పవన్‌కు ప్రశ్నించే హక్కు లేదు

vasireddy padma commented on pavan kalyan - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌: జనసేన నేత పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించే నైతిక హక్కును కోల్పోయారని, వాస్తవానికి ఆయన సమాధా నం చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతునిచ్చి, ఇప్పటికీ ఆ బంధాన్ని కొనసాగిస్తున్న పవన్‌ తన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికే ‘నేను ప్రశ్నిస్తున్నా ను’ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ మేనిఫెస్టోపై పవన్‌ కల్యాణ్‌ ఫొటో కూడా ఉందని, అందులోని హామీలకు ఆయన కూడా బాధ్యత వహించాలని, దాన్నుంచి తప్పించు కోలేరన్నారు. బాబు ప్రభుత్వం నాలుగేళ్లుగా సాగిస్తున్న అరాచకాలు, అన్యాయాలు, రాజ్యాంగ ఉల్లంఘనల్లో పవన్‌కు కూడా వాటా ఉందా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. వాటా ఉండబట్టే చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదువుతున్నారని విమర్శించారు.

23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది చాలక వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇస్తే పవన్‌ ప్రశ్నించకుండా ఎక్కడ ఉన్నారు? రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నా, కోర్టులు తప్పు పడుతున్నా ఈ వ్యవహారాలన్నింటిపై పవన్‌కు కడుపు మండటం లేదా? లేక మండకుండా తాయిలం మింగి నిద్ర పోయారా? అని ప్రశ్నించారు.

Back to Top