పండుటాకులకూ పెన్షన్‌ తీసేస్తారా?

Ys jagan mohan reddy praja sankalpa yatra in east godavari district - Sakshi

ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదా?.. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు

అన్ని అర్హతలున్నప్పటికీ పెన్షన్‌ తీసేశారని వాపోయిన వృద్ధురాలు  

జన్మభూమి కమిటీ సిఫార్సు చేయలేదని చేతులెత్తేసిన అధికారులు

జననేత వద్ద గోడు వెళ్లబోసుకున్న వైనం

పెన్షన్‌ వచ్చేలా చూస్తామని హామీ

పంటల బీమా కల్పించడం లేదని వాపోయిన చెరకు రైతులు

ప్రభుత్వం వేధిస్తోందన్న ప్రైవేట్‌ పాఠశాలల యాజమానుల సంఘం

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అయ్యా.. నా పేరు బండారు అప్పలరాజు. వయస్సు 84 ఏళ్లు. నాది తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి. ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డులున్నాయి. ఏ విధంగా చూసినా పెన్షన్‌కు అర్హురాలినే. కానీ, జన్మభూమి కమిటీల దురాగతంతో ఈ వయస్సులో నాకు పెన్షన్‌ లేకుండా చేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయమని, పండుటాకులకు పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పిన చంద్రబాబు పెన్షన్‌ ఎగ్గొట్టారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముం టుందయ్యా?’ అంటూ గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉన్న ఓ పండు ముదుసలి ప్రజా సంకల్ప యాత్రలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి తన గోడు వినిపించి బావురుమంది.

చూపు మందగించి, మాట సరిగా వినపడని పరిస్థితుల్లో ఆమె మరో పండుటాకు ఆసరాతో వచ్చి.. అయ్యా, పెన్షన్‌ తీసేశారయ్యా.. అని చెప్పినప్పుడు విస్తుపోవడం జగన్‌ వంతైంది. అసలీ ప్రభుత్వానికి ఏమైంది? ఇటువంటి వాళ్లకు కూడా పెన్షన్‌ తీసేయడానికి ఈ జన్మభూమి కమిటీలకు చేతులెలా వచ్చా యని వైఎస్‌ జగన్‌ విస్మయం వ్యక్తం చేశారు. నిజానికి ఈమె వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పెన్షన్‌ తీసుకుంది. 2014 ఎన్నికలకు ముందు దాకా సక్రమంగానే వృద్ధాప్య పెన్షన్‌ వచ్చింది.

ఆ తర్వాతే ఈమెకు కష్టాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో ఆమె కుటుంబ సభ్యులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు పలికారన్న కక్షతో ఈమెకు పెన్షన్‌ రాకుండా చేశారు. ఈ విషయమై ఆమె, కుటుంబ సభ్యులు నాలుగైదుసార్లు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. జన్మభూమి కమిటీ సిఫార్సు లేకుండా తామేమీ చేయలేమని అధికారులే చేతులెత్తేశారంటే అసలీ ప్రభుత్వానికి మానవత్వం ఉన్నట్టా? లేనట్టా? అని జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేమి జరిగిందో కనుక్కోండని తన సహాయకులకు సూచించారు. ఆమెకు పెన్షన్‌ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.  

 
ఆస్పత్రిలో వైద్యులు లేరయ్యా..  
సోమవారం 224వ రోజు ప్రజాసంకల్పయాత్ర విరవ చేరుకున్నప్పుడు ఆ గ్రామ ప్రజలు వచ్చి జగన్‌ను కలిసి తమ గ్రామంలోని ఆస్పత్రి దుస్థితిని వివరించారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విరవ గ్రామానికి రెండు అంబులెన్స్‌లతో జనరల్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేస్తే.. ఇప్పుడది కునారిల్లుతోందని, డాక్టర్లు లేరని వాపోయారు.

ఈ గ్రామంలో ఆస్పత్రి సరిగా లేక మంగుదుర్తి, దివిలి, విరవాడ, విరవ, మల్లాం, కోలంక, లక్ష్మీపురం, నర్సాపురం గ్రామాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. తమరు ముఖ్యమంత్రి అయ్యాక ఈ గ్రామ ఆస్పత్రికి పూర్వ వైభవం తేవాలని ఆకాంక్షించారు. వృద్ధాప్య పింఛన్లు, ఇళ్లు, లోన్లు అందడం లేదని గ్రామ ప్రజల తరఫున అనంతగిరి వీరబాబు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌ హయాంలో ఇచ్చిన స్థలాల్లో ఇళ్లు కట్టుకునేందుకు రుణాలు రాకుండా టీడీపీ నాయకులు అడ్డం పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
చెరకు రైతులకు పంటల బీమా వర్తించదా?
టై అప్‌ లోన్లు (ఫ్యాక్టరీలతో రైతులు కుదుర్చుకునే ఒప్పందం మేరకు బ్యాంకులు ఇచ్చేవి) తీసుకునే రైతులకు పంటల బీమా వర్తించదంటున్నారని పలువురు చెరకు రైతులు వాపోయారు. చంద్రమాంపల్లి వద్ద ఉలివేశ్వరం చెరకు రైతులు ఈ విషయాన్ని జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు.

పంట రుణాలు తీసుకునే ప్రతి రైతుకు పంటల బీమా వర్తించాల్సి ఉన్నా తమకు వర్తింపజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో చెరకు పంటకు తెగుళ్లు సోకి, దిగుబడి తగ్గడంతో తీవ్రంగా నష్టపోయినా.. బ్యాంకు వాళ్లు, ఫ్యాక్టరీ వాళ్లు తమకు సంబంధం లేదంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై న్యాయం చేయాలని జగన్‌ను కోరారు.  
 
దారిపొడవునా విన్నపాలు, ఫిర్యాదులు..
నాలుగేళ్లుగా అన్ని విధాలా ఇక్కట్లు పడుతున్నామని వివిధ వర్గాల వారు ప్రతిపక్ష నేత జగన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తమను వేధిస్తోందని, లేనిపోని నిబంధనలు పెట్టి ఇక్కట్ల పాలుజేస్తోందని ప్రైవేట్‌ స్కూళ్ల యజమానుల సంఘం వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేసింది. నాయీ బ్రాహ్మణులకూ 45 ఏళ్లకే పింఛన్‌ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు జగన్‌కు వినతి పత్రం అందజేశారు. తమకు ఫెడరేషన్‌ కాకుండా కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరారు.

ఆలయాల్లో తలనీలాల వల్ల వస్తుందన్న ఆదాయంలో పది శాతం తమకు కేటాయించాలన్నారు. ఆలయాల్లో వేదం ఎంత ప్రధానమైందో నాదం కూడా అంతే ముఖ్యమని, మంగళవాయిద్య కళాకారులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని కోరారు. బీమా, ఉచిత విద్యుత్‌.. తదితర సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. మన ప్రభుత్వం రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తామని జగన్‌ భరోసా ఇస్తూ ముందుకు సాగారు.   

ఊరూవాడా కదిలొచ్చింది..
జగ్గంపేట జై కొట్టింది. పెద్దాపురం పులకరించింది.. పిఠాపురం పోటెత్తింది. ప్రజా సంకల్ప యాత్ర సాగిన ప్రాంతం జనసంద్రమే అయింది. జననేత ప్రజా సంకల్ప యాత్ర సోమవారం ఒకే రోజు మూడు నియోజకవర్గాల్లో సాగింది. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రారంభమై పెద్దాపురం మీదుగా పిఠాపురంలో ప్రవేశించింది. వీరవరం మొదలు విరవ వరకు దారి పొడవునా వేలాది మంది ప్రజలు జగన్‌తో కలిసి అడుగులో అడుగు వేశారు.

పెద్దాపురం దాటి పిఠాపురంలో ప్రవేశించినప్పుడు పెద్ద సంఖ్యలో మహిళలు ఎదురేగి స్వాగతం పలికారు. మంగళహారతులు పట్టి, తిలకం దిద్దారు. పిల్ల కాలువలు, పంట చేల మధ్య గ్రామీణ రహదారులపై సాగిన యాత్ర జన ప్రవాహాన్ని తలపించింది. వివిధ వర్గాల ప్రముఖులు జననేత సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top