ప్రజలను చంద్రబాబు పిచ్చోళ్లనుకుంటున్నాడు

YS Jagan Mohan Reddy Comments on Chandrababu At Bheemili - Sakshi

     ఆనందపురం సభలో ముఖ్యమంత్రిపై మండిపడిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

     పునాది గోడలు దాటని పోలవరం చూపించి ప్రాజెక్ట్‌ పూర్తయినట్లు బిల్డప్‌   

     గ్యాలరీ వాక్‌ అంటూ ఆర్భాటం ఎందుకు?

     ఈ పెద్దమనిషి తీరు.. ఇంటికి పునాది వేసి గృహ ప్రవేశానికి పిలిచినట్లుంది

     పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల అప్పు రూపాయి కూడా మాఫీ చేయలేదు

    అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాన్ని ఒప్పుకుని కూడా పచ్చి అబద్ధాలు 

     బినామీ నారాయణ కోసం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు 

     ముఖ్యమంత్రి శిక్షణలో ఆరితేరి మంత్రి గంటా దోచుకుతిన్నారు 

     మన ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం

హుద్‌హుద్‌ వచ్చినప్పుడు సముద్ర అలలు మనవైపు రాలేదు. వర్షం, విపరీతమైన గాలులు వచ్చాయి.కానీ చంద్రబాబు హుద్‌హుద్‌నూ వదిలిపెట్టలేదు. ఈ తుపాన్‌ను కారణం చూపించి తహసీల్దారు ఆఫీసుల్లో 16 వేలకు పైగా ఎఫ్‌ఎంబీలు మాయమైపోయాయి.. 379 రీసర్వే సెటిల్మెంటు రిజిస్టర్లు (ఆర్‌ఎస్‌ఆర్‌లు), 233 మ్యాపులు మాయమైపోయాయని కట్టు కథలు చెప్పి దోచుకుతిన్నారని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు.
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతిని:  పునాది గోడలు కూడా దాటని పోలవరం ప్రాజెక్టును చూపించి ప్రజలందరినీ పిచ్చివాళ్లను చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రజలకు రోజుకో సినిమా చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 264వ రోజు సోమవారం విశాఖపట్టణం జిల్లా భీమిలి నియోజకవర్గంలోని ఆనందపురం జంక్షన్‌ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారని, విశాఖ నగరాన్ని దోచేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

డిజైన్‌ కూడా ఖరారు కాలేదు కానీ.. 
‘‘చంద్రబాబు తన మూడేళ్ల మనవడిని కూడా తీసుకుని పోలవరం వెళ్లాడు. అక్కడ ప్రాజెక్టు పనులు చూస్తే పునాది గోడలు కూడా దాటవు. ఇంకా ఈ ప్రాజెక్టు మట్టికట్ట డిజైన్‌ కూడా ఖరారు కాలేదు. కానీ ఈ పెద్ద మనిషి గ్యాలరీ వాక్‌ అంటూ ప్రాజెక్టు పూర్తయిందన్నట్లు చూపిస్తున్నాడు. అసలు గ్యాలరీ, గ్యాలరీ అంటూ చంద్రబాబు చెప్పే కొత్త పదానికి అర్థం ఏమిటో తెలుసా? గ్యాలరీ అంటే పునాదుల్లో ఒక భాగమే. కానీ ఈయన ఎలాంటి బిల్డప్‌ ఇస్తాడంటే.. పునాదులు వేసి ఇల్లు పూర్తయిపోయినట్టుగా గృహ ప్రవేశానికి పిలుస్తాడు. కేవలం పునాదులు మాత్రం వేసి ఇల్లు నిర్మించకుండానే గృహ ప్రవేశానికి ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే ఆ వ్యక్తిని మీరు ఏమంటారు. పిచ్చోడనరా? లేదా మోసం చేశాడనరా? ఇవాళ మన ఖర్మ ఏమిటంటే మనందరినీ పిచ్చోళ్లను చేస్తున్నాడీ పెద్దమనిషి చంద్రబాబు. ఈయనకు సంబంధించిన ఎల్లో మీడియా కూడా తోడై  ఆయన తానా అంటే తందానా.. అంటూ ఏది చెబితే అది ప్రచారం చేస్తోంది. ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట యుద్ధం చేస్తున్నాడంటారు. మనకు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం ఎవరు? నాలుగున్నరేళ్ల క్రితమే.. ఆరు నెలలకో ఏడాదికో ప్రత్యేక హోదా కోసం నిలదేసి ఉంటే, హోదా ఇవ్వకపోతే మంత్రి వర్గం నుంచి వైదొలుగుతామని అల్టిమేటం ఇచ్చి ఉంటే హోదా వచ్చేది కదా? కానీ ఈ పెద్దమనిషి అలా చేయలేదు. ఈ పెద్దమనిషిలో డ్రామాలు కనిపిస్తున్నాయి.  

భీమిలిలో అభివృద్ధి ఏదీ? 
భీమిలిలో నేను నడుస్తున్నప్పుడు ఇక్కడి ప్రజలు నాతో అన్నారు.. బాబు అధికారం చేపట్టి నాలుగున్నరేళ్లు గడిచి పోయిందన్నా.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నా.. అని చెప్పారు. దొంగలు, దొంగలు కలిసి ఊళ్లు పంచుకుంటున్నారనే విధంగా ఇక్కడ పాలన ఉందన్నా.. విశాఖ నగరాన్ని దోచేస్తున్నారన్నా.. అని నా దగ్గరకొచ్చి చెబుతున్నారు. ఈరోజు ఇక్కడ ప్రభుత్వ, ఈనాం, అసైన్డ్‌ భూములు కనిపించడం లేదు. ఒకవేళ కనిపిస్తే అవి ఎలా దోచుకోవాలా అని ఇక్కడి నాయకులు చూస్తున్నారని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలోని మధురవాడ, ఆనందపురం తహసీల్దారు కార్యాలయాల్లో జరిగిన భూ అక్రమాలపై సిట్‌ ముందు సాక్ష్యాధారాలతో ఇవ్వడానికి ప్రజలు బారులు తీరాల్సిన పరిస్థితి వచ్చిందని నాకు చెప్పారు. ఇంతమంది తహసీల్దార్లు మంత్రి అండదండలు లేనిదే అన్యాయాలు చేయగలుగుతారా?  

చిట్టివలస జ్యూట్‌ మిల్లు పరిస్థితి తెలుసా? 
మంత్రి గంటా అధికారంలోకి రాక ముందు 6 వేల మంది కార్మికులుండే చిట్టివలస జ్యూట్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానని మాటిచ్చాడు. నాలుగున్నరేళ్లయింది. 6 వేల మంది కార్మికులకు రూ.149 కోట్లు బకాయి పడ్డారు. ఒకవైపు బకాయిలుంటే మరోవైపు గంటా ఏం చేశాడో తెలుసా? ఈ జూట్‌ మిల్లుకున్న 2 ఎకరాల గోడౌన్‌ స్థలాన్ని వేరొకరితో కొనుగోలు చేయించారు. ఆ సొమ్ము కార్మికులకు ఇచ్చారా అంటే అదీ లేదు. తక్కువ రేటుకు కొనుగోలు చేయడం, ఆ సొమ్ముతో వ్యాపారం చేసే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. మూడు రోజులు విశాఖలో విశాఖ సమ్మిట్‌ పేరిట ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలో సదస్సులు పెడతారు. ఈ 3 రోజులకు రూ.150 కోట్లు. ఇందులో తినడానికి, తాగడానికి రూ.53 కోట్లు ఖర్చు.

ఈ సమ్మిట్‌ ద్వారా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలొచ్చేశాయని ఊదరగొడతారు. నిజంగా 40 లక్షల ఉద్యోగాలొచ్చాయా? ఉత్తరాంధ్రలో 35 జూట్‌ మిల్లుల ద్వారా 50 వేల మందికి ఉపాధి కలుగుతుంటే చంద్రబాబు సీఎం అయ్యాక 35 జూట్‌మిల్లుల్లో 18 మూతపడ్డాయి. వీటిలో పనిచేసే 30 వేల మంది రోడ్డున పడే పరిస్థితి. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జూట్‌ మిల్లులకు యూనిట్‌ విద్యుత్‌ రూ.3.15 ఉండేది. బాబు సీఎం అయ్యాక యూనిట్‌ ధర రూ.8.40కి పెంచేశారు. ఇలాగైతే జూట్‌ మిల్లులు మూతపడక ఏమవుతాయి? ఈ జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీలు నష్టాల్లో నడుస్తున్నాయి. ఉద్యోగాల సంగతి దేవుడెరుగు.. ఉన్న ఫ్యాక్టరీలు మూతపడుతున్నా చంద్రబాబుకు చీమ కుట్టినట్టయినా లేదు.  

చిన్న పనులు కూడా చేయలేదు.. 
మంత్రి గంటా గత ఎన్నికల్లో తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ కడతానని హామీ ఇచ్చాడు. గంటా కదా?  తెలివితేటలెక్కువ. 2016లో రెడీమేడ్‌ శంకుస్థాపన రాయి తెచ్చి టెంకాయ కొట్టాడు. ఆ తర్వాత ఆ శిలాఫలకాన్ని తీసుకుపోయాడు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి ఆయన పోటీ చేయడు. ఇక భీమిలితో ఆయనకు పని వుండదు. ఎన్నికలప్పుడు ఆయన నియోజకవర్గాలు మారుస్తుంటాడు. ఈ పెద్దమనిషికి ఓ బాస్‌ ఉన్నాడు.. పిల్లిగడ్డం ఆయన. అబద్ధాలు ఆడడంలో ఒకరిని మించి ఒకరు. భీమిలి, ఆనందపురం మండలాల్లో రైతు బజారు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఈ చిన్న పని కూడా చేయలేని అసమర్థుడు. ఈ నియోజకవర్గంలోని జగ్గమ్మ రిజర్వాయర్, అల్లూరి జన్మించిన పద్మనాభం మండలం పాండ్రంగిలో గోస్తనీపై వంతెన కూడా నిర్మించలేని అసమర్థ పాలన వీరిది.

భీమిలిలో ఒక జెట్టీ, మూలకుద్దులో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. ఎన్నికలొస్తే మళ్లీ ఇవే హామీలిస్తారు. పాలకుడంటే, నాయకుడంటే ఆ రోజుల్లో వైఎస్‌నే చూశామన్నా.. అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. నాన్నగారు నగరబాటకు వచ్చినప్పుడు భీమిలిలో తాగునీటికి అవస్థలు పడుతున్నామని చెబితే వెంటనే రూ.20 కోట్లు మంజూరు చేసి గోస్తనీ నుంచి నీళ్లిచ్చారని ఈ ప్రాంత ప్రజలు చెప్పారు. నాన్నగారు మధురవాడలో ఐటీ విస్తరణకు చేసిన కృషి ఎంతో గొప్పది. 300 ఎకరాల్లో ఐటీ సెజ్, ఇన్ఫోసిస్, కెనెక్సా, సింబయాసిస్, నగరంలో హెచ్‌ఎస్‌బీసీ, విప్రో, టెక్‌ మహింద్రా వంటివి ఏర్పాటయ్యాయి. ఇప్పటి పరిస్థితులు చూస్తే.. ఉన్న ఐటీలే మూతపడుతున్నాయని ప్రజలు చెబుతున్నారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే అక్షరాలా 32,882 ఇళ్లు కట్టించిన ఘనత నాన్నగారిదేనని, ఆయన పోయాక ఇళ్ల గురించి మాట్లాడే వారు, ఇళ్లు కట్టించే ఆలోచన చేసే వారు లేరని చెబుతున్నారు. చంద్రబాబు ఇంతటి దారుణంగా పరిపాలన చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. 

ఇదే మంత్రి ఆధీనంలో ఉన్న విద్యా శాఖ గురించి మాట్లాడితే ఆశ్చర్యం కలిగించే విషయాలు
తెలుస్తాయి. మంత్రి వియ్యంకుడు నారాయణ కాలేజీలో ఫీజులు బాదుడే బాదుడు. ఫీజులు పెంచుకోవడానికి ఈ మంత్రి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తాడు. ఫీజులు విపరీతంగా పెంచాక నారాయణ కాలేజీల్లో 30 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరైనా అయితే దీనిపై కమిటీ వేసి నారాయణ కాలేజీలను మూసివేయించాలి. కానీ మంత్రి ఏం చేశారో తెలుసా? తన వియ్యకుడు కాబట్టి గోళ్లు గిల్లుకుంటున్నాడు. నారాయణ కోసం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలను నిర్వీర్యం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల కోసం కమిటీ వేశామంటాడు. ఆ కమిటీ రిపోర్టు ఇవ్వదు. ఆ కమిటీ పేరు చెప్పి కాలేజీకి ఇంత అని వసూలు చేస్తున్నారు. పదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు పరీక్షా పేపర్లు లీక్‌ అవుతున్నాయి. అవి ముందుగా నారాయణ కాలేజీలకు లీకవుతున్నాయి. పాఠశాల బిల్డింగ్‌లకు వేసే సున్నాల్లోనూ స్కాం. మధ్యాహ్న భోజన పథకంలో 85 వేల మంది అక్క చెల్లెమ్మలను ఇంటికి పంపించి ఆ పని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 950 మంది స్టాఫ్‌ ఉండాల్సి ఉంటే ఇంకా 550 మందిని రిక్రూట్‌ చేయకుండా ఖాళీగా ఉంచేస్తున్నారు. ఏయూ పరిస్థితి బాగోలేదని సీఎం చంద్రబాబు బంధువు, ఆయన బినామీ
ఎంవీవీఎస్‌ మూర్తి గీతం కాలేజీకి పిల్లలను పంపేలా చేస్తున్నారు.

ఇలాంటి నాయకుడు అవసరమా?  
రాష్ట్రంలో రైతన్నలకు గిట్టుబాటు ధర లేదు. సున్నా, పావలా వడ్డీ రుణాలు అసలే లేవు. రుణమాఫీ అని రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. రైతులకు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ కాలేదు. ఈ పెద్దమనిషి చంద్రబాబు చేసిన మోసం ఇంతా అంతా కాదు.. పొదుపు సంఘాలను తానే కనిపెట్టానన్నాడు. రుణ మాఫీ కావాలంటే బాబు రావాలని ప్రచారం చేశారు. ఆయనొచ్చారు కానీ బంగారం ఇంటికి రాలేదు. వేలం వేస్తామని నోటీసులు వస్తున్నాయి. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. కోటీ 70 లక్షల ఇళ్లుంటే ప్రతి ఇంటికి వెళ్లి ఉద్యోగం ఇస్తాం. మీ పిల్లాడు ఏమీ చదవకపోయినా, ఉద్యోగం రాకపోయినా ఫర్వాలేదు ఇంటింటికి రూ.2 వేలిస్తామని ఊదరగొట్టాడు. ఇప్పటికి 55 నెలలైంది. నెలకు రూ.2 వేల చొప్పున లక్షా పది వేల రూపాయలు బాకీ పడ్డారు. ఈయన హయాంలో ఉద్యోగాల్లేవు. నిరుద్యోగ భృతీ లేదు.   

బాబును పొరపాటున కూడా క్షమించకూడదు 
ఈ పెద్దమనిషి హయాంలో ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతీ లేదు. ఉద్యోగాలు రావడానికి అంతో ఇంతో అవకాశాలున్న ప్రత్యేక హోదా కూడా రాకుండా పోయింది. కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ రేట్లు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, నీటి పన్నులు, స్కూలు, కళాశాల ఫీజుల వరకు అన్నీ బాదుడే బాదుడు. ఇసుక, మట్టి మొదలు కాంట్రాక్టులు, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, మద్యం, రాజధాని భూములు, విశాఖ భూములు.. చివరకు గుడి భూములను కూడా వదలకుండా దోచేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు పాతరేశారు. పిల్లలు పెద్ద చదువులు చదువుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇవాళ పిల్లలెవరైనా ఇంజినీరింగ్‌ చదవాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్యశ్రీ పడకేసింది. గుండె, మెదడు, నరాలకు సంబంధించిన పెద్ద వ్యాధి గానీ, క్యాన్సర్‌ వ్యాధి గానీ వస్తే ఇవాళ చికిత్స కోసం మంచి ఆసుపత్రులు ఉన్న హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదట. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఎనిమిది నెలలుగా బకాయిలు చెల్లించడం లేదు.

వైద్యానికి లక్షలు ఖర్చు చేయలేక రోగుల ప్రాణాలు పోయే పరిస్థితి. 108కి ఫోన్‌ చేస్తే అంబులెన్స్‌ వస్తుందో రాదో తెలియదు. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరో సరుకు లభించని పరిస్థితి. పింఛన్లు, రేషన్‌ కార్డు, మరుగుదొడ్లు.. ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి అన్యాయమైన పాలన సాగించే వాళ్లను, మోసాలు చేసే వాళ్లను పొరపాటున కూడా క్షమించకూడదు. లేదంటే ఎన్నికలపుడు ఇచ్చిన హామీలన్నింటినీ వంద శాతం మేరకు పూర్తి చేశానని చంద్రబాబు మీ అందరి చెవుల్లో పూలు పెడతాడు. ఈ దఫా తనకు ఓటేస్తే ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు. మీరు నమ్మరని తెలిసి ప్రతి ఇంటికీ తన మనిషిని పంపి ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారు. ఆ డబ్బును వద్దనొద్దు. రూ.5 వేలు కావాలని అడగండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిన డబ్బే అది. మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. అపుడు ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అనేది వస్తుంది. మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top