టీడీపీది ముగిసిన చరిత్ర

Vijayasai Reddy fires on Chandrababu and Pawan Kalyan - Sakshi

భవిష్యత్తు లేదని చంద్రబాబే టీడీపీ గొంతు నులిమేస్తున్నాడు

బీజేపీలో కలిపి ఖతం చేసే పనిలో ఉన్నాడు 

చంద్రబాబుపై ధ్వజమెత్తిన విజయసాయిరెడ్డి  

సాక్షి, విశాఖపట్నం/తగరపువలస (భీమిలి): రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీది ముగిసిన చరిత్ర అని, ఇక ఆ పార్టీకి భవిష్యత్తు లేదని రాజ్యసభ సభ్యుడు, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని వివిధ వార్డుల్లో అభివృద్ధి పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే చిట్టివలసలో జరిగిన మరో కార్యక్రమంలో డ్వాక్రా మహిళలకు రుణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ఎక్కడ శిక్ష అనుభవించాల్సి వస్తుందోనని భయపడి.. తన పార్టీ నేతలను కేంద్రంలో ఉన్న పార్టీలోకి పంపిస్తున్నారని విమర్శించారు.

ఆ రకంగా తెలుగుదేశం పార్టీ గొంతు నులిమేస్తున్నాడని, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పార్టీని మట్టుబెడుతున్నాడని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయోగించిన రామబాణానికి చంద్రబాబు ఐదు నెలల క్రితమే నేలకూలాడని విజయసాయిరెడ్డి అన్నారు. మంచి పాలన చూసి రాష్ట్ర ప్రజలందరూ హర్షం వ్యక్తంచేస్తుంటే ఒక ముసలి నక్క, ఆయన కొడుకు ఓ యువ నక్కకి మాత్రమే కడుపు మండుతోందని ధ్వజమెత్తారు. ఆ నక్క ఎవరో కాదని.. గత ఐదేళ్లలో కీచకుడిలా రాష్ట్ర ప్రజలను పీడించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు. రైతును ఆదుకునే విషయంలో ఎక్కడా వెనుకంజ వేయకుండా రైతన్ననే రాజులా చూస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో 20–25 సంవత్సరాల పాటు కొనసాగేలా భగవంతుని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు.

బాబు దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌.. 
చంద్రబాబుకి సొంత పుత్రుడు లోకేష్‌ అయితే.. దత్త పుత్రుడు పవన్‌ కల్యాణ్‌ అని విజయసాయిరెడ్డి అన్నారు. సొంత పుత్రుడు ఒక్క స్థానంలో మంగళగిరిలో ఓడిపోతే.. దత్తపుత్రుడు రెండు స్థానాల్లో పరాజయం పొందాడని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నా«ద్, గొల్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top