రాష్ట్ర భద్రతా సలహాదారు పోస్టు.. దుమారం

West Bengal Gets A State Security Adviser Post - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో మొట్టమొదటిసారిగా రాష్ట్ర భద్రతా సలహాదారు (స్టేట్‌ సెక్యూరిటీ అడ్వయిజర్‌.. ఎస్‌ఎస్‌ఏ)ను నియమించడం రాజకీయంగా దుమారం రేపుతోంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ నెల 23న ఈ పదవిని సృష్టించింది. గురువారం బెంగాల్‌ డీజీపీగా రిటైర్‌ కాబోతున్న సురజిత్‌ కౌర్‌ పురకాయస్త రేపు (శుక్రవారం) మొదటి ఎస్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. గతంలో కోల్‌కతా పోలీసు కమిషనర్‌గా పనిచేసిన ఆయనను మమత ఎస్‌ఎస్‌ఏగా నియమించిన విషయం తెలిసిందే.

అయితే, ఈ నియామకంపై బీజేపీ భగ్గుమంటోంది. ‘ఎవరి భధ్రత కోసం ఆయన సలహాలు ఇస్తారా? మమతా బెనర్జీ భద్రతకా? లేక ప్రజల రక్షణకా? డీజీపీగా పంచాయతీ ఎన్నికల్లో ఆయన ప్రజలకు ఏ మేరకు భద్రత కల్పించారో మనమంతా చూశాం’ అని బీజేపీ బెంగాల్‌ నేత రాహుల్‌ సిన్హా విమర్శించారు. హోంమంత్రిగా మమత వైఫల్యం చెందడం వల్లే పురకాయస్త కోసం ఎస్‌ఎస్‌ఏ పోస్టును సృష్టించారని ఆయన మండిపడ్డారు. సీఎం ​మమత వద్దే రాష్ట్ర హోంశాఖ, ఇన్‌చార్జ్‌  ఆఫ్‌ పోలీసుశాఖలు ఉన్నాయి.  పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించలేని డీజీపీకి ఈ పదవితో ప్రమోషన్‌ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. తృణమూల్‌ ప్రభుత్వం సిగ్గుపడే రీతిలో కుట్రలకు పాల్పడుతోందని అన్నారు. కేంద్రంలో జాతీయ భద్రతా సలహాదారు ఉంటారని, ఎస్‌ఎస్‌ఏను నియమించడం ద్వారా ప్రధాని కావాలన్న కలను నెరవేర్చుకున్నట్టు మమత సంబరపడుతున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top