ప్రజా సమస్యలపై ఉధృత పోరాటం

Vijaya Sai Reddy meeting With YSRCP Leaders In Guntur - Sakshi

వైఎస్‌ జగన్‌ మనకు ఆదర్శం

అధికార పార్టీ కుట్రలను తిప్పికొట్టాలి

వైఎస్సార్‌ సీపీ జిల్లా సమన్వయకర్తలు, నాయకుల ప్రత్యేక సమావేశంలోఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రాణాలకు తెగించి వారి సమస్యలపై పోరాటం చేస్తున్నారని, ఆయన్ను ఆదర్శంగా తీసుకుని పార్టీ శ్రేణులు పని చేయాలని రాజ్యసభ సభ్యుడు, పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి వి.విజయసాయిరెడ్డి సూచించారు. పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన జిల్లాకు చెందిన పార్లమెంట్, అసెంబ్లీ సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల పాటు ఇచ్చిన హామీలను పక్కనబెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన అధికార టీడీపీ.. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కొత్త ఎత్తుగడలను వేస్తుందన్నారు. నేతలు అప్రమత్తంగా ఉండి వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా సమాయత్తం కావాలని చెప్పారు. పార్టీ అధికా రంలోకి రాగానే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో నేతలంతా సమన్వయంతో కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.

ప్రజల్లో భరోసా నింపండి..
2019 ఎన్నికల్లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే నవరత్నాలను అమలులోకి తీసుకొచ్చి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరి కష్టాలు తీరుస్తారని ప్రజల్లో భరోసా నింపాలని  విజయసాయిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూ నవరత్నాలు, వాటి ఉపయోగాలను ప్రజల్లోకి పూర్తి స్థాయిలో తీసుకెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ముందుండి ప్రతి ఒక్కరూ నడిపించాలన్నారు. జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై పార్టీ నేతలంతా కలిసి కట్టుగా పోరాటాలు చేయాలని సూచించారు. పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు చేపడుతున్న కక్ష సాధింపు చర్యలను తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో పీఏసీ మెంబర్‌ సాది దుర్గాప్రసాద్‌రాజు, ఆఫీస్‌ అనుబంధ విభాగాల కో ఆర్డినేటర్‌ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, బాపట్ల, గుంటూరు, నరసరావుపేట పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు మోపిదేవి వెంకటరమణ, రావి వెంకటరమణ, అంబటి రాంబాబు, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల పార్లమెంటు సమన్వయకర్తలు కిలారి రోశయ్య, లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా, డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు మేరుగ నాగార్జున, మేకతోటి సుచరిత, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, విడదల రజని, చంద్రగిరి ఏసురత్నం, వుండవల్లి శ్రీదేవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top