చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ సవాల్‌

YS Jagan Asks TDP To Resign For Loksabha on Demand of Special Status - Sakshi

రేణమాల(ఉదయగిరి నియోజకవర్గం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలసి నడిచేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందా? అని ప్రశ్నించారు. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణమాల గ్రామంలో ఏర్పాటు చేసిన మహిళల ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా ఓ యువతి ప్రత్యేక హోదాపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్‌కు ఊపిరని, హోదా సాధించేవరకూ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ(వైఎస్‌ఆర్‌ సీపీ) విశ్రమించబోదని అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మార్చి 5 నుంచి జరగనున్న బడ్జెట్‌ సమావేశాల్లో హోదా కోసం పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారని చెప్పారు. ఏప్రిల్‌ 6 వరకూ(బడ్జెట్‌ సమావేశాలు ముగుస్తాయి) పోరాటం చేసినా ఫలితం లేకపోతే పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని తెలిపారు.

వైఎస్‌ఆర్‌ సీపీ కి చెందిన ప్రతి ఒక్కరూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద మార్చి 1న ధర్నా నిర్వహిస్తారని చెప్పారు. మార్చి 3న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లు పాదయాత్ర జరుగుతున్న ప్రదేశానికి వస్తారని, అక్కడి నుంచి తాను వారందరినీ జెండా ఊపి ఢిల్లీకి పంపుతానని వివరించారు. ప్రత్యేక హోదా మన హక్కు.. ప్రత్యేక ప్యాకేజి మాకొద్దు అనే నినాదంతో మార్చి 5న పార్లమెంటు వద్ద పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేస్తారని చెప్పారు. ఏప్రిల్‌ 6 వరకూ హోదా కోసం పోరాటం చేస్తారని, ఫలితం లేకపోతే చివరి రోజైన ఏప్రిల్‌ 6న లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేసి రాష్ట్రానికి తిరిగి వస్తారని వివరించారు.

ప్యాకేజితో సరిపెడామనుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలు రాజీనామా చేయడం వల్ల ప్రత్యేక హోదాపై మన ఆరాటాన్ని కేంద్రానికి స్పష్టంగా చెప్పొచ్చని అన్నారు. ప్రత్యేక హోదా ఏపీ ఊపిరని దాని కోసం పార్టీ పోరాటం ఆగదని పునరుద్ఘాటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top