అన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే..

Uttamkumar reddy fires on KCR govt - Sakshi

కేసీఆర్‌ సర్కార్‌పై ఉత్తమ్‌ ధ్వజం 

మణుగూరులో కాంగ్రెస్‌ ప్రజాచైతన్య బస్సుయాత్ర సభ

సాక్షి, కొత్తగూడెం: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అడుగడుగునా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య బస్సుయాత్ర మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గానికి చేరుకుంది. మణుగూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎప్పటికప్పుడు న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు పడుతున్నా.. ప్రభుత్వ పనితీరులో మార్పు లేదన్నారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే పెత్తనం చెలాయిస్తూ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ప్రశ్నించేవారి గొంతు లు నొక్కేందుకు అనేక కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలోనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌ సభ్యత్వాలను రద్దు చేశారని, ఇది పూర్తి గా అప్రజాస్వామికమన్నారు. ఇరువురి సభ్యత్వాలను కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడం ప్రజాస్వామ్య విజయమని, కేసీఆర్‌ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పారు. దీన్ని బట్టి సీఎం, స్పీకర్‌లకు ఆ పదవుల్లో కొనసాగే అర్హత లేదని, వారు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లలో న్యాయస్థానాలు అనేకసార్లు తప్పుపట్టిన కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ప్రజలే పాతరేయాలని ఆయన పిలుపునిచ్చారు. 

హామీల అమలులో విఫలం 
హామీల అమలులో సీఎం విఫలమయ్యారని ఉత్తమ్‌ విమర్శించారు. దళితులను సీఎంను చేస్తాననే హామీని విస్మరించారని, వారికి మూడెకరాల భూమి ఇస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. అటవీ హక్కుల చట్టం కింద కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనులకు పట్టాలిస్తే ఆ భూములను హరితహారం పేరుతో లాక్కొని వారికి అన్యాయం చేశారని మండిపడ్డారు. కేజీ టు పీజీ విద్య, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, ఒకేసారి రుణమాఫీ, అభయహస్తం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తదితర పథకాలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. కేవలం కాంట్రాక్టర్లను బాగు చేస్తూ కమీషన్లు దండుకునేందుకు మాత్రమే ఇరిగేషన్, మిషన్‌ భగీరథ పథకాలకు వేలకోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మణుగూరు వద్ద రూ.7,300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ వల్ల ఉపయోగం ఏమీ లేకపోగా, ఆ పరిసర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులనూ కేసీఆర్‌ మోసం చేశారన్నారు. ఈ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బహిష్కరించి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు.

లక్ష ఉద్యోగాలిస్తాం..
కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. పోడు భూములు సాగు చేసుకునే గిరిజనులకు పట్టాలు ఇస్తామని, దళితులకు తక్షణమే మూడెకరాల భూమి పంపిణీ చేస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ.లక్ష రివాల్వింగ్‌ ఫండ్‌తో పాటు రూ.10 లక్షల బ్యాంకు రుణం ఇచ్చి వడ్డీ ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. అభయ హస్తం పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు.

లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని, లేకుంటే నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇప్పిస్తామన్నారు. గత ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పినపాక టికెట్‌ను త్యాగం చేసిన రేగా కాంతారావుకు ఈసారి టికెట్‌ కేటాయించనున్నట్లు ప్రకటించారు. సభలో పార్టీ నేతలు షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బలరాంనాయక్, రేగా కాంతారావు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top