వైద్యం కోసం పేదలు అప్పులపాలు కాకూడదు

YS Jagan comments on the healing of the poor - Sakshi

     ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు 

     ముస్లింల ఆత్మీయ సదస్సులో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 

     ముస్లింలకు అన్ని విధాలా అండగా ఉంటాం 

     ఇమామ్, మౌజన్‌లకు వేతనాలు పెంచుతాం 

     మసీదు, చర్చి, గుడికి రూ.15 వేలు ఇస్తాం 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ‘వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. వెయ్యి రూపాయలకు మించి అయ్యే ప్రతీ చికిత్సనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తాం. ప్రాంతాలతో పని లేకుండా మంచి వైద్యం కోసం ఎక్కడికెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. వైద్యం కోసం పేదలు అప్పులపాలు కాకుండా చూస్తాం’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేశారు. పేదరికంతో అల్లాడుతున్న ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వారి సంక్షేమం కోసం వైఎస్సార్‌ ఒక అడుగు ముందుకేస్తే తాను రెండడుగులు ముందుకేస్తానని చెప్పా రు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 32వ రోజు సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని మదిగుబ్బ క్రాస్‌ రోడ్డు వద్ద ముస్లిం మైనార్టీలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో జగన్‌ ప్రసంగించారు. ముస్లింలకు దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని మేలు దివంగత మహానేత వైఎస్‌ఆర్‌ చేశారని గుర్తు చేశారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే చంద్రబాబుకు మైనార్టీలు గుర్తుకొస్తారని మండిపడ్డారు. కేబినెట్‌లో కనీసం ఒక్క ముస్లింకు కూడా స్థానం ఇవ్వని ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. ఈ సదస్సులో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

మైనార్టీ సోదరులారా ఆలోచించండి 
ఎంతో మంది ముస్లిం సోదరులు ఇవాళ పేదరికంలో ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఇవాళ ఇంజనీరింగ్‌ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. ప్రభుత్వం మాత్రం ముష్టి వేసినట్లు రూ.35 వేలు ఇస్తోంది. బాబు హయాంలో మన పిల్లల్ని ఇంజనీర్లు, డాక్టర్లు చదివించే స్థాయి మనకు ఉందా? నాన్నగారు ఒకడుగు ముందుకు వేసి పేదవాళ్ల జీవితాల్లో చిరునవ్వులు తెచ్చారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు వచ్చాక.. పిల్లల్ని చదివించే పరిస్థితి లేకుండా పోయింది. 108కు ఫోన్‌ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. ఎంత పేదవాడైనా కుటుంబ సభ్యులను మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి బతికించుకోవాలని తాపత్రయ పడతాడు. ఆ మంచి ఆసుపత్రులు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. 60 ఏళ్లు రాజధానిగా ఉండబట్టే అక్కడ ఆసుపత్రులు అభివృద్ధి చెందాయి.

కానీ హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ ఇవ్వరట. తొమ్మిది నెలలుగా నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు ఇవ్వడం లేదు. ఇలాంటప్పుడు ఆ ఆసుపత్రుల్లో వైద్యం చేయించే పరిస్థితి ఉంటుందా? మనందరి ప్రభుత్వం వచ్చాక.. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం. వెయ్యి రూపాయలకు మించి ఖర్చయ్యే ఏ వైద్యమైనా సరే ప్రభుత్వమే భరిస్తుంది. ఆపరేషన్‌ అయ్యాక డాక్టర్లు చెప్పిన విశ్రాంతి కాలానికి కూడా మందుల ఖర్చులకు డబ్బులు ఇస్తాం. బెంగళూరైనా.. చెన్నై అయినా... హైదరాబాద్‌ అయినా ఎక్కడికెళ్లి వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీని వర్తింపజేస్తాం. కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకునే వారి మందుల ఖర్చు పెరుగుతోంది. అలాంటి రోగులకు పింఛను నెలకు రూ.10 వేలు ఇస్తాం.  

మసీదు, చర్చి, గుడికి తోడ్పాటు
ఇమామ్, మౌజన్‌లకు చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు. కానీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తాం. మసీదు, చర్చి, గుడికి ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఒక్కోదానికి రూ.15 వేలు ఇస్తాం. ఏ మనిషి అయినా గుడి, చర్చి, మసీదుకు పోవాలి. అక్కడ  దేవుడి ని ప్రార్థించినప్పుడే మంచి, చెడు తెలుస్తుంది. అందుకే ఆ ద్వారం మూసుకోకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో చాలా మందికి రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. ఇలాంటి వారికి తమ ప్రభుత్వం లో రూ.2 వేలు పింఛన్‌ ఇవ్వడమే కాకుం డా వయో పరిమితిని 45 ఏళ్లకే తగ్గిస్తాం. పేదలందరి స్థితిగతులు మార్చి.. ప్రతి పేదవాడికీ తోడుగా ఉండేందుకు వైఎస్సార్‌సీపీ నవరత్నాలను ప్రకటించింది. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ మేలు చేయాలనే సదుద్దేశంతో చేపట్టిన ఈ పాదయాత్రలో ప్రజలు ఎక్కడైనా నన్ను కలవచ్చు. సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు నన్ను ఆశీర్వదించండి.’’ అని  వైఎస్‌ జగన్‌ కోరారు.  

ముస్లింల ఆర్థికాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తా
ట్వీటర్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: తాను అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశాల్లో ముస్లింల సామాజిక, ఆర్థికాభివృద్ధి కూడా ఒకటి అని వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ట్వీట్‌ చేశారు. డాక్టర్‌ వైఎస్సార్‌ గొప్ప దార్శనికతతో ఆంధ్రప్రదేశ్‌లోని ముస్లింలు, బడుగువర్గాల అభివృద్ధికి పటిష్ట పునాది వేశారని, దీన్ని మరింత పటిష్టపర్చేందుకు, ఆయా వర్గాల అభ్యున్నతికి శాయశక్తులా పాటుపడతానంటూ ట్వీటర్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో మాట్లాడుతున్న రెండు ఫొటోలను కూడా జత చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top