బై ఎలక్షన్‌.. ఎవరికి టెన్షన్‌?

Widespread discussion on Nalgonda and Alampur by-election - Sakshi

     నల్లగొండ, అలంపూర్‌ ఉప ఎన్నికలపై సర్వత్రా చర్చ

     ఎన్నికలొస్తే ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠ

     ఎన్నికల ఏడాది కావడంతో టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకం

     దక్షిణాన కాంగ్రెస్‌తో ‘ఢీ’ ఆషామాషీ కాదంటున్న విశ్లేషకులు

     అధికార టీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్‌లకు జీవన్మరణ సమస్య

     తెలుగుదేశం, బీజేపీలది నామమాత్రపు పోటీనే!

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ, అలంపూర్‌ శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలొస్తాయా? ఆ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుని ఎన్నికల నోటిఫికేషన్‌ ఇస్తే ఎవరు గెలుస్తారు? అధికార టీఆర్‌ఎస్‌ గెలిస్తే పరిస్థితేంటి? ప్రతిపక్ష కాంగ్రెస్‌ గెలిస్తే ఏమవుతుంది? 2019 ఎన్నికలపై ఈ ఫలితాల ప్రభావం ఎంతమేరకు ఉంటుంది? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు హాట్‌టాపిక్‌.. రాష్ట్రంలోని ఏ నలుగురు కలసినా ఇదే చర్చ.. 

ఎన్నికలొస్తే ఏమవుతుంది?
అధికార పక్షం దూకుడు చూస్తుంటే ఉప ఎన్నికలొస్తాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఎన్నిలొస్తే అధికార, విపక్షాలు రెండింటికీ జీవన్మరణ సమస్యేనని విశ్లేషకులు అంటున్నారు. 2014 ఎన్నికల్లో పరాభవం పొందిన కాంగ్రెస్‌.. ఈ ఉప ఎన్నికల్లో ఓడితే కోలుకోవడం కష్టమేనని, తన రాజకీయ చతురతతో కాంగ్రెస్‌ను కేసీఆర్‌ చావుదెబ్బ తీయడం ఖాయమని చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌కు తొలి నుంచీ అండగా ఉన్న దక్షిణ తెలంగాణలో ఆ పార్టీని ఢీకొట్టడం టీఆర్‌ఎస్‌కు అంత సులువు కాదనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఉప ఎన్నికలు జరిగితే ప్రజల్లో ఉండే వ్యతిరేకత కూడా కాంగ్రెస్‌కు తోడవుతుందనే అంచనాలు కూడా లేకపోలేదు. ఒకవేళ టీఆర్‌ఎస్‌ ఓడితే ఆ పార్టీకీ పెద్ద దెబ్బ తగిలినట్టేనని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయం కోసం కేసీఆర్‌కు అష్టకష్టాలు తప్పవంటున్నారు. 

టీడీపీ, బీజేపీ నామమాత్రమే!
అధికార, విపక్షాలకు తోడు ఈ ఉప ఎన్నికల్లో ఇతర రాజకీయ పక్షాల ప్రభావం ఎలా ఉంటుందనే అంశపైనా చర్చ జరుగుతోంది. టీడీపీ, బీజేపీలు పోటీలో ఉంటాయా.. ఉండవా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ బరిలో నిలిచినా పోటీ నామ మాత్రమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప ఎన్నికలు జరిగే రెండు స్థానాల్లోనూ టీడీపీ, బీజేపీలు పెద్దగా ప్రభావం చూపిందేమీ లేదని రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలే అమీతుమీ తేల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

అధికార పక్షం వ్యూహమేంటి? 
ఉప ఎన్నికలకు సిద్ధపడే టీఆర్‌ఎస్‌ దూకుడుగా వెళ్తోందని, ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు చేసి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల ఖాళీని నోటిఫై చేయాలని ఎన్నికల కమిషన్‌కు సిఫారసు కూడా చేసిందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిగా మారింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు పట్టుకొమ్మ లాంటి నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో గెలిస్తే కాంగ్రెస్‌ కుంభస్థలాన్ని కొట్టినట్లేనన్న అంచనాతోనే టీఆర్‌ఎస్‌ ముందుకెళుతోందన్న చర్చ జరుగుతోంది. దీనిపై టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఒకరు మాట్లాడుతూ.. జానా, ఉత్తమ్, కోమటిరెడ్డి, డి.కె.అరుణ లాంటి కాంగ్రెస్‌ దిగ్గజాలకు ఒకేసారి చెక్‌ పెట్టినట్లవుతుందని, ఒక్క దెబ్బకు ఐదారు పిట్టలు కొట్టాలనే వ్యూహంతోనే తమ అధినేత పావులు కదుపుతున్నారని చెప్పడం గమనార్హం. ఎన్నికల్లో ప్రతికూల ఫలితమొచ్చినా సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం కూడా తేలుతుందని ఆ నేత అభిప్రాయపడటం టీఆర్‌ఎస్‌ ముందస్తు ప్రణాళికను స్పష్టం చేస్తోంది.

కాంగ్రెస్‌ ఏమనుకుంటోంది? 
ఉప ఎన్నికలపై కాంగ్రెస్‌ కూడా రకరకాల విశ్లేషణలు చేసుకుంటోంది. తమకు ఆయువుపట్టయిన నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జరిగే ఉప ఎన్నికలలో ఓడితే పరిస్థితి ఏంటని అంతర్గతంగా చర్చలు జోరుగా జరుగుతున్నాయి. ఉప ఎన్నికలు అధికార టీఆర్‌ఎస్‌కు కలసి వస్తాయని, ఎంతటి పట్టున్నా టీఆర్‌ఎస్‌ జోరును అడ్డుకోవడం కష్టమన్న వాదనను ఆ పార్టీ నేతలూ అంగీకరిస్తున్నారు. కానీ దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌కు ఉన్న కేడరే శ్రీరామరక్ష అని ఆ పార్టీ నేతలంటున్నారు. కోమటిరెడ్డి చరిష్మాకు తోడు అలంపూర్‌లో డి.కె.అరుణ సహకరిస్తే సంపత్‌ గెలుపు నల్లేరు మీద నడకేనని చెబుతున్నారు. ఉప ఎన్నికల వ్యూహంపై పీసీసీ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘గెలిస్తే మాకు మంచి ఊపొస్తుంది. సార్వత్రిక ఎన్నికలను స్వీప్‌ చేస్తాం. ఓడితే అధికార పార్టీ కాబట్టి గెలిచిందని చెప్పుకునే వెసులుబాటు ఉంటుంది’అని వ్యాఖ్యానించడం గమనార్హం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top