అచ్చంగా.. ఉత్తర కుమారుడే

YS Jagan Mohan Reddy Fires On Chandrababu Govt - Sakshi

చంద్రబాబునుద్దేశించి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఎద్దేవా 

చెప్పేదొకటి.. చేసేది మరొకటని మండిపాటు

కేంద్రంపై యుద్ధమంటూ ఢిల్లీకెళ్లి మోకరిల్లారు 

రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని నీతి ఆయోగ్‌ మీటింగ్‌లో గొప్పలు చెప్పారు 

అలాగైతే హోదా ఎందుకు ఇస్తారు? 

బీజేపీపై యుద్ధమంటారు..పరకాలను పక్కన కూర్చోబెట్టుకున్నారు 

మహారాష్ట్ర మంత్రి భార్యకు టీటీడీ పదవి ఇస్తారు 

కొబ్బరి రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నా పట్టించుకోరు 

మన ప్రభుత్వం రాగానే రైతులందరినీ ఆదుకుంటామని జననేత హామీ 

సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని భరోసా 

చంద్రబాబు ఢిల్లీకి బయలు దేరుతున్నారని, నీతి ఆయోగ్‌ మీటింగ్‌లో ప్రధాని మోదీని కడిగేస్తారని, ఉతికేస్తారని, అడిగేస్తారని, యుద్ధం చేస్తారని ఈ తానతందానా మీడియా (ఎల్లో మీడియా) ఊదర గొట్టేసింది. తీరా ఆయన అక్కడకు పోయాక ఉత్తర కుమారుడి తంతయింది.  

చంద్రబాబు నిన్న నీతి ఆయోగ్‌ మీటింగులో మోదీని నిలదీస్తారని అందరూ భావించారు. 23 మంది సీఎంలు, ప్రధాని ఉన్న ఆ మీటింగ్‌లో ప్రత్యేక హోదా ఇస్తారా? లేదా? అని అడగకుండా.. రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందని చంద్రబాబు గొప్పలు చెప్పా రు. రాష్ట్రం కష్టాల్లో ఉందని చెప్పకుండా 10.5 శాతం అభివృద్ధి రేటుతో పరుగెడుతోందని, దేశం మాత్రం 7 శాతం అభివృద్ధితో ఉందని చెబుతారు. అసలు ఈ పెద్ద మనిషికి ప్రత్యేక హోదాపై శ్రద్ధ ఉన్నట్టా? లేనట్టా? అలా చెబితే వాళ్లు ప్రత్యేక హోదా ఇస్తారా? 
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు ఉత్తర కుమారుణ్ణి తలపించిందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసే దానికి పొంతన ఉండదన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 192వ రోజు సోమవారం తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం రాగానే కొబ్బరి, వరి సహా రైతులందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

రోజుకో సినిమా, పూటకో డ్రామా... 
‘‘నాలుగేళ్ల ఈ పెద్దమనిషి పాలనలో రోజుకో సినిమా, పూటకో డ్రామా.. మహాభారతంలో కౌరవులపై యుద్ధానికి బయలుదేరిన ఉత్తర కుమారుడు కౌరవ సైన్యాన్ని చూసి చేష్టలుడిగిన వాడవుతాడు. ప్రత్యర్థిపై బీభత్సం సృష్టిస్తానని ప్రగల్భాలు పలికి పిరికివాడల్లే భీతిల్లిపోతాడు. తన సోదరిని అవమానించిన వాళ్లను హతమార్చి వాళ్ల తలపాగల కుచ్చుల్ని తీసుకువచ్చి తన చెల్లి చేతిలో పెడతానంటూ యుద్ధ క్షేత్రానికి వెళ్లి కౌరవ సేనల్ని చూసి గుండెలదిరి రథసారథిని రథాన్ని వెనక్కు తిప్పమంటాడు. చంద్రబాబు తీరు అచ్చం ఇలాగే ఉంది. ఇక్కడేమో యుద్ధం చేస్తానని గొప్పలు చెప్పిన వ్యక్తి.. ఢిల్లీలో మాత్రం మోదీకి వంగి వంగి అతి వినయం చూపుతూ.. మోదీ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోయినా ఆయన చేయి పట్టుకోవడం చూస్తే.. ఉత్తర కుమారుడి కంటే ఎక్కువే అనిపించింది. ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో చంద్రబాబు సైగ చేసిన వెంటనే సీఎంలు అందరూ ఆ సమావేశాన్ని బహిష్కరిస్తారని ఇక్కడ ఆయన మీడియా ఊదరగొడితే అక్కడకు పోయిన తర్వాత మోదీ ముందు అతివినయంతో ఆయన ఎడమ చేయి పట్టుకుని వదల్లేదు. పాపం చంద్రబాబు ఎంత గొప్పగా ఢిల్లీలో యుద్ధం చేశాడో.. (ఎద్దేవా) ఇక్కడేమో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు విపరీతంగా పోరాటం చేస్తున్నట్లు బిల్డప్‌ ఇచ్చారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు సహా మొత్తం 25 మంది రాజీనామా చేస్తే కేంద్రం దిగి వచ్చి దేశం మొత్తం మనవైపు చూస్తుందని తెలిసి కూడా చంద్రబాబు ఆ పని చేయకపోగా రాజీనామా చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలపై బురద చల్లమని ఆదేశిస్తారు.  

కోనసీమ నుంచి వలసలా? 
రైతులు నాకు చెబుతున్న మాటలు వింటుంటే క్షోభ పడాల్సి వస్తోంది. అన్నా.. బాబు సీఎం అయ్యాక మా అవస్థలు అన్నీ ఇన్నీ కావు. బతుకుదెరువు కోసం హైదరాబాద్, కేరళ, తమిళనాడు వెళ్తున్నామని చెబుతుంటే బాధనిపించింది. ఈ ప్రాంతంలో కొబ్బరి, వరి సాగు ఎక్కువ. జిల్లాలో 1,25,000 ఎకరాల్లో కొబ్బరి సాగు చేస్తుంటే ఒక్క కోనసీమలోనే 90 వేల ఎకరాల్లో కొబ్బరి సాగవుతోంది. దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఈ కోనసీమ కొబ్బరి రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అన్నా.. అదేమి ఖర్మో తెలియదు గానీ చంద్రబాబు సీఎం కాగానే కొబ్బరి పంటకు రేటు పడిపోయిందని చెబుతుంటే బాధనిపించింది. అన్నా..చంద్రబాబు సీఎం అయిన రెండున్నర ఏళ్లలోనే కొబ్బరి రేటు రూ.4,500 పడిపోయింది. అయినా ఈ సీఎం పట్టించుకోలేదని రైతులు చెబుతున్నారు.  

జీఎస్టీ పేరుతో 5 శాతం బాదుడు 
వెయ్యి కొబ్బరి కాయలకు రూ.14 వేలు ధర రావాల్సి ఉంటే ఇప్పుడు రూ.9 వేలు కూడా రావడం లేదన్నా అని రైతులు చెబుతున్నారు. కాయవలచిన తర్వాత వెయ్యి కాయలకు రూ.15 వేలు రావాల్సి ఉంటే ఇప్పుడది రూ.12 వేలు కూడా రావడం లేదు. గతంలో కొబ్బరిపై 4 శాతం పన్నుంటే దాన్ని రద్దు చేయమని రైతులు కోరిన వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరో మాట మాట్లాడకుండా రద్దు చేశారన్నా.. ఇప్పుడు జీఎస్టీ పేరుతో 5 శాతం బాదుతున్నారన్నా.. దీన్ని తీసేయమని కోరుతున్నా ఈ ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదన్నా అని రైతులు వాపోతున్నారు. చెట్టెక్కి కొబ్బరి కాయల్ని దింపి.. వలిచే కూలీలకు దక్కేది కాయకు అర్థ రూపాయి. పొరపాటున ఆ రైతు కూలీ చెట్టుపై నుంచి పడితే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం. 

వరి రైతుల పరిస్థితి దారుణం  
వరికి క్వింటాల్‌కు మద్దతు ధర రూ.1,550 ఉంటే రూ.1,130 కూడా దక్కడం లేదని నావద్దకు వచ్చిన రైతులు వాపోయారు. గోదావరి నది ఇక్కడి నుంచి పోతున్నా కూడా రబీ సమయంలో అప్పనపల్లి, పెదపట్నం, పెదపట్నం లంక తదితర ప్రాంతాలకు నీరు అందడం లేదు. అప్పనపల్లి ఎత్తిపోతల పథకం కోసం రైతులు ఒత్తిడి చేస్తున్నా నాలుగేళ్లుగా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అందుకే ఈ ప్రాంత ప్రజలు వైఎస్‌ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గోదావరి నది ఈ ప్రాంతానికి ఎంతటి వరమో, వరదలు వచ్చినప్పుడు అంతే నష్టం కలిగిస్తుంది. అలా నష్టం కలగకూడదని గోదావరి ఏటిగట్ల పటిష్టతకు నడుం కట్టింది వైఎస్‌ మాత్రమేనని రైతులు చెప్పినప్పుడు ఆనందం వేసింది. నాన్నగారి వల్ల ఇదే నియోజకవర్గంలో 150 కిలోమీటర్ల మేర రూ.70 కోట్లతో ఏటిగట్లు పటిష్టం చేశారని రైతులు చెబుతున్నారు. మిగిలిన చిన్నచిన్న పనులు కూడా ఈ ప్రభుత్వం చేపట్టడం లేదని వాపోయారు.   

అది లోకేశ్‌ ర్యాంప్‌... 
లంకల గన్నవరం ఇసుక ర్యాంప్‌ నుంచి యథేచ్చగా ఇసుకను దోచేస్తున్నారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. దానికి లోకేశ్‌ ర్యాంప్‌ అని మరోపేరు కూడా ఉందని చెప్పారు. ఆ ర్యాంప్‌ వైపు ఏ కలెక్టర్, ఏ పోలీసు వెళ్లరు. పొక్లెయిన్లతో ఇసుకను దోచేస్తున్నారన్నా.. ఇప్పుడక్కడ తవ్వడానికి ఏమీ లేక వదిలేశారన్నా.. అని చెప్పారు. ఇదే నియోజకవర్గంలో పేద వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వైఎస్‌ హయాంలో ఇదే నియోజకవర్గంలో 20 వేల ఇళ్లు కట్టించి ఇచ్చారని ప్రజలు గొప్పగా చెప్పుకుంటున్నారు.

నాలుగేళ్లుగా అంతా దోపిడే..  
ఇసుక, మట్టి మొదలు.. మద్యం, బొగ్గు.. కరెంటు కొనుగోళ్లు, కాంట్రాక్టులు, రాజధాని భూములు, విశాఖపట్నం భూములు, చివరికి గుడి భూములను కూడా వదిలిపెట్టకుండా ఈ పెద్దమనిషి దోచేస్తున్నాడు. పైన బాబు దోచేస్తుంటే కింద బాబు మాఫియా జన్మభూమి కమిటీలు దోచేస్తున్నాయి. ఇవాళ చంద్రబాబు హైటెక్‌ పరిపాలనలో వీధి వీధినా బెల్ట్‌ షాపే. రైతుల రూ.87,612 కోట్ల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. ఈయన గారు చేసిన రుణమాఫీ పథకం చివరికి వడ్డీలకు కూడా సరిపోలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు కానీ, వేలం నోటీసులు మాత్రం వస్తున్నాయి.  పొదుపు సంఘాల అక్కచెల్లమ్మల రుణాలు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు.  

ఇంత అన్యాయమైన ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉంటారా? 
జాబు రావాలంటే బాబు రావాలి అన్నాడు. ప్రతి ఇంటికీ ఉద్యోగం లేదా ఉపాధి ఇస్తానన్నాడు. లేదంటే ప్రతి నెలా రూ.2 వేలు భృతి ఇస్తానన్నాడు. ఇప్పటికి 50 నెలలైంది. ఈ లెక్కన ప్రతి ఇంటికీ లక్ష రూపాయలు బాకీ పడ్డారు. ఈ డబ్బులు ఎప్పుడిస్తారో ఆయన కనిపిస్తే అడగండి. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని మనం గుర్తుకు వస్తాం. మనల్ని మభ్య పెట్టడానికి రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లు ఉంటే కేవలం పది లక్షల మందికి రూ.వెయ్యి భృతి ఇస్తారట. అది కూడా నాలుగు నెలలేనట. ఇంతకన్నా అన్యాయమైన ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉంటాడా? ఇంతగా మోసాలు చేసే వారిని క్షమిస్తే రేపు మీ వద్దకు వచ్చి తాను చెప్పినవన్నీ 98 శాతం పూర్తి చేశానంటాడు. మీరు నమ్మరని ఇంటింటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటారు. ఇదీ నమ్మరని తన మనిషిని పంపించి మీ చేతిలో రూ.3 వేలు పెడతారు. వద్దనకండి. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మన జేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. మీ మనస్సాక్షి ప్రకారం ఓటెయ్యండి. అబద్ధాలు చెప్పేవాళ్లను, మోసాలు చేసే వాళ్లను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకురావాలని మిమ్మల్ని కోరుతున్నా. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగు పడాలీ అంటే అది ఒక్క జగన్‌ వల్లే సాధ్యమయ్యేది కాదు. మీ అందరి తోడు కావాలి. మీ అందరి దీవెనలు కావాలి’’ అని జగన్‌ అన్నారు.

కోనసీమ ఎంత అందంగా ఉంటుందో అంతే అలజడి
ప్రకృతి సోయగాలు, చుట్టూ చెట్టు చేమలు, పచ్చదనంతో కోనసీమ ఎంత అందంగా ఉంటుందో అలజడి కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ఇదే కోనసీమలో చమురు, సహజ వాయు నిక్షేపాల కోసం ఆయిల్‌ కంపెనీలు పొలాల మధ్య డ్రిల్లింగ్‌ నిర్వహిస్తున్నాయి. వందల కిలోమీటర్ల పొడవునా పైపులైన్లు వేశారు. గ్రామాల మధ్యలో నుంచి వెళ్తున్న పైప్‌లైన్‌ లీకై.. నగరం అనే ఊర్లో 2014 జూన్‌ 27న ఘోర ప్రమాదం జరిగి 22 మంది చనిపోయారు. 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ రోజు ఇక్కడికి వచ్చి నేనే పరామర్శించా. ఈ ఘటన జరిగినప్పుడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నారు. అప్పుడే బీజేపీ, టీడీపీల కొత్తకాపురం (అధికార పొత్తు) మొదలైంది. కేంద్రంలో టీడీపీ ఎంపీలు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు.

ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఇద్దరు మంత్రులుగా ఉండి సంసారం చేశారు. పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. వీరి పొగడ్తలు చూసి చిలకా గోరింకలు కూడా అసూయపడ్డాయి. ఆ రోజు నగరం గ్రామాన్ని స్మార్ట్‌ విలేజీగా చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు మరో 18 డిమాండ్లను నెరవేరుస్తామని చెప్పారు. స్మార్ట్‌ విలేజ్‌ రాలేదు.. ఫైర్‌స్టేషన్‌ రాలేదు.. ఆస్పత్రుల ఆధునికీకరణ, స్థాయి పెంపు ఏమైందో తెలియదు. గ్రామాలకు రక్షిత మంచి నీటి సరఫరా ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఆరోజు వాళ్లిద్దరూ (బీజేపీ, టీడీపీ) కలిసి ఇచ్చిన హామీ ప్రకారం దుర్ఘటనలో చనిపోయిన కుటుంబాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. అవీ రాలేదు. అయినా ఈ వ్యక్తి (చంద్రబాబు) పట్టించుకోడు. తీవ్రంగా గాయపడిన ఆ 9 మందికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయాల్సిఉంటే ఈ మనిషికి ఉలుకూ పలుకూ లేదు. తోడుగా ఉండాల్సిన ముఖ్యమంత్రే ప్రజల్ని ఇలా గాలికి వదిలేసినందుకు సిగ్గుపడాలి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top