నేను విన్నాను.. నేను ఉన్నాను

YS Jagan Assurance to the public for those who are looking about govt help - Sakshi

3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు విన్నా.. కళ్లారా చూశా..  

ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి నేనున్నాను  

మన ప్రభుత్వం వచ్చాక అవినీతికి తావులేని, కులపిచ్చిలేని పరిపాలన అందిస్తాం  

ప్రతి కుటుంబాన్ని, ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాం   

శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం.. 

జలయజ్ఞంతో ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తాం.. 

ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం  

ప్రతి ఏటా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ 

మన ప్రభుత్వం వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకుందాం  

వ్యవస్థలో మార్పు కోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలి  

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తనకు భరోసా కల్పించుకునేందుకు బాబు వాడుకుంటున్నాడు  

చిన్నాన్న హత్యలో బాబు పాత్ర లేకపోతే సీబీఐ విచారణకు ఆదేశించరెందుకు?  

అవినీతికి తావులేని పాలన, కులపిచ్చి లేని పాలన అందిస్తాం. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై లేకుండా చూస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం.
– వైఎస్‌ జగన్‌

‘రైతు భరోసా’ కింద అక్షరాలా రూ.50,000 ఇస్తాడని ప్రతి రైతన్నకూ చెప్పండి. ప్రతి సంవత్సరం రూ.12,500 మే నెలలో ప్రతి రైతు చేతికి ఇస్తాడని చెప్పండి. పెట్టుబడుల కోసం సాయం చేస్తాడు, పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాడని చెప్పండి. అంతేకాదు ధాన్యానికి బోనస్‌ కూడా ఇస్తాడని తెలియజేయండి.

చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పాలన చూశాం, ఇప్పుడు జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దామని చెప్పండి. రాజన్న పాలనను జగనన్న మళ్లీ తీసుకొస్తాడని చెప్పండి. మన బతుకులను అన్న మారుస్తాడని అందరికీ చెప్పండి.

పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై లేకుండా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో ఫొటోలు తీస్తాం. రెండేళ్లలో వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ఫొటోలు తీస్తాం. రెండింటి మధ్య తేడా ఏంటో మీకే చూపిస్తాం.

సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి, కాకినాడ/ అమలాపురం:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నం, విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని డెంకాడ, తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో రోడ్‌షోలు నిర్వహించారు. అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. అధికారంలోకి వచ్చాక తామేం చేస్తామో వివరించారు. వ్యవస్థలో మార్పు కోసం ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలను విన్నానని, కళ్లారా చూశానని చెప్పారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ‘మీకు నేనున్నా’ అని జగన్‌ హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతికి తావులేని స్వచ్ఛమైన పాలన అందిస్తామని పునరుద్ఘాటించారు. తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో చంద్రబాబు తప్పు లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని నిలదీశారు. మూడు సభల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే...  

మా చిన్నాన్నను పోగొట్టుకున్నా.. 
ఎన్నికల్లో మా పార్టీకి ఓటు వేయండి అని కోరడానికి ముందు.. అధికారంలోకి వచ్చాక మేము ఏం చేస్తామో చెబుతాను. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతికి తావులేని పరిపాలన అందిస్తామని హామీ ఇస్తున్నా. కుల పిచ్చి లేని పరిపాలన అందిస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. మా చిన్నాన్నను పోగొట్టుకున్నా. ఇసుక మాఫియాను అడ్డుకున్న మహిళా తహసీల్దార్‌ను జట్టు పట్టుకుని ఈడ్చేసిన ఎమ్మెల్యేల అరాచకాన్ని మనం చూశాం. మా చిన్నాన్న వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారు. మన ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై లేకుండా చేస్తాం.

ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉన్నాయో ఫొటోలు తీస్తాం. రెండేళ్లలో వాటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి, ఫొటోలు తీస్తాం. రెండింటి మధ్య తేడా ఏంటో మీకే చూపిస్తాం. వైద్యం కోసం కుటుంబాలపై పడుతున్న భారాన్ని పూర్తిగా తొలగిస్తాం. వైద్యం కోసం ఆస్తులమ్ముకునే పరిస్థితి లేకుండా చేసి తీరుతామని హామీ ఇస్తున్నా. వ్యవసాయాన్ని మళ్లీ పండుగలా మారుస్తాం. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తాం. పెట్టుబడుల కోసం ఉచితంగా సాయం అందిస్తాం. ఈ మేరకు ప్రతి రైతన్నకూ భరోసా ఇస్తున్నా. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీల కుటుంబాలకు ఒక మాట ఇస్తున్నా. నాకు ఐదేళ్లు గడువు ఇవ్వండి. ప్రతి కుటుంబాన్ని లక్షాధికారులుగా చేస్తాను. ఐదేళ్లు గడువు ఇవ్వండి ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తానని హామీ ఇస్తున్నా. చదువుకున్న ప్రతి నిరుద్యోగికీ ఇవాళ చెబుతున్నా.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే భర్తీ చేస్తాం. ప్రతి ఏటా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తాం.  

భూరికార్డులను ప్రక్షాళన చేస్తాం..  
ప్రతి సంక్షేమ పథకం ప్రతి పేదవాడికీ అందాలి. ఈ విషయంలో కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు, పార్టీలు చూడం. అందరికీ న్యాయం చేస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే జన్మభూమి కమిటీలను రద్దు చేస్తాం. మీ భూములు, ఇళ్లు, ఆస్తులను ఎవరూ ఆక్రమించుకోకుండా చట్టంలో మార్పులు తీసుకొస్తాం. ఇవాళ వెబ్‌ల్యాండ్‌ పుణ్యమా అని రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు వెళితే లంచాలు ఇస్తే గానీ పనులు జరగడం లేదు. అక్రమాలకు తావులేకుండా భూరికార్డులను ప్రక్షాళన చేస్తాం. 

మట్టి, ఇసుక, గనులను దోచుకున్నారు 
కురుక్షేత్రంలో చివరి ఘట్టానికొచ్చాం. చంద్రబాబు నాయుడి ఐదేళ్ల పరిపాలన చూశారు. అధికారం కోసం హామీలిచ్చి, కుర్చీ ఎక్కాక ఎలా మోసం చేస్తారనేది చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు విజయనగరం జిల్లాకు ఎన్నో హామీలిచ్చారు. ఇందులో ఎన్ని అమలయ్యాయో మీరే చెప్పండి. విజయనగరం పట్టణాన్ని స్మార్ట్‌ సిటీ చేస్తారట, జిల్లాలో మెడికల్‌ కాలేజీ పెడతారట, ఫుడ్‌పార్కు స్థాపిస్తారట, గిరిజన యూనివర్సిటీ నెలకొల్పుతారట.. అవి ఎక్కడైనా కనిపించాయా అని అడుగుతున్నా. (లేదు లేదు అంటూ జనం సమాధానం) గోస్తని–చంపావతి, నాగావళి–వేగవతి నదులను అనుసంధానిస్తానన్నారు. వెంగళరాయసాగర్, వట్టిగెడ్డ ఆధునీకరణ చేస్తామన్నారు. దాంతోపాటు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తానన్నారు. పెందుర్తి–అరకు రోడ్డును నాలుగు వరుసలుగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు చెప్పారు.

ఇవేవీ అమలు కాలేదు. కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక విజయనగరం, రాజాం, బొబ్బిలి, నెల్లిమర్లలో ఉన్న జ్యూట్‌మిల్లులు మాత్రం మూతబడ్డాయి. చంద్రబాబు పుణ్యాన ఫెర్రోఅల్లాయిస్‌ కంపెనీలు వరుసగా మూతపడుతున్నాయి. భీమసింగి చక్కెర కర్మాగారాన్ని రూ.48 కోట్ల నష్టాల్లోకి ముంచేశారు. మట్టి, ఇసుక, గనులను విచ్చలవిడిగా దోచుకున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టును కూడా వదలకుండా నాశనం చేశారు. ఇదే జిల్లాలోఎయిర్‌పోర్టు వస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూశారు. తనకు లంచాలు ఇవ్వరని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియాకు దక్కిన టెండర్‌ను చంద్రబాబు రద్దు చేశాడు. 

ఎవరికి భరోసా ఇచ్చావు బాబూ!  
ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు ఎవరికి భరోసా ఇచ్చాడో చెప్పాలి. పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా తన హెరిటేజ్‌ కంపెనీ కోసం రైతన్నల ప్రయోజనాలను పణంగా పెట్టిన చంద్రబాబు ఎవరికి భరోసా కల్పించాడో చెప్పాలి. ప్రతి ఉద్యోగికి ఉద్యోగం ఇస్తానన్నాడు, ఒకవేళ ఇవ్వలేకపోతే నెలు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తానన్నాడు. చంద్రబాబు 60 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంటే ప్రతి నిరుద్యోగికి భృతి కింద రూ.1.20 లక్షలు అందాలి. ఆ సొమ్ము ఎవరికి ఇచ్చాడో చెప్పాలని చంద్రబాబును డిమాండ్‌ చేస్తున్నా.  

రాజ్యాంగానికి తూట్లు పొడిచాడు  
చంద్రబాబు అబద్ధాలు చెబుతాడు, మోసాలు చేస్తాడు. మనుషులను తానే చంపిస్తాడు, ఎదుటివారిపై నేరం మోపుతాడు. ఇలాంటి చంద్రబాబుకు నిన్న ఆయన భార్య దిష్టి తీశారు. పత్రికల్లో ఆ ఫొటో చూసి ఆశ్చర్యపోయా. చంద్రబాబుకు పట్టిన దిష్టిని ఆయన భార్య తీశారు. కానీ, ఈ రాష్ట్రానికి చంద్రబాబు వల్ల పట్టిన దిష్టి రాష్ట్రంలో ఉన్న అన్ని కొబ్బరికాయలు కలిపినా, అన్ని గుమ్మడికాయలు కలిపినా, అన్ని నిమ్మకాయలు కలిపినా పోదు. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలను చూస్తే ఆయన మనిషేనా అనిపిస్తుంది. పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నాడు. ఐదేళ్లుగా ప్రజలను మోసం చేశాడు. విచ్చలవిడిగా అవినీతి, అన్యాయాలు చేశాడు. రాజ్యాంగానికి తూట్లు పొడిచాడు. వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేశాడు. సిగ్గు లేకుండా అందులో కొందరికి మంత్రి పదవులిచ్చాడు.  

‘సిట్‌ అంటే సిట్, స్టాండ్‌ అంటే స్టాండ్‌’  
అధికారంలోకి రావడానికి చంద్రబాబు దొంగ ఓట్లను చేర్పిస్తాడు, ఉన్న ఓట్లను తొలగింపజేస్తాడు. తానే హత్యలు చేయిస్తాడు, ఆధారాలు లేకుండా చేయడానికి ‘సిట్‌’ అనే దర్యాప్తు బృందాన్నినియమిస్తాడు. తాను సిట్‌ అంటే సిట్, స్టాండ్‌ అంటే స్టాండ్‌ అయ్యే బృందాన్ని ఏర్పాటు చేస్తాడు. చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నా. అయ్యా చంద్రబాబూ.. మా చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో నువ్వు ఏ తప్పూ చేయకపోతే, నీలో కల్మషం లేకపోతే సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు?   

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకే దిక్కు లేదు  
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తూర్పు గోదావరి జిల్లాకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. వాటిలో ఒక్కటైనా అమలైందో లేదో ప్రజలే చెప్పాలి. కాకినాడ,రాజమండ్రిని స్మార్ట్‌సిటీగా మారుస్తానన్నారు. అది నెరవేరిందా? (లేదు లేదు అంటూ జనం కేకలు) పెట్రోలియం యూనివర్సిటీ అన్నారు, పెట్రోలియం కారిడార్‌ అన్నారు. కాకినాడలో ఎన్‌ఎంజీ టెర్మినల్, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం అన్నారు. కొత్తగా ఇంకొక పోర్టు అన్నారు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ పార్కు అన్నారు. ఇవన్నీ ఎక్కడైనా మీకు కనిపించాయా? తెలుగు విశ్వవిద్యాలయం, కోనసీమకు కొబ్బరి పీచు ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేస్తానన్నారు. ఎక్కడైనా కనిపించాయా? అని అడుగుతున్నా. ఫుడ్‌పార్కు, ఆక్వా కల్చర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌.. ఇలా చాలా కథలు చెప్పాడు చంద్రబాబు. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలకే దిక్కూ దివాణం లేకుండా పోయిందంటే చంద్రబాబు చిత్తశుద్ధి ఏపాటిదో ప్రజలు అర్థం చేసుకోవచ్చు. అవినీతితో ఇన్నాళ్లూ సంపాదించిన సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేయడానికి చంద్రబాబు సిద్ధమయ్యాడు. చంద్రబాబు చెప్పే కబుర్లు నమ్మితే, ఆయన ఇచ్చే సొమ్ముకు ఆశపడితే అధోగతి తప్పదు.  

మోసగాళ్లను బంగాళాఖాతంలో కలిపేయాలి  
చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత, విలువలు అనే పదాలకు అర్థం రావాలి. అది జరగాలంటే అబద్ధాలు చెప్పేవాళ్లను, మోసం చేసే వాళ్లను బంగాళాఖాతంలో కలిపేసే పరిస్థితి రావాలి. వ్యవస్థలో మార్పు కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నా.  పండుల రవీంద్రబాబు ఎంపీ పదవిని వదిలేసి, మన పార్టీలోకి వచ్చారు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు న్యాయం చేస్తాం. జిల్లా నుంచి మొట్టమొదటి ఎమ్మెల్సీగా రవీంద్రబాబునే తీసుకొస్తానని మాట ఇస్తున్నా’’ అని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

ప్రతి కుటుంబం బాధలు విన్నా..
సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజల కష్టాలను విన్నాను, కళ్లారా చూశాను. ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల ఆవేదన విన్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల కష్టాలను స్వయంగా చూశా. ‘108’ ఫోన్‌ కొడితే కుయ్‌ కుయ్‌ కుయ్‌ అంటూ రావాల్సిన అంబులెన్స్‌ రాకపోవడాన్ని చూశా. వైద్యం కోసం ఆస్తులమ్ముకుంటున్న కుటుంబాలను చూశా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతను చూశా. ఉద్యోగం ఇవ్వలేకపోతే రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పి పాలకులు చేసిన మోసాన్ని చూశా. ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు, వేరే దేశాలకు వలస వెళుతున్న మన యువతను చూశా. గుక్కెడు తాగునీటి కోసం ఆలమటిస్తున్న గ్రామాలను చూశా. గ్రామాల్లో మద్యం బెల్టు దుకాణాల ఆగడాలు చూశా. మద్యం మహమ్మారి వల్ల కుటుంబాల్లో అక్కచెల్లెమ్మలు పడుతున్న అవస్థలను గమనించా.  రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఏమనుకుంటోందో విన్నాను. పంటలకు గిట్టుబాటు ధర లేక, రుణమాఫీ కాక మన రైతన్నలు ఎదుర్కొంటున్న బాధల గురించి తెలుసుకున్నా. ఐదేళ్లు కరువు వచ్చినా పట్టించుకోని ప్రభుత్వాన్ని మనం చూశాం. ప్రజల కష్టాలను లెక్కచేయని ప్రభుత్వాన్ని చూశాం. సమస్యల సుడిగుండంలో చిక్కుకుని, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికీ  ఈ వేదిక పైనుంచి ఒక మాట ఇస్తున్నా. మీకు నేనున్నా.  

ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం.. 
గ్రామ సచివాలయాలను తీసుకొస్తాం. చదువుకున్న 10 మంది పిల్లలకు మీ గ్రామంలోనే ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. మీ అందరి దీవెనలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కూడా సాధించుకుందాం. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా మొట్టమొదటి చట్టసభలోనే చట్టం చేస్తాం. నీటి కొరతను అధిగమించడానికి ఐదేళ్లలో సాగునీరు తీసుకొస్తాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడానికి జలయజ్ఞానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం.  

బాబుకు బుద్ధొచ్చేలా తీర్పు ఇవ్వాలి  
ఎన్టీఆర్‌ నుంచి పార్టీని, పదవిని చంద్రబాబు లాక్కున్నాడు. చివరకు ఆయనకు కూడా భద్రత ఇవ్వలేకపోయాడు. గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాలు పెట్టాడు. ఐదేళ్లలో లంచగొండి పాలనతో గ్రామాల్లో ఎవరికి భద్రత కల్పించాడో చెప్పాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకానికి భరోసా లేదు, ఆరోగ్యశ్రీ పథకానికి, ‘108’ పథకానికి భరోసా లేదు. ఏ ఒక్క సంక్షేమ పథకానికైనా భరోసా ఉందా? అని ప్రజల తరపున చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తనకు భరోసా కల్పించుకునేందుకు వాడుకుంటున్నాడు. ఇలాంటి నాయకుడి వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అని ప్రజలు ఆలోచించాలి. మాట తప్పని, మడమ తిప్పని వాడే నాయకుడవుతాడు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడనివాడే నాయకుడు. ఈ విషయం చంద్రబాబుకు అర్థమయ్యేలా, బుద్ధి వచ్చేలా తీర్పు ఇవ్వాలని ప్రజలను కోరుతున్నా. 

ఆడపిల్లల ఫోన్‌ నంబర్లతో బాబుకేం పని?
ఈ ఎన్నికల్లో ‘మీ భవిష్యత్తు– నా బాధ్యత’ అనేది చంద్రబాబు నినాదమట! ఐదేళ్ల తర్వాత బాబు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. మీరు ఒప్పుకుంటారా? (ఒప్పుకోం అంటూ జనం సమాధానం) ప్రజల భవిష్యత్తు తన బాధ్యత అంటున్న చంద్రబాబు నాయుడు నిజంగా చేసింది ఏమిటో తెలుసా? దొంగ సర్వేల పేరుతో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించాడు. కుటుంబాల్లోని ఆడపిల్లల వివరాలు, వారి ఫోన్‌ నంబర్లను తీసుకున్నాడు. అవన్నీ తెలుగుదేశం పార్టీకి చెందిన సేవామిత్ర అనే యాప్‌లో నమోదు చేశాడు. జన్మభూమి కమిటీల్లో సభ్యులుగా ఉన్న టీడీపీ నాయకులకు ఈ వివరాలన్నీ చేరవేస్తున్నాడు. ప్రజల ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలను టీడీపీ నాయకుల చేతిలో పెట్టాడు.

ఆడపిల్లల ఫోన్‌ నెంబర్లను కూడా అందజేస్తున్నాడు. ఆడపిల్లల వ్యక్తిగత వివరాలను మరొకరికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబును అడుగుతున్నా. మహిళలకు భద్రత కల్పిస్తానని చంద్రబాబు కబుర్లు చెబుతున్నాడు. భద్రత కల్పించడం అంటే మహిళల వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడమేనా? ఈ ఐదేళ్లలో ఎప్పుడు భద్రత, భరోసా కల్పించాడో చెప్పాలి. కాల్‌మనీ–సెక్స్‌ రాకెట్‌ కేసులో దొరికిపోయిన టీడీపీ నాయకులను అరెస్టు చేయకుండా చంద్రబాబు భద్రత కల్పించాడు. మహిళా ఎమ్మార్వో వనజాక్షిని జట్టు పట్టుకుని ఈడ్చుకుపోయిన చింతమనేని ప్రభాకర్‌ అనే టీడీపీ ఎమ్మెల్యేకు రక్షణ కల్పించాడు.  

రాజన్న పాలనను జగనన్న తీసుకొస్తాడని చెప్పండి  
మనం చంద్రబాబు నాయుడు అనే జిత్తులమారి నక్కతో పోరాటం చేస్తున్నామనే విషయం మర్చిపోవద్దు. అబద్ధాలు, మోసాలు వారికి అలవాటు. ఎన్నికలు వచ్చేసరికి గ్రామాలకు మూటల కొద్దీ డబ్బులు పంపిస్తారు. వారి(టీడీపీ పెద్దలు) దగ్గర అవినీతితో సంపాదించిన సొమ్ము చాలా ఉంది. గ్రామాలకు డబ్బుల మూటలు పంపించి, ప్రజల చేతిలో రూ.3,000 చొప్పున పెట్టి ప్రలోభాలకు గురిచేస్తారు. చంద్రబాబు ఇచ్చే సొమ్ముకు ఆశపడి మోసపోవద్దని మీరు ప్రతి ఒక్కరికీ చెప్పండి. రేపు మన ప్రభుత్వం వస్తుంది.
- అన్న ముఖ్యమంత్రి అయ్యాక మన పిల్లలను బడికి పంపిస్తే చాలు సంవత్సరానికి రూ.15,000 ఇస్తాడని ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి చెప్పండి. మన పిల్లల చదువులకు ఎన్ని రూ.లక్షలైనా ఫర్వాలేదు, అన్న చదివిస్తాడని చెప్పండి.
‘వైఎస్సార్‌ చేయూత’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడని చెప్పండి. ఈ కార్యక్రమం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చేతిలో రూ.75,000 పెడతాడని చెప్పండి. చంద్రబాబుకు ఐదేళ్లు అధికారం ఇస్తే అడ్డగోలుగా మోసం చేశాడని పొదుపు సంఘాల మహిళలకు గుర్తుచేయండి. 
అన్న ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల నాటి వరకు వారికి ఎంతైతే అప్పు ఉందో ఆ సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతికే ఇస్తాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీ రుణాలు ఇప్పిస్తాడని చెప్పండి. అక్కచెల్లెమ్మలు బ్యాంకుల వద్దకు గర్వంగా వెళ్లే పరిస్థితి తీసుకొస్తాడని చెప్పండి. 
అన్న ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్‌ను రూ.3,000 దాకా పెంచుకుంటూ పోతాడని అవ్వాతాతలకు చెప్పండి. మనం ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లండి. నవరత్నాలతో మన జీవితాలు బాగుపడతాయని వివరించండి. 
ఎండమావులను చూసి మోసపోవద్దని చెప్పండి. చంద్రబాబు చెప్పే మాటలను నమ్మొద్దని సూచించండి. చంద్రబాబు ఐదేళ్ల పాలన చూశాం, ఇప్పుడు జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దామని చెప్పండి. రాజన్న పాలనను జగనన్న మళ్లీ తీసుకొస్తాడని చెప్పండి. మన బతుకులను అన్న మారుస్తాడని అందరికీ చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నవి రెండు పార్టీల మధ్య ఎన్నికలు కాదు. ధర్మానికి, అధర్మానికి మధ్య.. విశ్వసనీయతకు, వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మీ అందరి ఆశీస్సులు, దీవెనలు కావాలని కోరుతున్నా. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top