ప్రజల సమస్యలపై అక్కడికక్కడే నిర్ణయాలు 

YS Jagan decisions taking about peoples issues on the spot - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  ‘ఈ పాదయాత్రలో నేనెక్కడికి నడుచుకుంటూ వెళుతున్నానో.. ఎక్కడ పడుకుంటానో.. విడిది చేస్తున్నానో మీ అందరికీ తెలుసు. ఎవరైనా ప్రజా సమస్యలపై నన్ను కలవొచ్చు.. ఇంకా ఏమైనా సూచనలు సలహాలుంటే ఇవ్వొచ్చు..’ అని జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో చేసే ప్రతి ప్రసంగంలోనూ ప్రజలనుద్దేశించి చెబుతూ ఉంటారు. అందుకు తగ్గట్లుగా ప్రజలు వచ్చి తనను కలిసి ఇచ్చిన సలహాల్లో ఆచరణయోగ్యమైన వాటిని అమలు చేస్తానని ప్రకటించడానికి ఆయన ఏ మాత్రం వెనుకాడ్డం లేదు. నెల్లూరు జిల్లా పాదయాత్రలో వస్తూ ఉండగా ఓ చిన్నారి (విద్యార్థిని) ఆయన వద్దకు వచ్చి.. ‘అన్నా.. కొన్ని కులాల వారికే.. వారి సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఉన్నాయి. అన్ని కులాల్లోనూ పేద వారు ఉన్నారు కనుక మాకూ కార్పొరేషన్‌ కావాల’ని కోరింది. ఆమె సూచన మేరకు అన్ని కులాల వారికీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  

ఎస్సీ, ఎస్టీల గృహాలకు 250 యూనిట్ల విద్యుత్‌ ఉచితం, సహకార డెయిరీలకు పాలు పోస్తే లీటరుకు రూ.4 ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం, ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పేదరైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేయడం, అంగన్‌వాడీ వర్కర్లలకు తెలంగాణ కంటే రూ.1000 వేతనం ఎక్కువ చేయడం, నాయీ బ్రాహ్మణులకు వారి సెలూన్లకు 250 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్‌ వర్తింపు, మసీదుల్లో విధులను నిర్వహించే ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు వేతనం, దేవాలయ పూజారులకు, చర్చిల పాస్టర్లకు గౌరవ వేతనం, దళితులకు ఆర్థిక స్వావలంబన కోసం 90 శాతం సబ్సిడీతో పాడి పశువులను సరఫరా చేయడం... ఇలాంటి హామీలన్నీ అప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు అక్కడికక్కడే జగన్‌ నిర్ణయాలు తీసుకుని ప్రకటించి ప్రజాదరణను చూరగొన్నారు. ఇవే కాకుండా నవరత్నాలతో పాటు ఉద్యోగుల సీపీఎస్‌ రద్దు, గ్రామ సచివాలయాలు, ఉద్యోగాల భర్తీ తదితర ఎన్నో హామీలు ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top