2024 ఎన్నికలే లక్ష్యంగా పనిచేద్దాం 

Vijaya Sai Reddy Says Lets work for 2024 elections as a target - Sakshi

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి 

పార్టీ శ్రేణులతో తాడేపల్లిలో భేటీ

సాక్షి, అమరావతి: 2024 ఎన్నికలే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రజల మనస్సు ఆకట్టుకుందామని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో పార్టీ అనుబంధ విభాగాల రాష్ట్ర అధ్యక్షులు, వర్కింగ్‌ అధ్యక్షులు, ప్రాంతీయ కోఆర్డినేటర్లు, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్లమెంటు, అసెంబ్లీ విభాగ ఇన్‌చార్జిల రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలోని ప్రతి కార్యకర్త, నాయకుడు, అనుబంధ విభాగాల సభ్యులు అందరూ కలిసి కృషి చేసిన ఫలితంగానే అఖండ విజయం సాధించామన్నారు. త్వరలో పార్టీ ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తుందని, ఫోన్‌ చేసి సమస్యలు చెబితే వాటికి పరిష్కారం లభిస్తుందన్నారు.  

సామాజిక న్యాయం పార్టీ కర్తవ్యం  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాజిక న్యాయం కచ్చితంగా అమలు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారని, అదే దృక్పథంతో ఆయన మంత్రివర్గ కూర్పు చేశారన్నారు. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ కార్యకర్తా బాధపడకుండా ముఖ్యమంత్రి జగన్‌ అందరికీ న్యాయం చేస్తారన్నారు. పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ జయంతి రోజును ఏపీ రైతు దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశానన్నారు.
 
అందరి శ్రమతోనే అధికారం 
విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అందరి కష్టంతో పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో పార్టీ నేత కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రక్షణనిధి, సింహాద్రి రమేశ్, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, డాక్టర్ల విభాగం అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఖాదర్‌ బాషా, నేతలు అన్నంరెడ్డి హర్షవర్దన్, మేడపాటి వెంకట్, సలాంబాబు, హరీష్‌ యాదవ్, రాచమల్లు రవి, కుప్పం ప్రసాద్, సినీ నటుడు విజయచందర్, వంగపండు ఉష పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top