రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు

Uttamkumar Reddy Fires on TRS Govt - Sakshi

పార్టీలోకి వంటేరు, ఎర్రబెల్లి అల్లుడు సహా 60 మంది

టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయి: ఉత్తమ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో పలువురు తెలంగాణ నేతలు పార్టీ లో చేరారు. శుక్రవారం ఢిల్లీలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ఆధ్వర్యంలో టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అల్లుడు మదన్‌మోహన్‌రావు, తెలంగాణ కాంత్రి దళ్‌ అధ్యక్షుడు సంగంరెడ్డి పృధ్వీరాజ్, ఏఐఎఫ్‌టీవో డిప్యూటీ కార్యదర్శి జి. హర్షవర్దన్‌రెడ్డి, సిద్దిపేట టీడీపీ ఇన్‌చార్జి చంద్రం సహా సుమారు 60 మంది నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారికి రాహుల్‌ గాంధీ కండువాలు కప్పి సాదరంగా కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రణాళికకు సంబంధించి త్వరలో పార్టీ నేతలతో మరోసారి సమావేశం నిర్వహిస్తానని రాహుల్‌ చెప్పినట్లు నేతలు తెలిపారు. 

టీఆర్‌ఎస్‌కు రోజులు దగ్గరపడ్డాయి: ఉత్తమ్‌ 
తెలంగాణలో నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌లో కేసీఆర్‌ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ విధానాలు నచ్చి పార్టీలో చేరిన నేతలకు మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అభినందించారు. గజ్వేల్‌లో విజయం సాధించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి బహుమానంగా ఇస్తానని వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.

తనపై ఎన్నికల కుట్ర చేసినా అవినీతిమయమైన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుండా కాంగ్రెస్‌లో చేరినట్టు చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టి హింసించినా వెనక్కు తగ్గబోనని ఆయన స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ, దేశాభివృద్ధి ఒక్క కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందని నమ్మి కాంగ్రెస్‌లో చేరినట్టు మదన్‌మోహన్‌రావు పేర్కొన్నారు. తెలంగాణలో భూమి లేని వారు 70 శాతం మంది ఉన్నట్లు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసిందని, కేవలం 30 శాతం మంది చేతుల్లోనే ఉన్న భూములకు కేసీఆర్‌ రైతుబంధు కింద డబ్బులిచ్చారని, మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటని పృథ్వీరాజ్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రజావ్యతిరేక విధానాలపై విద్యార్థులు, యువత పోరాడాలని కోరారు.

డీసీసీ అధ్యక్షుల నియామకం...
తెలంగాణ పాత జిల్లాల ప్రకారం ఖమ్మం మినహా అన్ని జిల్లాలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుల నియామకాన్ని రాహుల్‌ గాంధీ శుక్రవారం ఆమోదించారు. నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా తాహెర్‌ బిన్‌ హమ్దన్, నిజామాబాద్‌ సిటీ అధ్యక్షుడిగా కె. వేణు, కరీంనగర్‌ జిల్లా అధ్యక్షుడిగా కటకం మృత్యుంజయం, సిటీ అధ్యక్షుడిగా కర్రా రాజశేఖర్, ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా అల్లేటి మహేశ్వర్‌రెడ్డి, మెదక్‌ జిల్లా అధ్యక్షురాలిగా వి. సునీతాలక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కె.మల్లేష్, మహబూబ్‌నగర్‌ జిల్లా అధ్యక్షుడిగా ఒబేదుల్లా కొత్వాల్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా బూడిద భిక్షమయ్యగౌడ్, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడిగా నాయిని రాజేంద్రరెడ్డి, వరంగల్‌ సిటీ అధ్యక్షుడిగా కె. శ్రీనివాస్‌రావు, రామగుండం సిటీ అధ్యక్షుడిగా కె. లింగస్వామి యాదవ్, హైదరాబాద్‌ సిటీ అధ్యక్షుడిగా అంజన్‌కుమార్‌ యాదవ్‌ల నియామకాన్ని రాహుల్‌ ఆమోదించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top