దగా బాబూ తప్పుకో.. 

YS Jagan fires on Chandrababu At Meliaputti public meeting - Sakshi

శ్వేతపత్రాల పేరిట కల్లబొల్లి కబుర్లు చెబుతున్నావు

మెళియపుట్టి సభలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మండిపాటు

20 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులతో నాలుగేళ్లు

బీజేపీతో కాపురం చేశావు.. అప్పుడు ఏమీ చేయలేదెందుకు?   

ఇప్పుడు 25 మంది ఎంపీలను ఇస్తే చేసేస్తానని జనం చెవిలో పువ్వులు పెడుతున్నావు 

అప్పుడు కాంగ్రెస్‌ విలన్‌.. ఇప్పుడు బీజేపీ విలన్‌  

పోలవరం ప్రాజెక్టుకు ఒకే ఒక్క గేటు పెట్టి కొత్త సినిమా చూపిస్తున్నావు 

డిజైన్లకు అనుమతి లేదు.. డీపీఆర్‌ కూడా ఓకే కాలేదు 

రాజధాని పేరిట 2 ఎకరాల్లో బొమ్మల భవనాలతో మరో సినిమా 

గత ఎన్నికల నుంచి ఇప్పటి దాకా అవే గ్రాఫిక్స్‌ 

రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడవు.. వైదొలుగు..

అభివృద్ధి అనేది ఇంట్లో, ఊర్లో, చదువుల్లో, ఆరోగ్యంలో, పొలాల్లో కనిపించాలి.ఉద్యోగాల్లో, సంక్షేమంలో కనిపిస్తే.. దానిని అభివృద్ధి అంటాం. అంతే తప్ప తెల్ల కాగితాల్లో కనిపించేది అభివృద్ధి ఎలా అవుతుంది చంద్రబాబూ? 20 మంది ఎంపీలతో రాష్ట్రానికి  మేలు చేయడం చేతకానప్పుడు నీవు రాజకీయాలలో ఉండడానికి అర్హుడవేనా?

ఇంటికి గోడలు కట్టకుండా, శ్లాబ్‌ వేయకుండా ఇంటి ప్రారంభోత్సవానికి పిలిచి భోజనం పెడితే ఆ మనిషిని ఏమంటారు? పిచ్చోడంటారు. లేదా మనల్ని పిచ్చిపట్టించడానికి చేస్తున్నాడంటాం. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో అదే చేస్తున్నాడు. 48 గేట్లకు గాను ఒక గేటు పెట్టి ప్రారంభోత్సవం అంటూ మనకు సినిమా చూపిస్తున్నాడు.

రాజధాని గురించి మీకు చెప్పనక్కరలేదు. ఇది మరో సినిమా. మీరంతా బాహుబలి సినిమా చూశారా? అందులో రా«జధాని సెట్టింగులు చూశారా? అదే మన రాజధాని కోట. చంద్రబాబు గ్రాఫిక్స్‌. రాజధాని అంటే బాహుబలి సినిమా చూడండంటాడు. రాజధానిలో శాశ్వత నిర్మాణానికి ఒక్కటంటే ఒక్క ఇటుక వేయలేదు. పర్మినెంటు బిల్డింగ్‌ ఒక్కటంటే ఒక్కటి కనిపించదు. అంతా టెంపరరీ. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అది.. తాత్కాలిక ఇది.. తాత్కాలిక భవనాల సంగతి ఎలా ఉందో తెలుసా? బయట మూడించుల వర్షం పడితే లోపల ఆరించుల వర్షం పడుతుంది చంద్రబాబు  పుణ్యాన.  

రాహుల్‌ గాంధీ 2015 జులై 23న అనంతపురం వచ్చినప్పుడు ఇదే చంద్రబాబునాయుడు ఏమన్నాడో తెలుసా? ‘ఏముఖం పెట్టుకుని వస్తున్నావు? ఏం చేశారని? ఇంకా బతికున్నామా.. లేమా.. అని చూడటానికా? లేకపోతే పుండు మీద కారం చల్లి పోవాలనా? కష్టాలలో ఉండేది మీవల్లే కదా? కాంగ్రెస్‌ పార్టీకి సహకరించే వాళ్లనేమనాలి? ఇది న్యాయమేనా? రాష్ట్ర ద్రోహులు కాదా వీరందరూ? రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మళ్లీ తగుదునమ్మా అంటూ ఇక్కడికి వెక్కిరించడానికి వస్తున్నారా? కాంగ్రెస్‌ను శాశ్వతంగా బాయ్‌కాట్‌ చేయాలి. అప్పటికి కూడా మన కసి తీరదు. వారిని ఇగ్నోర్‌ చేయాలి. ఛీ కొట్టాలి. రాష్ట్రంలోకి రాకుండా భూస్థాపితం చేయాలి’ అన్నారు. ఇలాంటి కాంగ్రెస్‌తో ఈ పెద్దమనిషి చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకున్నారు. 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాలుగేళ్ల పాటు కేంద్రంలో బీజేపీతో సంసారం చేసి ఈ రోజు శ్వేతపత్రమని తెల్లకాగితం రిలీజ్‌ చేశావు. ఈ తెల్ల కాగితాలతో కల్లిబొల్లి కబుర్లు చెబుతున్నావు. రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేయలేదని ఇవాళ అంటున్నావు. 20 మంది ఎంపీలను పక్కన పెట్టుకుని రాష్ట్రానికి న్యాయం చేయలేని నీవు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడవేనా? రాజకీయాల నుంచి వైదొలగిపో.. పక్కకు తప్పుకో’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శ్వేత పత్రాలంటూ తెల్ల కాగితాలు విడుదల చేస్తూ 25 మంది ఎంపీలను ఇవ్వాలంటూ ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఇంటికి గోడలు కట్టకుండా, శ్లాబ్‌ వేయకుండానే గేటుపెట్టి భోజనానికి పిలిచినట్లు.. పోలవరం ప్రాజెక్టు పునాదులు కూడా పూర్తి కాకుండానే ఓ గేటు పెట్టి జనాల్ని పిచ్చోళ్లను చేయాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 330వ రోజు సోమవారం శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టిలో అశేష జనవాహిని మధ్య నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రాజధానిలో ఒక్కటంటే ఒక్కటీ శాశ్వత భవనానికి ఇటుక వేయలేదని, అన్నీ తాత్కాలికమేనని, తాజాగా రాజధాని నిర్మాణాలంటూ రెండెకరాల్లో రూ.50 కోట్లతో బొమ్మల భవనాలతో ప్రజలకు మరో సినిమా చూపించడానికి తయారవుతున్నారని తూర్పారపట్టారు. చంద్రబాబు చేస్తున్న మోసం, దగా, డ్రామాల గురించి ఆయన ప్రజలకు పూసగుచ్చినట్లు వివరించారు. ఈ సభలో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

బాబు హయాంలో రాక్షస పాలన 
‘‘చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో కరవు, తుపానులు, నిరుద్యోగం, మందు బాటిల్‌ ఇచ్చాడు. ఇసుక దోపిడీ, భూముల కుంభకోణాలు, రాజ్యాగం ఉల్లంఘనలు.. ఇది రాక్షస పాలన కాదా? ఈ నాలుగున్నరేళ్లలో ఏమిచ్చావయ్యా అని అడిగితే శ్వేతపత్రాలు ఇస్తున్నాడట. తెల్ల కాగితాలు ఇచ్చాడట. ఈ తెల్ల కాగితాలపై ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. ఎవరికైనా వారు చేసిన అభివృద్ధి వారి పరిపాలనకు గీటురాయి. తన అభివృద్ధిని చూసి ఓటు వేయండని అడిగితే ఆ ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి అవుతాడు. గతంలో నాన్నగారి పాలన గుర్తుందా? అప్పట్లో నన్ను చూసి, నా ప్రభుత్వ పనితీరును, అభివృద్ధిని చూసి ఓటేయండి అని అడిగారు. ఎవ్వరితోనూ పొత్తు కోసం ఎగబడలేదు నాన్నగారు. దాన్ని అభివృద్ధి అంటారు. కానీ చంద్రబాబునాయుడు ఇప్పుడేమంటున్నారో తెలుసా? రాష్ట్ర ప్రజలు 2014 ఎన్నికల్లో 17 మంది ఎంపీలను ఆయనకు కట్టబెట్టారు.

ఈ 17 మంది సరిపోరన్నట్లుగా మరో ముగ్గురిని చంద్రబాబు సంతలో పశువులు కొన్నట్లు కొన్నారు. మొత్తం 25 మంది ఎంపీలకు గాను 20 మందిని ఆయన దగ్గరే అట్టి పెట్టుకున్నారు. ఇద్దరిని కేంద్ర మంత్రులుగా చేసి నాలుగేళ్ల పాటు బీజేపీతో కాపురం చేశాడు. ఇప్పుడు బీజేపీకి విడాకులు ఇచ్చిన తర్వాత కేంద్రం.. రాష్ట్రానికి అన్యాయం చేసిందంటున్నాడు. ఈసారి నాకు 25కు 25 ఎంపీలను ఇవ్వండి.. నేనింకా ఏమేమో చేసేస్తానని మన చెవుల్లో పువ్వులు పెడుతున్నాడు. 20 మంది ఎంపీలను మీ దగ్గర పెట్టుకుని, ఇందులో ఇద్దరిని మంత్రులు చేసి నాలుగేళ్ల పాటు మీరు.. బీజేపీ చిలకా గోరింకల్లా కాపురం చేశారు. నువ్వు మోడీని పొగిడితే ఆయన నిన్ను పొగడడం.. అసెంబ్లీలో ఏకంగా తీర్మానాలు చేశారు. ఈ రోజు శ్వేత పత్రమని తెల్ల కాగితం రిలీజ్‌ చేస్తావు. కేంద్రం న్యాయం చేయలేదని ఇవాళ అంటున్నావు. 20 మంది ఎంపీలతో, ఇద్దరు కేంద్ర మంత్రులతో నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసి.. రాష్ట్రానికి మేలు చేయలేనప్పుడు నీవు రాజకీయాల్లో ఎందుకు ఉండాలి? పక్కకు తప్పుకో. 

కాంగ్రెస్‌ పార్టీతో కొత్త సంసారం 
చంద్రబాబు ఈ మధ్యకాలంలో బీజేపీకి విడాకులిచ్చి, ఇప్పుడు కొత్త సినిమా మొదలుపెట్టాడు. ఆ కొత్త సినిమా పేరు ‘కాంగ్రెస్‌ పార్టీతో కొత్త సంసారం’. కొత్త సినిమా ఈ మధ్యకాలంలో తీస్తున్నాడు. 2015లో బీజేపీతో సంసారం చేస్తున్నప్పుడు చిలకా గోరింకల్లా వారి కాపురం జరుగుతున్నప్పుడు కాంగ్రెస్‌ను బహిష్కరించాలన్నాడు. ఇప్పుడు బీజేపీతో సంసారమైపోయి విడాకులు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్‌తో దోస్తీ చేశాడు. కాంగ్రెస్‌తో కొత్తకాపురం మొదలు పెట్టాక మోదీ గురించి ఇప్పుడు అవే మాటలు అంటున్నాడు. మోదీ రాష్ట్రానికి వస్తున్నాడని చెప్పి.. చేసింది చాలదా? బతికి ఉన్నామా.. లేమా.. అని చూడ్డానికి వస్తున్నారా? అని మాట్లాడుతున్నారు. ఇవే మాటలు మీకు గుర్తుకు రావడం లేదా? సినిమా 1, సినిమా 2.. రెండు సినిమాలు ఒక్కటే కానీ పాత్రలే వేరు. అప్పట్లో కాంగ్రెస్‌ విలన్, ఇప్పుడు బీజేపీ విలన్‌. ఈ పెద్దమనిషి బీజేపీతో సంసారం చేసేటప్పుడు 2014 ఎన్నికల్లో జగన్‌కు ఓటేస్తే రాహుల్‌కు ఓటేసినట్లే అన్నాడు. ఇప్పుడు జగన్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లే అంటున్నాడు. ఇంతటి స్థాయిలో రాజకీయాలు దిగజారిపోయాయి. ఈయన పాలనలో మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు మాత్రమే కనిపిస్తున్నాయి.  

ఈ జిల్లాకు ఏం చేశావు బాబూ? 
అన్నా.. 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు ఈ జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లిచ్చామన్నా.. ఇవి చాలవన్నట్లు మా నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేను సంతలో పశువును కొన్నట్లుగా కొన్నాడు. మొత్తంగా జిల్లా నుంచి 8 స్థానాలు చేతిలో పెట్టుకొని మా నియోజకవర్గానికి, జిల్లాకు ఏం చేశాడన్నా.. అని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారు. సైకిలెక్కిన మా ఎమ్మెల్యే ఇసుక దందాలో బాగా సంపాదించారన్నా.. అని చెబుతున్నారు. ఇది సరిపోదన్నట్లు వంశధార నిర్వాసితుల పరిహారం కూడా బోగస్‌ పేర్లతో కొట్టేశాడన్నా.. అని చెప్పారు. వంశధార ప్రాజెక్టు గురించి చంద్రబాబు తన తొలి తొమ్మిదేళ్ల పాలనలో కనీసం ఆలోచన చేయలేదు. వైఎస్సార్‌ సీఎం అయ్యాక ఒడిశాతో వివాదమున్నా కూడా ఆ ప్రాజెక్టుకు సైడ్‌వియర్‌ కట్టి నీటిని తరలించేలా సింగిడి పాలాపురం రిజర్వాయర్‌ను ప్రారంభించారు. రూ.930 కోట్ల విలువ చేసే ప్రాజెక్టు పనుల్లో రూ.700 కోట్లు ఖర్చు చేసి ఉరుకులు పరుగులు తీయించారు. నాన్నగారు చనిపోయాక చంద్రబాబు నాయుడు వచ్చేసరికి కేవలం రూ.55 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ పూర్తి చేయలేదు. పైగా రూ.55 కోట్ల ప్రాజెక్టు అంచనాలను రూ.470 కోట్లకు పెంచారన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. కాంట్రాక్టర్‌గా వారి బినామీ సీఎం రమేష్‌ కంపెనీ రిత్విక్‌కు అప్పగించారు.

2.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. చంద్రబాబు చిత్తశుద్ధి ఎలా ఉందంటే.. ఈమధ్యకాలంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నేరడి వద్ద రిజర్వాయర్‌కు ఓకే  చెప్పినా చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వంశధార నిర్వాసితులకు నేను హామీ ఇస్తున్నాను. రేపు మనందరి ప్రభుత్వం వచ్చాక నేరడి బ్యారేజీ నిర్మాణంతో పాటు పెండింగ్‌ పనులన్నిటినీ పూర్తి చేస్తాను. నన్ను నిర్వాసితులు కలిశారు. అన్యాయం జరిగిందని వారు ధర్నాలు చేస్తుంటే గతంలో కూడా నేను వచ్చా. నిర్వాసితులకు మద్దతు తెలిపా. ఆరోజు నేనిచ్చిన మాట గుర్తుంది. ఇదే నిర్వాసితులు 200 మంది రైతులపై ప్రభుత్వం కేసులు పెట్టింది. 35 మందిని జైలులో పెట్టారు. రేపు మనందరి ప్రభుత్వం రాగానే వీరందరిపై ఉన్న కేసులు ఎత్తివేస్తాం. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం వచ్చేలా చేస్తాం. ప్రభుత్వం డీపట్టా భూముల్ని లాక్కొన్న ప్రతి పేదవాడికి మిగిలిన వారితో సమానంగా న్యాయం చేస్తాను. 

ఈ పెద్దమనిషి తల దించుకోవాలి  
మీ నియోజకవర్గానికి మేలు చేçయడానికి మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ ద్వారా 180 గ్రామాల్లోని 26,488 ఎకరాలకు నీరందించడానికి రూ.187 కోట్లు మంజూరు చేసి దివంగతనేత వైఎస్‌ ఆ ప్రాజెక్టు పనులను పరుగెత్తించారు. దాదాపు 70 శాంతం పనులు పూర్తయ్యాయి. అయితే చంద్రబాబు.. మిగతా పనుల అంచనాలను రూ.470 కోట్లకు పెంచేసి తన బినామీలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఇదే నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడుతున్నారు. పాతపట్నంలో 18 వేల మందికి తాగునీటి కోసం వైఎస్‌ చేపట్టిన పథకాన్ని ఈ పాలకులు సరిగా నిర్వహించడం లేదు. ఇతర 19 గ్రామాల్లో 30 వేల మందికి తాగునీరు లేదు. మేళియాపుట్టిలో చాలా మంది దారిపొడవునా ఇదే చెబుతున్నారు. ఇక్కడి ఆసుపత్రి గురించి కూడా చెబుతున్నారు. 10 మంది డాక్టర్లు ఉండాల్సిన చోట నలుగురు మాత్రమే ఉన్నారు. కమ్యూనిటీ ఆసుపత్రి ఓపీకి మాత్రమే పనికి వçస్తోంది. నాన్నగారి హయాంలో ఇదే నియోజకవర్గంలో 28 వేల ఇళ్లు కట్టించారు. ఈరోజు ఊరుకు నాలుగైదు కూడా కట్టని పరిస్థితి. ఆ మంజూరు చేసే ఇళ్లకు కూడా జన్మభూమి కమిటీలు లంచాలు పుచ్చుకుంటున్నాయి. చంద్రబాబు మా నియోజకవర్గంలో 20 గవర్నమెంటు స్కూళ్లు మూసేశారన్నా..  అని ప్రజలు చెబుతున్నారు. నిజంగా సీఎం స్థానంలో ఉన్న ఈ పెద్దమనిషి సిగ్గుతో తలదించుకోవాలి.  

మన ప్రభుత్వం రాగానే తిత్లీ బాధితులకు పరిహారం  
తిత్లీ తుపాను బాధితులకూ మొండి చేయి చూపారు. కానీ బాగా ఆదుకున్నట్లు ఏ ఆర్టీసీ బస్సుపై చూసినా ఆయన ఫొటోలే. విజయవాడ, విశాఖపట్నంలో ఆయన ఫ్లెక్సీలే. ఆయన్ను బాధితులు నిలదీస్తుంటే వెనుక నుంచి ఫొటోలు తీసి జైకొడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. తుపాను వల్ల వంశధార ఉప్పొంగి హిరమండలం మండలంలో పంటలు దెబ్బ తిన్నాయి. మెళియాపుట్టిలో రైతులు కార్యాలయాలను ముట్టడిస్తే కేసులు పెట్టి అరెస్టు చేసిన ఘనత చంద్రబాబుది. రైతులకు పంటనష్టం పరిహారం ఇవ్వడం లేదు. వేలాది ఎకరాలు పంట నష్టపోయినా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోతే కనీసం రేకులు కూడా ఇవ్వలేదు.

శ్రీకాకుళం జిల్లాలో తుపాను వల్ల రూ.3,435 కోట్ల నష్టం వచ్చిందని ఇదే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాడు. కానీ ఈయన ఇచ్చింది మాత్రం అందులో 15 శాతం కేవలం రూ.500 కోట్లు మాత్రమే. రైతులకు తన ఫొటోలతో కూడిన చెక్కులు ఇచ్చారు. ఆయన గారి సుందర ముఖారవిందాన్ని ఎవరైనా మరిచి పోతారేమోనని ఫొటో పెట్టాడు. మెళియాపుట్టి మండలం బండపల్లి గ్రామానికి చెందిన జెనియాపురం అప్పన్న అనే రైతుకు రూ.12,145 చెక్కు వచ్చింది. దాన్ని బ్యాంకులో చూపిస్తే చెత్తబుట్టలో వేశారని, డబ్బులు రాలేదని నాతో చెప్పాడు. ఇంతటి దారుణమైన పరిస్థితి ఉంటే.. తుపాన్‌ను జయించాను.. సముద్రాన్ని కంట్రోల్‌ చేశాను.. దేవుడిని జయించానని అనడానికి నీవు అర్హుడవేనా చంద్రబాబూ? రూ.3,435 కోట్ల నష్టం వాటిల్లిందని లెక్కలు తేల్చారు. ఇందులో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది పోగా మిగిలింది మనందరి ప్రభుత్వం రాగానే ఇస్తానని హామీ ఇస్తున్నాను. 

రైతులు, అక్క చెల్లెమ్మలకు మోసం 
రైతుల రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాపీ కాలేదు. ఆయన ఇచ్చిన మాఫీ సొమ్ము వడ్దీలకూ సరిపోకపోగా రైతుల అప్పు రూ.1.20 లక్షల కోట్లకు చేరింది. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాకపోగా నోటీసులు మాత్రం వస్తున్నాయి. సున్నా వడ్డీ రుణాలు కూడా అందడం లేదు. పెథాయ్‌ తుపాను వల్ల 6 లక్షల నుంచి 7 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మన సీఎం, మంత్రులు కేబినెట్‌ మీటింగ్‌లో రైతుల గురించి మాట్లాడరు. గజదొంగలు వాటాలు పంచుకున్నట్లు కమీషన్లు పంచుకుంటారు. భూములు ఎవరికి ఇవ్వాలో.. కమీషన్లు ఎలా కొట్టేయాలో ఆలోచిస్తారు. రాజధాని భూముల నుంచి విశాఖ భూముల వరకు ఏమీ వదలడం లేదు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. శ్రీకాకుళం జిల్లాలో రైతుల చేతికి ధాన్యం వచ్చింది. ఎక్కడైనా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా? చంద్రబాబు దళారీలకు కెప్టెన్‌. చంద్రబాబుకు హెరిటేజ్‌ షాపు ఉంది. అదే ధాన్యాన్ని తక్కువ ధరకు కొని చంద్రబాబు తన షాపులో బియ్యాన్ని మూడు, నాలుగు రెట్లకు అమ్ముతున్నారు. క్వింటాలు ధాన్యం  రూ.1,750గా నిర్ణయించినా రూ.1,000 కూడా రావడం లేదు.   

అన్నింటా బాదుడే బాదుడు..   
చంద్రబాబు హయాంలో కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ రేట్లు, ఇంటి పన్నులు, స్కూలు, కాలేజీ ఫీజులు, ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు మామూలు రోజుల్లో ఆర్టీసీ చార్జీ ఏసీ బస్సుకు రూ.1,352. అదే సంక్రాంతి వస్తే రూ.1,900 అవుతుంది. ఫీజు రీయింబర్స్‌మెంటు పథకానికి పాతరేశారు. ఇంజినీరింగ్‌ చదువుకు ఏటా రూ.లక్షకు పైగా ఖర్చవుతుంటే ఈయన ఇస్తోంది రూ.35 వేలే. మిగతా డబ్బు కట్టడానికి పేదలు ఇళ్లు, ఆస్తులు, భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆ ఇచ్చేది కూడా సరిగా ఇవ్వని పరిస్థితి. చంద్రబాబు బీసీలను ఆదుకోవడమంటే ఆదరణ1, ఆదరణ2 అని నాలుగు కత్తెరలు, నాలుగు ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడమే అనుకుంటాడు. నిజమైన ప్రేమ అంటే ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు చూపారు. ఏ పేదవాడైనా కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబంలో ఒక్కరైనా విద్యావంతుడు కావాలని స్వప్నం చూశారు. దాన్ని తన హయాంలో నిజం చేశారు.

ఇవాళ ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యమైంది. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రూ.550 కోట్ల బకాయి ఇవ్వడం లేదని సేవలు నిలిపేసిన దారుణ పరిస్థితి. 20 నిమిషాల్లో రావలసిన అంబులెన్స్‌ 108 వస్తుందో రాదో తెలియని పరిస్థితి. రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. ఇవాళ గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియాను తయారు చేశాడు. ఏది కావాలన్నా లంచం ఇవ్వాల్సిందే. తాగడానికి మంచి నీరు ఉండదు కానీ, వీధి చివర, బడి, గుడి పక్కన మందు షాపులున్నాయి. మట్టి, ఇసుక, భూములు.. అన్నింటా దోపిడే. ఇలాంటి రాజకీయ వ్యవస్థలో, అన్యాయమైన పాలనలో మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత రావాలి. ఎన్నికల ప్రణాళికలో చెప్పినది చేయకపోతే తన పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోయే పరిస్థితి తీసుకురావాలి. అప్పుడే ఈ రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత వస్తాయి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయడానికి బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించాలని, దీవించాలని కోరుతున్నాను’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

బాబు వచ్చాడు.. ఉద్యోగాలు గోవిందా.. 
చంద్రబాబు ఎన్నికలకు ముందు చెప్పిన మాట.. జాబు రావాలంటే బాబు రావాలి అని. ఇంటికో ఉద్యోగం,  లేక ఉపాధి ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల రూ.2 వేలు ఇస్తామన్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. 55 నెలలు అంటే రూ.1.10 లక్షలు మీకు బాకీపడ్డాడు. ఎప్పుడైనా చంద్రబాబు కనిపిస్తే ఈ బాకీ గురించి అడగండి. నిరుద్యోగ భృతి ఇచ్చేశానని, యువకులు కేరింతలు కొడుతున్నారని చెబుతున్నాడు. ఎన్నికలకు 3 నెలల ముందు రూ.2 వేల భృతిని రూ.1,000 చేశాడు. 1.72 కోట్ల ఇళ్లను 3 లక్షలకు కుదించి.. వారికి రూ.వెయ్యి చొప్పున ఈ మూడు నెలలు ఇస్తాడట. ఇంతకన్నా మోసం చేసే వ్యక్తి ప్రపంచంలో ఉంటాడా? రాష్ట్ర విభజన తరువాత 1.42 లక్షల ఉద్యోగాల ఖాళీలున్నాయి. రిటైరయిన వారిని కలిపితే అవి 2.40 లక్షలకు పెరిగాయి. ఆ ఉద్యోగాల్లో ఒక్కటైనా భర్తీ చేశాడా?  
- బాబు వచ్చాడు.. 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. 
- గృహ నిర్మాణ శాఖలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు 3500 మంది ఉద్యోగాలు గోవిందా..  
- గోపాల మిత్రలు 1000 మంది ఉద్యోగాలు గోవిందా.. 
- 4500 మంది ఫీల్డు అసిస్టెంటు ఉద్యోగాలు గోవిందా.. 
- ఆయుష్‌ ఉద్యోగులు 800 మంది ఉద్యోగాలు గోవిందా.. 
- సాక్షర భారత్‌ సిబ్బంది 30 వేల మంది ఉద్యోగాలు గోవిందా.. 
- మధ్యాహ్న భోజన పథకంలోని 85 వేల మంది అక్కచెల్లెమ్మల ఉద్యోగాలూ గోవిందా..  

మన ప్రభుత్వం రాగానే ఇలా చేస్తాం 
- వైద్యం ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. పేదవాడి వైద్యం కోసం ఎన్ని లక్షలు ఖర్చు అయినా భరిస్తాం. 
- ఏపీలోని పేదలు వైద్యం కోసం దేశంలోని ఏ నగరానికి వెళ్లినా, ఏ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. 
- కిడ్నీ, తలసేమియా.. లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి నెలనెలా రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం.  
- మహానేత కాలంలో జరిగినట్లే.. మూగ, చెవిటి పిల్లలు అందరికీ రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు ఖర్చయ్యే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ ఆపరేషన్లు ఉచితంగా చేయిస్తాం. 
- క్యాన్సర్‌ చికిత్సకు కనీసం ఏడెనిమిది సార్లు కీమోథెరపీ చేయాలి. ఇవాళ ఈ ప్రభుత్వం కేవలం రెండుసార్లకు మాత్రమే డబ్బులిస్తోంది. దీంతో ఆరు నెలల తర్వాత వారికి వ్యాధి తిరగబెడుతోంది. రోగులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సరిగా జరగడం లేదు. పేదలు ఆస్పత్రులకు వెళితే ఏడాది తర్వాత రమ్మంటున్నారు. దీంతో వారి ప్రాణాలు పోతున్నాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మారుస్తాం.   
- ఆపరేషన్‌ పూర్తయ్యాక వైద్యులు సూచించే విశ్రాంతి కాలంలో పనులు చేసుకోలేరు కాబట్టి ఆర్థిక సాయం అందిస్తాం.   

‘బాబు – పోలవరం’ మరో డ్రామా.. 
చంద్రబాబు ఇప్పుడు పోలవరం డ్రామాలు ఆడుతున్నాడు. పోలవరం గేటు ప్రారంభిస్తున్నాడట. టీవీలో చూశాం. పోలవరం ప్రాజెక్టు పునాదులు దాటి ముందడుగు వేయలేదు. 48 గేట్లు పెట్టవలసి ఉంది. ఒక్కో గేటు పెట్టడానికి రెండు నెలలు పడుతుంది. ఈయన ప్రారంభించింది ఒకే ఒక్క గేటు. అయినా బిల్డప్‌ ఎలా ఇస్తున్నాడో తెలుసా? ఆయన తాన అంటే ఆయనకు సంబంధించిన ఎల్లో మీడియా, పేపర్లు, టీవీలు తందానా.. అంటాయి. ఆయన ఏమీ చేసినా ఆహా ఓహో చంద్రబాబు అంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు గోబెల్స్‌ ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. డ్యాంకు అవసరమైన గట్టు కట్టలేదు. ఆ గట్టు ఎలా కట్టాలో డిజైన్‌ కూడా పూర్తి కాలేదు. కనీసం డీపీఆర్‌ కూడా ఓకే కాలేదు. ప్రాజెక్టులో చుక్కనీరు కూడా నిలపలేదు. నిర్వాసితులను తరలించలేదు. కానీ 48 గేట్లలో ఒకే ఒక్క గేటుకు ప్రారంభోత్సవం చేసి మనకు పెద్ద సినిమా చూపిస్తాడు. ఆ సినిమా పేరు ‘బాబు – పోలవరం ప్రాజెక్టు’. 

క్రిస్మస్‌ సందర్భంగా నేడు పాదయాత్రకు విరామం   
క్రిస్మస్‌ సందర్భంగా నేడు (మంగళవారం) ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రాం కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం తెలిపారు. క్రైస్తవులు ఆనందంగా క్రిస్మస్‌ పండుగను జరుపుకునేందుకు వీలుగా పాదయాత్రకు విరామం ప్రకటించామన్నారు. బుధవారం పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టి మండలం చాపర నుంచి యథావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top