ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాం

We will support the Muslim minorities says YS Jagan - Sakshi

ఆత్మీయ సమ్మేళనంలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ హామీ 

దుల్హన్‌ పథకం కింద యువతులకు రూ. లక్ష ఇస్తాం 

ఇస్లామిక్‌ బ్యాంకు ఏర్పాటుతో ఆర్థికంగా తోడుంటాం   

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి :  రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను అన్ని విధాలా ఆదుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని ప్రతిపక్ష నేత, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 82వ రోజు బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1100 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించిన ఆయన ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గంలోని హసనాపురం వద్ద జరిగిన ముస్లింల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మైనారిటీలకు చేసిన మోసాలను ఎండగట్టారు. ‘చంద్రబాబు తన రాజకీయాల కోసం ఏమైనా చేస్తారు. ఎంతటి హామీలైనా ఇస్తారు. ఆ తర్వాత వాటిని మరచిపోతారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ గాలి విపరీతంగా వీస్తోందనుకుంటే మైనార్టీలను చంద్రబాబు పూర్తిగా మరచిపోతారు. మోదీ గాలి తగ్గిందంటే మళ్లీ ఆయనకు మైనార్టీలు గుర్తుకు వస్తారు’ అని విమర్శించారు. ఈ సమ్మేళనంలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ఒక్కరికైనా రుణం ఇచ్చారా? 
‘‘ముస్లిం నిరుద్యోగ యువకులకు రూ.5 లక్షలు రుణ సౌకర్యం కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్కరికైనా రుణం ఇచ్చారా? పేద, మధ్య తరగతి ముస్లింలకు రూ. లక్ష మేరకు వడ్డీలేని రుణాలు ఇస్తానన్నారు. అవీ ఇవ్వలేదు. ఇస్లామిక్‌ బ్యాంకును ఏర్పాటు చేసి రూ.50 వేల వరకూ సబ్సిడీతో రుణాలిస్తానని చెప్పారు. ఇస్లామిక్‌ బ్యాంకును స్థాపించారా? ఎక్కడైనా ఒక్కరికైనా రుణం ఇచ్చారా? కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అన్నారు.

అమలు జరుగుతోందా? నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మోసాలు, అబద్ధాలే చోటు చేసుకున్నాయి. రోజుకు రెండుసార్లు మీడియా ముందుకు వచ్చి గంటలు గంటలు మాట్లాడి బోర్‌ కొట్టించే ముఖ్యమంత్రి.. కేంద్రం బడ్జెట్‌ పెట్టి ఐదు రోజులైనా మీడియా ముందుకు రాలేదు. కానీ తాను చిటపటలాడుతున్నట్లు తనకు అనుకూలమైన మీడియాలో లీకులు ఇస్తున్నారు. టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉంటున్న కేంద్ర క్యాబినెట్‌లో ఆమోదించిన తర్వాతే బడ్జెట్‌ పార్లమెంటుకు వస్తుంది. మరి చంద్రబాబుకు తెలియకుండా బడ్జెట్‌ ప్రవేశ పెట్టారా? ఆయనకు తెలియకుండానే అన్యాయం జరిగిందా? ఇప్పటికి నాలుగు బడ్జెట్‌లు ఇలాగే ప్రవేశ పెట్టారు. అయితే ఒక్క ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయి కనుక నెపాన్ని ఎవరిమీదనో ఒకరి మీద నెట్టాలి కనుక కేంద్రంపై వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. 

దుల్హన్‌ పథకం కింద రూ. లక్ష  
పేద ముస్లిం యువతులకు పెళ్లి చేసేటపుడు దుల్హన్‌ పథకం కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.50 వేల స్థానంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లక్ష రూపాయలు ఇస్తాం. (ప్రస్తుతం ఈ పథకం కింద రూ.50 వేలు ఇస్తున్నారని, అది కూడా సక్రమంగా అమలు జరగడం లేదని, కమీషన్లు తీసుకుంటున్నారని ఓ ముస్లిం సోదరుడు జగన్‌ దృష్టికి తెచ్చినపుడు ఆయన ఇలా స్పందించారు.) ఈ మొత్తాన్ని వధువు తల్లిదండ్రులకు పెళ్లికి ముందే అందేలా ఏర్పాట్లు చేస్తాం. ఇస్లామిక్‌ బ్యాంకునూ ఏర్పాటు చేసి ఆర్థికంగా తోడుంటాం’’ అని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top