నువ్వెంతంటే నువ్వెంత..

On Women*s Day Celebrations TDP Women Activists Quarreled In Party Office - Sakshi

టీడీపీ జిల్లా కార్యాలయంలో రచ్చ..రచ్చ

ఒంగోలు నగర కమిటీ వర్సెస్‌ జిల్లా మహిళా కమిటీ

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి వారిచ్చిన గౌరవం

సాక్షి, ఒంగోలు సబర్బన్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మహిళా విభాగం నాయకులు రచ్చ రచ్చ చేసుకున్నారు. ఒంగోలు నగర టీడీపీ మహిళా విభాగం, జిల్లా మహిళా విభాగం నాయకురాళ్ల మధ్య చోటుచేసుకున్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఈ రచ్చకు  జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్‌టీఆర్‌ భవన్‌ వేదిక కావటం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. సాక్షాత్తు కార్యాలయంలోనే దూషణల పర్వానికి దిగిన మహిళా నాయకురాళ్లు నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ నోరు హద్దులు దాటేలా పారేసుకున్నారు. ఇది ఒకరకంగా చెప్పాలంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్‌ అనుచరులు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనుచరుల మధ్య వివాదంగా మారింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల గొప్పతనాన్ని.. వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించేందుకు చేపట్టాల్సిన వేడుకలో తెలుగు మహిళల దూషణలతో మహిళల ఆత్మగౌరవాన్ని మంటల్లో కలిపారని అక్కడికి వచ్చినవారే విమర్శించటం గమనార్హం.

అసలేం జరిగిందంటే..

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని ఒంగోలు నగర పార్టీ అధ్యక్షురాలు ఆర్ల వెంకట రత్నం ఉదయం జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆమెతో పాటు ఆరిగ శైలజ, రెడ్డమ్మలతో పాటు పలువురు కార్యాలయానికి చేరుకున్నారు. కాలాతీతం కావటంతో జిల్లా కమిటీ నాయకురాళ్లు ఎవరూ రాకపోవటంతో ఆలస్యమవుతుందని నగర కమిటీ అధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నంతో పాటు పలువురు కేక్‌ కట్‌ చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం పూర్తి కాగానే జిల్లా కమిటీ అధ్యక్షురాలు రావుల పద్మజ. జిల్లా కార్యదర్శి లక్ష్మీ పద్మజతో పాటు తమ్మినేని మాధవిలతో పాటు పలువురు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే కేక్‌ కట్‌ చేయటం పూర్తి కావటంతో ఆర్ల వెంకటరత్నం బృందంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదికాస్తా చిలికి చిలికి గాలివానలా తయారైంది. చివరకు దూషణల పర్వానికి చేరింది. జిల్లా టీడీపీ కార్యాలయంలో రచ్చ...రచ్చ అయింది. ఈ పంచాయితీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ వద్దకు పంచాయితీ చేరింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top