అవినీతి రహిత పాలన

Vijaya Sai Reddy Comments In Incharges meeting of YSRCP Booth Committees - Sakshi

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి హామీ  

పార్టీ కార్యక్రమాలను ఇకపై మరింత ముమ్మరం చేస్తాం  

2024లో వైఎస్సార్‌సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలి  

తాడేపల్లిలో రాష్ట్రస్థాయి వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీల ఇన్‌చార్జిల సమావేశం

సాక్షి, అమరావతి: పార్టీ కోసం పని చేసిన వారందరికీ తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని, వారికి సముచితమైన గౌరవం కల్పిస్తామని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున తాను మాట ఇస్తున్నానని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అని నిర్లక్ష్యంగా ఉండబోమని, వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తామని అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గురువారం రాష్ట్రస్థాయి వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీల ఇన్‌చార్జిల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి అమరావతికి తరలించామని చెప్పారు. త్వరలో ఇక్కడ కొత్త కార్యాలయం ఏర్పాటు చేసుకుందామని పేర్కొన్నారు. తాను ఇకపై శని, ఆదివారాల్లో పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని వెల్లడించారు.  ప్రజాసంకల్ప యాత్ర సమయంలో ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతోందన్నారు. ప్రజలకు అవినీతి రహిత పాలన అందించి, 2024లో వైఎస్సార్‌సీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఇదే స్ఫూర్తితో కార్యకర్తలంతా కృషి చేయాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.  

ప్రజాస్వామ్యబద్ధంగా వలంటీర్ల నియామకం: అజేయ కల్లం  
గ్రామ వలంటీర్‌ అంటే సేవకు మారుపేరు అని సీఎం ముఖ్య సలహాదారు అజయ్‌ కల్లం చెప్పారు. గ్రామ వలంటీర్ల నియామకం పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్నారు. గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో ప్రతి 50 ఇళ్లకు ఒక ఫెసిలిటేటర్‌ను నియమించబోతున్నామని తెలిపారు. వీరు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాల్సి ఉంటుందన్నారు. వారికి గౌరవ వేతనం రూ.5 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. సాధికార సర్వే ప్రకారం రాష్ట్రంలో 1.44 కోట్ల ఇళ్లు ఉన్నాయన్నారు. దాదాపు 3 లక్షల మంది వలంటీర్లను తీసుకోవాలని అనుకున్నామన్నారు.వలంటీర్ల నియామకంపై రేపో మాపో విధివిధానాలతో కూడిన జీవో వస్తుందని పేర్కొన్నారు. ఆ జీవో ప్రకారం మండల స్థాయిలో సెలక్షన్‌ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పదో తరగతి, గ్రామాల్లో ఇంటర్, అర్బన్‌ ఏరియాల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు పాటిస్తామన్నారు. ప్రతి కేటగిరీలో వీలైనంత వరకు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, బూత్‌ కమిటీల రాష్ట్ర కో–ఆర్డినేటర్‌  కె.సుధాకర్‌రెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ కో–ఆర్డినేటర్‌ అన్నంరెడ్డి, హర్షవర్దన్, మేడపాటి వెంకట్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చల్లా మధు, సోషల్‌ మీడియా కో–ఆర్డినేటర్‌ జి.దేవేందర్‌రెడ్డి, ప్రాంతీయ బూత్‌ కమిటీల కన్వీనర్లు బి.వెంకటేశ్వరరావు చౌదరి, పి.మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top