40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఈవెంట్ మేనేజర్‌గానే సక్సెస్!

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu Through Twitte - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ.. కేవలం ఈవెంట్‌ మేనేజర్‌గా మాత్రమే సక్సెస్‌ అయ్యాడని చంద్రబాబునుద్దేశించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. విలువలు కలిగిన రాజనీతిజ్ణుడు కాలేకపోయాడని విమర్శించారు. ఓడినా గెలిచాననే పిడివాదం.. దానికి కులమీడియా వంత పాడటం.. ప్రజలు మూకమ్మడిగా ఈసడించుకున్నా ఈవీఎంలపై ఏడవడం.. ఈ నలబై రోజులన్నా ఆపద్ధర్మ సీఎంగా పదవిని ఆస్వాదించామని సూచించారు. ఆదివారం ట్విటర్‌ వేదికగా చంద్రబాబు తీరుపై ఆయన ధ్వజమెత్తారు. దేశమంతా ఎన్నికల మూడ్‌లో ఉంటే ఓట్లు రాలని చంద్రబాబు.. ఈసీ మీద ఫిర్యాదులంటూ ఢిల్లీ వెళ్లి పరువు తీసుకుంటున్నారన్నారు. 80 శాతం పోలింగ్ జరిగితే మిషన్లు పనిచేయలేదని అనడంలో లాజిక్ అర్థం కాక ఈయనతో అంటకాగిన నాయకులు కూడా తల పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈ బురద తమకెక్కడ పూస్తాడోనని చంద్రబాబును అంతా దూరం పెట్టారని తెలిపారు.

‘సీఎస్ పునేఠా, ఇంటెలిజెన్స్ చీఫ్‌ వెంకటేశ్వర్రావు, ముగ్గురు ఎస్పీలు, పక్కకు తప్పించిన అధికారులు చంద్రబాబుకు కీలుబొమ్మలని చూపే ఆధారాలు ఎలక్షన్ కమిషన్ దగ్గరున్నాయి. అనవసరంగా కెలుక్కుని అవన్నీ బయటపెట్టించుకుంటాడు. బట్టలు చింపుకుని ఢిల్లీ వీధుల్లో పరువు తీసుకోవడం తప్ప ప్రయోజనం ఉంటుందా?’ అని ప్రశ్నించారు.

అందుకే బ్యాలెట్ పేపర్ కావాలంటున్నావా?
చంద్రబాబు వ్యవహారం.. పరీక్ష సరిగ్గా రాయని విద్యార్థి ప్రశ్నపత్రంపై ఫిర్యాదు చేసినట్టుందని ఎద్దేవా చేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌ను బదిలీ చేయకుండా తన బంధువైన ఏబీ వెంకటేశ్వర్రావును ఎలా పక్కకు తప్పిస్తారని అడుగుతుంటే ఇతని మానసిక స్థితి బాగా లేదని దేశమంతా తెలిసి పోయిందన్నారు. బ్యాలెట్ పేపర్ రోజుల్లో రిగ్గింగ్ తేలికగా జరిపేవారని, ఎన్నికల సిబ్బందిని, ఏజెంట్లను మ్యానేజ్ చేస్తే టకాటకా గుద్ది బాక్సుల్లో వేయించిన అనుభవం చంద్రబాబుదని ఆరోపించారు. ఓటింగ్ మిషన్లను రిగ్గింగ్ చేయాలంటే చాలా సమయం పడుతుందని, అందరికీ తెలిసిపోతుందని, అందుకే పదేపదే బ్యాలెట్ పేపర్ కావాలంటున్నాడని దుయ్యబట్టారు.

దెబ్బ మామూలుగా తగిలినట్టు లేదుగా..
ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో వారే ఆంధ్ర ఓటర్లని, మైండ్ బ్లాకయిన వ్యక్తి తనకెందుకు అలా అయిందో గ్రహించకుండా ఈవీఎంలపై ఓటు వేయడం విద్యావంతులకు కూడా కష్టమని అంటున్నాడని, వీవీ ప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కోర్టు తీర్పునూ తప్పుపడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు దెబ్బ మామూలుగా తగిలినట్టు లేదుగా.! అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top