ఒకవేళ నరేంద్ర మోదీ ఓడిపోతే...!

What if Narendra Modi Loses? - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఒకవేళ ఈ లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓడిపోతే! అంటే బీజేపీ పార్టీకి అధికారం సిద్ధించకపోతే! అందుకు అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ హంగ్‌ పార్లమెంట్‌ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ వార్తలు వెలువడుతున్న నేటి పరిస్థితుల్లో ఏమైనా జరగవచ్చు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాలను చూసుకోవాల్సిన అవసరం ఉందంటూ భారతీయ జనతా పార్టీ నాయకుడు రాంమాధవ్‌ మాట్లాడం కూడా అదే విషయాన్ని సూచిస్తోంది. అందుకు సూచనగా స్టాక్‌ మార్కెట్‌ కూడా మందగమనంతో నడుస్తోంది. సట్టా మార్కెట్‌ (బెట్టింగ్‌ మార్కెట్‌) నీరసపడింది. మోదీపై ఉత్సాహంగా బెట్టింగ్‌లు కాచేందుకు సిద్ధంగా లేదు. 200 సీట్లు దక్కించుకొని కూడా బీజేపీ మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అప్పుడు ఆరెస్సెస్‌ అధినాయకుల సూచనలకు తలొగ్గినట్లు మిత్రపక్షాల సూచనలకు తలొగ్గాల్సి వస్తుంది. అప్పుడు తమదే నైతిక విజయం అంటూ విపక్షాలు జబ్బలు చరచూకోవచ్చు.

బీజేపీ 175 సీట్లకు పరిమితపై లోక్‌సభలో అత్యధిక సీట్లను సాధించిన పార్టీగా ఆవిర్భవించినట్లయితే నరేంద్ర ప్రధాని అయ్యే అవకాశాలు ఉండవు. తెరమీదకు మరో అభ్యర్థి రావచ్చు. ఏది ఏమైనా ఈ పరిణామాలు భారతీయ ఆర్థిక మార్కిట్‌కు శుభసూచకం కావు. స్టాక్‌ మార్కెట్‌ పడిపోయి లావాదేవీలు కూడా నిలిచిపోవచ్చు. మోదీ అభిమాన పెట్టుబడుదారులు నీరసపడొచ్చు. అయితే ఆ తర్వాత వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్‌ కోలుకొని సాధారణ పరిస్థితులు ఏర్పడవచ్చు. 2004లో అదే జరిగింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వాన్ని పడగొట్టి యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాడు మార్కెట్‌ 20 శాతం నష్టపోయింది. మళ్లీ ఆ ఏడాది డిసెంబర్‌ నెల నాటికి స్టాక్‌ మార్కెట్‌ కోలుకొని గాడిన పడింది.
 
వాస్తవానికి చెప్పాలంటే దేశ ఆర్థిక మార్కెట్ల కోసం నరేంద్ర మోదీ చేసిందీ ఏమీలేదు. ఆయన తిరిగి అధికారంలోకి వచ్చినా, నిష్క్రమించినా మార్కెట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే సెంటిమెంట్‌ దెబ్బతింటుంది కనుక కొన్ని రోజులు మార్కెట్‌ మందగమనంతో సాగవచ్చు. తర్వాత కోల్కోవచ్చు. ఆర్థిక రంగంలో అద్భుతాలు సృష్టిస్తానని మోదీ చెప్పారు. కానీ ఏమీ చేయలేక పోయారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు ఆయన్ని పెద్ద దెబ్బ తీసింది. రేపు ఎవరు ప్రధాని అయినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అత్యవసరంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎన్నో చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. మున్నెన్నడు లేనివిధంగా నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టి పీడిస్తోంది. వ్యవసాయ సంక్షోభం, పెట్టుబడుల స్తంభన, స్తంభించి పోయిన పారిశ్రామిక ఉత్పాదకత. వీటితో పాటు ప్రభుత్వ అస్థిరత సమస్య. ఏ పార్టీకి సంపూర్జ మెజారిటీ రాకుండా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినట్లయితే అస్థిరత సమస్య ఉంటుంది. అది ఎప్పుడు ఎలా ఉంటుందనేది ఇప్పుడే ఊహించలేం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top