మీ మద్దతుతోనే హోదా సాధ్యం

Ys jagan comments on Ap special status at ananthapur yuvabheri - Sakshi

‘అనంత’ యువభేరిలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ప్రత్యేక హోదాతోనే ‘అనంత’ లాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి 

హోదా వచ్చి ఉంటే లక్షల్లో ఉద్యోగాలు

మనకు హోదా, ప్యాకేజీ రెండూ లేవు

ఎన్నికల్లో గట్టెక్కగానే హోదా అంటే సంజీవనా అని చంద్రబాబు అంటున్నారు

అవును సంజీవనే.. హోదా ఉన్న రాష్ట్రాలనొకసారి చూడండి.. 

అధికారంలో ఉన్న వారు ఇలా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఇంకెవరిని అడగాలి? 

అందరం ఏకమై పాలకులకు కనువిప్పు కలిగేలా పోరాడదామని పిలుపు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ప్రత్యేక హోదాపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందని తెలిసినా మోసం చేస్తున్నారు. హోదా వల్ల లాభం లేదని అబద్ధాలు చెబుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్నో లాభాలుంటాయని విద్యార్థులైన మీకే ఇంత అవగాహన ఉంది. కనీసం మీ మాటలు విన్నాకైనా వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. హోదా కోసం ఇకపై మరింతగా ప్రజల్లోకి వెళ్లి అందరి మద్దతు కూడగడదాం. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు గట్టిగా ప్రయత్నిద్దాం.

ఇది ఒక్క జగన్‌మోహన్‌రెడ్డి వల్ల మాత్రమే సాధ్యమయ్యే పని కాదు. మీ అందరి మద్దతు కావాలి. అందరూ కలసికట్టుగా పోరాటం చేస్తే హోదా సాధ్యమే. అవసరమైతే చివరి అస్త్రంగా ఎంపీల చేత రాజీనామా కూడా చేయిస్తాం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా పోరులో భాగంగా మంగళవారం అనంతపురం నగరంలోని ఎంవైఆర్‌ ఫంక్షన్‌ హాలులో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ‘యువభేరి’కి జగన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా సాగిన ఈ కార్యక్రమ వేదికపై ప్రొఫెసర్లు, న్యాయవాదులు, విద్యావేత్తలు ఆసీనులయ్యారు. వారంతా ప్రత్యేక హోదా ఆవశ్యకతను సోదాహరణంగా వివరించారు. ఆపై జగన్‌ మాట్లాడారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...

ఈ పాలకులకు చెవులు లేవు..
‘‘యువభేరికి వస్తే పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయి. ఇవేవీ ఖాతరు చేయకుండా వచ్చిన విద్యార్థులు, యువకులు, మేధావులకు అభివాదం. గడిచిన మూడున్నరేళ్లలో ప్రత్యేక హోదా కోసం కలసికట్టుగా పోరాటం చేశాం. గుంటూరులో 9వ యువభేరి జరిగింది. ఆపై విద్యార్థులకు పరీక్షలు.. తర్వాత సెలవులు, సెప్టెంబర్‌ వరకూ అడ్మిషన్లు జరిగాయి. ఇప్పుడు అక్టోబర్‌లో పదవ యువభేరి నిర్వహిస్తున్నాం. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి ఉద్యమించాల్సింది పోయి విద్యార్థులపై కేసులు పెడతామని బెదిరించారు. మూడున్నరేళ్లలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్నాలు చేశాం. మంగళగిరిలో రెండు రోజులు, గుంటూరులో 7 రోజులు నిరవధిక నిరాహార దీక్షలు చేశాం. గుంటూరులో దీక్ష చేస్తున్న సమయంలో మోదీ విజయవాడకు వస్తున్నారు. కనీసం చంద్రబాబు ‘మా ప్రతిపక్ష నేత జగన్‌ నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోసం యువకులు ఆరాటపడుతున్నారు’ అని మోదీపై ఒత్తిడి తెస్తారని ఆశపడ్డాం.

కానీ పోలీసులను పంపి ప్రతిపక్ష నేత దీక్షను బలవంతంగా భగ్నం చేయించారు. కనీసం ఆ తర్వాతైనా మోదీని అడిగారా.. అంటే ఆ ఊసే ఎత్తలేదు. హోదా డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రం ప్రత్యేక హోదా కోరుకుంటోంది.. హోదా ఇవ్వండని మద్దతు ఇవ్వాల్సిందిపోయి, బంద్‌ రోజు బస్సులను తిప్పించి విఫలం చేసేందుకు ముఖ్యమంత్రి యత్నించారు. ఇవన్నీ అధిగమించాం. రాష్ట్రపతి, ప్రధానితో పాటు చాలా మందిని కలసి వినతి పత్రాలు ఇచ్చాం. ప్రతీ పార్లమెంట్, అసెంబ్లీ సమావేశంలోనూ ప్రత్యేక హోదా అంశంపై గట్టిగా పట్టుబట్టాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు గట్టిగా పోరాటం చేశారు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో కూడా ప్రత్యేక హోదాపై ప్రత్యేకంగా తీర్మానం చేశాం. మూడున్నరేళ్లుగా ఇంతగా ఉద్యమించినా.. ఈ అంశాన్ని పాలకులు పూర్తిగా పక్కన పెట్టారు. మన పాలకులకు చెవులు లేవు. వీరి వద్ద మరింత గట్టిగా నినదించాలి. ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఇందుకోసం అందరం ఏకం అవుదాం. మీ అందరి మద్దతుతో హోదా కోసం మరింతగా ఉద్యమిద్దాం. అవసరమైతే చివరి అస్త్రంగా ఎంపీల చేత రాజీనామా కూడా చేయిస్తాం.

హోదా వస్తేనే పరిశ్రమలు.. ఉద్యోగాలు
పార్లమెంట్‌ను సాక్షిగా చేస్తూ రాష్ట్రాన్ని విడగొట్టారు. ప్రతీ విద్యార్థి చదువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్లు పట్టుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళతారు. విభజనతో హైదరాబాద్‌ పోతోందని మనమందరం బాధపడ్డాం. ఈ క్రమంలో పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హోదాపై మాట ఇచ్చారు. ఆ మాటను నెరవేర్చండని అడుగుతున్నా.. పరిశ్రమ స్థాపించాలంటే 2 – 3 ఏళ్లు పడుతుంది. హోదా ఉంటేనే పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొస్తారు. హోదా ఉంటే పరిశ్రమలు, కాలేజీలు, ఆస్పత్రులు, హోటళ్లు స్థాపిస్తారు. చంద్రబాబు, జగన్‌లను చూసి పరిశ్రమలు రావు. ఇన్‌కం ట్యాక్స్, జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదంటేనే అంతా ముందుకు వస్తారు. ఆ రోజు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టి తప్పు చేసింది. ఈ తప్పు దిద్దుకునేందుకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.

ఐదేళ్లు సరిపోదు, పదేళ్లు హోదా ఇవ్వండని వెంకయ్యనాయుడు అడిగారు. బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని పొందుపరిచారు. అంతటితో ఆగలేదు. పదేళ్లు సరిపోదు, నేను ముఖ్యమంత్రిని అయితే 15 ఏళ్లు తెస్తా అని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలైపోయాయి. ప్రజలతో పని ముగిసింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అని అంటున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో పెద్దలుగా ఉన్నవారు పార్లమెంట్‌లో చేసిన చట్టాలను, హామీలను పట్టించుకోకపోతే ప్రజాస్వామ్యంలో ఎవరిని అడగాలని అడుగుతున్నా.

మీడియా బలంతో మభ్యపెడుతున్నారు
అవసరమైనప్పుడు వాడుకోవడం, అవసరం తీరిన తర్వాత వెన్నుపోటు పొడవటం చంద్రబాబు నైజం. రాష్ట్రం విడిపోయి అందరం ఇబ్బంది పడుతుంటే ప్రత్యేక హోదా తీసుకు రావడం ముఖ్యమంత్రి కనీస కర్తవ్యం. కానీ మన ఖర్మ ఏంటంటే ప్రత్యేక హోదా గురించి తెలిసినా, తన స్వార్థం కోసం చంద్రబాబు దానిని తాకట్టు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో హోదా కోసం పోరాటం సాగిస్తున్నాం. హోదాను తీసుకురాలేకపోవడానికి 14వ ఆర్థిక సంఘం కారణమని ఇటీవల కొత్తగా బాబు అబద్ధాలు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి హోదా లేదు కాబట్టి మనకూ ఇవ్వడం లేదని బొంకుతున్నారు. అంతటితో ఆగకుండా ప్రత్యేక హోదాకు మించి ప్రత్యేక ప్యాకేజీ తెప్పించాననీ బొంకుతున్నారు. ఈ రెండూ అబద్ధాలే.

ఇవాల్టికీ 11 రాష్ట్రాలకు హోదా ఉందనేది నిజం. మనకు మాత్రం ప్రత్యేక హోదా రాలేదు.. ఆ మేరకు ప్యాకేజీ రాలేదనేది నిజం. పార్లమెంట్‌ సాక్షిగా 2017 ఏప్రిల్‌లో వివేక్‌ గుప్తా ఓ ప్రశ్న (4393) వేశారు. కేంద్రం నుంచి ఏటా ఏ మేరకు రాష్ట్రాలకు నిధులు ఇచ్చారు..? మూడేళ్ల వివరాలు చెప్పండి? అని అడిగారు. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. 11 రాష్ట్రాలకు హోదా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాల్లో జనాభా 7.5 కోట్లు. దేశ జనాభా 121 కోట్లు. అంటే దేశ జనాభాలో 11 రాష్ట్రాల జనాభా 6.2 శాతం ఉంది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.9,42,745 కోట్లు ఇస్తే, 11 రాష్ట్రాలకు రూ.1,32,582 కోట్లు ఇచ్చారు. అంటే 6.2 శాతం జనాభా ఉన్న 11 రాష్ట్రాలకు 14.06 శాతం నిధులు ఇచ్చారు. ఆంధ్రరాష్ట్ర జనాభా 4.93 కోట్లు. అంటే 4.08 శాతం అన్నమాట’’. 

నాడు ఎవరేమన్నారో చూడండి..
యువభేరిలో ప్రత్యేక హోదా, ఎన్నికల హామీలపై జగన్‌ విద్యార్థులకు కొన్ని వీడియోలు చూపించారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో వెంకయ్యనాయుడు.. హోదా గురించి పార్లమెంట్‌లో మాట్లాడిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అని నరేంద్ర మోదీ తిరుపతి ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటల వీడియో చూపించారు. హోదా పదేళ్లు కాదు.. 15 ఏళ్లు కావాలని చంద్రబాబు అదే ఎన్నికల ప్రచారంలో చెప్పడం, ఎన్నికల తర్వాత పలు సందర్భాల్లో హోదా ఏమైనా సంజీవనా? అని మాట మార్చడం.. హోదా లేకుండా ప్యాకేజీ ఇస్తామన్నపుడు ఏది ఇస్తే అదే తీసుకోవాలని చెప్పిన దృశ్యాలను విద్యార్థులకు చూపించారు.

ఈ వీడియోలు చూసిన విద్యార్థులు సీఎం డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలపై.. చంద్రబాబు జనం సాక్షిగా ఇచ్చిన హామీల తాలూకు వీడియో క్లిప్పింగులను చూపించారు. ఆపై చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యాయా? అని జగన్‌ విద్యార్థులను ప్రశ్నించగా... అందుకు వారు లేదు.. లేదు.. అంటూ చేతులు ఊపి బదులిచ్చారు.

చంద్రబాబు, జగన్‌ను చూసి రాష్ట్రానికి పరిశ్రమలు రావు. హోదా వల్ల వచ్చే రాయితీలను చూసి పరిశ్రమలు వస్తాయి. అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగాలంటే హోదా తప్పనిసరి.

ప్రత్యేక హోదా కోసం ‘అనంత’తో కలిపి పది జిల్లాల్లో యువభేరీలు నిర్వహించాం. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులను పలుమార్లు కలసి విజ్ఞప్తి చేశాం. అయితే ఒక్క జగన్‌ మోహన్‌రెడ్డి వల్ల మాత్రమే ఇది సాధ్యం కాదు. మీ అందరి మద్దతుతోనే హోదా సాధ్యమవుతుంది.

హోదా ఉండి ఉంటే..
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల రూ.44,747 కోట్లు మాత్రమే ఇచ్చారు. హోదా ఉండి ఉంటే ఈ నిష్పత్తి మేరకు రూ.86,686 కోట్లు వచ్చేవి. ఆంధ్రకు ఈ నిష్పత్తి ఎందుకు వర్తించలేదనేందుకు కారణం హోదా లేకపోవడమే. ఈ క్రమంలో ఆంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారని చంద్రబాబు ఏరకంగా చెప్పగలుగుతున్నాడో అర్థం కావడం లేదు! ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలి అనేందుకు ఫార్మూలాలు లేవు. హోదా కలిగిన రాష్ట్రాలకు నిధులు ఎక్కువగా కేటాయించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా అయిపోయిన అంశమని తేలిగ్గా తీసుకుంటున్నారు. మరి నిధుల కేటాయింపుల్లో ఇంత తేడా ఎలా ఉంది? అని ప్రశ్నిస్తున్నా. ఉద్యోగాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.

122వ రాజ్యాంగ సవరణ ద్వారా జీఎస్టీ అమలులోకి వచ్చింది. ఇందులో ఆర్టికల్‌ 279, సెక్షన్‌(4), క్లాస్‌(జి).. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు జీఎస్టీలో ప్రత్యేక రాయితీలు ఉన్నాయని చెబుతోంది. హోదా ఉందనేందుకు ఇంతకంటే మరో ఉదాహరణ కావాలా? అని అడుతున్నా. ప్రధాన మంత్రి.. సవహజ్‌ బిజిల్‌ హర్దర్‌ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. కరెంటులేని ప్రతీ ఇంటికి కనెక్షన్‌ ఇస్తామని చెబుతున్నారు. ఇందులో కూడా మామూలు రాష్ట్రాలకు 60 శాతం నిధులు కేంద్రం ఇస్తుంటే, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 85 శాతం ఇస్తున్నారు. ఇంత ప్రయోజనం ఉన్నా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మీడియా బలంతో ప్రజలను మభ్యపెడుతోంది.

‘అనంత’లాంటి వెనుకబడిన ప్రాంతాలకు హోదా అవసరం 
అనంతపురం లాంటి జిల్లాకు హోదా చాలా అవసరం. రాజస్తాన్‌లోని జైసల్మీర్‌ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం. ఎక్కువ భాగం ఎడారిగా మారుతుందని అంతా భయపడుతున్నాం. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా అనంత. 19,130 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది. అత్యధికంగా ప్రజలు వలస పోతున్న జిల్లా కూడా ఇదే. ఏటా కనీసం 4 – 5 లక్షల మంది పంటలు పండక, ఉపాధి లేక, ఉద్యోగాలు రాక, అప్పులు తీర్చలేక వలసలు పోతున్నారు. చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న జిల్లాల్లో కూడా మొదటి స్థానంలో ఉంది. ఇలాంటి జిల్లాకు హోదా ఎంత అవసరమో చెప్పనవసరం లేదు. ఈ మూడున్నరేళ్లలో ఈ పాటికే హోదా ఇచ్చి ఉంటే పరిశ్రమలు, హోటళ్లు ఏర్పడి లక్షల ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా మా జిల్లాలోనే ఉద్యోగం దక్కుతుందనే భరోసా ప్రతి విద్యార్థికీ ఉండేది.

ఈ మూడున్నరేళ్లలో అబద్దాలు చెప్పారు.. మోసం చేశారు.. అసెంబ్లీలో 2014 సెప్టెంబర్‌లో ‘అనంత’ అభివృద్ధికి ముఖ్యమంత్రి పలు హామీలు ఇచ్చారు. మూడున్నరేళ్ల తర్వాత వీటిలో ఏ ఒక్కటైనా అమలైందా? అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. చంద్రబాబు ఇచ్చిన హామీలు చదువుతాను.. అమలైందో లేదో మీరే చెప్పండి. సెంట్రల్‌ యూనివర్సిటీ.. రాలేదు(విద్యార్థుల సమాధానం), ఎయిమ్స్‌ అనుబంధ కేంద్రం.. రాలేదు (విద్యార్థుల సమాధానం), నూతన పారిశ్రామికనగరం.. రాలేదు (విద్యార్థుల సమాధానం), బెంగళూరు–చెన్నై కారిడార్‌.. లేదు..లేదు.. (విద్యార్థుల సమాధానం), టెక్స్‌టైల్‌ పార్క్‌..    రాలేదు.. (విద్యార్థుల సమాధానం), ఫుడ్‌ పార్క్‌.. రాలేదు.. (విద్యార్థుల సమాధానం), ఎలక్ట్రానిక్, హార్డ్‌ వేర్‌ క్లస్టర్‌.. రాలేదు..(విద్యార్థుల సమాధానం), భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. లేదు.. లేదు.. (విద్యార్థుల సమాధానం), పుట్టపర్తిని ఆధ్యాత్మిక నగరంగా తీర్చిదిద్దుతాం.. ఒక్క నిర్మాణం చేపట్టలేదు(విద్యార్థుల సమాధానం), పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మతుల కేంద్రం.. లేదు.. లేదు..(విద్యార్థుల సమాధానం), కుద్రేముఖ్‌ ఇనుప పిల్లెట్ల పరిశ్రమ.. రాలేదు..(విద్యార్థుల సమాధానం),  హంద్రీ – నీవాను పూర్తి చేస్తాం.. 2012లో పూర్తయిన ఫేజ్‌–1 పిల్ల కాలువలు కూడా పూర్తి చేయలేదు(విద్యార్థుల సమాధానం).

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top