మీ జీవితాల్లో వెలుగులు నింపుతా

YS Jagan Mohan Reddy Party Campaign in Chittoor - Sakshi

రైతన్నకు తోడుగా.. నేతన్నకు నీడగా ఉంటా

వరాల జల్లు కురిపించిన వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి

నవరత్నాలతో అందరికీ లబ్ధి

బాబు మాయమాటలకు మోసపోవద్దు

జననేత రాకతో జనసంద్రమైన మదనపల్లె

‘‘టమాట రైతులకు గిట్టుబాట ధర కల్పిస్తా.. చేనేతలకు ఏడాదికి రూ.24 వేలు పట్టు రాయితీ ఇస్తా.. నిరుద్యోగులకు అండగా ఉంటా.. పిల్లల చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్న పరిస్థితి కళ్లారా చూశా.. మందులకు డబ్బుల్లేక అవస్థలు పడుతున్న కుటుంబాలను చూశా.. అంతటి బాధలు పడుతున్నా కూడా మనసు లేని ఈ ప్రభుత్వాన్ని చూశా.. మీ కష్టాలన్నీ నేను చూశా.. ప్రతి కుటుంబానికీ చెబుతున్నా.. నేను ఉన్నాను. మీకు అండగా ఉంటాను.. మీ జీవితాల్లో వెలుగులు నింపుతా..’’ అంటూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. మదనపల్లెలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగం జనాన్ని     ఆకట్టుకుంది. తమ పార్టీ అధికారంలోకి రాగానే అమలుచేసే నవరత్నాలను జననేత వివరించినప్పుడు జనం చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు.

మదనపల్లె : ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మదనపల్లె పర్యటన ఇటు రైతన్నకు.. అటు చేనేతలకు, నిరుద్యోగులకు భరోసానిచ్చింది. టమాట పండించే రైతులకు, మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న చేనేతలకు అండగా నిలుస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వారి జీవితాల్లో వెలుగులు పూయిస్తానని భరోసా కల్పించారు. చేనేతలకు నెలకు రూ.2వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలు పట్టురాయితీ ఇస్తానని ప్రకటించారు. ధరల స్థిరీకరణ నిధులతో టమాట రైతులకు గిట్టుబాట ధర కల్పిస్తామని, దళారీ వ్యవస్థను నిర్మూలించి ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మదనపల్లెకు చేరుకున్న జగన్‌మోహన్‌ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనంతో మదనపల్లె పట్టణం కిక్కిరిసిపోయింది.

ఎర్రటి ఎండను సైతం లెక్క చెయ్యకుండా జనం జగన్‌మోహన్‌రెడ్డి రాక కోసం వేచి చూశారు. ఆయన కూడా ఎండలోనే నిల్చొని వివిధ వర్గాల వారికి వరాల జల్లులు కురిపిం చారు. మదనపల్లె టమాట రైతులు, చేనేతల సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. టమాట రైతులు మార్కెట్‌లో దళారులు చేత మోసపోతున్న వైనం గురించి ప్రస్తావించినప్పుడు సభ హోరెత్తింది. టమాట రైతులు మార్కెట్‌లో 10 శాతం కమీషన్‌తో నిలువుదోపిడీకి గురవుతున్నారని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పెట్టిన పెట్టుబడులు లభించక, కూలీలకు డబ్బులు చెల్లించలేక అప్పుల పాలైన రైతులకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చేనేతలకు గుర్తింపుకార్డులు మంజూరుచేసి, మగ్గాల ఇళ్లను కమర్షియల్‌ కేటగిరీలో కాకుండా డొమెస్టిక్‌ కేటగిరీలో చేర్చి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం స్థానికులను ఆకట్టుకుంది. పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ గుర్తు ఉన్నాయని, వాటిని పరిష్కరి స్తానని చెప్పడంతో సభకు వచ్చిన ప్రజలు కరతాళ ధ్వనులతో హర్షం తెలియజేశారు.

అవ్వా.. తాత.. అక్క.. చెల్లి అంటూ..
నవరత్నాల్లోని ప్రతి అంశాన్నీ వివరిస్తూ రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యపడుతుందన్నారు. ప్రతి గ్రామానికీ వెళ్లండని.. అక్కడ అవ్వా.. తాతా.. అక్క, చెల్లిని కలవమని నాయకులు, కార్యకర్తలకు చెప్పిన మాటలతో సభకు వచ్చిన మహిళలు, వృద్ధులు, యువకులు చప్పట్లు చరుస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంకా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తు ఫ్యాను చూపిస్తూ అవ్వా మన గుర్తు ఫ్యాను.. తాతా మన గుర్తు ఫ్యాను.. అన్నా మన గుర్తు ఫ్యాను.. అంటూ పిలిచి పిలిచి ఫ్యాను గుర్తును చూపిస్తూ సాగిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. రాజంపేట పార్లమెంట్‌ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్‌ నవాజ్‌ బాషాను ఫ్యాన్‌ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరినప్పుడు సభకు వచ్చిన జనం కూడా చేయి తిప్పుతూ స్వాగతించారు.

నమాజ్‌ను గౌరవించిన జగన్‌
ప్రసంగం సమయంలో జామియా మసీదులో అసర్‌ నమాజ్‌కు సంబంధించి అజాహ్‌ విని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండు నిముషాలు నిశ్శబ్దంగా ఉందామని కోరారు. దీంతో సభకు వచ్చిన ముస్లిం మైనారిటీలు హర్షం తెలియజేశారు. మైనారిటీ నాయకులు మస్తాన్‌ ఖాన్, ఫిర్దౌస్‌ ఖాన్‌ తదితరులు జగన్‌మోహన్‌రెడ్డికి మక్కా నుంచి తెప్పించిన వస్త్రాన్ని కప్పి, పవిత్రమైన జంజం నీటిని తాపించారు.

కిటకిటలాడిన బెంగళూరు బస్టాండు
వేలాదిగా వచ్చిన అభిమానులతో మదనపల్లె బెంగళూరు బస్టాండు కిటకిటలాడింది. పాదయాత్ర సందర్భం గా మదనపల్లె నియోజకవర్గానికి 2018 జనవరి ఒకటో తేదీ వచ్చిన జగన్‌ 15 నెలల తర్వాత మళ్లీ రావడంతో కార్యకర్తలు, అభిమానుల్లో నూతనోత్తేజం కనిపిం చింది. జగన్‌ రాక సందర్భంగా మదనపల్లె జనసంద్రాన్ని తలపించింది. వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎంపీపీ సుజనాబాలకృష్ణారెడ్డి, జరీనా బేగం, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, రామచంద్రారెడ్డి, కౌన్సిలర్‌ జింకా వెంకటాచలపతి, షమీం అస్లాం, గాయత్రీదేవి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top