క్వారీ కార్మికులతో వైఎస్‌ జగన్‌ ముఖాముఖి

ys jagan interacted with quarry workers - Sakshi - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, గోర్లగుట్ట (కర్నూలు): ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సాయంత్రం గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. క్వారీ కార్మికుల కష్టాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విన్న వైఎస్‌ జగన్‌.. తమ పార్టీ అధికారంలోకి రాగానే.. క్వారీ కార్మికుల కష్టాలన్నింటినీ తీరుస్తామని, వారికి మెరుగైన లాభసాటియైన జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.  వైఎస్‌ జగన్‌-కార్మికుల ముఖాముఖి ఇది..

‘గోర్లగుట్ట, బేతంచర్లలో రెండు నాపరాయి క్వారీలు ఉన్నాయి. చంద్రబాబు రాకముందు ఇక్కడ క్వారీ పరిశ్రమకు కరెంటు బిల్లు యూనిట్‌కు రూ. 3.70 వచ్చేది. చంద్రబాబు వచ్చాక ఇప్పుడు యూనిట్‌కు రూ. 8.70 వసూలు చేస్తున్నారు. క్వారీల్లో 22మందికి మిషన్లు ఇచ్చారు. ఒక్కో మిషన్‌ మీద ఆరుగురు బతుకుతారు. రెండు క్వారీల్లో 20వేల కుటుంబాలు బతుకుతున్నాయి. అయితే, క్వారీ లారీలు కర్నూలు దాటాలంటే ఇబ్బంది పడుతున్నాయి. అధికారులు లంచాలు తీసుకుంటూ వేధిస్తున్నారు. నేను కూడా ఐదు వేలు లంచం ఇచ్చాను’ అని కార్మికుడు ఆవేదన వ్యక్తం చేయగా.. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్న వైనాన్ని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు.

‘వైఎస్సార్‌ ఉన్నప్పుడు మాకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. ఇప్పుడు డ్రైనేజ్‌ వ్యవస్థ లేదు. ఎవరితో చెప్పినా పట్టించుకోవడం లేదు. నా కొడుకుకు క్యాన్సర్‌ వచ్చింది. చికిత్స కోసం రూ. మూడు లక్షలు ఖర్చు అయింది. అయినా ఆరోగ్యశ్రీ పథకం కింద మాకు ఎలాంటి సాయం అందలేదు’ అని ఒక మహిళ తన గోడు వైఎస్‌ జగన్‌కు చెప్పుకుంది. ఆమెను ఆదుకుంటామని జననేత హామీ ఇచ్చారు. 

‘చంద్రబాబు పొదుపు రుణాలు మాఫీ చేస్తామని మాఫీ చేయలేదు. రూ. ఆరువేలు అప్పు కింద ఇచ్చాడు. సున్నా వడ్డీకే రుణాలు, పావులా వడ్డీ రుణాలు రావడం లేదు. వైఎస్సార్‌ ఉన్నప్పుడు వచ్చిన సదుపాయాలేవి ఇప్పుడు అందడం లేదు’ అని మరో మహిళ ఆవేదన వ్యక్తంచేసింది. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఎంత రుణం ఉంటుందో.. ఆ మొత్తాన్ని తాము అధికారంలోకి వచ్చాక మాఫీ చేస్తామని, నాలుగు దఫాలుగా రుణమాఫీ మొత్తం డబ్బుని మహిళల చేతికే నేరుగా ఇస్తామని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. సున్నా వడ్డీకే రుణాలు, పావులా వడ్డీకే రుణాలు ఇవ్వాలంటే ఆ వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తే.. అప్పుడు బ్యాంకులు మహిళలకు ఆ మేరకు రుణాలు ఇస్తాయని, చంద్రబాబు ఆ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించడం మానేయడంతో ఇప్పుడా రుణాలు రావడం లేదని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు, పావులా వడ్డీ రుణాలు ఇస్తామని తెలిపారు.

’సార్‌.. మా ఏరియాలో క్వారీలో పనిచేసేవారు ప్రమాదవశాత్తు చనిపోతున్నారు. ఎవరికీ చంద్రన్న బీమా అందడం లేదు. ఎలాంటి సాయం అందడం లేదు. మన ప్రభుత్వం వచ్చాక ఒక మంచి వైఎస్సార్‌ బీమా పథకాన్ని పెట్టాలి’ అని మరో కార్మికుడు కోరగా.. ఇందుకు వైఎస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. 

’చంద్రబాబు బాత్రూమ్‌లు కట్టించుకుంటే రూ. 15వేలు ఇస్తామన్నారు. ఇందుకోసం పనులు మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు బిల్లు పాస్‌ చేయడం లేదు. బాత్రూమ్‌లను పూర్తిగా నిర్మించిన తర్వాత రూ. 5వేలు ఒకమారు, రూ. 8వేలు మరోమారు ఇస్తామని చెప్తున్నారు. డబ్బులు అందకపోవడంతో మరుగుదొడ్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం’ అని ఒక మహిళ తెలుపగా.. ‘కనీసం నీ మాటలతోనైనా చంద్రబాబుకు బుద్ధి వస్తుందేమో చూడాలమ్మ’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.
తన పొలం వేరేవారు ఆక్రమించుకున్నారని, కలెక్టర్‌, అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదని ఓ బాధితుడు వైఎస్‌ జగన్‌కు మొరపెట్టుకోగా.. ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ కలిస్తే.. సాయం చేస్తారని జననేత హామీ ఇచ్చారు.

’ నాకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఇక్కడ స్కూళ్లు బాగాలేకపోవడంతో కర్నూలులో వేశాం. అక్కడ మా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గనుల్లో పనులు నిలిచిపోయి ఉపాధిలేక చాలా అవస్థలు పడుతున్నాం.. కరెంటు బిల్లులు విపరీతంగా పెంచడంతో మేం ఉపాధి కోల్పోయాం’ అని ఒక మహిళ విన్నవించుకోగా.. కరెంటు బిల్లులు తగ్గించి మెరుగైన, లాభసాటియైన ఉపాధి కల్పిస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ తప్పకుండా సీఎం అవుతారని, తమ కష్టాలు తీరుస్తారని ఆమె ధీమా వ్యక్తం చేసింది.

నాపరాయి క్యారీ ఓనర్లు అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది ఈ చంద్రబాబు పాలనలో.. ఏపీ జీఎస్టీ, సీఎస్టీ పెంచడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. నాపరాయి చదరపు మీటర్‌ రాయల్టీని ప్రభుత్వం రూ. 18 నుంచి రూ. 50కు పెంచింది. విపరీతంగా పెనాల్టీ వసూలుచేస్తోంది. దీంతో ఈ రోజు పదిమందిని కూడా పోషించలేని పరిస్థితికి వచ్చాం. రాజధాని అమరావతిలో నిర్మాణాల కోసం, ఇతర ప్రభుత్వ నిర్మాణాల కోసం చంద్రబాబు ప్రభుత్వానికి ఈ నాపరాయి పనికిరాదట. ఈ నాపరాయి పనికిరాదు అని అంటున్నారు. ఎందుకయ్యా మాకు ఇంత దారుణమైన పరిస్థితి’ అని నాపరాయి క్వారీ యజమాని ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. చంద్రబాబు ప్రభుత్వం క్వారీ కార్మికులను అన్యాయకరమైన పరిస్థితుల్లోకి నెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రాయల్టీ, విద్యుత్‌ చార్జీల విషయంలో కచ్చితంగా సానుకూల నిర్ణయం తీసుకుంటామని, క్వారీ వ్యాపారం లాభసాటిగా సాగేలా, కార్మికులకు మెరుగైన జీవితం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వపరంగా అవసరమున్న చోట ఇక్కడి నాపరాయి ఉపయోగించుకుంటామని తెలిపారు.

15సార్లు దరఖాస్తు చేసుకున్నా.. రేషన్‌ కార్డు ఇవ్వలేదని ఒక వ్యక్తి మొరపెట్టుకోగా.. ఏడాదిలో మనందరి ప్రభుత్వం వస్తుందని, అప్పుడు రేషన్‌, ఫించన్‌, ఇల్లు, ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇలా ఏ విషయమైనా అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, దరఖాస్తు చేసిన 72 గంటల్లోనే అది పరిష్కారం జరిగేలా తమ ప్రభుత్వంలో చూస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు భయపడే చంద్రబాబు ప్రభుత్వం పగలు ఏడుగంటల కరెంటు ఇస్తోందని ఓ యువకుడు గుర్తుచేయగా.. పాదయాత్రలో రైతులు తమకు పగలు మూడు గంటలకు మించి ఇవ్వడం లేదని, మిగతా కరెంటు రాత్రి ఇస్తున్నారని తనకు చెప్పారని, చంద్రబాబు పాలనలో రైతులు ఇలా అనేక కష్టాలు పడుతున్న విషయాన్ని పాదయాత్రలో చాటడంతో చంద్రబాబు ట్యూబ్‌లైట్‌ వెలిగి ఇప్పుడు ఏడుగంటల కరెంటు ఇస్తున్నట్టు జీవో ఇచ్చారని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు రోడ్డెక్కి పాదయాత్ర చేస్తేగానీ రైతుల కష్టాలు ప్రభుత్వానికి గుర్తుకురాలేదని, ఏ పంటకు ఇప్పుడు గిట్టుబాటు ధర రావడం లేదని, బాబు సర్కారులో రైతుల పరిస్థితి ఎలా ఉంది చెప్పడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. ఇప్పుడు ఇప్పుడు రోడ్డుమీద ప్రమాదాలు జరుగుతున్నా.. 108 అంబులెన్సులు రావడం రాదని ఓ యువకుడు చెప్పగా.. 108, ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం నాశనం చేస్తున్నదని, హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేయబోమని బాబు సర్కారు జీవో ఇచ్చిందని, నిజంగా ఈ ప్రభుత్వానికి మనస్సు అనేది ఉందా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని కనీవినీ ఎరుగని రీతిలో బ్రాహ్మాండంగా అమలు చేస్తామని తెలిపారు. క్వారీ కార్మికులతో ముఖాముఖి అనంతరం వైఎస్‌ జగన్‌ 13వ రోజు పాదయాత్ర ముగిసింది. సోమవారం వైఎస్‌ జగన్‌ 13.5 కిలోమీటర్లు నడిచారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top