ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ కరప్షన్‌లో నంబర్‌ వన్‌

YS Jagan fires on Chandrababu in the Kakinada Sabha - Sakshi

కాకినాడ సభలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

బాబు విదేశాల్లో కోతలు కోస్తే ఇక్కడ ఆయన కరపత్రిక ఆహా.. ఓహో అంటూ బ్యానర్‌ కథనాలు 

అమరావతి వెళ్తే టీడీపీ ఎమ్మెల్యేకు చెందిన గేదెలు మేస్తూ కనిపిస్తాయి.. బాహుబలి గ్రాఫిక్స్‌ కనిపిస్తాయి

బయటకు యుద్ధం.. లోపల కాళ్లబేరం..ఇదీ.. హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు నైజం

పరిశ్రమలకు రూ.3,600 కోట్ల రాయితీ ఇవ్వనందుకా?

విద్యుత్‌ చార్జీలు పెంచి నాపరాళ్ల ఫ్యాక్టరీలు మూతపడేలా చేసినందుకా?

రాయల్టీ విపరీతంగా పెంచి గ్రానైట్‌ పరిశ్రమల నడ్డి విరిచినందుకా?

జూట్‌ మిల్లులు, డెయిరీలు కనుమరుగయ్యేలా చేసి రైతులను ఇబ్బంది పెట్టినందుకా?..

అబద్ధాలు ఆడినందుకు, మోసం చేసినందుకా నంబర్‌ వన్‌?

సింగపూర్‌లో చంద్రబాబు కోసిన కోతలు ఎలా ఉన్నాయంటే.. అమరావతిలో ఉద్యోగులు కేవలం 15 నిమిషాల్లో అలా నడుచుకుంటూ తమ కార్యాలయాలకు వెళ్లి పోవచ్చట. అక్కడ 1,400 కిలోమీటర్ల మేర సైకిళ్లు తొక్కుకునే మార్గాలున్నాయట. (కార్లు వెళ్లే మార్గాల సంగతి దేవుడెరుగు) అమరావతి అద్భుతమైన గార్డెన్‌ సిటీ అట. అంతటితో ఆగలేదు. 180 కి.మీల మేర అక్కడ రవాణా కోసం కాలువలు కూడా ఉన్నాయట. అక్కడ వాడే వాహనాలన్నీ ఎలక్ట్రికల్‌ వాహనాలట. కాలుష్యమే ఉండదట. అక్కడ చంద్రబాబు ఇలా కోతలు కోస్తే.. ఇక్కడ ఆహా... రాజధాని.. ఓహో రాజధాని.. అని ప్రచారం. నేను పొద్దున్నే లేచి చంద్రబాబు కరపత్రం ఈనాడు ఏం రాసిందోనని చూశాను. ‘ఆహా... రాజధాని, ఓహో రాజధాని, అమరావతి రాజసం’ అని రాశారు. 

అమరావతికి వెళ్లి చూస్తే అక్కడ గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అక్కడ శాశ్వత నిర్మాణం కోసం ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా వేయక పోవడం కనిపిస్తుంది. చంద్రబాబు గారి.. ఎమ్మెల్యే గారి గేదెలు గడ్డి మేస్తూ కనిపిస్తాయి. అక్కడ ఇంకా చంద్రబాబు గారి బాహుబలి గ్రాఫిక్స్‌ కనిపిస్తాయి. ఈయన గారి గిమ్మిక్కులు కనిపిస్తాయి. రాజధాని పేరు చెప్పి లంచాలు పుచ్చుకుని తనకు కావాల్సిన వాళ్లకు, తన బినామీలకు భూములు అమ్మేయడం కనిపిస్తోంది. 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనలో ఉండేది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ కాదు.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ కరప్షన్‌ (సులభతర లంచగొండితనం).. ఈయన గారి పరిపాలనలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని గత రెండేళ్లలో మూడు ప్రఖ్యాత సంస్థలు.. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ రీసెర్చ్, సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్, ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్‌నేషనల్‌.. తేల్చి చెప్పాయి. 

పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే చంద్రబాబుకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రథమ స్థానం ఇచ్చిన వారికి బుద్ధి, జ్ఞానం ఉందా?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 215వ రోజు బుధవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసినందుకు, అబద్ధాలు చెప్పినందుకు నంబర్‌ వన్‌ స్థానం వచ్చిందని నిప్పులు చెరిగారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..  

పరిశ్రమలకు రాయితీలు ఎగ్గొట్టినందుకా? 
‘‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఈ పెద్దమనిషి తొలుత చేయాల్సింది ఏమంటే పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వడం. ఈయన ముఖ్యమంత్రి అయ్యాక పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు రూ,6,800 కోట్లు అయితే, ఇచ్చింది కేవలం రూ.3,200 కోట్లు మాత్రమే. అంటే ఈ పెద్దమనిషి నాలుగేళ్లుగా రూ.3,600 కోట్ల రాయితీ బకాయిలు పరిశ్రమలకు ఇవ్వలేదు. ఇలాంటి వ్యక్తికి ఈజ్‌ ఆ‹ఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ఎవరైనా ఇచ్చారు అంటే.. నిజంగా ఇచ్చినోడికైనా బుద్ధి ఉండాలి.. లేదా చంద్రబాబుకైనా బుద్ధి ఉండాలి. చంద్రబాబు పాలనలో ఏ జిల్లాలో చూసినా మూతపడిన పరిశ్రమలే కనిపిస్తాయి. ఈ పెద్దమనిషి అధికారంలోకి వచ్చాక కరెంటు యూనిట్‌ ధర రూ.3.75 ఉంటే దానిని ఈయన రూ 8.75కు పెంచడంతో కర్నూలు జిల్లాలో నాపరాళ్ల ఫ్యాక్టరీలన్నీ మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

గ్రానైట్‌ మీద వేసే రాయల్టీని విపరీతంగా పెంచడంతో చిత్తూరు, ప్రకాశం అనంతపురం జిల్లాల్లో గ్రానైట్‌ క్వారీయింగ్‌ పరిశ్రమలు నడపలేక మూసేస్తున్నారు. కరెంటు రేట్ల పెరుగుదల వల్ల గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లన్నీ కూడా వరుసగా మూత పడుతున్నాయి. చిత్తూరు, రేణిగుంట, కోవూరు, గన్నవరం, తమ్మపాలెం, భీమసింగిలో  గ్రానైట్‌ ఫ్యాక్టరీలు చంద్రబాబు పాలనలో మూత పడటం మనమంతా చూస్తున్నాం. హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని మూసేయించాడు. ఇవాళ ఒంగోలు డెయిరీని కూడా నష్టాల బాట పట్టించిన ఘనత కూడా చంద్రబాబుదే. ఆయిల్‌ఫెడ్‌ లాంటి సహకార సంస్థలు కూడా మూతపడ్డాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో సుమారు 50 స్పిన్నింగ్‌ మిల్లుల వారికి ఇవ్వాల్సిన విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వని కారణంగా వాటిలో పది మిల్లులు మూతపడ్డాయి.

మిగతా మిల్లుల్లో కూడా ఉత్పత్తి, ఉద్యోగులను తగ్గించుకుని నడిపించుకునే పరిస్థితులున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ నాలుగేళ్లుగా 14 జూట్‌ మిల్లులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఉన్నవి నడవని పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవాలు ఇలా ఉంటే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చినట్లు ఈ పెద్ద మనిషి ఊదరగొడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలి? చంద్రబాబు మోసాలు, అబద్ధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. ఈయనకు నంబర్‌ వన్‌ వచ్చిందని ఈనాడు పత్రికలో పెద్ద పెద్ద అడ్వర్టయిజ్‌మెంట్లు ఇచ్చుకుని ప్రచారం చేసుకుంటున్నారు.  

సింగపూర్‌లో రాజధాని సినిమా.. 
చంద్రబాబు పాలన ఏ స్థాయిలో ఉందో అని చెప్పడానికి రెండు ఉదాహరణలు చెబుతాను. వారం క్రితం.. ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్జాతీయ నగరాల సదస్సు జరుగుతోందని చెప్పి సింగపూర్‌కు వెళ్లారు. అక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఆ సదస్సుకు ముంబాయి, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాల నుంచి ఏ ముఖ్యమంత్రి గాని, ఏ వ్యక్తి గానీ రాలేదు. మన చంద్రబాబును మాత్రమే వాళ్లు పిలిచారట. అమరావతి పేరు చెప్పి ఈ పెద్దమనిషి 50 వేల ఎకరాల పంట భూములను గడ్డి భూములుగా మార్చేసి లంచాలు తీసుకుంటూ దేశ, విదేశాల్లో ఉన్న తన బినామీలకు నచ్చిన వారికి నచ్చిన రేటుకు  భూములు అమ్మేస్తున్నారు.

ఇలాంటి చంద్రబాబును మాత్రమే వాళ్లు సింగపూర్‌కు ఆహ్వానించారట. అక్కడ చంద్రబాబు కట్టని అమరావతి గురించి, కనపడని అమరావతి గురించి కోతలు కోస్తూ ఉంటే.. సింగపూర్, దుబాయ్, షాంఘై నగరాలకు చెందిన వారంతా ఇక తమ నగరాల్లో ఉండటం శుద్ధ దండుగ అందరమూ అమరావతికే వెళ్లి పోదామన్నట్లుగా.. చంద్రబాబు  అక్కడ బిల్డప్‌ ఇచ్చారు. 

చంద్రబాబు మోసాలను గమనించండి.. 
సింగపూర్‌ నుంచి వచ్చీ రాగానే.. విమానం దిగీ దిగగానే ఈనాడులో మళ్లీ బ్యానర్‌ వార్త వచ్చింది. ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీకి ప్రథమస్థానం వచ్చిందని బిల్డప్‌ (చిత్రీకరించారు) ఇచ్చారు. ఈనాడులో ఆ వార్త చూసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రపంచ బ్యాంకు వాళ్లు చంద్రబాబు పాలనను చూసి మెచ్చుకుని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తనకు నంబర్‌ వన్‌ స్థానం ఇచ్చారని ఊదరగొట్టారు. అంతటితో ఆగ లేదు.. చంద్రబాబు గొప్పదనం చూసి మనమంతా కడుపు నింపుకోవాలన్నారు. ఉద్యోగాలు, పెట్టుబడులు, పరిశ్రమలు ఇవేవీ రాకపోయినా కూడా వచ్చేసినట్లుగా మనమంతా ఆనందపడాలట. నాలుగేళ్లలో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు వచ్చాయా? (ప్రజల నుంచి లేదు... లేదు అని కేకలు). డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ ప్రమోషనల్‌ పాలసీ (డీఐపీపీ) వెబ్‌సైట్‌లో చూస్తే మనకు ప్రతి రాష్ట్రంలోనూ ఎంతెంత పెట్టుబడులు ఎప్పుడు వచ్చాయనేది తెలిసి పోతుంది. ఆ ప్రకారం ఈ నాలుగేళ్లలో ఏపీకి కనీసం రూ.20 వేల కోట్ల రూపాయలు కూడా రాలేదు.  

ఈ జిల్లాకు బాబు ఏం చేశారు?  
ఈ జిల్లాలో 19 నియోజకవర్గాలకు గాను 17 ఎమ్మెల్యేలను పక్కనే కూర్చోబెట్టుకున్నారు. కాకినాడకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ఇక్కడ జరిగింది, జరుగుతా ఉన్నది అవినీతి, లంచగొండితనం, ప్రచార అర్భాటం. కాకినాడ స్మార్ట్‌ సిటీగా మారలేదుగానీ, కాకినాడలో అవినీతి మాత్రం చాలా స్మార్ట్‌గా మారింది. జన్మభూమి కమిటీల మాఫియాకు తోడు టీడీపీ నాయకులు ఆయిల్, డీజిల్‌ మాఫియా కూడా చేస్తున్నారు. షిప్పు నుంచి ఆయిలు వెళ్లే పైపులైన్లకు కన్నం పెట్టి ఆయిల్‌ అమ్ముకుంటున్నారు. గజదొంగలు పరిపాలిస్తే ఎలా ఉంటుందీ అనేదానికి కాకినాడే నిదర్శనం. ఇక్కడ మాఫియాను అరికట్టాల్సిన పోలీసుల పరిస్థితి ఎలా ఉందీ అంటే పోలీసుల పోస్టింగ్‌లకు రాజకీయ నాయకులు లంచాలు తీసుకుంటున్న దుస్థితి. ఇదే కాకినాడలో ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ఇలా ఏది కనబడితే అది కబ్జా జరుగుతోంది. అడ్డుకుంటే దౌర్జన్యం.  

పుష్కలంగా పేకాట క్లబ్బులు కనిపిస్తున్నాయి. ప్రతి నెలా ఇక్కడి టీడీపీ నాయకులకు మామూళ్లు వస్తున్నాయి. కార్పొరేషన్‌ రుణాలకు రూ.20 వేలు, రూ.30 వేలు లంచం లేనిదే ఇవ్వడం లేదు. పక్కనే కాకినాడ రూరల్‌ నియోజక వర్గం..  అక్కడ కూడా ప్రతి దానికీ ఒక రేటు. లే ఔట్‌ వేస్తే ఎకరాకు రూ.6 లక్షలు ఇవ్వనిదే పని కావడం లేదు. ఇళ్ల స్థలాల కోసం  వేలకు వేలు వసూలు చేస్తున్నారు.  ముఖ్యమంత్రికి కూడా భాగం ఇస్తున్నాం కదా.. ఇంకెందుకు భయం అని అక్రమార్కులు అంటున్నారు. నాలుగేళ్లుగా కాకినాడను పట్టించుకోని వారు ఇప్పుడు స్మార్ట్‌ సిటీకోసం, డ్రైనేజీల కోసం టెండర్లు పిలుస్తున్నాం అంటూ మనందరి చెవుల్లో కాలీఫ్లవర్‌ పెడతారు.   ఆరు నెలల్లో ఎన్నికలు వస్తున్నాయనే సరికి అన్నీ గుర్తుకొస్తాయి. స్మార్ట్‌ సీటీ కింద కేంద్రం వందల కోట్లు ఇస్తే ఖర్చు చేసింది రూ.50 కోట్లు మాత్రమే. కేంద్రం ప్రకటించిన 20 స్మార్ట్‌ సిటీల్లో కాకినాడ పనితీరు చివరి స్థానంలో అంటే 20వ స్థానంలో ఉంది. 

పేదల ఫ్లాట్లలోనూ అవినీతి 
నాడు రాజశేఖరరెడ్డిగారు కాకినాడ నగరానికి ‘ఆవా’ మంచినీళ్ల స్కీము మొదలు పెట్టారు. ఆయన మృతి చెందాక ఆ స్కీము ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది. మహానేత హయాంలోనే కాకినాడలో రెండు రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు.. (సాంబమూర్తి నగర్, పేదరాజుపేట) కట్టారు. ఏటివోక వద్ద మరో బ్రిడ్జి మంజూరు చేశారు. ఆయన మృతి చెందాక ఈ బ్రిడ్జి పనులు ఆగిపోయాయి. జగన్నాథపురం కాల్వపై బ్రిడ్జి పనులు ఎన్ని సార్లు అలైన్‌మెంటు మార్చారో. ఆ బ్రిడ్జికి సంబంధించి రూ.54 కోట్ల పనులను అక్షరాలా రూ.146 కోట్లకు తీసుకుపోయారు. దీంట్లో కూడా డబ్బు సంపాదించుకోవాలని ఈ రోజుకు కూడా ఆ పనులు మొదలు పెట్టలేదు. 2016లో బాబు తీసుకొచ్చిన గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వాళ్లకు లంచాలు ఇవ్వనిదే పనులు జరగడం లేదని ప్రజలు చెబుతున్నారు.

నాన్నగారి పాలనలో ఇదే కాకినాడలో 13 వేల ఇళ్లు కట్టించారు. ఇప్పుడు చంద్రబాబు నాలుగున్నరేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. పైగా రాజశేఖరరెడ్డి పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ఫ్లాటు కడతాను అని వ్యాపారం చేస్తున్నారు. రూ.3 లక్షలు కూడా చేయని ఫ్లాటును రూ.6 లక్షలకు అమ్ముతాడట. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.3 లక్షలు భరిస్తే, మిగతా రూ.3 లక్షలను పేదలు నెల నెలా 20 ఏళ్ల పాటు కట్టుకోవాలట. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి.. చంద్రబాబు ఇస్తానంటున్న ఈ ఫ్లాట్లు వద్దనకుండా తీసుకోండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ ఫ్లాట్ల మీద ఉన్న అప్పు మొత్తం మాఫీ చేస్తాం.

ఇదే కాకినాడలో జనరల్‌ ఆస్పత్రి పరిస్థితి దారుణం. ఎవరైనా గర్భవతి డెలివరీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుందో రాదోనని భయపడే పరిస్థితి. అటెండర్‌ మొదలు డాక్టర్‌ వరకు దాదాపుగా 500కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. గత ఆరు నెలల్లో 48 మంది అక్కచెల్లెమ్మలు డెలివరీ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. కనీసం విచారణ కూడా లేదు. ఇక్కడ 20 డయాలసిస్‌ యూనిట్లు ఉంటే నెఫ్రాలజిస్ట్‌లు లేక టెక్నీషియన్లతో పని చేయిస్తున్న అధ్వానమైన పరిస్థితి. పక్కనే తమ్మవరం. ఇక్కడ 300 ఎకరాల భూమిపై ఏపీఐఐసీకి, రైతులకు మధ్య వివాదం జరుగుతోంది. ఎన్నికలప్పుడు ఈ పెద్దమనిషి ఈ భూములన్నీ డీనోటిఫై చేసి ఇస్తానని చెప్పి పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. నాలుగున్నరేళ్ల ఈ పాలనలో అవినీతి, మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లే. 

చంద్రబాబును క్షమించొద్దు 
అబద్దాలాడే చంద్రబాబును మళ్లీ క్షమిస్తే.. హామీలన్నీ నెరవేర్చానని, కేజీ బంగారం, బెంజికారు ఇస్తానంటారు. అయినా మీరు నమ్మరు కాబట్టి ప్రతి ఇంటికి సాధికార మిత్ర పేరుతో ఒకరిని పంపిస్తారు. వాళ్లు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు డబ్బు పెడతారు. వద్దు అనద్దు. రూ.5 వేలు తీసుకోండి. అదంతా మనడబ్బే. మన జేబుల్లోనుంచి కొట్టేసిన డబ్బే. మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. ఈ వ్యవస్థలో మార్పు కోసం మీ ముందుకు వచ్చిన మీ బిడ్డను ఆశీర్వదించండి. మన ప్రభుత్వం రాగానే పేదలందరినీ నవరత్నాలతో ఆదుకుంటాం. ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏపీపీఎస్సీ, డీఎస్సీ  నోటిఫికేషన్లన్నీ క్రమం తప్పకుండా విడుదల చేసి ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేస్తాం. పెన్షన్, రేషన్‌ కార్డు, మరుగుదొడ్లు.. ఏది కావాలన్నా 72 గంటల్లో మంజూరు చేసే వ్యవస్థను తీసుకొస్తాం. గ్రామ సచివాలయాల్లో అక్కడి 10 మందికి ఉద్యోగాలిస్తాం. ఈ లెక్కన లక్షా యాభై వేల మంది పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం తీసుకొస్తాం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.  

కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలను నమ్మొద్దు 
ప్రత్యేక హోదా విషయంలో ఏ పార్టీని కూడా మీరు నమ్మొద్దు. నమ్మి నమ్మి అలసిపోయాం. వద్దు వద్దంటున్నా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి మోసం చేసింది. అందువల్ల కాంగ్రెస్‌ను నమ్మొద్దు. నరేంద్రమోదీ ఎన్నికలప్పుడు తిరుపతి సభలో స్వయంగా ఆయనే ప్రత్యేక హోదా ఇస్తాం, పదేళ్ల పాటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలో ఉండీ కూడా బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేస్తోంది. ఇక చంద్రబాబు.. 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తాను అంటున్నారు.

ఇప్పుడు 20 మంది ఎంపీలను ఇస్తే ఏం ఒరగబెట్టావ్‌ అని నిలదీయండి. నాలుగేళ్ల పాటు బీజేపీతో సంసారం చేసి.. ఇప్పుడు అన్యాయం చేసిందని, తాను మాత్రం మంచోడినని మోసం చేస్తున్నారు. కాబట్టి ఏపార్టీనీ నమ్మొద్దు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వెయ్యండి. 25 మంది ఎంపీలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిస్తే ఆ తర్వాత కేంద్రాన్ని మనం శాసిస్తాం. ప్రత్యేక హోదాకు ఎవరు సంతకం పెడితే వారికే మా మద్దతు. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాం. ఉద్యోగాలు రావాలి అంటే ప్రత్యేక హోదా రావాలి. ఇందుకు మీ అందరి దీవెనలు కావాలి.

చంద్రబాబూ.. దేంట్లో నంబర్‌ వన్‌ ? 
- రైతులు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేయనందుకా? 
- సొంత కంపెనీ లాభాల కోసం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించనందుకా? 
- నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు భృతి ఇస్తానని చెప్పి ఇవ్వనందుకా? 
- ప్రత్యేక హోదా సంజీవిని అనిచెప్పి.. ఎన్నికలయ్యాక సంజీవినా.. అన్నందుకా? 
- హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏమైనా బాగుపడ్డాయా.. అన్నందుకా? 
- కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా.. అన్నందుకా? 
- నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టినందుకా? 
- వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు రాజీనామా చేయకుండా మోసం చేసినందుకా? వారితో కలిసి దీక్ష చేపట్టనందుకా? 
- ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, 108 పథకాలను నిర్వీర్యం చేసినందుకా?  
- వీధి వీదినా మద్యం షాపులు తెరిపించి మన పిల్లలకు తాగుడు అలవాటు చేసినందుకా? 
- విద్యుత్, బస్సు చార్జీలు, ఇంటి పన్నులు పెంచినందుకా? 
- ప్రతి కులం వారికి హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేసినందుకా? 
- హామీలు నెరవేర్చాలని అడిగిన వారిని తాట తీస్తానని, తోకకత్తిరిస్తానని అన్నందుకా?   
- మట్టి ఇసుక, బొగ్గు, కరెంటు కొనుగోళ్లు, రాజధాని భూములు, చివరికి గుడి భూములు కూడా వదలకుండా దోచుకున్నందుకా? 
- దోచుకున్న నల్లధనాన్ని దాచుకోవడానికి విదేశాలకు వెళుతూ.. ఆ పర్యటన ప్రజల అభివృద్ధికి అని చిత్రీకరించుకున్నందుకా? 
- ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చి కొనుగోలు చేసినందుకా? 
- తెలంగాణలో ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ నల్లధనంతో అడ్డంగా ఆడియో, వీడియోలతో సహా దొరికిపోయి వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటున్నందుకా? 
- గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీలు పెట్టి, పింఛన్లు, ఇళ్లు, మరుగుదొడ్లు, రేషన్‌ ఏది కావాలన్నా.. లంచం వసూలు చేయిస్తున్నందుకా? 

ఇదేమి డ్రామా! 
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో బయటకు యుద్ధం చేస్తున్నట్లుగా చంద్రబాబు నటిస్తున్నారు.. లోపల మాత్రం ఆ పార్టీ నేతల కాళ్లపై పడుతున్నారు.. ఇదే బీజేపీ ప్రభుత్వంపై గతంలో మేము అవిశ్వాస తీర్మానం పెట్టాం.. పెట్టీ.. పెట్టీ చివరకు నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద విసుగెత్తి బీజేపీ మొహం మీద మన ఎంపీలు రాజీనామాలు కొట్టి వచ్చేశారు. ఇదేమి డ్రామానో గానీ.. ఇప్పుడు టీడీపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగానే వెంటనే ఆమోదించారు.  ఈ పెద్ద మనిషిని అఖిలపక్ష సమావేశానికి నరేంద్ర మోదీ పిలిచారు. ఆ అఖిలపక్ష సమావేశంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుకమ్మకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అని వాళ్లంతట వాళ్లే ఒక పదవి ఇచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు.

వాస్తవానికి ఆమె చంద్రబాబు నాయుడు లంచం తీసుకుని ఆయన చేత కండువా వేయించుకుని తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాంటి ఎంపీని  అనర్హురాలిగా ప్రకటించమని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా అడిగితే కేంద్రంలో ఉన్న స్పీకర్‌ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న స్పీకర్‌ మాదిరే వ్యవహరించి అనర్హురాలిగా ప్రకటించలేదు. పైగా అఖిలపక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్పకపోయినా చంద్రబాబు మద్దతుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి ఇచ్చారు. బయట చూస్తే బీజేపీని తిడుతున్నట్టు చంద్రబాబు డ్రామా చేస్తారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త చంద్రబాబు వద్ద నిన్నటి దాకా పని చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మహారాష్ట్ర బీజేపీకి చెందిన ఆర్థిక మంత్రి భార్యను సభ్యురాలిగా నియమించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమా.. నందమూరి బాలకృష్ట షూటింగ్‌ చేస్తాఉంటాడు.. అక్కడ సీన్‌ కట్‌ చేస్తే.. పక్కనే వెంకయ్యనాయుడు కుర్చీ వేసుకుని కనిపిస్తాడు. బయటికేమో బీజేపీపై యుద్ధం. లోపలేమో నరేంద్రమోదీ అంతదూరం నుంచి ఎడమ చేయి చాపినా ఈయన వంగిపోతాడు. బయట యుద్ధం.. లోపల కాళ్లమీద పడటం.. ఇదీ చంద్రబాబు డ్రామా.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top