విశ్వ విఖ్యాత విజయనగరి

Vizianagaram District Special Story - Sakshi

సాంస్కృతిక, రాజకీయ చైతన్యం

ఆది నుంచీ రాజరికపు ఆనవాళ్లు

బ్రిటిష్‌ పరిపాలనలో కొన్నాళ్లు

2008లో నియోజకవర్గాల పునర్విభజన

ప్రధాన పార్టీలు వైఎస్సార్‌ కాంగ్రెస్, టీడీపీ

విశ్వ పటంపై చెక్కు చెదరని స్థానం. చరిత్ర పుటల్లో చిరస్మరణీయ జ్ఞాపకం. విశ్వఖ్యాతినార్జించిన మహానుభావుల నిలయం.. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే విజయనగరం జిల్లా విభిన్నం.. విలక్షణం.. ఎందరో ప్రజా ప్రతినిధులు కేంద్ర పదవుల్ని అలంకరించారు. మరెందరో కవులు, రచయితలు, కళాకారులు, విద్యావేత్తలు దేశ విదేశాల్లో ఖ్యాతినార్జించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, సందర్శనీయ, చారిత్రక ప్రదేశాలు ఈ జిల్లాలో అనేకం ఉన్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీరణ జరిగి విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ప్రస్తుతం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాజకీయంగా జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీలే ప్రధాన ప్రత్యర్థులు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల శంఖారావం మోగిన తరుణంలో విజయనగరం జిల్లా విశిష్టతపై కథనమిది.

సాక్షి ప్రతినిధి, విజయనగరం :క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నాటికే కటక్‌ నుంచి పిఠాపురం వరకూ విస్తరించిన కళింగ రాజ్యంలో అంతర్భాగంగా ఉండే విజయనగర ప్రాంతం బలమైన నాగరికత పునాదులపై నిర్మితమైంది. 1565లో తళ్లికోట యుద్ధంతో గోల్కొండ నవాబుల ఏలుబడిలోకి వెళ్లింది. ఫౌజిదారుల కాలంలోనే విజయనగరం, బొబ్బిలి సంస్థానాలు పుట్టుకొచ్చాయి. నిజాం మరణం తర్వాత ఫ్రెంచ్‌ సేనాని బుస్సీ సాయంతో సలాబత్‌జంగ్‌ అధికారంలోకి వచ్చాడు. దానికి ప్రతిగా శ్రీకాకుళం నుంచి కొండపల్లి సర్కారు వరకూ నాలుగు సర్కార్లను ఫ్రెంచ్‌ వారు రాయించుకున్నారు. కానీ తర్వాత ఈ ప్రాంతమంతా తూర్పు ఇండియా వర్తక సంఘం ద్వారా ఆంగ్లేయుల వశమైంది. 1757, జనవరి 24న జరిగిన బొబ్బిలి యుద్ధం చరిత్రలో నేటికీ ఓ సంచలనం. ఈ యుద్ధం తర్వాత మొదలైన చిన విజయరామరాజు పాలనపై ఈస్ట్‌ ఇండియా కంపెనీ పెత్తనం చెలాయించింది. దానికి ఆయన ఎదురు తిరిగారు. 1794లో తిరుగుబావుటా ఎగురవేశారు. అదే పద్మనాభ యుద్ధం. ఈ యుద్ధంలో విజయనగర రాజులు ప్రాణాలు వదిలారు. కానీ మద్రాసు అప్పటి గవర్నర్‌ విజయనగరం కోటను చిన విజయరామరాజు తనయుడు గజపతికి అప్పగించారు.

జిల్లా ఆవిర్భావం
జాతీయోధ్యమ కాలంలోనే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలనే డిమాండ్‌ ఉండేది. కానీ ఆంగ్ల పాలకులు దానిని పట్టించుకోలేదు. దీంతో 1979 వరకూ విశాఖ జిల్లాలో అంతర్భాగంగానే ఉండిపోయింది. 1979, జూన్‌ 1వ తేదీన విజయనగరం జిల్లా ఏర్పడింది. జిల్లా విజయనగరం, పార్వతీపురం డివిజన్లుగా విభజించి ఉంది. 34 రెవెన్యూ మండలాలు, 12 పట్టణాలు, 1524 గ్రామాలున్న విజయనగరం జిల్లాలో ఐటీడీఏ సబ్‌ ప్లాన్‌లోని ఎనిమిది మండలాలను కలుపుకొని జియ్యమ్మ వలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, పార్వతీపురం, గరుగుబిల్లి, మక్కువ, పాచిపెంట, సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి, సీతానగరం, బలిజిపేట, బాడంగి, తెర్లాం మండలాలు పార్వతీపురం డివిజన్‌లో ఉన్నాయి. ఈ 15 మండలాలు కురుపాం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి నియోజకవర్గాల పరిధిలోకి వస్తున్నాయి. మిగిలిన పదకొండు మండలాలు విజయనగరం డివిజన్‌లో ఉన్నాయి.

రాజకీయ ప్రాతినిధ్యం
రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో విజయనగరం ఒకటి. 2008 పునర్‌ వ్యవస్థీకరణ తరువాత ఇది కొత్తగా ఏర్పడింది. తొలి ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి 2009లో ఎన్నికయ్యారు. 2014 నుంచి పూసపాటి అశోక్‌గజపతిరాజు విజయనగరం టీడీపీ ఎంపీగా ఉన్నారు. భోగాపురం నియోజకవర్గం ఉండేది. కానీ 2008 పునర్‌ వ్యవస్థీకరణ తర్వాత భోగాపురం, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ మండలాలను కలిపి నెల్లిమర్ల నియోజకవర్గంగా ఏర్పాటు చేశారు. నెల్లిమర్లకు టీడీపీకి చెందిన పతివాడ నారాయణస్వామి నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరం నియోజకవర్గానికి మీసాల గీత, చీపురుపల్లికి కిమిడి మృణాళిని, గజపతినగరానికి కేఏ నాయుడు, పార్వతీపురానికి బొబ్బిలి చిరంజీవులు, శృంగవరపుకోటకు కోళ్ల లలితకుమారి టీడీపీ నుంచి, కురుపాం నియోజకవర్గానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పాముల పుష్పశ్రీవాణి, బొబ్బిలి నియోజకవర్గానికి వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన సుజయకృష్ణ రంగారావు, సాలూరు నియోజకవర్గానికి వైఎస్సార్‌ సీపీకి చెందిన పీడిక రాజన్నదొర ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్సీలుగా ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి, విశాఖ బీజేపీ ఎంపీగా కంభంపాటి హరిబాబు, అరకు ఎంపీగా వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన కొత్తపల్లి గీత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కురుపాం, సాలూరు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వేషన్‌ కాగా, పార్వతీపురాన్ని ఎస్సీలకు కేటాయించారు.

జిల్లాలో 2304 పోలింగ్‌ కేంద్రాలు
విజయనగరం గంటస్తంభం: 2019 పార్లమెంటు, శాసనసభ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 2304 పోలింగు కేంద్రాలు గుర్తించారు. ఇప్పటికే ఈ పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. విద్యుత్, మరుగుదొడ్లు సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులు వెళ్లే విధంగా ర్యాంపులను ఏర్పాటు చేశారు. మొత్తంగా సౌకర్యాలు చూస్తే 92 పోలింగు కేంద్రాల్లో మరుగుదొడ్లు మినహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ తెలిపారు.  

సమస్యాత్మక గ్రామాలు
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు జిల్లాలో ఉన్న 2304 పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితిని పోలీసులు అంచనా వేశారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మక, సున్నిత, సాధారణ పరిస్థితులున్న గ్రామాలను పోలీసు అధికారులు గుర్తించారు. జిల్లాలో మొత్తం గ్రామాల్లో 842 సాధారణ పరిస్థితులున్న గ్రామాలుగా గుర్తించగా 650 సమస్యాత్మక, 89 అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్టు ఎస్పీ దామోదర తెలిపారు.

మూడు చోట్ల లెక్కింపు
ఎన్నికల నిర్వహణలో భాగంగా లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందులో 18 కేంద్రాలను గుర్తించారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో అసెంబ్లీతోపాటు పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ కూడా జరగనుంది. తొమ్మిది అసెంబ్లీ స్థానాల అభ్యర్థులతో పాటు ఆయా పరిధిలో పార్లమెంటు అభ్యర్థి ఓట్లను కూడా లెక్కించాల్సి ఉంది. ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు లెక్కింపు కేంద్రాల చొప్పున 18 కేంద్రాలను గుర్తించారు. జేఎన్‌టీయూ, ఎంవీజీఆర్, లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలను ఇందుకు గుర్తించారు.

ఈవీఎంలు సిద్ధం
ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ ఓటింగు యంత్రాలు(ఈవీఎం), వీవీ ప్యాడ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు ఎన్నికల సంఘం బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాడ్లను పంపించింది. వాటిని అధికారులు ఫస్ట్‌ లెవెల్‌ చెక్‌ చేసి గోదాముల్లో భద్రపరిచారు. మరికొన్ని రావలసి ఉంది. పోలింగ్‌కు ముందు వాటిని నియోజకవర్గ కేంద్రాలకు పంపిస్తారు. అక్కడి నుంచి పోలింగ్‌ కేంద్రాలకు పటిష్ట బందోబస్తు మధ్య పంపిస్తారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top