‘హోదా’.. ఏపీకి జీవన్మరణ సమస్యే

Vijaya Sai Reddy On Special Status In Rajya Sabha - Sakshi

బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ దారుణంగా మోసం చేశాయి 

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అని రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి గళమెత్తారు. ఏపీకి సంజీవని అయిన హోదా విషయంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్‌ ప్రజలను దారుణంగా మోసం చేశాయని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ అంశం ప్రజాకోర్టులో ఉందని.. హోదా విషయంలో మోసం చేసిన పార్టీ లకు రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. విభజన జరిగినప్పుటి నుంచి వైఎస్సార్‌సీపీ మాత్రమే హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తోందని గుర్తుచేశారు. హోదా ఏపీకి సంజీవని అన్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ బలంగా విశ్వసించిందని, ఏపీ సీఎం చంద్రబాబు హోదా ఏమైనా సంజీవనా? అంటూ ఎగతాళి చేశారని విమర్శించారు.

ఎందుకు అమలు చేయలేదు
మే 26, 2014లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం.. అంతకుముందు మార్చి 2, 2014న గత యూపీఏ కేబినెట్‌లో ఆమోదించిన ప్రత్యేక హోదా అమలు తీర్మానాన్ని ఏ అధికారంతో అమలు చేయలేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. డిసెంబర్‌ 31, 2014 వరకు అప్పటి ప్రణాళికా సంఘం కొనసాగుతున్నా ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ‘హోదా’అమలు చేయలేదని నిలదీశారు. పార్టీలు అధికారంలోకి వస్తుంటాయ్, పోతుంటాయ్‌.. కానీ, ప్రభుత్వాలు శాశ్వతమని, గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను నేటి ప్రభుత్వాలు అమలుచేసి గౌరవించాలన్నారు.

14వ ఆర్థిక సంఘం చెప్పిందన్న సాకుతో ఏపీకి హోదా అమలు చేయకపోవడం దారుణమని, అసలు ప్రత్యేక హోదా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదన్నారు. ప్రత్యేక హోదాపై తన ప్రసంగానికి పదేపదే అడ్డుతగిలిన టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌పై విజయసాయిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘నీవు మాట్లాడేటప్పుడు నేను ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఇప్పుడు నేను మాట్లాడేది నువ్వు విను. నువ్వేంటో నాకు తెలుసు’ అంటూ ఆయన మండిపడ్డారు.

రాజ్యసభ నుంచి వైఎస్సార్‌సీపీ వాకౌట్‌ 
రాజ్యసభలో మంగళవారం జరిగిన స్వల్పకాలిక చర్చలో తమకు తగినంత సమయం కేటాయించలేదని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు తాము ప్రయత్నించగా సమయం ఇవ్వలేదని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. సుజనా చౌదరికి అర గంట, సీఎం రమేశ్‌కు పావుగంట సమయం ఇచ్చారని, తమకు కేటాయించిన ఏడు నిమిషాల్లో తొలి రెండు నిమిషాలు సభ ఆర్డర్‌లోనే లేదని, నాలుగు నిమిషాలకే మైక్‌ కట్‌ చేశారని ఆరోపించారు.

ఈ సమయంలో రాజ్యసభ ఛైర్మన్‌ స్పందిస్తూ ‘‘సభలో సభ్యుల సంఖ్యను బట్టి అవకాశం ఉంటుంది. టీఆర్‌ఎస్‌ సభ్యుల సంఖ్య ఎంత? టీడీపీ సభ్యుల సంఖ్య ఎంత? వైఎస్సార్‌సీపీ సభ్యుల సంఖ్య ఎంత? విజయసాయిరెడ్డి తన స్థానానికి వెళ్లాలి. లేదంటే సస్పెండ్‌ చేయాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నారు. తనను సస్పెండ్‌ చేసినా పర్లేదని, చైర్మన్‌ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇవేవీ రికార్డుల్లో నమోదు కావని చైర్మన్‌ పేర్కొన్నారు. దాంతో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సభ నుంచి వాకౌట్‌ చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top