పెదబాబు పర్మిషన్లు.. చినబాబు కలెక్షన్లు

YS Jagan fires on Chandrababu At Sabbavaram Meeting - Sakshi

సబ్బవరం సభలో మండిపడిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

బాబు భూ దోపిడీకి అంతే లేదు..విశాఖ భూములపై కన్ను 

ముదపాక అసైన్డ్‌ భూములు 540 ఎకరాలు కొట్టేసేందుకు పన్నాగం 

బాబుకు ఎల్లో మీడియా తాన తందానా

టెట్‌ 1,2,3 అంటున్నారు కానీ డీఎస్సీ ప్రకటన వెలువరించలేదు 

మన ప్రభుత్వం రాగానే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం 

అవ్వాతాతల పింఛన్‌ను రూ.2 వేలకు..

ఒక అబద్ధాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. చంద్రబాబు వ్యవస్థలను ఎంతగా మేనేజ్‌ చేస్తాడనే దానికి ఈరోజు ఈనాడు పేపర్‌ చూస్తే అర్థమైంది. పెట్రోల్‌ వంద రూపాయలకు చేరుతుందేమోనని చంద్రబాబు అన్నారట. ఆహా.. పెట్రోలు ధరలు పెరుగుతుంటే వీళ్లు ఇంతగా పట్టించుకున్నారేమిటబ్బా అని నాకు నిజంగానే ఆశ్చర్యం వేసింది. నిజంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోని పెట్రోల్, డీజిల్‌ రేట్లు దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ఆరేడు రూపాయలు ఎక్కువ. ఎక్కడి దాకానో అవసరం లేదు.. పక్కనున్న యానాం వెళ్లి లీటర్‌ పెట్రోలు కొట్టించుకుని చూడండి. మన రాష్ట్రం కన్నా కనీసం రూ.6 తక్కువగా ఉంటుంది. వాస్తవానికి కేంద్రం వేసే ట్యాక్స్‌ల కన్నా రాష్ట్రం వేసే ట్యాక్సులు ఎక్కువ. కానీ ఈనాడు పేపర్‌ ఏనాడూ ఆ వార్త రాయదు. చంద్రబాబు చెప్పడు. వాళ్లకు నచ్చితే మోస్తారు. నచ్చకపోతే బురదజల్లుతారు. ఎన్టీ రామారావు భార్య లక్ష్మీపార్వతిని ఎంతగా ఇబ్బంది పెట్టారో అందరికీ తెలిసిందే. 
 
2014 ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు వేసినట్లే అని చంద్రబాబు అన్నాడు. బీజేపీతో జత కట్టాడు. ఇప్పుడు జగన్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనంటాడు. కాంగ్రెస్‌తో జత కడతాడు. ఆయనకు మంచిదన్నది ఈనాడుకు మంచిదవుతుంది.. అదే రాస్తుంది. టీవీలలో చూపిస్తారు. ఈయన తానా అంటే ఎల్లోమీడియా తందానా అంటుంది.  
  
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తుంటే.. ఆయన కుమారుడు చిన్నబాబు కలెక్షన్లు చేసుకుంటున్నాడని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబు కన్ను విశాఖ భూములపై పడిందని, కనిపించిన భూములను వదలకుండా దోచేయాలని చూస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 255వ రోజు బుధవారం ఆయన విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని సబ్బవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబు భూ దోపిడీకి అంతే లేకుండా పోయిందని మండిపడ్డారు. అబద్ధాలను నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రశ్నించిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

గజానికో కబ్జాకోరు.. 
‘‘పక్కనే దామోదం సంజీవయ్య లా యూనివర్సిటీ ఉంది. ఆరోజు దేశం మొత్తం మీద 16 లా (న్యాయ) యూనివర్సిటీలు ఉంటే మన రాష్ట్రానికి లా యూనివర్సిటీ కావాలని, అది కూడా విశాఖపట్నానికి రావాలని.. అదీ సబ్బవరంలో ఉండాలని ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి పట్టుబట్టి తీసుకువచ్చారని నా దగ్గరకు వచ్చిన విద్యార్థులు చెప్పారు. అటువంటి స్థాయి నుంచి ఇవాళ ఇదే విశాఖ జిల్లా.. ఇదే పెందుర్తి నియోజకవర్గం చంద్రబాబు పాలనలో ఎలా మారిందో చూడండని ఇక్కడి ప్రజలు నాతో చెప్పుకొచ్చారు. బాబుగారొచ్చారు.. గజానికో కబ్జాకోరును తయారు చేశారన్నా.. రికార్డులు తారు మారు చేస్తున్నారు.. భూములు ఆక్రమించేస్తున్నారు.. బినామీల పేరుతో చివరకు ఇక్కడి నాయకులు పరిహారాలను కూడా కాజేయడం మొదలు పెట్టారని చెప్పుకొచ్చారు. దళిత మహిళను ఏకంగా బట్టలు ఊడదీసి దాడి చేసిన ఘటన ఇక్కడే జరిగిందన్నా.. ఈ నియోజకవర్గంలో పేదవారికి రక్షణ కరువైందన్నా అని ఇక్కడి ప్రజలు నా వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నా.. ప్రతి దాంట్లోనూ స్కామే.

ఈ స్కాముల్లో ఎమ్మెల్యేలకింత.. మంత్రులకింత.. చినబాబుకింత.. పెదబాబుకింత.. అని వాటాలు పోతున్నాయన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. పనులకు పెదబాబు పర్మిషన్‌ ఇస్తాడు.. చినబాబు కలెక్షన్‌ చేస్తాడన్నా అని చెప్పారు. విశాఖపట్నంలోని ఆస్తులపై వీరి కన్ను పడిందన్నా అని చెబుతున్నారు. ఇదే నియోజకవర్గానికి సంబంధించి 540 ఎకరాల ముదుపాక భూములు.. పేదవారికి చెందిన ఈ అసైన్డ్‌ భూముల్ని కొట్టేయడానికి ఇక్కడి తెలుగుదేశం పార్టీ నాయకులు ఏకంగా చంద్రబాబు కొడుకు చినబాబుతో సంబంధాలు పెట్టుకుని చేసిన స్కామ్‌ అంతా ఇంతా కాదు. రైతుల దగ్గర నుంచి ఆ అసైన్డ్‌ భూములను తక్కువ రేటుకే శనక్కాయలు, బిస్కెట్లకు కొన్నట్టు కొన్నారు. కొన్న తర్వాత ఆ భూములకు ల్యాండ్‌ పూలింగ్‌ అని కొత్త పథకం పెట్టారు. తక్కువ రేటుతో కొనుగోలు చేసే అధికారం లేని ఈ అసైన్డ్‌ భూములను దగ్గరుండి టీడీపీ నాయకులు తమ బినామీలతో కొనుగోలు చేయించి ల్యాండ్‌ పూలింగ్‌ కింద గవర్నమెంట్‌కు అప్పజెప్పుతున్నారు. అలా అప్పజెప్పాక వీటిలో రోడ్లు వేసి కోట్ల విలువైన ప్లాట్లు ఇస్తారంట. ఈ స్కామ్‌పై వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజలు ఆందోళనలు చేస్తే.. పేపర్లు, టీవీల్లో మారుమోగితే అప్పుడు కానీ ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దీనిపై ఎంక్వైరీ వేశామన్నారు. అది ఇంకా జరుగుతూనే.. ఉంది.  

మెడ్‌టెక్‌కు 250 ఎకరాలు... 
ఇదే నియోజకవర్గంలో పెదగంట్యాడలో మెడ్‌టెక్‌ కోసం 250 ఎకరాలు తీసుకున్నారు. ఇవి పేదలు, మాజీ సైనికులకు చెందిన భూములు. బలవంతంగా తీసుకున్నారు. బినామీలను సృష్టించారు. రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో డాక్యుమెంట్లు తారు మారు చేసే స్థాయికి వీళ్ల కంప్యూటర్‌ వ్యవస్థ వెళ్లిపోయిందంటే ఏ స్థాయిలో అవినీతి చేస్తున్నారో చెప్పడానికి వేరే నిదర్శనం అక్కర్లేదు. పేదలకు అందాల్సిన పరిహారాన్ని గద్దల్లా తన్నుకుపోతున్నారు. వీళ్లకు పై నుంచి పెదబాబు, చినబాబుల అండ ఉందని స్థానికులు చెబుతున్నారు. గుర్రంపాలెంలో ఏపీఐఐసీ  కోసం రైతుల దగ్గర నుంచి డి.ఫారం భూములు సేకరించారు. ఎకరాకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. ఆ పరిహారం కాజేసేందుకు బినామీలను సృష్టించారు. భూ రికార్డులు తారుమారు చేశారు. ఇచ్చే పరిహారాన్ని కూడా దోచుకుతినే కార్యక్రమం చేస్తున్నారు. ఇక నీరు–చెట్టు గురించి ఇక్కడి ప్రజలు చెబుతూ.. పినగాడిరాతి చెరువు, పెందుర్తి పెద్దచెరువు, కవ్వాది పాలెం చెరువుతో సహా అనేక చెరువుల్ని తవ్వేసి మట్టిని అమ్ముకుంటున్నారన్నారు. మరోపక్క చెరువుల్ని తాటి చెట్టంత లోతు తవ్వుతూ ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకుంటున్నారు. ఈ పథకం పేరు చెప్పి రూ.40 కోట్లు దోచేశారంటే వీళ్లు మనుషులేనా? అని అనుమానం వస్తుంది. లక్ష్మీపురంలో రాయుడు చెరువును ఆక్రమించి రూ.100 కోట్ల విలువైన భూమిని కొట్టేయడానికి ప్లాన్‌ చేశారంటే వీరు ఆస్తులను దోచుకోవడం కోసమే నాయకులుగా ఉన్నారనేది స్పష్టమవుతోంది.   

సింహాచలం భూముల సమస్యకు పరిçష్కరిస్తాం..
పెందుర్తి నియోజకవర్గం వచ్చినప్పుడు సింహాచలం దేవస్థానానికి చెందిన పంచగ్రామాల భూ సమస్య గురించి మాట్లాడక తప్పదు. ఈ సమస్య పరిష్కారించేస్తామని గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు ఊదరగొట్టారు. విశాఖపట్నంలో పేరుకు కేబినెట్‌ మీటింగ్‌ పెట్టి 100 రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని మనందరి చెవుల్లో పువ్వులు పెట్టే కార్యక్రమం చేశారు. ఇక్కడి ఎమ్మెల్యేలు అయితే ఇంకా ఎక్కువగా మన చెవుల్లో కాలిప్లవర్‌ పెట్టారు. దొంగ దీక్షలు చేశారు. ఆరు నెలల్లో సమస్య పరిష్కరించకపోతే తన పదవికి రాజీనామా చేసేస్తానని ఇక్కడి ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. చంద్రబాబు వంద రోజుల్లో పరిష్కరిస్తానన్న ఈ సమస్య మరో 100 రోజుల్లో ఎన్నికలకు వెళ్లే పరిస్థితి వచ్చినా పరిష్కారం కాలేదు.

నిజంగా ఈ సమస్యను పరిష్కరించాలంటే ఇదే నియోజకవర్గంలో పీఠాధిపతులు ఉన్నారు. ఒక్కసారి ఆయనే అక్కడకు వెళ్లి వారితో మాట్లాడి.. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ బాధ్యతను వారిపై పెట్టి వారికి తోడుగా ఉంటే ఈ సమస్య పరిష్కారం కాదా? ఈ పెద్దమనిషికి చిత్తశుద్ధి, సమస్యను పరిష్కరించాలన్న తాపత్రయం లేవు. అందుకే ఈ సమస్య పరిష్కారం కాలేదు. రేపు మీ అందరి ఆశీస్సులు, సింహాచలం దేవుని దయతో మన పార్టీ అధికారంలోకి రాగానే ఈ సమస్యను పీఠాధిపతులకు అప్పజెబుతా. వాళ్లకు తోడుగా ఉంటా. వాళ్లు, నేను కలిసి ఈ సమస్యను పరిష్కరిస్తా.  

అన్నింటా బాదుడే బాదుడు.. 
చంద్రబాబు హయాంలో కరెంటు, ఆర్టీసీ చార్జీలు, ఇంటిపన్నులు, స్కూలు, కళాశాల ఫీజులు, పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచి బాదుడే బాదుడు. పేదలు, మధ్యతరగతి వారు తమ పిల్లలను చదివించుకోలేని పరిస్థితి. మామూలు స్కూలులో ఏడాదికి ఫీజు రూ.40 వేలు. ఇంటర్‌కు రూ.65 వేలు. అదే చంద్రబాబు బినామీ అయిన నారాయణ కళాశాలల్లో అయితే అక్షరాల లక్షా 60 వేలు. తన బినామీ సంస్థలైన నారాయణ, చైతన్య కళాశాలలు, స్కూళ్ల కోసం ప్రభుత్వ స్కూళ్లను, కళాశాలలను క్రమబద్ధీకరణ పేరిట దగ్గరుండి మూసివేయిస్తున్నాడు ఈ పెద్దమనిషి. ప్రభుత్వ స్కూళ్లలో 20 వేల టీచర్ల పోస్టులను భర్తీ చేయడు కానీ.. టెట్‌ 1, 2, 3 అంటాడు. డీఎస్సీ పరీక్ష మాత్రం పెట్టడు. పిల్లలు వేలకు వేలు కోచింగ్‌ సెంటర్లకు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్రం విడిపోయే నాటికి లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

నోటిఫికేషన్లు మాత్రం రావు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం పరిస్థితి దారుణంగా ఉంది. కార్మికులు, ఆయాలకు ఆరు నెలలుగా జీతాలు లేవు.. బిల్లులు ఇవ్వడం లేదు. పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫాంలు ఇవ్వరు. ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను నీరు గార్చుతూ మనంతట మనమే ఆయన బినామీ సంస్థలైన నారాయణ, చైతన్య స్కూళ్లకు పంపించాల్సిన అనివార్య పరిస్థితి కల్పిస్తున్నాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తుంగలో తొక్కారు. ఇంజినీరింగ్‌ చదివించాలంటే ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆరోగ్యశ్రీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. హైదరాబాద్‌కు వెళితే ఆరోగ్యశ్రీ కట్‌ అంటున్నారు. కానీ ఈయన గారి మంత్రి యనమల రామకృష్ణుడికి పంటి నొప్పి వస్తే సింగపూర్‌కు తీసుకువెళ్లి రూ.3 లక్షలు ఖర్చు చేయించాడు. ఇవాళ 108కు ఫోన్‌ చేస్తే 20 నిమిషాలలో అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. ఇదే సబ్బవరంలో అంబులెన్స్‌ సకాలంలో రాక పాలనాయుడు అనే యువకుడు చనిపోయాడు. అందుకే మన నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ అదీప్‌ రాజు ఈరోజే అంబులెన్స్‌ను ఆసుపత్రికి విరాళంగా అందజేశారు.ఇవాళ రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. ఇళ్లు లేవు, ఇళ్ల స్థలాలు లేవు. ఏది కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలివ్వాల్సిన పరిస్థితి. గ్రామ గ్రామాన మాఫియాలను తయారు చేశారు. పరిస్థితి దారుణంగా మారింది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

రాష్ట్రంలో అన్యాయమైన పాలన 
నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో అంతటా అన్యాయమే. ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసేవారు మీకు నాయకుడిగా కావాలా? ఇవాళ రాష్ట్రంలో వ్యవసాయం లేదు. రైతులు అష్టకష్టాలు పడి పండించిన అరకొర పంటలకూ గిట్టుబాటు ధరలు లేవు. సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటమో.. లేక మూతపడే దశలో ఉండడమో చూస్తున్నాం. రైతులకు రుణమాఫీ కాలేదు. రూ.87,612 కోట్ల రుణాలు మాఫీ చేస్తామన్న చంద్రబాబు రైతుల వడ్డీల్లో నాలుగవ వంతు కూడా మాఫీ చేయలేదు. బ్యాంకుల్లోని బంగారం వడ్డీలకే సరిపోయింది. రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీలు లేవు. పావలా వడ్డీలు మరిచిపోయారు.

అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. జాబు ఇవ్వకపోతే ఇంటికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇవాళ ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతీ లేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఉద్యోగాలు వెల్లువలా వచ్చేవి. పరిశ్రమలు ఏర్పాటు అయ్యేవి. ఈ పెద్దమనిషి బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదా గానీ, విశాఖకు రైల్వే జోన్‌ గానీ గుర్తుకు రాలేదు. మొదటి భార్య బీజేపీతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. పక్కనే పోలవరం ప్రాజెక్టు ఉంది. పునాది గోడలు దాట లేదు. యుద్ధ ప్రాతిపదికన పోలవరాన్ని పూర్తి చేసి నీటి కోసం చూడాల్సిన ఈ పెద్దమనిషి ఈ ప్రాజెక్టు నుంచి లంచాలు పిండుకుంటున్నాడు. ఇష్టానుసారం రేట్లు పెంచి నామినేషన్‌ పద్ధతిలో తన మనుషుల్ని, బినామీలను సబ్‌ కాంట్రాక్టర్లుగా తీసుకువస్తున్నాడు. చివరకు తన క్యాబినెట్‌లోని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు కూడా సబ్‌ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారంటే ఎంతగా దోపిడీ సాగుతుందో చెప్పాల్సిన పని లేదు. చంద్రబాబు దోపిడీ కారణంగా ఈ ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. 

ఎన్టీపీసీ బూడిద సమస్య పరిష్కరిస్తాం 
పక్కనే ఎన్టీపీసీ ఉంది. ప్లకార్డులు పట్టుకుని వాళ్లు వాళ్ల బాధలు చెబుతున్నారు. ఎన్టీపీసీ బూడిద వల్ల కాలుష్యంతో బాధపడుతున్నారు. పిట్టవానిపాలెం, దేవాడ, మరణాసిపేట గ్రామాలను తరలిస్తామని అçప్పట్లో చంద్రబాబు, ఎన్టీపీసీ వారు మాట ఇచ్చారన్నా.. ఇవాళ ఎన్టీపీసీలో పని జరుగుతోందన్నా.. కాలుష్యం వస్తుందన్నా.. æమరో మూడు నెలలకో ఆరు నెలలకో ఎన్నికలొచ్చే పరిస్థితి ఉన్నా గ్రామాలను తరలించే కార్యక్రమాన్ని చంద్రబాబు కానీ, ఎన్టీపీసీ కానీ పట్టించుకోవడం లేదన్నా అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.   నేనైతే కచ్చితంగా చెబుతున్నా.. ఎన్టీపీసీ ప్లైయాష్‌ పాండ్‌ సమస్య తీరుస్తానని హామీ ఇస్తున్నా. పరవాడలో ఫార్మాసిటీ ఉంది. దివంగత నేత రాజశేఖరరెడ్డి గారి కృషి వల్ల ఎస్‌ఈజెడ్‌ (సెజ్‌)లో బ్రాండిక్స్‌ కంపెనీ వచ్చింది. ఏకంగా 18 వేల మంది పని చేస్తున్నారు. ఈ సెజ్‌లో 25 వేల మందికి ఉద్యోగాలు వస్తున్న పరిస్థితి. ఇటువైపు పరవాడలోని ఫార్మాసీటీలో 12 వేల మంది ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. నిజంగా ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి  స్వప్న సాకారం ఈ ఫార్మాసిటీ, ఎస్‌ఈజెడ్‌లు.

ఈ రోజు యాజమాన్యాలు ఎలా తయారయ్యాయంటే ఫ్యాక్టరీలు పెట్టడానికి మన దగ్గర నుంచి భూములు కావాలి. ఫ్యాక్టరీలు పెట్టాక ఉద్యోగాలిచ్చే సమయంలో మాత్రం మన పిల్లలు కన్పించరు. రేపు మనందరి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే ఒక బిల్లు తీసుకొస్తా.. ఉన్న పరిశ్రమలు, కట్టబోయే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకొస్తా. ఇక్కడకు వచ్చేటప్పుడు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో అంతర్భాగమైన భూదేవి చెరువు కనిపించింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు ఇది. 8 లక్షల ఎకరాలకు సాగు, 30 లక్షల మందికి తాగు నీరు, విశాఖపట్నంతో సహా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మేలు జరుగుతుందని సబ్బవరం సమీపంలో అయ్యన్నపాలెం భూదేవి చెరువు వద్ద ఆ దివంగత నేత ఆ రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన రోజు ఈవాల్టికీ నాకు గుర్తుంది. ఇవాళ భూదేవి రిజర్వాయర్‌ పనులు అవుతాయో లేదోననే సందేహం రైతుల్లో ఉంది. రిజర్వాయర్‌ రాదంటే ఆ భూములు అమ్మొచ్చు. పిల్లలకు పెళ్లిళ్లు చేయాలన్నా, చదివించుకోవాలన్నా కూడా ఇబ్బందికర పరిస్థితి. ఈ సమస్య చంద్రబాబుకు పట్టదు.  

నంద్యాల ముస్లిం యువకులకు జగన్‌ భరోసా
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి విశాఖ బృందం: ముఖ్యమంత్రి సభలో ప్లకార్డులు ప్రదర్శించారని దేశద్రోహ కేసులు పెట్టి చితక బాదిన ఘటనలో బాధిత ముస్లిం యువకులు ఎనిమిది మంది ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన షేక్‌ మహమ్మద్‌ భాషా, షేక్‌ జుబీర్, షేక్‌ ఇలియాస్, షేక్‌ ముత్తు, షేక్‌ ముజాహిత్, షేక్‌ జుబేర్‌ అహ్మద్, సయ్యద్‌ అబిద్, జుక్రియలు గత నెల 28న  గుంటూరులో జరిగిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’ కార్యక్రమంలో ప్లకార్డులు ప్రదర్శించారని అరెస్ట్‌ చేసి చిత్రహింసలకు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్‌పై బయటకు వచ్చిన వారు బుధవారం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం వద్ద పాదయాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను కలిశారు. తమను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో వివరించారు. 2014 ఎన్నికల మానిఫెస్టోలో ముస్లింలకు ఇచ్చిన హామీలు  నెరవేర్చాలని కోరినందుకు.. దేశాన్ని విభజించాలన్నట్టు దేశద్రోహం కేసు పెట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. సభలో దేశద్రోహులు ఉన్నట్టు పచ్చ మీడియా చిత్రీకరిస్తూ బ్రేకింగ్‌ న్యూస్‌లు ఇవ్వడంతో తమకు చచ్చిపోవాలని ఉందన్నారు. వారి కష్టాన్ని ఓపికతో విన్న జగన్‌.. వారికి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి వెంట నంద్యాలకు చెందిన పార్టీ నేత శిల్పా రవిచంద్రారెడ్డి, రాష్ట్ర మైనారిటీ సెల్‌ ప్రధాన కార్యదర్శి డి.ఎస్‌.హబీబుల్లా, కర్నూలు అసెంబ్లీ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌లు ఉన్నారు. 

వైఎస్సార్‌సీపీలోకి డాక్టర్‌ రమణమూర్తి, రఘురాజు
విశాఖ నగరానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త, కళా ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ పి.వి.రమణమూర్తి, ఆయన సతీమణి డాక్టర్‌ కళావతి, మామ రామారావు, పలువురు అనుచరులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సమక్షంలో బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. పాదయాత్ర ప్రాంతానికి వెళ్లిన వారికి వైఎస్‌ జగన్‌.. కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. డా.రమణమూర్తి పేదల వైద్యుడిగా పేరుపొందారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోట నియోజకవర్గ బీజేపీ కన్వీనర్‌ ఇందుకూరి రఘురాజు బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. కేంబ్రిడ్జ్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రఘురాజు ఎస్‌.కోట జెడ్పీటీసీ సభ్యునిగా, మండల ఉపాధ్యక్షునిగా, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షునిగా సేవలు అందించారు. కాంగ్రెస్‌ పార్టీలో వివిధ పదవుల్లో రాణించారు. 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేసి 30వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఆయన చేరికతో ఎస్‌.కోటలో వైఎస్సార్‌సీపీ బలోపేతం అవుతుందని నాయకులు భావిస్తున్నారు. వీరితో పాటు  చీపురుపల్లికి చెందిన పంచాయతీరాజ్‌ రిటైర్డ్‌ ఈఈ కుంచాడ శ్రీనివాసకుమార్, డొల్ల వెంకటరమణ, కడప ఈశ్వరరావు, గొల్లు రామునాయుడు, డి.రాంబాబు, గొల్ల వెంకటరావు, అరకొండ వెంకటరాము, నాగిరెడ్డి కనకం, కె.సన్యాసిరావు, అల్లూరి అప్పలరాజు తదితరులతో పాటు పలువురు ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు సహా 500 మంది పార్టీలో చేరారు. పెందుర్తికి చెందిన టీడీపీ నాయకుడు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు దొగ్గ కృష్ణభగవాన్, న్యాయవాది దొగ్గ గౌతం, ఎంపీటీసీ సభ్యుడు భీశెట్టి వెంకటేష్, మల్లువానిపాలెం ఎంపీటీసీ సభ్యురాలు సింగంపల్లి వెంకటరమణమ్మ తదితరులు వందలాది మంది అనుచరులతో పార్టీలో చేరారు.

సర్వేపల్లికి జననేత ఘన నివాళి 
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పాదయాత్ర శిబిరంలో డాక్డర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్‌ వైస్‌ చాన్సలర్లు, డీన్‌లు, ప్రొఫెసర్లను ఘనంగా సన్మానించారు. సన్మానం అందుకున్న వారిలో ఏయూ తెలుగు విభాగం విశ్రాంత ప్రొఫెసర్‌ డాక్టర్‌ కోలవెన్ను మలయవాసిని, ఏపీ లా యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ వై. సత్యనారాయణ, మాజీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ జి సుబ్రహ్మణ్యం, ఆంధ్రా యూనివర్సిటీ ఫార్మర్‌ డీన్‌ డాక్టర్‌ కె. తిమ్మారెడ్డి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఓ ఆర్‌  రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ మాజీ డీన్‌ ప్రొఫెసర్‌ ఓ. భానుకుమార్, వెల్ఫేర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎం. జేమ్స్‌ స్టీఫెన్, ఆంధ్రా యూనివర్సిటీ ఫార్మర్‌ రెక్టార్, పూర్వపు రిజిస్టార్‌ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాద్‌ రెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ స్కూల్‌ అండ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ కె.విజయ్‌కుమార్‌లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు గుడివాడ అమర్నాథ్, వరుదు కల్యాణి, కరణం ధర్మశ్రీ, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

ప్రశ్నిస్తే అరెస్టులు, దేశద్రోహం కేసులా? 
ఎవరైనా నీ (చంద్రబాబు) ఎన్నికల ప్రణాళికలో పలానాది పెట్టావు కదా? దాన్ని ఎందుకు అమలు చేయవని ప్రశ్నిస్తే.. తాట తీస్తానని, తోక కత్తిరిస్తానని బెదిరిస్తాడు. మరికొందరిని ఏకంగా అరెస్టు చేయించి దేశద్రోహం కేసులు పెట్టిస్తున్నాడు ఈ పెద్దమనిషి. అందుకే ఈ పాలనను గమనించాలని కోరుతున్నా. అబద్ధాలు చెప్పే, మోసం చేసే ఈ వ్యక్తిని పొరపాటున క్షమిస్తే.. రేపొద్దున ఎన్నికల ప్రణాళికలోని హామీలలో 99 శాతం పూర్తి చేశానని మీ చెవ్వుల్లో క్యాలీఫ్లవర్‌ పెడతాడు. మొదటి ఐదేళ్లు బ్రహ్మాండంగా చేశానని, మరో ఐదేళ్లు ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తానంటాడు. మీరు నమ్మరని తెలిసి ఇంటికి కేజీ బంగారం, బోనస్‌గా బెంజ్‌ కారు ఇస్తానంటాడు. అదీ నమ్మరని తెలిసి ప్రతి ఇంటికి తన మనిషిని పంపిస్తాడు. ఒక్కొక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లో నుంచి దోచేసిందే. కానీ మీ మనసాక్షి ప్రకారం ఓటు వేయండి. రేపు మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం. అవ్వా తాతల పింఛన్‌ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచుతా. పింఛన్‌ వయస్సు 65 ఏళ్ల నుంచి 60కి తగ్గిస్తా. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అన్న పదాలకు అర్థం రావాలి. ఇది ఒక్క జగన్‌ వల్ల అయ్యే పని కాదు. జగన్‌కు మీ అందరి తోడు, దీవెనలు కావాలి.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top