‘శవాల మీద చిల్లర ఏరుకునే చంద్రబాబు’

YS Jagan Critics Chandrababu Naidu At Chilakapalem Public Meeting - Sakshi

సాక్షి, చిలకలపాలెం/శ్రీకాకుళం :  రాష్ట్ర ప్రజానీకం ప్రకృతి విపత్తులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు పక్క రాష్ట్రంలో పాలన సాగించేందుకు వెళ్లాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ విమర్శలు గుప్పించారు. తిత్లీ తుపాను దెబ్బకు అతలాకుతలమైన ఉత్తరాంధ్రను పట్టించుకోకుండా చంద్రబాబు తెలంగాణలో ‘రాజకీయాలు’ చేస్తున్నాడని మండిపడ్డారు. చిలకలపాలెంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు. తిత్లీ తుపానుతో ఒక్క ఎచ్చెర్ల మండలంలోనే 1200 ఎకరాల్లో పంట నష్టపోయామనీ, కానీ ఆ మొత్తాన్ని అధికారులు 400 ఎకరాలకు కుదించారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

‘ఏ ప్రభుత్వాధినేత అయినా తుపాను రాకముందే జాగ్రత్త పడతారు. నష్ట నివారణ చర్యలపై దృష్టి పెడతారు. పక్కనున్న ఒడిషాలో ప్రభుత్వం అలానే వ్యవహరించింది. కానీ, బాబుకు అవేమీ పట్టవు. తిత్లీ ప్రభావంతో ఏపీలో 3,435 కోట్ల నష్టం జరిగిందని బాబు కేంద్రానికి లేఖ రాస్తాడు. కానీ, బాధితులను ఆదుకోవడానికి ముందుకురాడు. కేవలం రూ.520 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటాడు.  అంటే నష్టపోయిన దానిలో కేవలం 15 శాతం మాత్రమే ఇచ్చి గొప్పలు చెప్పుకుంటాడు. ప్రభుత్వం ఎంతో చేసినట్టు బస్సులకు ఫోటోలు పెట్టి పబ్లిసిటీ చేసుకుంటాడు. చంద్రబాబు వ్యవహారం ఎలా ఉందంటే.. శవాలపై చిల్లర ఏరుకునే తీరుగా ఉంది’ అని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు.

బాబు విద్యా వ్యతిరేకి..
శ్రీకాకుళం జిల్లాలో విద్యాభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అంబేద్కర్‌ యూనివర్సిటీ తీసుకొచ్చారనీ, కానీ చంద్రబాబు ఆ వర్సిటీని నాశనం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. కనీస వసతుల కల్పించకుండా, విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇవ్వకుండా దగా చేస్తున్నారని నిప్పులు చెరిగారు. 96 మంది అధ్యాపకులు ఉండాల్సిన వర్సిటీలో కేవలం 12 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు మాత్రమే ఉన్నారని తెలిపారు. పోస్టులు భర్తీ చేయక కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నారని దుయ్యబట్టారు.

ఏ ప్రభుత్వమైనా మెరుగైన విద్యనందించేందుకు కృషి చేస్తుందనీ, టీడీపీ ప్రభుత్వం అందుకు వ్యతిరేకంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. ఒక్క ఎచ్చెర్ల నియోజకవర్గంలోనే 34 ప్రభుత్వ పాఠశాల్ని, 5 హాస్టళ్లు మూసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ హయాంలోనే తోటపల్లి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయనీ, మిగతా 10 శాతం పనులను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని ధ్వజమెత్తారు.

కమీషన్‌ వెంకట్రావ్‌..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదరి కొనుగోలు చేసిన చంద్రబాబు తెలంగాణలో నీతులు చెప్తున్నాడని వైఎస్ జగన్‌ దుయ్యబట్టారు. ఎమ్మెల్యే కళా వెంకట్రావు కాదనీ, కాకాలు పట్టే, కమీషన్ల వెంకట్రావు అని చురకలంటిచారు. బ్రోకర్‌గా మారిన వెంకాట్రావ్‌ చంద్రబాబుతో కలిసి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారని అన్నారు. రూ.4 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని 15 లక్షలకే దోచుకున్నారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top