బాబు హయాంలో ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం 

Weak economy in the reign of Chandrababu - Sakshi

చట్ట పరిధిని దాటి అప్పులు చేశాడు 

ఇదేనా 40 ఏళ్ల అనుభవం? 

పది రోజుల్లో ఫలితాలొస్తుంటే..మంత్రివర్గ సమావేశం ఎందుకు! 

ఎమ్మెల్యే గడికోట ఆగ్రహం 

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో అస్తవ్యస్తంగా తయారయ్యిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.  తన స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని, టీడీపీని ఈ ఎన్నికల్లో గట్టెక్కించడం కోసం, తన వాళ్లకు లబ్ధి చేకూర్చి అవినీతిమయం చేశారని విమర్శించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని, ఇప్పటికీ మూడున్నర లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. పది రోజుల్లో ఫలితాలుంటే మంత్రివర్గ సమావేశం ఎందుకని ప్రశ్నించారు. ఎలాగూ తాను అధికారంలోకి రానని గ్రహించిన చంద్రబాబు అడ్డగోలుగా తన వాళ్లకు బిల్లులు చెల్లించడానికే మంత్రివర్గ సమావేశం నాటకం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పరిస్థితి చూసి ఏప్రిల్‌ 16వతేదీన సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఒక సమీక్ష చేశారని, కొన్ని ప్రాధాన్యత బిల్లులు, అత్యవసర బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ‘సీఎస్‌ సమీక్షిస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటి? సీఎఫ్‌ఎంఎస్‌లో చంద్రబాబు ఇన్వాల్వ్‌మెంట్‌ ఏంటి? సీఎఫ్‌ఎంఎస్‌ను నాశనం చేసిన చంద్రబాబు చెల్లించాల్సిన బిల్లులు చూస్తే రూ.43 వేల కోట్లకు పైగా ఉన్నాయి. ఖజానాలో మాత్రం రూ.9,000 కోట్లు మాత్రమే ఉన్నట్లు సీఎస్‌ తెలియజేశారు’ అని గడికోట అన్నారు. గతంలో సీఎఫ్‌ఎంఎస్‌ (సెంట్రలైజ్‌ ఫండ్స్‌ మేనేజ్మెంట్‌ సిస్టం) ప్రవేశపెట్టారని, దానిని పనిచేయకుండా చంద్రబాబు అడ్డగోలుగా జోక్యం చేసుకోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని గడికోట విమర్శించారు.  

సీఎఫ్‌ఎంఎస్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ప్రైవేటు వ్యక్తులకా? 
ఫైనాన్స్‌ సెక్రటరీ వద్ద మాత్రమే సీఎఫ్‌ఎంఎస్‌ లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఉండాలనీ, కానీ సీఎఫ్‌ఎంఎస్‌ సంస్థకు తనకు అనుకూలమైన వ్యక్తిని సీఈవోగా నియమించి లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ వివరాలు ఇచ్చారన్నారు. తద్వారా నిధులు వివిధ రూపాల్లో మళ్లించారన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ వ్యవస్థను  పూర్తిగా అవినీతిమయం చేశారని,  కొందరు కాంట్రాక్టు ఉద్యోగులకు రెండుసార్లు రూ.200 కోట్లు చెల్లించారని అన్నారు. దీనిపై తాము నిలదీస్తే ఆ నిధులను వెనక్కితెచ్చారన్నారు. పోలవరం విహార యాత్రల పేరుతో, ఆయన అధర్మపోరాట దీక్షకు  ఆర్టీసీ బస్సుల్లో జనాన్ని తరలించారని అన్నారు.  రాబోయే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల గౌరవాన్ని కాపాడుతుందని  శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top