అహో నయవంచక చంద్రబాబూ...

YS Jagan fires on Chandrababu At Anakapalle - Sakshi

బాబూ.. మళ్లీ నువ్వే రావాలని ఎవరు కోరారయ్యా? 

అనకాపల్లి సభలో నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ 

అన్ని వర్గాలను వంచించినందుకా? 

ఒక్క హామీ కూడా నెరవేర్చనందుకా?

రైతుల్ని నట్టేట ముంచినందుకా?  

కుటుంబాల్లో అనురాగం,ఆత్మీయత లేకుండా చేసినందుకా?

ఎందుకు మళ్లీ రమ్మని కోరారు? 

ఎల్లకాలం అందర్నీ మోసం చేయడం మీ తరం కాదు బాబూ..

గ్రేటర్‌ విశాఖలో కలిశాక అనకాపల్లికి ఏం ఒరిగింది? 

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అనకాపల్లిని ప్రత్యేక జిల్లా చేస్తాం 

పేదల ఉన్నత చదువు బాధ్యత మాదే

ఇవాళ పొద్దున్నే నందమూరి హరికృష్ణ గారికి యాక్సిడెంట్‌ జరిగిందని, తను మన మధ్య నుంచి వెళ్లిపోయారన్న సంగతి తెలిసింది. ఈ సభలో ప్రసంగం ప్రారంభించే ముందు.. నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అహో నయవంచకా.. మళ్లీ నువ్వే రావాలని ఎవరు కోరుకుంటున్నారయ్యా..’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు. ఏ వర్గాన్నీ వదలకుండా మోసం చేసినందుకా.. అందరినీ వంచించినందుకా.. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌ను అవినీతిమయం చేసినందుకా.. ఇందుకోసం మళ్లీ నువ్వే రావాలా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబును పొరపాటున క్షమిస్తే రాష్ట్రంలో మట్టి కూడా మిగలదని ఎద్దేవా చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 249వ రోజు బుధవారం విశాఖ జిల్లా అనకాపల్లి నాలుగు రోడ్ల చౌరస్తాలో అశేష జనవాహినితో కిక్కిరిసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలను, సహకార రంగంలోని చక్కెర, పాడి పరిశ్రమలను నిర్వీర్యం చేస్తున్న తీరును కళ్లకు కట్టినట్టు వివరించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సహకార రంగాన్ని కాపాడతామని భరోసా ఇచ్చారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

చెరకు రైతుల జీవితం చేదెక్కింది 
‘‘ఎటుచూసినా ఇసుకవేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. మీ అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అనకాపల్లి అంటేనే మనకు తియ్యటి బెల్లం గుర్తుకు వస్తుంది. మునగపాక బెల్లమైతే ప్రసిద్ధి గాంచిన బెల్లం. కానీ, ఇవాళ బెల్లం, చెరకు రైతుల పరిస్థితి మాత్రం చేదుగా ఉంది. ఒకవైపు పెట్టుబడులు పెరిగాయి. రైతులు నష్టాల్లో కొట్టు మిట్టాడుతున్నారు. అప్పులు తీర్చలేక రైతులు గ్రామాల్లో భూములు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. 2007–08లో సీజన్‌ నాటికి అనకాపల్లి మార్కెట్‌కు 5.70 లక్షల క్వింటాళ్ల బెల్లం వస్తే ఇవాళ అంటే 2017–18 నాటికి పదేళ్ల తర్వాత సరిగ్గా 3.54 లక్షల క్వింటాళ్లకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. బెల్లం రైతుల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరోపక్క సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను చంద్రబాబు దగ్గరుండి నష్టాల్లోకి నెట్టేస్తారు. ఆ తర్వాత మూత వేయించి, తన బినామీలకు పప్పులు, బెల్లాల మాదిరి కారుచౌకగా కట్టబెడతారు.

ఇదే జిల్లాలో చంద్రబాబు తన సమీప బంధువు ఎంవీఎస్‌ మూర్తికి సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలను కట్టబెట్టాలని చూడటం మీ అందరికీ తెలిసిన విషయమే. సహకార రంగంలోని ఫ్యాక్టరీలపై విశాఖ జిల్లా రైతులందరూ ఆధారపడి ఉన్నారు. ఏటి కొప్పాక ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నష్టాల బాటలో ఉంటే నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి నిలబెట్టారు. 2014–15లో చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక ఇవాళ ఆ ఫ్యాక్టరీ కథ తిరిగి మొదటికి వచ్చింది. రూ.22 కోట్ల నష్టాలలో ఉంది. రేపోమాపో మూతపడే స్థితికి వచ్చింది. పక్కనే తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీ కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీ రూ.20 కోట్ల నష్టాల్లోకి వెళ్తే నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఫ్యాక్టరీని ఆదుకున్నారు. సహాయం చేసి బకాయిలు తీర్చారు. క్రషింగ్‌ మొదలు పెట్టించారు.

చంద్రబాబు మళ్లీ సీఎం అయ్యాక ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగులకు రూ.15.7 కోట్లు బకాయిలు ఉన్నాయి. రూ.29 కోట్ల నష్టాల్లో ఉంది. జీతాలు లేక 39 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇటువైపు చూస్తే చోడవరం షుగర్‌ ఫ్యాక్టరీ కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.45 కోట్ల నష్టాల్లో వెళ్లింది. డాక్టర్‌ వైఎస్సార్‌ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఆ రూ.45 కోట్ల నష్టాలను తీర్చడమే కాకుండా రూ.45 కోట్ల లాభాల్లోకి తీసుకువచ్చారు. టన్నుకు రూ.300, రూ.400 రాయితీలు ఇచ్చి ఆదుకున్నారు. కార్మికులకు బోనస్‌ ఇచ్చారు. మళ్లీ ఇవాళ బాబు వచ్చాక ఈ ఫ్యాక్టరీ రూ.100 కోట్ల నష్టాల్లో ఉంది. చంద్రబాబు పాలన ఎంత దారుణంగా ఉందనేదానికి ఇదే నిదర్శనం.  
 
తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ పరిస్థితీ అంతే.. 
చంద్రబాబు ఆవేళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు తాండవ షుగర్‌ ఫ్యాక్టరీ రూ.28 కోట్ల నష్టాల్లో ఉండేది. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఫ్యాక్టరీని ఆదుకుని తోడుగా నిలబడ్డారు. బకాయిలన్నీ తీర్చారు. క్రషింగ్‌ కెపాసిటీని 1,250 టన్నుల నుంచి 2,500 టన్నులకు పెంచారు. ప్రతి టన్నుకూ రూ.300–400 బోనస్‌ ఇచ్చారు. రైతులకు అండగా నిలిచారు. ఆవేళ దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో ఆ ఫ్యాక్టరీ రూ.5 కోట్ల లాభాల్లో నిలిచింది. ఇవాళ చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఫ్యాక్టరీ పరిస్థితి చూస్తే రూ.40 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఏదీ బతకదు. సహకార ఫ్యాక్టరీలు, డెయిరీలు మూతపడతాయి. ఉద్యోగాలు లేక పిల్లలు అల్లాడతారు. రైతన్నలు ఇక్కట్లు పడతారు. ప్రైవేటు రంగంలోని డెయిరీల వాళ్లందరూ కుమ్మక్కైపోతారు. హెరిటేజ్‌ డెయిరీ లాభాల కోసం చంద్రబాబు రైతుల జీవితాలతో చెలగాటం ఆడతారు. సహకార రంగంలోని ఫ్యాక్టరీలను చంద్రబాబు దగ్గరుండి మూత వేయిస్తారు. సహకార రంగంలోని డెయిరీలన్నీ మూతపడితే ప్రైవేటు డెయిరీల తీరు ఎలా ఉంటుందో ఊహించనలవి కాదు.  
 
కేజీహెచ్‌కు వెళ్లాలా? 
ఇదే నియోజకవర్గంలో ప్రజలు నా వద్దకు వచ్చి అన్నా.. అనకాపల్లిలో 250 పడకల ఆస్పత్రి ఉందన్నా, కానీ అందులో ఏ సౌకర్యం ఉండదన్నా అని చెప్పి బాధ పడ్డారు. 46 మంది డాక్టర్లు ఉండాల్సి ఉంటే కేవలం 15 మంది మాత్రమే పని చేస్తున్నారు. ఇక్కడ ఎవరికైనా బాగోలేకపోతే నేరుగా కేజీహెచ్‌కు వెళ్లమని పంపిస్తున్నారన్నా అని చెప్పారు. మరి అలాంటప్పుడు ఇక్కడ ఆసుపత్రి ఎందుకు? 64 మంది నర్సులు ఉండాల్సిన చోట కేవలం 28 మందితో పని జరుపుతున్నారు. అంబులెన్స్‌లు మూడు ఉంటే ఒక్క డ్రైవర్‌ ఉన్నారట. ఇంతటి దారుణంగా ఆసుపత్రుల పరిస్థితి ఉంది. అనకాపల్లిని గ్రేటర్‌ విశాఖలో కలిపారు. ఏమైనా మేలు జరిగిందా అంటే ఏమీ లేదు. ఇంటి పన్నులు, కరెంటు చార్జీలు పెంచి బాదుడే బాదుడు. రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనకాపల్లిని ప్రత్యేక జిల్లాగా మారుస్తానని హామీ ఇస్తున్నా. ఆ జిల్లాకు అనకాపల్లినే హెడ్‌ క్వార్టర్‌గా పెడతామని చెబుతున్నా. అప్పుడు ఇక్కడి వారు కేజీహెచ్‌కు వెళ్లకుండా ఇక్కడే వైద్యం చేయించుకునేలా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నా. 
 
జగన్‌ అనే నేను చెబుతున్నా.. 
నాన్నగారి హయాంలో ఈ ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే అక్షరాల 11 వేల ఇళ్లు కట్టించారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. అనకాపల్లికి సమీపంలోని సత్యనారాయణపురంలో 3 వేల మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తే నాన్నగారు చనిపోయాక చంద్రబాబు హయాంలో ఆ స్థలాలను బలవంతంగా లాక్కొని, అక్కడ ఫ్లాట్లు కడుతామని మోసం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఆ స్థలాల్లో 300 చదరపు అడుగుల ఫ్లాట్లు కడతారట. రూ.3 లక్షల విలువ చేసే ఫ్లాటును పేదవాడికి రూ.6 లక్షలకు అమ్ముతారట. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.3 లక్షలు ఇస్తే మిగతా రూ.3 లక్షలు పేదవాడి మీద అప్పుగా రాసుకుంటారట. నెల నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు కడుతూ పోవాలట. లంచాలు తీసుకునేది చంద్రబాబు అయితే ఆ సొమ్మును పేదలు భరించాలా? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఆ ఫ్లాట్లు కొద్దో గొప్పో ఇచ్చే కార్యక్రమం చేస్తాడు చంద్రబాబు. వాటిని ఇస్తే వద్దు అనకుండా తీసుకోండి. జగన్‌ అనే నేను చెబుతున్నా.. మనందరి ప్రభుత్వం రాగానే.. ఆ పేదవాడు చెల్లించాల్సిన రూ.3 లక్షలు మాఫీ చేస్తానని మాట ఇస్తున్నా. 
 

మళ్లీ నువ్వే రావాలన్నది ఇందుకోసమా బాబూ? 
సీపీఎస్‌ను రద్దు చేయాలని ఉద్యోగులు ప్లకార్డులు పట్టుకుని కనిపిస్తారు. అయినా ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఈ మధ్య కాలంలో చంద్రబాబు ఏమంటున్నాడో తెలుసా? తన గురించి ప్రచారం చేయాలట. అదేమిటంటే.. ‘మళ్లీ నువ్వే రావాలి’ అని ప్రచారం చేయాలట. ఈ మాట చంద్రబాబు ప్రతి మీటింగ్‌లో పదే పదే చెబుతున్నారు. నేనడుగుతున్నా.. అయ్యా, చంద్రబాబు గారూ.. మిమ్మల్ని మళ్లీ ఎవరు రమ్మంటున్నారయ్యా?  
– జనాభాలో 62 శాతంగా ఉన్న రైతులకు బేషరతుగా రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసినందుకా? కనీసం వడ్డీలో నాలుగో వంతు కూడా మాఫీ చేయనందుకా? వారు బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేయించినందుకు కృతజ్ఞతగానా?   
–రాష్ట్ర జనాభాలో 50 శాతంగా ఉన్న డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ద్రోహం చేసినందుకా? పొదుపు సంఘాల రూ.14,204 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయనందుకా? 
– గత ఎన్నికల్లో ప్రతి నిరుద్యోగికీ నెలకు రూ.2 వేల చొప్పున భృతి ఇస్తానని చెప్పి 51 నెలలకు లక్షా రెండు వేల రూపాయలు ఎగ్గొట్టినందుకా? 
– ప్రత్యేక ప్యాకేజీకి ఆశపడి, లేని ప్యాకేజీ ఉన్నట్లు మోసం చేసి, ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టినందుకా?  
– ఎన్నికల ప్రణాళికలో ప్రతి కులానికి ఒక పేజీ పెట్టి మోసం చేసినందుకా? 
– మీ లంచాలు, అవినీతి విశ్వరూపానికి భయపడి మాకీ లాంటీ కంపెనీలు వెనక్కుపోయినందుకా? 
– మీ అవినీతితో పారిశ్రామిక వేత్తలు విస్తుపోయి.. నీ కాళ్లు పట్టుకుని మళ్లీ నువ్వే రావాలని కోరుతున్నారా? 
– అడ్డూ అదుపు లేకుండా స్కూలు, కాలేజీ ఫీజులు పెరుగుతున్నాయి, ఆ ఫీజులు కట్టలేక అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. స్కూళ్లలోనే 30, 40 వేల రూపాయల ఫీజులు కట్టాల్సి వస్తోంది. అదే నారాయణలో ఇంటర్‌ కోసం అక్షరాల రూ.1.68 లక్షలు చెల్లించాలి. కాలేజీలకు పంపించాలంటే లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఫీజులు కట్టుకోలేక అవస్థలు పడుతున్నా.. నీ బినామీలైన నారాయణ, చైతన్య కళాశాలల కోసం ప్రభుత్వ స్కూళ్లను, కళాశాలలను, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్వీర్యం చేసినందుకు మళ్లీ నువ్వే రావాలని అడుగుతున్నారా? 
– పిల్లల చదువు కోసం పొలమో, బంగారమో అమ్ముకునే పరిస్థితి తీసుకువచ్చినందుకా? 
– అధికారంలోకి రాక ముందు బెల్టు షాపులు రద్దు అన్నావు. సీఎం అయ్యాక ప్రతి గ్రామంలో బడి, గుడి పక్కన, వీధివిధినా బెల్టు షాపులు పెట్టి పిల్లల్ని తాగుబోతులుగా మార్చినందుకా? 
– మద్యం వల్ల ఇవాళ లక్షలాది కుటుంబాల్లో ఆత్మీయత, అనురాగాలు లేకుండా చేసి.. కాపురాలు నిలువునా కూలిపోతున్నా పట్టించుకోనందుకా?    
– దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోలు, డీజిల్‌పై అధికంగా పన్నులు వేస్తున్నందుకా? కరెంటు చార్జీలు, ఇంటి పన్నులు ఏది చూసినా బాదేస్తున్నందుకా? 
– ఇసుక, మట్టి, కరెంటు కొనుగోలు, కాంట్రాక్టర్లు, రాజధాని భూములు, గుడిభూములు, విశాఖ భూములు.. దేన్నీ వదిలిపెట్టకుండా దోచుకుంటుంటే ఎవరండీ.. మళ్లీ నువ్వే రావాలి అని అడుగుతున్నది? 
– గజానికో గాంధారి పుత్రుడిని తయారు చేసి గ్రామాల మీదకు వదిలావు. జన్మభూమి కమిటీల మాఫీయాను తయారు చేశావు. పింఛన్, రేషన్‌కార్డు, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలే. ఏపీని అవినీతి ఆంధ్రగా, అరాచకాల ఆంధ్రగా మార్చినందుకు జేజేలు కొట్టి మళ్లీ నువ్వే రావాలని అడుగుతున్నారా? కాటేసిన పాములను, జేబు కొట్టిన దొంగలను ఎవరైనా కావాలని మళ్లీ కోరుకుంటారా? ప్రజలు అలా కోరుకుంటారని నీవు (చంద్రబాబు) అనుకోవడం నీ అహంకారానికి నిదర్శనం కాదా? ఇన్ని ఘన కార్యాలు చేశావని అహో.. మోసగాడా మళ్లీ నువ్వే రావాలి అని అడుగుతున్నారా?  

మీకు ఎలాంటి నాయకుడు కావాలి? 
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నా అది ఒక చరిత్రాత్మకం అని చెప్పగలడు ఈ పెద్దమనిషి. అలా తన అనుకూల పత్రికల్లో రాయించగలడు. టీవీల్లో ప్రచారం చేయించగలడు. ఇంతటి గొప్పవ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు. నేను ఒక్కటే చెబుతున్నా.. అందరినీ ఎల్లకాలం మోసం చేయలేవు. ఒకసారి మోసం చేశావు. మళ్లీ మళ్లీ మోసం చేయడం నీ తరం కాదు. ఎందుకంటే పైన దేవుడున్నాడు.. కింద ప్రజలున్నారు. ఇటువంటి అన్యాయమైన, అబద్ధాలు చెప్పే పరిపాలన, మోసాలు చేసే పాలన చూస్తున్నారు. ఈ వ్యవస్థ బాగుపడాలంటే, ఈ వ్యవస్థలో విశ్వసనీయత రావాలంటే పొరపాటున కూడా చంద్రబాబులాంటి వాళ్లను నమ్మొద్దు. మీకు ఎలాంటి పాలన కావాలో ఆలోచించండి. అబద్ధాలు చెప్పేవారు, మోసాలు చేసేవారు మీకు నాయకుడిగా కావాలా?  

పొరపాటున చంద్రబాబు లాంటి వాళ్లను క్షమిస్తే రేప్పొద్దున.. గత ఎన్నికల హామీలలో 99 శాతం పూర్తి చేశానని చెవుల్లో కాలీఫ్లవర్‌ పెడతాడు. ఇంకా నమ్మించడానికి ప్రతి ఇంటికి కిలో బంగారం, బోనస్‌గా ఇంటికో బెంజ్‌ కారు ఇస్తామంటాడు. అవీ నమ్మరని తెలిసి ప్రతి ఇంటికి తన మనుషుల్ని పంపించి రూ.3 వేలు చేతిలో పెడతాడు. ఆ డబ్బును వద్దు అనకండి. రూ.3 వేలు కాదు, రూ.5 వేలు కావాలని గుంజండి. ఆ డబ్బంతా మనదే. మన జేబుల్లోంచి దోచిన సొమ్మే. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండి. అప్పుడే చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి నిజాయితీ, విశ్వసనీయత వస్తాయి. రేపు మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలని నవరత్నాలను ప్రకటించాం. ఇందులో పేదవాడి పిల్లలకు విద్య అతి ముఖ్యమైంది.

మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర పెద్ద చదువులు చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా? ఇంజనీరింగ్‌ చదివించాలంటే ఫీజులు ఏటా రూ.లక్షపైనే ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కేవలం రూ.30 వేలు.. రూ. 35 వేలు. అది కూడా సరిగా అందడం లేదని చాలా మంది పిల్లలు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు సరిపోక విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగేళ్లలో రూ.3 లక్షలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దాని కోసం ఇల్లు.. వాకిలీ అమ్ముకునే పరిస్థితి ఉంది. పిల్లల చదువుల కోసం పేదలు అప్పులపాలవ్వకుండా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేసి భరోసాగా నిలిచారు. ఆయన కుమారునిగా నేను రెండడుగులు ముందుకు వేస్తాను. మీ పిల్లలను ఏం చదువులు చదివిస్తారో మీ ఇష్టం. ఎన్ని లక్షలు ఖర్చయినా ఫర్వాలేదు. నేను చదివిస్తా. అంతేకాదు... వాళ్లకయ్యే హాస్టల్‌ ఖర్చుల కోసం ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. పెద్ద చదువులు చదవాలంటే చిట్టి పిల్లల నుంచే పునాదులు పడతాయి. అందుకే చిన్నారులను బడికి పంపే ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు ఇస్తాం. అందుకే ప్రతి చెల్లెమ్మకు, అక్కకు చెబుతున్నా.. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే జగన్‌ అనే నేను.. చదువు రాని వారు ఏ ఒక్కరూ లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నా. చెడిపోయిన ఈ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతున్నా.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top