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడుతున్న వ్యక్తిని ముఖ్యమంత్రి అనాలా? లేక రాక్షసుడు అనాలా? అక్కడ భూమి ఉచితమే, రాయితీపై సిమెంట్‌ లభిస్తోంది. ఆ ఫ్లాట్లలో లిఫ్ట్‌ లేదు, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ లేదు. వాటి నిర్మాణానికి అడుగుకి రూ.వెయ్యికి మించి కాదని ప్రైవేట్‌ బిల్డర్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అడుగుకి రూ.2,000 చొప్పున పేదలకు అమ్ముతున్నాడు. 300 అడుగుల ఫ్లాట్‌కు రూ.6 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇందులో రూ.లక్షన్నర కేంద్ర ప్రభుత్వం, మరో రూ.లక్షన్నర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తాయట. మిగిలిన రూ.3 లక్షలను పేదవాడి పేరిట అప్పుగా రాసుకుంటారట. పేదవాడు తన వాటా కింద బ్యాంకులకు నెలకు రూ.3,000 చొప్పున 20 ఏళ్ల పాటు చెల్లిస్తూనే ఉండాలట. ఫ్లాట్ల నిర్మాణంలో లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే ఆ భారాన్ని పేదలు భరించాలా? ఇలాంటి రాక్షసులను చూసినప్పుడు బాధ కలుగుతోంది. రేపు మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లాట్ల కోసం పేదలు చెల్లించాల్సిన రూ.3 లక్షల అప్పును మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నా.  

పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లొద్దా?..: ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉండాలని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి నిర్ణయించారు. నెల్లూరు జిల్లాకు సింహపురి విశ్వవిద్యాలయాన్ని తీసుకొచ్చారు. ఆ యూనివర్సిటీ పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. 200 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ యూనివర్సిటీకి పిల్లలు ఎవరూ వెళ్లొద్దని చంద్రబాబు అనుకుంటున్నాడు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు అభివృద్ధి చేయాలని, పిల్లలకు మంచి చదువులు ఉచితంగా చెప్పించాలన్న ఆలోచన చంద్రబాబుకు లేనేలేదు. పిల్లలు ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లేలా చేయాలని ఆరాట పడుతున్నాడు. అందుకు కారణం తనకు బినామీ అయిన నారాయణ విద్యాసంస్థలకు మేలు చేయాలని చూస్తున్నాడు.  

‘నారాయణ’కు ఎల్లో మీడియా భజన ..: నెల్లూరులోని జనార్దన్‌రెడ్డి నగర్‌లో పేదలకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా వారి ఇళ్లను, స్థలాలను లాక్కున్నారు. పేదలపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. దయ లేని పరిపాలన, మనసు లేని పరిపాలన, మోసం చేసే పరిపాలన, అబద్ధాలు చెప్పే పరిపాలన, అధర్మం చేసే పరిపాలన, అవినీతి చేసే పరిపాలన.. ఐదేళ్ల చంద్రబాబు హయాంలో మనకు కనిపించింది ఇదే. టీడీపీ హయాంలో వ్యవస్థలు దిగజారాయి. మంచివాడు, పేదలకు మేలు చేయాలని తపన పడే మన ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9, టీవీ5, అమ్ముడుపోయిన టీవీ చానళ్లు ఒక పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నారాయణ విద్యాసంస్థల్లో పిల్లలు చనిపోతున్నారు.  పదోతరగతి, ఇంటర్మీడియెట్‌ ప్రశ్నపత్రాలు లీకవుతున్నాయి. నారాయణ సంస్థలు చేయని అన్యాయాలే ఉండవు. ఆ నారాయణ సంస్థల యజమాని, మంత్రి నారాయణ చాలా గొప్పవాడు.. ఆహా ఓహో అంటూ ఎల్లో మీడియా పత్రికలు రాస్తున్నాయి. 

ప్రజల కోసం పదేళ్లుగా పోరాడుతున్నా..: మరో వారం రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ఓటు వేయండి అని కోరుతున్నా. 2004 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఒక్క అవకాశం ఇచ్చారు. ఆయన ప్రతి పేదవాడి గుండెలో చెరగని ముద్ర వేశారు. చనిపోయిన తర్వాత కూడా ప్రజల మనస్సుల్లో బతికే ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. జగన్‌ అనే మీ బిడ్డకు అవకాశం ఇవ్వండి. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని నిరూపిస్తా. నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లోనూ నాన్నగారి ఫొటోతోపాటు నా ఫొటో సైతం ఉండేలా గొప్ప పరిపాలన అందిస్తా. నేను పదేళ్లుగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే ఉన్నా. నేను చేసిన వందలాది ధర్నాలు మీరు చూశారు. దీక్షలు, ఆందోళనలు చూశారు.  నేను చేసిన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చూశారు. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. జగన్‌ అనే నేను హామీ ఇస్తున్నా.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా. మార్పును చేసి చూపిస్తా.

►దయలేని పరిపాలన, మనసు లేని పరిపాలన, మోసం చేసే పరిపాలన, అబద్ధాలు చెప్పే పరిపాలన, అధర్మం చేసే పరిపాలన, అవినీతి చేసే పరిపాలన.. ఐదేళ్ల చంద్రబాబు హయాంలో మనకు కనిపించింది ఇదే
 
►గతంలో ఉప ఎన్నికలు రాగానే చంద్రబాబుకు నంద్యాలపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఇక్కడ శంకుస్థాపనలు చేశారు, ఓట్ల కోసం గారడీలు చేశారు. మనుషులను కొన్నారు, భయపెట్టారు, ప్రలోభపెట్టారు. దేశంలో ఇంతటి అరాచకమైన, అన్యాయమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండవు 

 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top