ఇక్కడ ఎవరు గెలిస్తే.. ఆ పార్టీకే పగ్గాలు

Visakhapatnam South Constituency Sentiment Story - Sakshi

సెంట్‌మెంట్‌

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఓ సెంటిమెంట్‌ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందితే కచ్చితంగా ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది. పునర్విభజనకు ముందున్న విశాఖ–1 నియోజకవర్గం నుంచి ఈ సెంటిమెంట్‌ కొనసాగుతూ వస్తోంది. పేరు మారిన తర్వాత అదే పంథాలో సాగుతోంది. నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరూ ప్రతిపక్షంలో కూర్చోకపోవడం రికార్డు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత 1983 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గ్రంధి మాధవి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అల్లు భానుమతి టీడీపీ అభ్యర్థిగా రగంలోకి దిగి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.
1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఒకటో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఈటి విజయలక్ష్మి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పుడు అదే పార్టీ అధికారంలోకి వచ్చింది.
1994లో జరిగిన ఎన్నికల్లో ఎస్‌.ఏ.రహ్మన్‌ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కుదుర్చుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో దిగింది. పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది.
2004 ఎన్నికల్లో ద్రోణంరాజు సత్యనారాయణ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.
2005 డిసెంబరులో అనారోగ్యంతో ద్రోణంరాజు సత్యనారాయణ మృతిచెందారు. దీంతో 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ద్రోణంరాజు శ్రీనివాస్‌ గెలుపొందారు.
2009 ఎన్నికల ముందు జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో విశాఖ ఒకటో నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి అధికారంలోకి రాగా దక్షిణ నియోజకవర్గం నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్‌ రెండోసారి విజయం సాధించారు. దీంతో ఇక్కడి నుంచి రెండసార్లు విజయం సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా ఆయన రికార్డు నెలకొల్పారు.

రాష్ట్ర విభజన తర్వాత..
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్‌కుమార్‌ ప్రస్తుతం శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ అభ్యర్థి ఈ నియోజకవర్గంలో గెలుస్తారన్న సెంటిమెంట్‌ కొనసాగుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top