విశ్వాసపరీక్షలో ‘యెడ్డీ’ విజయం

Yediyurappa passes floor test, speaker Ramesh Kumar resigns - Sakshi

మూజువాణి ఓటుతో విశ్వాస తీర్మానానికి ఆమోదం

ప్రతీకార రాజకీయాలు చేయకుండా పనిచేస్తానన్న సీఎం యడియూరప్ప

బలపరీక్ష పూర్తైన వెంటనే స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ రాజీనామా

సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో గత నెల రోజులుగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. విధానసౌధలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప విజయం సాధించారు. అసెంబ్లీ ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే సీఎం యడియూరప్ప ‘నా నేతృత్వంలోని మంత్రివర్గంపై ఈ సభ విశ్వాసం ఉంచుతోంది’ అనే ఏకవాక్య తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ..‘నేను ప్రతీకార రాజకీయాల జోలికిపోను.  కాంగ్రెస్‌–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వ హయాంలో పాలనా యంత్రాంగం నిర్వీర్యమైంది. దీన్ని చక్కదిద్దడమే మా తొలి ప్రాధాన్యత’ అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌–జేడీఎస్‌ సభ్యులు డివిజన్‌ కోరకపోవడంతో విశ్వాసతీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందిందని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు. స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ ఆదివారం కాంగ్రెస్‌–జేడీఎస్‌లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసిన విషయం తెలిసిందే.

ఇది అనైతిక ప్రభుత్వం..
విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా సీఎల్పీ నేత సిద్దరామయ్య ముఖ్యమంత్రి యడియూరప్పపై నిప్పులు చెరిగారు. ‘యడియూరప్ప నేతృత్వంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అనైతిక పద్ధతుల్లో ప్రభుత్వం ఏర్పడింది. ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేదు. కేవలం 105 మంది ఎమ్మెల్యేలతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా పదవీకాలాన్ని పూర్తిచేసుకోవాలని నేను కోరుకుంటున్నా. కానీ మీరెంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూద్దాం!’ అని సిద్దరామయ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం హెచ్‌.డి.కుమారస్వామి మాట్లాడుతూ..‘మీరు(బీజేపీ) కుట్రలు పన్ని అధికారంలోకి వచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన పనులు, ఈ రాజకీయాలు చరిత్రలో నిలిచిపోతాయి’ అని వ్యంగ్యంగా అన్నారు. విశ్వాసఘట్టం ముగిసిన నేపథ్యంలో మంత్రివర్గ ఏర్పాటుపై దృష్టిసారిస్తామని బీజేపీ నేత సురేశ్‌ కుమార్‌ తెలిపారు.

స్పీకర్‌ రాజీనామా..
అసెంబ్లీలో విశ్వాసతీర్మానం ఆమోదం పొందినవెంటనే తాను స్పీకర్‌ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు రమేశ్‌ కుమార్‌ ప్రకటించారు.‘రాజ్యాంగాన్ని అనుసరించి మనస్సాక్షి ప్రకారం విధుల్ని నిర్వర్తించాను. స్పీకర్‌ కుర్చీ గౌరవాన్ని కాపాడేందుకు శాయశక్తులా కృషిచేశాను. ప్రజలు మీకు(యడియూరప్ప) రెండో అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో సుపరిపానలతో మీదైన ముద్ర వేయండి’ అని తెలిపారు. అనంతరం తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌ కృష్ణారెడ్డికి అందించి సభనుంచి నిష్క్రమించారు. అంతకుముందు  ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ఖర్చులకు ఉద్దేశించిన ఆర్థికబిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top