బాబూ.. బాధ్యత మరిచి మాపై నిందలా?

YS Jagan fires on Chandrababu about Titli Cyclone At Salur - Sakshi

తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు ఏం చేశావు? 

సాలూరు సభలో నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత 

ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదు? 

ఇవాళ ఏమీ చేయకున్నా చేసినట్లు పబ్లిసిటీ చేసుకుంటున్నావు.. 

బాధితులు నిలదీస్తే బుల్‌డోజర్లు పంపిస్తానంటావా? 

మా పార్టీ నేతలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటుంటే బురద చల్లుతున్నావు.. 

ప్రతిపక్షం సహాయక కార్యక్రమాలను అడ్డుకుంటోందా? 

ప్రతిపక్ష నేత తుపాన్‌ తాకిడి ప్రాంతానికి వెళ్లలేదంటూ బాధ్యత నుంచి తప్పుకుంటావా? 

ఖజానా, అధికార యంత్రాంగం నీ వద్ద ఉందా? నా వద్ద ఉందా? 

50 రోజుల పాటు తుపాను పీడిత ప్రాంతాల్లో పర్యటిస్తా 

బాధితులకు రూ.3,435 కోట్ల పరిహారం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే.. 

లేదంటే మనందరి ప్రభుత్వం రాగానే అందజేస్తామని భరోసా 

అయ్యా చంద్రబాబూ.. గతంలో (2014 అక్టోబర్‌) హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు అక్షరాలా 65 వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్పావు. ఇప్పటికి నాలుగున్నరేళ్లు గడిచిపోయాయి. హుద్‌హుద్‌ తుపానుకు 926 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సాక్షాత్తూ చంద్రబాబునాయుడే ఈమధ్య కేంద్ర హోమ్‌ మంత్రి రాజనాథ్‌ సింగ్‌కు లిఖిత పూర్వకంగా తెలియజేశారు.ఈ 926 కోట్ల రూపాయల్లో కేంద్రం 500 కోట్లు మాత్రమే ఇచ్చిందని చంద్రబాబు చెబుతున్నారు. అంటే అక్షరాలా 65 వేల కోట్ల రూపాయల నష్టం వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.400 కోట్లా? పైగా హుద్‌హుద్‌ తుపానును జయించానని అడ్వర్టయిజ్‌మెంట్లు వేయించుకుంటాడు. సంబరాలు చేసుకుంటాడు.  

తిత్లీ తుపాను వచ్చిన ప్రాంతానికి జగన్‌ ఎందుకు పోలేదని ఈ పెద్దమనిషి చంద్రబాబునాయుడు అంటున్నాడు. నిజంగా ఈ పెద్దమనిషి ఈ మాట అంటున్నప్పుడు నవ్వాలో, ఏడ్వాలో నాకు అర్థం కావడం లేదు. అయ్యా చంద్రబాబు గారూ.. సీఎం నువ్వా.. నేనా? ఖజానా నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? అధికార యంత్రాంగం నీ దగ్గర ఉందా? నా దగ్గర ఉందా? ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సిన బాధ్యత నీదా? నాదా? అని అడుగుతున్నాను.  

శ్రీకాకుళం, విజయనగరంలో తిత్లీ వల్ల అక్షరాలా 3,435 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కేంద్ర హోం మంత్రికి లిఖిత పూర్వకంగా లెటర్‌ ఇచ్చారు. మరి 11 రోజులుగా నువ్వు చేసిందేమిటి? రూ. 200 విలువైన సరుకులు మాత్రమే ఇచ్చావు. అంతకన్నా దమ్మిడీ అయినా ఇచ్చావా చంద్రబాబూ? ఈ పెద్దమనిషి ఇప్పటికే ప్రకృతిని హేండిల్‌ చేశాడట. సముద్రాన్ని కంట్రోల్‌ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడట. రెయిన్‌గన్‌లతో కరవుతో యుద్ధం చేసి అనంతపురంలో కరవును పారదోలాడట. 
– ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘తీత్లీ తుపాను పీడిత ప్రాంతాలకు సాయం చేయాల్సింది నువ్వా? నేనా? ముఖ్యమంత్రివి నువ్వా? నేనా? ఖజానా ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరుందా? నా దగ్గరుందా? ప్రతిపక్ష నాయకుడు జగన్‌ అక్కడికి ఎందుకు పోలేదని అడుగుతావా? ఇంతకన్నా దిక్కుమాలిన తనం ఉంటుందా? అధికార యంత్రాంగం ఎవరి చేతుల్లో ఉంది? నీ దగ్గరా? నా దగ్గరా?’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. మరో వారం రోజుల్లో తిత్లీ తుపాను పీడిత ప్రాంతాలకు జగన్‌ అనే నేను పాదయాత్రతో గ్రామగ్రామానికి వెళతానని, 50 రోజుల పాటు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. కేంద్రానికి నివేదించిన ప్రకారం రూ.3,435 కోట్ల తిత్లీ నష్టాన్ని ఇంకో పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వమే బాధితులకు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో తమ ప్రభుత్వం వచ్చాక ఆ మొత్తం ఇచ్చేస్తుందని తుపాను బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 291వ రోజు సోమవారం ఆయన విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటని నిలదీశారు. వైఎస్‌ జగన్‌ ఈ సభలో ఇంకా ఏమన్నారంటే.. 

ఈ ముఖ్యమంత్రికి కనీస బాధ్యత లేదు.. 
శ్రీకాకుళం జిల్లాలో పదకొండు రోజుల కిందట తిత్లీ తుపాను వచ్చింది. విజయనగరం జిల్లాలోని కురుపాం ప్రాంతంపై కూడా ఈ తుపాను ప్రభావం పడింది. దేంట్లో అయినా రాజకీయ లబ్ధి ఎలా పొందాలన్న ఆరాటం చంద్రబాబుకు ఎక్కువ. చేసేది తక్కువ.. పబ్లిసిటీ ఇచ్చుకొనేది మాత్రం కొండంత. తుపాను వస్తోంది అని అందరికీ తెలుసు. పేపర్లలో రాశారు. టీవీల్లో చూపించారు. అదుగో తుపాను రాబోతోంది అని చెప్పి వారం రోజుల కిందటి నుంచి మనందరికీ చెప్పారు. ఈ పరిస్థితిలో ఏ ముఖ్యమంత్రి అయినా చేయాల్సింది ఏమిటి? అక్కడ కనీసం అన్నం పొట్లాలు, నీళ్ల ట్యాంకర్లు, దానికి సంబంధించిన డబ్బులు, సామగ్రి, కూరగాయలు తెచ్చి పెట్టుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? కానీ ఈ పెద్దమనిషి అవేవీ చేయకుండా తుపాను వచ్చిన తర్వాత తీరిగ్గా శ్రీకాకుళం పోయాడు.  తాగడానికి నీళ్లు లేక, కరెంటు కూడా లేని పరిస్థితి చూసి అక్కడి ప్రజలు చంద్రబాబునాయుడి గారిని గట్టిగా అడిగితే ఈ పెద్దమనిషి ఏమన్నాడో తెలుసా? మీరేమైనా కతలు పడితే బుల్డోజర్లతో తొక్కిస్తా అన్నాడు. ఈ పెద్దమనిషి మాట్లాడిన మాటలు, అక్కడ చేసిన పనులు గమనించాలని కోరుతున్నా. తిత్లీ తుపాను బాధితులు తమను ఆదుకోవాలని, నీటి కోసం గట్టిగా నిలదీస్తే ఈ పెద్దమనిషి అందుకు సంబంధించిన ఫొటోలను వెనక నుంచి తీయించి చంద్రబాబునాయుడి గారికి కృతజ్ఞతలు చెబుతున్నట్లు దిక్కుమాలిన ఆలోచనతో తన ఎల్లోమీడియాలో పబ్లిసిటీ ఇచ్చుకుంటాడు. అవే ఫొటోలను హోర్డింగ్‌లుగా చేసి రాజధాని అమరావతిలో పెట్టుకుంటాడు. ఇంతకన్నా దిక్కుమాలిన వ్యక్తి ప్రపంచంలో ఇంకెవరన్నా ఉంటారా?
 

 

సాగునీటి ప్రాజెక్టుల్ని పట్టించుకున్నది ఎక్కడ?
సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులకు తోడుగా ఉండేందుకు ఆనాడు వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు పెద్దగెడ్డ రిజర్వాయర్‌  ప్రాజెక్టు పనులు చేపట్టి పూర్తి చేశారు. నాన్నగారి పుణ్యాన 12 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఈ రిజర్వాయర్‌ నుంచి ఎడమ కాలువ తవ్వుతామని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన హామీకి దిక్కు లేదు. సాలూరు, రామభద్రపురం ప్రాంతాలకు నీళ్లు అందించి మేలు చేయాల్సిన ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెడితే సాగు నీటి కోసం తాము ఎక్కడికి పోవాలన్నా అని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే నియోజకవర్గం మెంటాడ మండలంలో ఆంధ్రా హైలెవెల్‌ కెనాల్‌ పూర్తి చేసి 4,500 ఎకరాలకు సాగు నీరు అందిస్తామని టీడీపీ నాయకులు హామీ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు పూర్తి అయిందా? మక్కువ మండలంలో 5,500 ఎకరాలకు నీరు అందించే గోముఖి రెగ్యులేటర్‌ కుప్పకూలింది. ఈ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాల్సి ఉండగా ఇంతవరకు పట్టించుకోని అన్యాయమైన పరిస్థితి.

 

రైతుల కష్టం హెరిటేజ్‌పాలు.. 
ఇదే ప్రాంతంలో ఎక్కువగా కూరగాయలు పండిస్తారు. నేనిక్కడకు వచ్చేటప్పుడు రైతులు నన్ను కలిసి తమకు ఇస్తున్న ధరలు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదన్నా అని చెప్పారు. రైతుల నుంచి వంకాయలు కేజీ రూ.13కు కొని చంద్రబాబు హెరిటేజ్‌ షాపుల్లో రూ.40 చొప్పున అమ్ముతున్నారు. బీరకాయలు రూ.15 చొప్పున కొని రూ.38కి అమ్ముతున్నారు. దొండకాయలు కేజీ రూ.13కు కొని రూ.36 చొప్పున, కాకర కాయలు కేజీ రూ.15కు కొని రూ.50 చొప్పున హెరిటేజ్‌ షాపుల్లో అమ్ముతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేదు కానీ చంద్రబాబు షాపుల్లో మాత్రం రెండింతల రేట్లకు అమ్ముకుంటున్నారు. దళారీలను కట్టడి చేసి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన ముఖ్యమంత్రే దళారీలకు నాయకుడయ్యారు. రైతులకు అన్యాయం చేస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. 

సాలూరుకు మంచినీళ్లు వస్తున్నాయా? 
పెద్దగెడ్డ రిజర్వాయర్‌ నుంచి సాలూరుకు మంచినీరు ఇచ్చేందుకు కేంద్రం రూ.50 కోట్లను మంజూరు చేసిందన్నా.. కానీ ఈ నాలుగున్నరేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్న జ్ఞానం ఈ చంద్రబాబుకు లేదన్నా.. అని సాలూరు వాసులు చెబుతున్నారు. ఇదే సాలూరు నియోజకవర్గంలో పెద్దగెడ్డ ప్రాజెక్టు నుంచి 97 గ్రామాలకు సాగునీటిని సరఫరా చేసేందుకు ఆనాడు డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు రూ.33 కోట్లతో మెగా వాటర్‌ స్కీమ్‌ను ప్రారంభిస్తే ఇప్పుడు దాన్ని సరిగా నిర్వహించలేని అధ్వాన పరిస్థితి. కేవలం 30 గ్రామాలకే నీరు అందుతుందన్నా అని ప్రజలు చెబుతున్నారు. సాలూరు మండలంలో 21 గ్రామాలకు వెంగాళరాయ ప్రాజెక్టు నుంచి ఆవేళ డాక్టర్‌ వైఎస్సార్‌ తాగునీటిని అందించేందుకు ఈ స్కీమ్‌ను ప్రారంభిస్తే ఇవాళ దాన్ని కూడా సరిగ్గా నడపలేని అన్యాయమైన పాలన సాగుతోంది. ఇదే సాలూరు పట్టణంలో బైపాస్‌ రోడ్డు వేయాలన్న జ్ఞానం కూడా లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తోంది.  ఆటోనగర్‌లోఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి.. ఇక్కడి టీడీపీ ఇన్‌చార్జ్‌ బాంజదేవ్‌ 35 ఎకరాలను ఆక్రమించి అక్రమంగా చేపల చెరువులు తవ్వి పెద్దగెడ్డ రిజర్వాయర్‌ నుంచి రైతులకు దక్కాల్సిన నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.  

రైతులు, అక్కచెల్లెమ్మల పరిస్థితి దారుణం 
నేను విజయనగరంలో అడుగు పెట్టినప్పుడు చాలా మంది ఆగ్రిగోల్డ్‌ బాధితులు నా వద్దకు వచ్చారు. బాధితులను ఆదుకోవాలన్న ఆరాటం చంద్రబాబుకు లేదు. ఆ విలువైన ఆస్తుల్ని ఎలా కొట్టేయాలి అని దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నాడు ఈ పెద్దమనిషి. తన బినామీలతో తక్కువ రేట్లకు అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొనుగోలు చేయిస్తాడు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను చిన్న చిన్న ప్లాట్లుగా మార్చి, వేలం వేస్తే బాధితులకు న్యాయం చేయవచ్చు. కానీ ఈ ముఖ్యమంత్రి ఆ పని చేయకుండా బ్రోకరిజం చేస్తున్నాడు. ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. గిట్టుబాటు ధరలు లేవు. రుణమాఫీ లేదు. సున్నా, పావలా వడ్డీ రుణాలు లేవు. రైతుల రుణాలు పూర్తిగా, బేషరతుగా మాఫీ కావాలన్నా, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలన్నా బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. ఆ రోజుల్లో టీవీల్లో ఓ ప్రకటన కనబడేది. ఓ అక్క మెడలో నుంచి మంగళసూత్రాన్ని ఓ బ్యాంకర్‌ లాక్కొనిపోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు.. ఆ వెంటనే ఓ చేయి వచ్చి బ్యాంకర్‌ చేయి పట్టుకుంటుంది. దీంతో ఆ బ్యాంకర్‌ ఆ చేయి వైపు తిరిగి చూస్తాడు. అప్పుడు ఆ అక్క అంటుంది.. ఓ నెల ఆగండయ్యా అని.. ఒక్క నెలలో ఏమవుతుందని బ్యాంకర్‌ అడుగుతాడు.

అప్పుడు బ్యాంకర్‌ చెయ్యి పట్టుకున్న వ్యక్తి ఏమంటాడంటే.. ఆయన (బాబు) వస్తాడు అని. ఆయన వచ్చాడు.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం మాత్రం ఇంటికి రాలేదు కానీ బంగారాన్ని వేలం వేస్తామన్న నోటీసులు మాత్రం ఇంటికి వస్తున్నాయి. అక్షరాల 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేయాల్సి ఉంటే చంద్రబాబు చేసిన రుణమాఫీ అనే పథకం వడ్డీలలో నాలుగో వంతుకు కూడా సరిపోని పరిస్థితి. రైతులకు సున్నా వడ్డీలకు రుణాలు రాకుండా చేయడం మరో అన్యాయం. అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ అని చెప్పి మోసం చేశాడు. ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. రాష్ట్రంలోని కోటీ 70 లక్షల ఇళ్లకు ఇంటికో ఉద్యోగమన్నా, ఉపాధి అయినా ఇస్తామని ఊదరగొట్టాడు. లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఏదీ లేదు. పైగా రూ.20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని విశాఖలో మీటింగ్‌లు పెట్టి చెబుతాడు. అవి ఎక్కడైనా కనిపించాయా? ఉద్యోగాల మాట దెవుడెరుగు ఉన్న ఉద్యోగాలను దగ్గరుండి ఊడబెరుకుతున్నాడు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్‌ల మీద ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి దినదినగండం నూరేళ్ల ఆయుష్షు అన్న చందంగా మారింది చంద్రబాబు పాలనలో. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 55 నెలలు కావొస్తోంది. ఈ లెక్కన నెలనెలా రూ.2 వేల చొప్పున ప్రతి ఇంటికి రూ.1.10 లక్షలు బాకీ పడ్డారా? లేదా?  

ఒక ప్రతిపక్ష నేతగా నేను పాదయాత్ర చేస్తున్నాను కాబట్టి మా పార్టీ ఇతర జిల్లాల సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు తుపాను ప్రాంతాల్లో పర్యటించి బాధితుల తరఫున నిలబడితే ఈ పెద్దమనిషి ఏమంటాడో తెలుసా? ప్రతిపక్షం సహాయ కార్యక్రమాలను అడ్డుకుంటోందని బురదేస్తాడు. ఒకవైపున ఈ మాటలంటూ అదే నాలుకతో ప్రతిపక్ష నాయకుడు రాలేదంటాడు. నేను ఒక్కటే చెబుతున్నా.. ఏమి చేసినా నిజాయితీతో చేసే చిత్తశుద్ధి మాకుంది. మరో వారం రోజుల్లో తుపాను ప్రాంతానికి జగన్‌ అనే వ్యక్తి ఎంటరవుతాడని చెబుతున్నాను.పాదయాత్ర చేసుకుంటూ గ్రామం గ్రామం తిరుగుతూ తుపాను ప్రాంతాలకు వెళ్లి 50 రోజుల పాటు అక్కడే ఉంటానని మీ అందరి తరఫున చెబుతున్నాను. చంద్రబాబునాయుడికి టైమ్‌ ఇస్తున్నాం. రూ.3,435 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పావు. నీవు చెప్పిన రూ.3,435 కోట్లు ఇంకొక పది రోజుల్లో బాధితులందరికీ అందించాలని చెబుతున్నాం. ఒకవేళ చంద్రబాబు గారు ఆ 3,435 కోట్ల రూపాయలు ఇవ్వకపోతే.. రేపు మన ప్రభుత్వం రాగానే ఆ డబ్బు బాధితులకు ఇస్తామని భరోసా ఇస్తున్నాను. ఎవ్వరూ బాధపడొద్దు.   

కనుచూపు మేర ఎటుచూసినా ఇసుక వేస్తే రాలనంత జనం కనిపిస్తున్నారు. ఇంతటి ఆదరణ చూపిన ప్రతి ఒక్కరికీ తలవంచి కృతజ్ఞతలు తెలుపుతున్నా. సాలూరు గిరిజన నియోజకవర్గం. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నది గిరిజన ఎమ్మెల్యే రాజన్న దొర. రాజన్న దొరకున్న వ్యక్తిత్వం,విలువలు పక్కనే ఉన్న రాజులకు కూడా లేవని గర్వంగా చెబుతాను. సంతలో పశువులను కొన్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యేను కొన్నారు. రాజన్న దొరను కూడా కొనడానికి ప్రలోభపెడితే.. తాను అమ్ముడుబోనని చెప్పిన ఘతన 
మీ ఎమ్మెల్యే రాజన్న దొరది. 

 

చంద్రబాబు నిద్రపోతున్నాడా? 
ఈ నియోజకవర్గంలో అడుగుపెడుతూనే.. ఇక్కడి పాలన గురించి ప్రజలు చెప్పారు. ఈ ఏడాది విజయనగరం జిల్లాలో జ్వరాలు వచ్చి 86 మంది చనిపోతే ప్రభుత్వం పడుకుని ఉందన్నా అని చెప్పారు. ఒక్క సాలూరు మండలంలో 21 మంది, ఒక్క కరాసవలసలోనే నెల రోజుల్లో 11 మంది చనిపోయారు. జ్వరాలతో గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకు పోతుంటే చంద్రబాబూ.. నీవు పడుకుని నిద్రపోతున్నావా? 2017 జూలై 24న బాగువలస గ్రామానికి చెందిన చిన్నమ్మడు సాలూరు పీహెచ్‌సీలో బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి పరిస్థితి విషమించడంతో విజయనగరంలో ఆసుపత్రికి తరలించాలని డాక్టర్లు సిఫార్సు చేస్తే ప్రభుత్వ అంబులెన్స్‌ వచ్చింది. అన్ని సౌకర్యాలు ఉండాల్సిన ఆ అంబులెన్స్‌లో ఆక్సిజన్‌ లేక చిన్మమ్మడును తరలించే సమయంలో ఆమె చనిపోయింది. మహానేత పాలనలో 108కు ఫోన్‌ కొడితే 20 నిమిషాల్లో కుయ్‌ కుయ్‌మంటూ వచ్చి ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లి ఉచితంగా చికిత్స చేసి చిరునవ్వుతో ఇంటికి పంపే పరిస్థితి ఉండేది. ఇవాళ 108కి ఫోన్‌ చేస్తే అంబులె¯న్స్‌ కండిషన్లో లేదని జవాబు వస్తోంది. సాలూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో 8 మంది డాక్టర్లు ఉండాల్సి ఉంటే కేవలం నలుగురితో పని జరుపుతున్నారు. 
 

అంతటా అవినీతే 
పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు పాలనలో పునాది గోడలు దాట లేదు. ప్రాజెక్టును అవినీతిమయం చేశారు. సాక్షాత్తు కేబినెట్‌ మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు వియ్యంకుడు సబ్‌కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. తన బినామీలను సబ్‌ కాంట్రాక్టర్లుగా పెట్టుకుని రేట్లు పెంచి పనులు అప్పగిస్తున్నారు. దీంతో ఆ ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా మొండిచేయి చూపిస్తోందంటే చంద్రబాబు పుణ్యం కాదా? ఇదే పెద్దమనిషి ప్రత్యేక హోదాకు వెన్నుపోటు పొడిచారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు. అటువంటి మాట చెప్పిన ఈపెద్దమనిషి.. ఆనాడు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినట్టు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. రాష్ట్రంలో ఎటుచూసినా దోపిడే. ఇసుక, మట్టి, మద్యం అమ్మకాలు, కాంట్రాక్టులు, బొగ్గు కొనుగోళ్లు, కరెంటు కొనుగోళ్లు, రాజధాని భూములు, విశాఖ భూములు, గుడి భూములు, చివరకు దళితుల భూముల్నీ వదిలిపెట్టకుండా దోపిడీ చేస్తున్నారు. చివరకు గ్రామ గ్రామానా మాఫియాలను తయారు చేశారు. పెన్షన్‌ కావాలన్నా లంచం, రేషన్‌ కావాలన్నా లంచం, చివరకు మరుగుదొడ్లు కావాలన్నా లంచం లేనిదే పని జరగడం లేదు. కరెంట్‌ చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ రేట్లు, ఆర్టీసీ చార్జీలు, ఇంటి పన్నులు, స్కూలు, కాలేజీ ఫీజులు బాదుడే బాదుడు. ఇవాళ గ్రామాల్లో తాగడానికి మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయో లేదో తెలీదు కానీ వీధి చివర, బడిపక్కన, గుడిపక్కన ఇంటిపక్కన బెల్టుషాపులు పెట్టించి మద్యం అమ్ముతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేషన్‌ షాపుల్లో ఇవాళ బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు.
 

నారాయణ, చైతన్య స్కూళ్లు చంద్రబాబు బినామీ సంస్థలు 
ఈ రోజు పిల్లలు చదువుకోవాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. సాలూరు వంటి మున్సిపాల్టీలో కూడా స్కూళ్లలో రూ.20 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేస్తున్న పరిస్థితి. పిల్లలను గవర్నమెంటు స్కూళ్లకు పంపిద్దామంటే రేషనలైజేషన్‌ పేరిట చంద్రబాబు దగ్గరుండి మూసివేయిస్తున్నారు. గవర్నమెంటు స్కూళ్లలో దాదాపుగా 23 వేల టీచర్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కావాలని భర్తీ చేయడం లేదు. ఎందుకంటే వాటిని నిర్వీర్యం చేసి ప్రతి మున్సిపాల్టీలో, ప్రతి గ్రామంలో కూడా నారాయణ, చైతన్య స్కూళ్లను తీసుకురావాలని ఆరాటపడుతున్నాడు. ఈ స్కూళ్లు చంద్రబాబు బినామీ సంస్థలు. ఈ స్కూళ్లలో అక్షరాలా రూ.40 వేల నుంచి లక్షా అరవై వేల వరకు ఫీజులున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని కూడా నిర్వీర్యం చేశాడు. ఇలాంటి అన్యాయ పాలన పోవాలి. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత రావాలి. ఇది జరగాలంటే ఒక్క జగన్‌ వల్లే సాధ్యం కాదు. మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కావాలి. మన ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం. అవ్వాతాతకు రూ.2 వేలు పింఛన్‌ ఇస్తాం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top