అసలు ముద్దాయిలు కేసీఆర్, హరీశ్‌లే..

Uttamkumar Reddy Slams KCR And Harish Rao Over Unfair Arrests - Sakshi

టీఆర్‌ఎస్‌ అధినేతకు తొత్తులుగా కొందరు పోలీసులు

మూణ్నెల్ల తర్వాత అధికారంలో ఉండేది కాంగ్రెస్సే 

ఎవరినీ వదిలిపెట్టం.. అందరి జాబితా సిద్ధం  

కేసీఆర్‌ కుటుంబాన్ని తరిమికొట్టడం చారిత్రక అవసరం 

పార్టీలో పలువురు నేతల చేరిక సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తూ కాంగ్రెస్‌ నేతలను ఇబ్బందులు పెడుతున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. మూణ్నెల్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉంటుందన్న విషయాన్ని సదరు అధికారులు మర్చిపోవద్దన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన ఏ అధికారినీ వదిలిపెట్టేది లేదని, అలాంటి అధికారుల జాబితా సిద్ధం చేస్తున్నామని హెచ్చరించారు.

బుధవారం గాంధీభవన్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అధ్యక్షతన జరిగిన సభలో మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, జె.అనిరుధ్‌రెడ్డి (జడ్చర్ల), పైలెట్‌ రోహిత్‌రెడ్డి (తాండూరు), విజయ్‌కుమార్‌రెడ్డి (ముథోల్‌) ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉత్తమ్‌ ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడారు. ఎప్పుడో 2005లో కేసు వేస్తే 13 ఏళ్ల తర్వాత 2018లో జగ్గారెడ్డిని అర్ధరాత్రి పోలీసులు మఫ్టీలో వచ్చి కనీసం కుటుంబ సభ్యులకు చెప్పకుండా అరెస్టు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నేతలను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల జోలికిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అసలు ఈ కేసులో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావులే ముద్దాయిలని, ఈ విషయాన్ని 2007లో జరిగిన సీఐడీ విచారణలో రాషెద్‌ అనే వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడని చెప్పారు.  

గుజరాతీ మహిళను అమెరికా పంపిన హరీశ్‌.. 
2005–06లో హరీశ్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఓ గుజరాతీ మహిళను తన భార్యగా చూపెట్టి అమెరికాకు పంపాడని, కేసీఆర్‌ కూడా అమెరికాకు అక్రమంగా జనాన్ని పంపారని రాషెద్‌ చెప్పాడన్నారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో కానీ, అంగీకార వాంగ్మూలంలో కానీ జగ్గారెడ్డి పేరు లేదని, అప్పటి టీఆర్‌ఎస్‌ నేతలు లింగయ్య, మధుసూదన్‌రెడ్డి పేర్లు ఉన్నాయని చెప్పారు. వాస్తవం ఇలా ఉంటే కాంగ్రెస్‌ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఆపద్ధర్మ సీఎం హోదాలోనే ఇలా ఉంటే పొరపాటున కేసీఆర్‌ మళ్లీ అధికారంలోకి వస్తే మానవ హక్కులు, సామాన్యుల హక్కులను కాలరాస్తారనే విషయాన్ని అందరూ గమనించాలని కోరారు.

నాలుగు కోట్ల మంది ఉన్న తెలంగాణ సమాజాన్ని నాలుగేళ్లుగా నలుగురు వ్యక్తులున్న ఓ కుటుంబం పీడిస్తోందని ఉత్తమ్‌ అన్నారు. తెలంగాణను లూటీ చేయడమే కాకుండా వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెట్టిస్తున్నారన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టడం చారిత్రక అవసరమని చెప్పారు. కొంగరకలాన్‌ సభలో 25 వేల గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా నీళ్లిచ్చామని కేసీఆర్‌ చెప్పారని, ఇంతకన్నా అబద్ధం మరోటి లేదన్నారు. కేవలం కమీషన్ల కక్కుర్తితో ఈ పథకం కింద రూ.50 వేల కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు కంకణం కట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.  

చెంచాగిరీ చేసేవారికే ప్రమోషన్లు... 
కేసీఆర్‌ తనకు తానే మేధావిని అని అనుకుంటున్నాడని, ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన ఉన్నవాడే అలా అనుకుంటాడని కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ తనకు చెంచాగిరీ చేసే అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నాడని, రాజీవ్‌శర్మ కేసీఆర్‌కు బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నాడని అన్నారు. ఇంత అవినీతి ప్రభుత్వాన్ని తానెక్కడా చూడలేదని, కేవలం డబ్బుపై ఆధారపడి గెలవాన్న ఉద్దేశంతోనే కేసీఆర్‌ ముందుకెళుతున్నాడన్నారు. ముందస్తు ఎన్నికలు కేసీఆర్‌ పుట్టి ముంచడం ఖాయమని మాజీ మంత్రి డి.కె.అరుణ అన్నారు. టీఆర్‌ఎస్‌కు వచ్చేది వంద సీట్లు కాదని, కేవలం పది సీట్లే అన్నారు.

దోచుకున్న డబ్బుతో మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్‌ కలలు కంటున్నాడని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ గెలుపును ఆపడం ఆయన తరం కాదని అన్నారు. కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే బాధ్యత యువతపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబ్‌నగర్‌ డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, రంగారెడ్డి జిల్లా నేతలు పటోళ్ల కార్తీక్‌రెడ్డి, రమేశ్‌ మహరాజ్, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ యాదవ్‌తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top