బాబును మళ్లీ నమ్మొద్దు...

ys jagan fired on cm chandra babu naidu - Sakshi

అభివృద్ధికి దూరమైన ఎస్సీ..ఎస్టీలు

పథకాలన్నీ పేరుకు మాత్రమే

ఒక్క ఇల్లూ కట్టిన దాఖలా లేదు

విద్యార్థుల హాస్టళ్లపైనా వేటు

ఖర్చుచేయని సబ్‌ప్లాన్‌ నిధులు

ఉచిత కరెంటుకు మంగళం

ఉపాధి లేక ఆగని వలసలు

ఎన్నికల  ముందు...
‘ నేను పెద్ద మాదిగను. మీ ఇంట్లో  సభ్యుడిని. అధికారంలోకి వచ్చిన వెంటనే దళిత సంక్షేమానికి పెద్దపీట వేస్తా.’

ఎన్నికల తరువాత...
‘ దళితుల కుటుంబంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా.’
ఈ వ్యాఖ్యలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నైజం బయటపడింది. ఓట్ల కోసమే దళిత సంక్షేమం గురించి     మాట్లాడతారని తెలుస్తోంది. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికే దళితులపై అపార ప్రేమ చూపించారని దళిత సంఘాలు మండిపడుతున్నాయి.

ఒక్కో మైలు రాయి దాటుకుంటూ ప్రజా సంకల్పయాత్ర ముందుకు సాగిపోతోంది. ఇడుపులపాయలో తొలి అడుగుతో ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర ముక్కంటి సాక్షిగా 900కిలోమీటర్లు చేరుకుంది. విమర్శల బాణాలను ఎదుర్కొంటూ.. పదునైన ప్రశ్నలను సంధిస్తూ.. ప్రేమపూర్వక దీవెనలందుకుంటూ.. జనం గుండెలకు దగ్గరవుతూ.. సానుకూలతను కూడగడుతూ.. నవరత్నాలను సానబెడుతూ..ఉత్తేజ ప్రసంగాలతో సర్కారు తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ..సంకల్ప బలంతో జననేత ముందుకు సాగిపోతున్నాడు. జనహృదయాలను గెలుచుకుంటున్నాడు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీకాళహస్తిలో పార్టీ సమన్వయకర్త బియ్యపు మధుసూదనరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలకపక్షంపై నిప్పులు చెరిగారు. అవినీతి, మోసాన్ని ఎంచుకున్న సీఎం చంద్రబాబునాయుడు ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజలకిచ్చిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. చంద్రబాబుది దారుణమైన పాలనగా పేర్కొంటూ, గడచిన నాలుగేళ్లలో కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు మూడుసార్లు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోలు చార్జీలను పెంచిన బాబు ఇంటి పన్నులను కూడా పెద్ద ఎత్తున పెంచారన్నారు. జిల్లాలోని మన్నవరం ప్రాజెక్టు పనులను పక్కన పడేసిన బాబు పదేపదే ప్రయివేటు విమానాల్లో విదేశాలకు చెక్కేసి నల్లధనాన్ని దాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కరెంటు, రాయల్టీ, సీనరేజీ ఛార్జీల పెంపు వల్ల జిల్లాలోని గ్రానైట్‌ పరిశ్రమలు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయాయని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. సోమశిల, స్వర్ణముఖి, గాలేరు–నగరి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా చంద్రబాబు జిల్లాకు తీరని అన్యా యం చేశారని ధ్వజమెత్తారు. ఈ దారుణమైన పాలనను ప్రజలు క్షమించకూడదన్నారు.

పాదయాత్ర సాగిందిలా...
ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. రాచగున్నేరి, ఇసుకగుంట, చెల్లపాళెం క్రాస్‌ల మీదుగా యాత్ర  సాగింది. మధ్యాహ్నం 11 గంటలకు చెర్లోపల్లి హరిజనవాడకు చేరుకోగానే పెద్ద ఎత్తున మహిళలు ఎదురొచ్చి గుమ్మడికాయలతో దిష్టితీసి వైఎస్‌ జగన్‌కు ఘనస్వాగతం పలికారు. పాదయాత్ర 900 కిలోమీటర్లు అధిగమించిన సందర్భాన్ని పురస్కరించుకుని జననేత రోడ్డు పక్కన రావిచెట్టు మొక్కను నాటారు.

అనంతరం పానగల్‌ మీదుగా పాదయాత్ర శ్రీకాళహస్తి వరకూ సాగింది. దారిమధ్యలో చిందేపల్లికి చెందిన రైతు రాధాకృష్ణ వైఎస్‌ జగన్‌ను కలిసి గౌతమబుద్ధుని పాలరాతి విగ్రహాన్ని అందజేశారు. ఆర్టీసీ, రైతు సంఘ నాయకులు కలిసి జగన్‌కు మద్దతు పలికారు. శ్రీకాళహస్తి కలంకారీ కార్మికులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. టూరిజం ఉద్యోగులు పలువురు కలిసి ఉద్యోగ భద్రతపై వినతిపత్రం అందజేశారు. అందరి విన్నపాలనూ ఆలకిస్తూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు.

పాదయాత్రలో పాల్గొన్న నేతలు వీరే...
ఆదివారం నాటి పాదయాత్రలో పార్టీ సీనియర్‌ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపూడి వరప్రసాద్, భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నారాయణస్వామి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీ వయ్య, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి, పార్టీ నాయకులు హరిప్రసాదరెడ్డి, నారమల్లి పద్మజ, పన్నీరుకాల్వ శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కిటకిటలాడిన శ్రీకాళహస్తి...
శ్రీకాళహస్తిలో బహిరంగసభ ఉందని తెల్సుకున్న చుట్టుపక్కల జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పెండ్లిమండపం ప్రాంతం కిటకిట లాడింది. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతలకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్‌రెడ్డి పాలక ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ ప్రసంగానికి ముందు మండపం ఎదుట నిర్మించిన స్టేజీ జనం తాకిడికి కూలిపోయింది. నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు బియ్యపు మధుసూదన్‌రెడ్డి చికిత్స చేయించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top