సీబీఐ లుకలుకలు బయటపడుతున్నాయ్‌!

Vasireddy Padma Slams Chandrababu In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేసుల విషయంలో పచ్చ మీడియాకు మూడో కన్నుగా కనిపించిన సీబీఐ ఇప్పుడు మాత్రం ‘ఛీబీఐ’గా కనిపిస్తోందా!?.. తమకు నచ్చితే నంది, లేకుంటే పంది అనే మాదిరిగా తెలుగుదేశం పార్టీ పత్రికల తీరు ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బినామీ అయిన సీఎం రమేష్‌పై దాడులు జరపగానే ‘ఛీబీఐ’గా మారిందా? అని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. సీబీఐని అవసరాలకు వాడుకుంటూ భ్రష్టు పట్టించారని, అందులో పనిచేసే వారినే అరెస్టుచేసే దుస్థితికి రాజకీయ నాయకులు తీసుకువచ్చారని ఆమె ఆరోపించారు. సీబీఐను కాంగ్రెస్, టీడీపీలు దుర్వినియోగం చేస్తున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చెప్పినపుడు పచ్చ మీడియాకు వినపడలేదా? అని ఆమె సూటిగా ప్రశ్నించారు. సీఎం రమేష్‌ వ్యవహారాలు చాలా బయటకు రావాల్సినవి ఉన్నాయని, అసలు రమేష్‌ను నిర్దోషి అని తేల్చేందుకు పత్రికలకు ఏం హక్కు ఉందని ఆమె అన్నారు. రమేష్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నారని, అధికారులు తప్పుడు వాంగ్మూలాన్ని ఇచ్చారని, సీఎం రమేష్‌ను ఇరికించే యత్నం చేస్తున్నారంటూ పత్రికల్లో కథనాలు రాయడంపై పద్మ అభ్యంతరం తెలిపారు. గతంలో సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకుని జగన్‌పై ఎలా బురద జల్లారో ప్రజలింకా మర్చిపోలేదన్నారు.  

దర్యాప్తు సంస్థలను భ్రష్టు పట్టించిన బాబు 
కాగా, చంద్రబాబు సీబీఐని ఎలా భ్రష్టు పట్టించారనడానికి వాసిరెడ్డి పద్మ ఉదాహరణలు ఇస్తూ.. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చంద్రబాబు అక్రమాలపై  పిటిషన్‌ వేస్తే సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోర్టు ఆదేశించిందన్నారు. అయితే, చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే దాకా సీబీఐ ఒక్క అడుగు ముందుకు కదల్లేదన్నారు. ఇదే సీబీఐ.. కాంగ్రెస్‌ పార్టీ, శంకర్‌రావు, టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌ గజపతిరాజులు కలిసి కోర్టులో పిటిషన్‌ వేస్తే విచారణకు ఆదేశించిన గంటల వ్యవధిలోనే వందల టీమ్‌లను సీబీఐ జగన్‌ మీదకు పంపిందని పద్మ గుర్తుచేశారు. ఈడీలోని తన మనుషులతో జగన్‌ భార్యపై కూడా కేసులు పెట్టించే నీచ స్థితికి చంద్రబాబు దిగజారారన్నారు. అసలు సీబీఐ పతనంలో ఎవరి పాత్ర ఎంత అనేది కూడా తేలాలన్నారు.  

గతంలో జగన్‌ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు తిత్లీ తుపాను సహాయక చర్యలు భేష్‌ అని చంద్రబాబుకు సర్టిఫికెట్‌ ఇవ్వడమేమిటి? అని పద్మ మండిపడ్డారు. బాధితులు తిండి, మంచినీరు లేక రోదిస్తుంటే ఆయన అలా అనడం ఎంతవరకు సమంజసం? అసలు వీరి బంధం ఏనాటిది? అని ఆమె ప్రశ్నించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ సభ ఒక్కరే వెళ్లటం వెనుక ఆంతర్యం ఏమిటని కూడా ఆమె అన్నారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top