భద్రత లేదు.. భరోసా లేదు..

YS Jagan Fires On Chandrababu At Election Campaign - Sakshi

సీఎం చంద్రబాబుపై ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఆగ్రహం 

చంద్రబాబు పాలనలో నేరగాళ్లకు తప్ప సామాన్య ప్రజలకు భద్రత లేదు   

ఐదేళ్లలో బాబు రాష్ట్రంలో విపరీతంగా దొంగ పనులు చేశాడు  

ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చాడు  

పదవిని అడ్డం పెట్టుకుని తనకు తానే భరోసా కల్పించుకున్నాడు  

పొరపాటున బాబుకు మళ్లీ ఓటేస్తే ప్రజలకు నరకం చూపిస్తాడు  

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐదేళ్లలో రాష్ట్రంలో విపరీతంగా దొంగ పనులు చేశాడు. ప్రజలు ఇచ్చిన పదవిని అడ్డం పెట్టుకుని చట్టానికి దొరక్కుండా తనకు తానే భరోసా కల్పించకున్నాడు. గత ఎన్నికల సమయంలో మహిళలు, రైతులు, యువతకు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మళ్లీ ఐదేళ్ల తరువాత వచ్చి మీ భవిష్యత్తు–నా బాధ్యత అంటున్నాడు.

ఆ సుదీర్ఘ పాదయాత్రలో ప్రతి ఒక్కరి కష్టం విన్నాను, బాధలు చూశాను. ప్రతి కుటుంబం ఏం కోరుకుంటోందో తెలుసుకున్నాను. ప్రభుత్వం సహాయం ఎండమావిగా భావిస్తూ కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. మీకు నేనున్నాను అని మాట ఇస్తున్నా.

చంద్రబాబు నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో కలిసి కాపురం చేశాడు. టీడీపీ ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా పనిచేశారు. కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ కట్టాలన్న ఆలోచన అప్పుడు చంద్రబాబుకు రాలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. రైతన్నల రుణాలను మాఫీ చేయలేదు, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదు. స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మించి ఉంటే 10 వేల ఉద్యోగాలు వచ్చేవి. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చేవి. ఎంతోమందికి ఉద్యోగాలు దక్కేవి. చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ నుంచి పార్టీని లాక్కొని ఆయనకు వెన్నుపోటు పొడిచాడు. కనీసం ఆయనకు కూడా భరోసా కల్పించలేకపోయాడు.  

చంద్రబాబుకు సంబంధించిన మహానాయకుడు సినిమానే జనం చూడాలట! లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా చూడొద్దని ప్రచారం చేస్తున్నారు. కోర్టుకు వెళ్లి ఆ సినిమాను నిలిపి వేయించారు. మరోసారి బాబు అధికారంలోకి వస్తే వాళ్లకు నచ్చిన సినిమాలే మనం చూడాల్సి వస్తుంది

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/సాక్షి ప్రతినిధి కడప/సాక్షి, తిరుపతి: ‘‘చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఎవరికి భద్రత కల్పించాడో చెప్పాలి. అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ తన కుమారుడు నారా లోకేశ్‌కు భద్రత కల్పించాడు. ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌ను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేకు భద్రత కల్పించాడు. మహిళలకు అప్పులిచ్చి బ్లాక్‌ మెయిల్‌ చేసి, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నిర్వహించిన రాక్షసులకు భద్రత కల్పించాడు. చంద్రబాబు పరిపాలనలో నేరగాళ్లకు తప్ప సామాన్య ప్రజలకు భద్రత లేదు. చంద్రబాబు ఎవరికి భరోసా ఇచ్చాడో సమాధానం చెప్పాలి.  ప్రజలు ఇచ్చిన పదవిని అడ్డం పెట్టుకుని చట్టానికి దొరక్కుండా తనకు తానే భరోసా కల్పించుకున్నాడు’’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన శుక్రవారం ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, వైఎస్సార్‌ జిల్లా బద్వేల్, మైదుకూరు, చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాలుగు సభల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం మాట్లాడారంటే...  

రూ.లక్షల కోట్లతో లోకేశ్‌ స్థిరీకరణ నిధి  
సంతనూతలపాడు సభలో..
రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తానని చెప్పిన చంద్రబాబు చివరకు రూ.లక్షల కోట్లతో లోకేశ్‌ స్థిరీకరణ నిధి తీసుకొచ్చాడు. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేసి విర్ర వీగాడు. కానీ, ఇవాళ 13 జిల్లాల ప్రజలను చూసి వణికిపోతున్నాడు. ఏదైనా మీటింగ్‌కు ఒక్కడే వెళ్లాలంటే భయపడుతున్నాడు. ఢిల్లీ నుండి ఎవరైనా నాయకులు జతగా వస్తేనే మీటింగ్‌లకు వెళ్లే పరిస్థితికి వచ్చాడు. ప్రజలకు 650 వాగ్దానాలు చేశాడు. అందులో ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. 2014లో విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టో ఇప్పుడు కనిపించకుండా దాచేస్తున్నాడు. ఈ ఐదేళ్లలో దారుణమైన పరిపాలన చూశాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు మీ భవిష్యత్తు–నా బాధ్యత అంటున్నాడు చంద్రబాబు. ఇలాంటి మనిషిని నమ్ముతారా? చంద్రబాబు మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయో గమనించాలి.   

ఇలాగైతే ఉద్యోగాలెలా వస్తాయి?  
ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న యువతను చూసినప్పుడు బాధ కలుగుతోంది. నా పాదయాత్రలో చీమకుర్తిలో గ్రానైట్‌ పరిశ్రమలను చూశా. క్వారీలు మూతపడుతున్నాయి. వందలాది గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు మూతపడుతున్నాయి. వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి, రోడ్డున పడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నాడా? అని అడుగుతున్నా. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, రూ.40 లక్షల ఉద్యోగాలు వచ్చాయి అంటూ చంద్రబాబు ఊదరగొడుతున్నాడు. బాబు పాలనలో గ్రానైట్‌పై రాయల్టీని విపరీతంగా పెంచారు. పెద్ద సైజ్‌ గ్రానైట్‌పై రాయల్టీ గతంలో రూ.1,980 ఉండేది. దాన్ని చంద్రబాబు రూ.5,200కు పెంచేశాడు. చిన్న సైజ్‌ గ్రానైట్‌పై రాయల్టీ గతంలో రూ.660 ఉండేది. చంద్రబాబు దాన్ని రూ.1,755కి పెంచాడు. పాలిషింగ్‌ యూనిట్లకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో యూనిట్‌ కరెంటును రూ.3.70కి సరఫరా చేసేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దాన్ని రూ.8.70కి పెంచేశాడు. దాంతో గ్రానైట్‌ పాలిషింగ్‌ గిట్టుబాటు కాక యూనిట్లు వరుసగా మూతపడుతున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే ఇక ఉద్యోగాలు ఎలా వస్తాయి?  

బాబు వచ్చాడు.. జాబులు పోయాయి  
చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో ప్రజలంతా ఆలోచించాలి. బాబు పాలనలో రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతుల రుణాలు రూ.87,612 కోట్లు ఉండేవి. వాటిని మాఫీ చేయకపోవడంతో వడ్డీలతో కలిపి రూ.1.50 లక్షల కోట్లకు చేరాయి.  ఉద్యోగాలు తగ్గాయి, నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది. బాబు వస్తే జాబు వస్తుందని అన్నాడు. కానీ, బాబు వచ్చి ఉన్న జాబులను ఊడగొడుతున్నాడు. ఉద్యోగం, ఉపాధి కల్పించలేకపోతే ఇంటికి రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. 60 నెలల పాలనలో ఒక్కరికి కూడా భృతి ఇవ్వలేదు. 

రుణమాఫీ పేరిట పచ్చి దగా
చంద్రబాబు సీఎం అయ్యే నాటికి పొదుపు సంఘాల మహిళల రుణాలు రూ.14,200 కోట్లు ఉండేవి. అవన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చాడు. మాఫీ చేయకపోవడంతో ఆ రుణాలు వడ్డీలతో కలిపి తడిసిమోపెడై అక్షరాలా రూ.26,000 కోట్లకు ఎగబాకాయి. పొదుపు సంఘాల మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని చంద్రబాబు పూర్తిగా ఎగరగొట్టాడు. మహిళలకు భద్రత కల్పిస్తామని గత ఎన్నికల సమయంలో ఊదరగొట్టాడు. కానీ, సాక్షాత్తూ ఒక మహిళా తహసీల్దార్‌ను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లినా అతడిపై కేసులు పెట్టలేదు. విజయవాడలో కాల్‌మనీ–సెక్స్‌రాకెట్‌ నడిపించిన వారిని శిక్షించలేదు. 

స్కూళ్లు తగ్గాయి.. బార్లు పెరిగాయి  
గత పదేళ్లతో పోలిస్తే ఇప్పుడు చంద్రబాబు హయాంలో పంటల దిగుబడి తగ్గింది, సాగు విస్తీర్ణం పడిపోయింది. బీసీలపై తనకు ప్రేమ ఉందని బాబు చెప్పుకుంటాడు. కానీ, ఆ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదు. అప్పుల పాలైతే తప్ప చదువుకోలేని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీలను ఆదుకోవడం తగ్గిపోయింది, వారి భూములను లాక్కోవడం పెరిగిపోయింది. బాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్ల సంఖ్య తగ్గింది, మద్యం బార్ల సంఖ్య పెరిగింది. మద్యం బెల్టు షాపుల రద్దుపై తొలి సంతకం పెడతానన్నాడు. కానీ, మద్యం షాపులను పెంచే ఫైళ్లపై సంతకాలు పెట్టాడు. బాబు పాలనలో పోలీసుస్టేషన్లు పెరగలేదు గానీ ప్రతి గ్రామంలో జన్మభూమి కమిటీలు అనే మాఫియాలు పెరిగాయి. చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరగడం పెరిగింది. ‘108’కు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌లు రావడం తగ్గింది. మంత్రి యనమల రామకృష్ణుడికి పంటి నొప్పి వస్తే సింగపూర్‌కు పంపడానికి చంద్రబాబు దగ్గర డబ్బులుంటాయి గానీ ప్రజలు పక్క రాష్ట్రంలో గుండె ఆపరేషన్‌ చేయించుకుంటే డబ్బులు ఇవ్వడు.  

జనంపై చార్జీల బాదుడు  
చంద్రబాబు పాలనలో ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు. నీటి పన్నులు బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు. కానీ, ప్రజల ఆదాయం మాత్రం పదేళ్ల క్రితంతో పోలిస్తే తగ్గిపోయింది. అమరావతి అని పేరుపెట్టాడు. అమరేశ్వరుడి భూములు కూడా కొల్లగొట్టాడు. రాజధానిలో 40 గుడులను కూలగొట్టాడు. రాజధాని గురించి మాట్లాడితే గ్రాఫిక్స్‌ చూపిస్తాడు. 

పరిహారం కోరితే కేసులు పెట్టారు  
సంతనూతలపాడు నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఇక్కడ రామతీర్థం, గుండ్లకమ్మ ప్రాజెక్టులను నిర్మించారు. ఆ ప్రాజెక్టుల పరిస్థితి ఇప్పుడు చూస్తే గుండె తరుక్కుపోతోంది. రామతీర్థం కింద ఆయకట్టుకు సాగర్‌ నీరు ఇప్పించలేకపోయారు. గుండ్లకమ్మ కింద ఐదేళ్లుగా చంద్రబాబు హయాంలో పంట కాలువలను పూర్తిచేయలేకపోయారు. 11 గ్రామాల్లో ఇంకా పునరావాస పనులు పూర్తి కాలేదు. ఇంతకన్నా అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? అసలు చంద్రబాబు ముఖ్యమంత్రేనా అని అడుగుతున్నా. ఈ ప్రాంతంలో పొగాకు రైతులు అధికంగా ఉన్నారు. పెట్టుబడులకు డబ్బులు లేక, అప్పులు చేసి పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలు రాక ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రమణారెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. పరిహారం కోసం పోరాడినవారిపై పోలీసు కేసులు పెట్టించారు. పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద జగన్‌ ధర్నా చేస్తే తప్ప ధరలు పెరగని పరిస్థితిని ఐదేళ్లుగా చూస్తున్నాం.   

అన్నను సీఎంను చేసుకుందామని చెప్పండి  
మరో 14 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. చంద్రబాబు ప్రతి ఓటర్‌ చేతిలో రూ.3 వేలు పెట్టి, ప్రలోభాలకు గురిచేస్తాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని ప్రతి ఒక్కరికీ చెప్పండి. 14 రోజులు ఓపిక పట్టండి, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాడని అక్కచెల్లెమ్మలకు చెప్పండి.  ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయితే మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాడని, ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాడని తెలియజేయండి. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఉచితంగా ఇస్తాడని చెప్పండి. పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో నేరుగా ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. పంటలకు గిట్టుబాటు ధరలకు గ్యారంటీ ఇస్తాడని చెప్పండి. మరో 14 రోజులు ఓపిక పడితే పెన్షన్‌ను జగన్‌ రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతాతకు చెప్పండి.  అన్న ముఖ్యమంతి అయితే ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు కట్టిస్తాడని చెప్పండి. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. 

దళారులకు కెప్టెన్‌ చంద్రబాబు
మైదుకూరు సభలో..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పసుపునకు క్వింటాల్‌ ధర రూ.16 వేలు ఉండేది. ఇప్పుడు రూ.5 వేలు రావడం లేదు. మిర్చికి రూ.10 వేలు గిట్టుబాటు ధర రావాలి. కానీ, కనీసం రూ.6 వేలు కూడా దక్కడం లేదు. ఉల్లి పంట రైతులను కన్నీరు పెట్టిస్తోంది. క్వింటాల్‌కు కనీసం రూ.వెయ్యి కూడా రాకపోవడం దారుణం. అదే ఉల్లిని చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ దుకాణాల్లో కిలో రూ.23కు అమ్ముతున్నారు. దళారులను కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రి వారికి కెప్టెన్‌గా మారాడు. అంతా కలిసి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. మైదుకూరులో సీసీ రోడ్లు, బాత్‌రూమ్‌లు నిర్మించకుండానే అధికార పార్టీ నాయకులు బిల్లులు తీసుకున్నారు. వాటిపై విజిలెన్స్‌ విచారణ జరగకుండా అడ్డుకున్నారు. మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడే  మైదుకూరు టీడీపీ అభ్యర్థి. ఆయనకు పోలవరం ప్రాజెక్టులో సబ్‌ కాంట్రాక్టు కింద నామినేషన్‌పై పనులు అప్పగించారు.  

ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం..: మరో 14 రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబు చేయని మోసం ఉండదు, చెప్పని అబద్ధం ఉండదు. చేయని కుట్ర, డ్రామా ఉండదు. చూపని సినిమా ఉండదు. ఇవాళ మన యుద్ధం కేవలం చంద్రబాబుతోనే కాదు.. ఆయనతోపాటు ఈనాడుతో, ఆంధ్రజ్యోతితో, టీవీ5తో, ఇతర అమ్ముడుపోయిన చానళ్లతోనూ యుద్ధం చేస్తున్నాం. ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి కుట్రలు ఇంకా పెరుగుతున్నాయి.  

మీ కష్టాలు విన్నా.. మీకు నేనున్నా..: నా పాదయాత్ర మైదుకూరు గుండా సాగింది. ప్రతి ఒక్కరి కష్టం విన్నాను, బాధలు చూశాను. ప్రతి కుటుంబం ఏం కోరుకుంటోందో తెలుసుకున్నాను. ప్రభుత్వ సహాయాన్ని ఎండమావిగా భావిస్తూ కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. మీకు నేనున్నాను    .

బాబు పాలనలో నేరగాళ్లకే భద్రత  
బద్వేల్‌ సభలో..
చంద్రబాబు నాయుడు ఐదేళ్లుగా ఎవరికి భద్రత కల్పించాడో చెప్పాలి. రాష్ట్రంలో భూముల నుంచి ఇసుక వరకు దోపిడీ చేయనిది ఏమైనా మిగిలి ఉందా? చంద్రబాబు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ తన కుమారుడు నారా లోకేశ్‌కు భద్రత కల్పించాడు. ఇసుక దోపిడీని అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌ను జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేకు భద్రత కల్పించాడు. మహిళలకు అప్పులిచ్చి బ్లాక్‌ మెయిల్‌ చేసి, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నిర్వహించిన రాక్షసులకు భద్రత కల్పించాడు. చంద్రబాబు పరిపాలనలో నేరగాళ్లకు తప్ప సామాన్య ప్రజలకు భద్రత లేదు. చంద్రబాబు ఎవరికి భరోసా ఇచ్చాడో సమాధానం చెప్పాలి. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలను మాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఎగ్గొట్టాడు. పావలా వడ్డీకి రుణాలు ఇవ్వలేదు. నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల చొప్పున భృతి ఇస్తానని చెప్పి దగా చేశాడు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని ఘనత చంద్రబాబుదే.  

వ్యక్తిగత సమాచారం దొంగిలించాడు  
అధికారంలో ఉన్నప్పుడు బాబుకు ప్రజలు గుర్తుకురారు. అభివృద్ధి గుర్తుకు రాదు. ఎన్నికల సమయంలోనే ప్రజలు గుర్తుకొస్తారు, అభివృద్ధి గుర్తుకొస్తుంది. ఎన్నికలప్పుడే కొత్తకొత్త పథకాలు గుర్తుకొస్తాయి. ఎన్నికల ముందే హడావుడిగా శంకుస్థాపనలు చేస్తారు. ప్రజలకు భద్రత కల్పించానంటూ బాబు టీవీల్లో ప్రచారం చేసుకుంటున్నాడు. ప్రజలంతా భద్రంగా దాచుకునే బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ కార్డుల వివరాలను, మన ఇళ్లల్లోని ఆడవాళ్ల ఫోన్‌ నంబర్లను దొంగతనంగా, మోసపూరితంగా ప్రైవేట్‌ ఐటీ సంస్థకు అప్పగించాడు. సేవామిత్ర అనే యాప్‌నకు ఇచ్చాడు. ప్రజల సమాచారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించాడు. ఇక ప్రజలకు భద్రత ఎక్కడుందో అర్థం చేసుకోండి.  

చంద్రబాబుకే భరోసా దక్కింది  
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఐదేళ్లలో రాష్ట్రంలో విపరీతంగా దొంగ పనులు చేశాడు. ప్రజలు ఇచ్చిన పదవిని అడ్డం పెట్టుకుని చట్టానికి దొరక్కుండా తనకు తానే భరోసా కల్పించుకున్నాడు. 2014లో ఆయన ఇచ్చిన ప్రకటనలను గుర్తుకు తెచ్చుకోవాలి. మహిళలు, రైతులు, యువతకు ఎన్నో హామీలు ఇచ్చాడు. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మళ్లీ ఐదేళ్ల తరువాత వచ్చి మీ భవిష్యత్తు–నా బాధ్యత అంటున్నాడు. అందుకే చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత అనే పదానికి అర్థం రావాలి. ఇచ్చిన హామీని నిలబెట్టుకోని రాజకీయ నాయకుడు పదవిని వదిలిపెట్టి వెళ్లిపోయే రాజకీయాలు రావాలి. అలాంటి పరిస్థితిని తీసుకురావాలంటే అది ప్రజలతోనే సాధ్యం.  

బద్వేల్‌ సమస్యలు పరిష్కరిస్తాం  
నేను పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు బద్వేల్‌ నియోజకవర్గంలో యాత్ర లేదనే ఉద్దేశంతో చాలామంది నాయకులు మైదుకూరు మార్గమధ్యంలో నన్ను కలిశారు. తమ సమస్యలను సీఎం చంద్రబాబుతో విన్నవించుకున్నా పట్టించుకోలేదని చెప్పారు.  పక్కనే ఉన్న బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు సామర్థ్యం 17 టీఎంసీలు. ఐదేళ్లుగా ఒక్క సంవత్సరం కూడా అందులో రెండు మూడు టీఎంసీల నీళ్లు కనిపించడం లేదని చెప్పారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇదే బ్రహ్మంసాగర్‌లో 14 టీఎంసీలను నిల్వ చేశారు. వైఎస్‌ పాలనలో సంతోషంగా ఉన్న రైతాంగం ప్రస్తుత టీడీపీ పాలనలో అధ్వాన్నమైన స్థితికి చేరుకుంది. బ్రహ్మంసాగర్‌లో నీళ్లు లేక, తాగునీరు సైతం దొరక్క ఇక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బద్వేల్‌ సమస్యలను పరిష్కరిస్తామని మాట ఇస్తున్నా. కుందూ నదిపై లిఫ్ట్‌ ఏర్పాటు చేసి బ్రహ్మంసాగర్‌కు నీటిని అందించాలని, సోమశిల ఎత్తిపోతల ద్వారా బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాలకు తాగునీరు ఇవ్వాలని, వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి కలసపాడు, పోరుమామిళ్ల ప్రజలకు తాగు, సాగునీరు అందించాలని కోరారు. మన ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. బద్వేల్‌ పట్టణాన్ని టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం 
అభివృద్ధి చేయలేదు.

బాబొస్తే ఇళ్లు, భూములు మిగలవు  
పుత్తూరు సభలో..
చంద్రబాబుకు మళ్లీ పొరపాటున ఓటేస్తే... పేదల ఇళ్లు, భూములు ఉండవు. ఉచిత విద్యుత్‌ ఇవ్వడు. ఇసుక, మట్టి, కొండలు, గుట్టలు, నదులు కనిపించవు. లారీ ఇసుక రూ.లక్ష పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. గ్రామాల్లో జన్మభూమి కమిటీలే పెత్తనం చెలాయిస్తాయి. మనం ఏ సినిమా చూడాలో, టీవీలో ఏ చానల్‌ చూడాలో, ఏ పత్రిక చదవాలో వాళ్లే శాసిస్తారు. చంద్రబాబుకు సంబంధించిన మహానాయకుడు సినిమానే జనం చూడాలట! లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చూడొద్దని ప్రచారం చేస్తున్నారు. కోర్టుకు వెళ్లి ఆ సినిమాను నిలిపి వేయించారు. మరోసారి బాబు అధికారంలోకి వస్తే వాళ్లకు నచ్చిన సినిమాలే మనం చూడాల్సి వస్తుంది. బాబు ఇచ్చే అబద్ధపు హామీలను విశ్వసిస్తే మోసపోవడం ఖాయం. చంద్రబాబు పాలనలో 50 ప్రభుత్వ కంపెనీలను పూర్తిగా అమ్మేశారు.  

బాబు పాలన మోసం, దుర్మార్గమే..: మహిళల సమస్యలపై మాట్లాడిన ఎమ్మెల్యే రోజమ్మను అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలన అంతా మోసం, అవినీతి, దుర్మార్గమే. ఐదేళ్ల పాలనలో వేలాది ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. పొరపాటున బాబుకు మరోసారి ఓటేస్తే అన్ని ప్రభుత్వ స్కూళ్లను మూసేస్తారు. వాటి స్థానంలో ప్రతి గ్రామంలో నారాయణ స్కూళ్లు కనిపిస్తాయి. ఎల్‌కేజీ చదవాలంటే చంద్రబాబుకు ఏడాదికి రూ.లక్ష ఫీజు కట్టాలి. ఇంజనీరింగ్‌ చదవడానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి వస్తుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా రద్దు చేస్తారు. ఇప్పటికే కొన ఊపిరితో ఉన్న 108, 104 సర్వీసులు పూర్తిగా మూతపడతాయి. ఆరోగ్యశ్రీ ఉండదు. పెన్షన్, రేషన్‌ కార్డులను తొలగిస్తారు. పేదలకు ఇళ్లు ఇవ్వరు. తనను వ్యతిరేకించే వారిని బతకనివ్వడు.  

హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీ మూత..: చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సహకార రంగంలో ఉన్న చిత్తూరు, రేణిగుంట చక్కెర ఫ్యాక్టరీలను మూసివేయించాడు. చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు ఇదే జిల్లాలోని మామిడి రైతులను పీల్చిపిప్పి చేశాడు. ఈ జిల్లాలో గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్‌ రెండూ టీడీపీ నాయకులవే. హెరిటేజ్‌ ఫుడ్స్, గల్లా ఫుడ్స్, శ్రీని ఫుడ్స్‌ కలిసి దళారీ వ్యవస్థను ముందుకు తెచ్చి.. గిట్టుబాటు ధర రాకుండా చేశారు. హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని మూసివేశాడు. గాలేరు–నగరి ప్రాజెక్ట్‌లో అంచనా వ్యయాలను పెంచేసి, తన బినామీలకు పనులు కట్టబెట్టాడు. వేణుగోపాల్‌ సాగర్‌ పనులను వైఎస్సార్‌ హయాంలో ప్రారంభించారు. బాబు వచ్చాక ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచి, సీఎం రమేశ్‌కు పనులు కట్టబెట్టారు.   

వైఎస్సార్‌సీపీలోకి డీఎల్‌ రవీంద్రారెడ్డి
మాజీ ఎమ్మెల్యే వి.శివరామకృష్ణారావు కూడా.. 
మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వి.శివరామకృష్ణారావు శుక్రవారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. బద్వేల్‌లో శివరామకృష్ణారావు, మైదుకూరులో రవీంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ‘‘రాజకీయాల్లో లేకపోతే నేను డీఎల్‌ రవీంద్రారెడ్డిని అంకుల్‌ అని పిలవాలి. రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి అన్నా అంటున్నాను. ఆ అన్నకు ఎప్పుడూ తోడుగా ఉంటా’’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. బి.మఠం జెడ్పీటీసీ ఎం.రామగోవిందురెడ్డితో పాటు పలువురు ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, సీనియర్‌ రాజకీయ నాయకులు కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top