బీజేపీకి పరాభవం తప్పదు: ఉత్తమ్‌

Uttamkumar Reddy comments on BJP about next elections - Sakshi

     వచ్చేఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారం 

     టీఆర్‌ఎస్‌ పాలన అవినీతిమయం

     మేము అధికారంలోకి వస్తే రూ.3 వేల నిరుద్యోగభృతి ఇస్తాం

సాక్షి, వరంగల్‌ రూరల్‌: కర్ణాటకలో బీజేపీకి ఏ విధంగా పరాభవం ఎదురైందో.. ఇక దేశ వ్యాప్తంగా అలాంటి పరిస్థితి తప్పదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్ధన్నపేటలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్‌ అధ్యక్షతన శనివారం రాత్రి జరిగిన కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సు యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని, రాహుల్‌ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదని, కేసీఆర్‌ పాలనలో మోసపోయామనే భావనలో ప్రజలు ఉన్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 80 ఎమ్మెల్యే స్థానాలు గెలిచి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు డబ్బులు ఉంటాయి కానీ రైతులకు బోనస్‌ ఇచ్చేందుకు ఉండవా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏక కాలంలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని, ప్రతి పంటకు రూ.300 నుంచి బోనస్‌ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో పంటలకు బోనస్‌ ఇచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పంటలకు ప్రత్యేక బీమాను ప్రభుత్వమే చేయించి నష్టపోయిన సమయంలో పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు.  

ఓట్లు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదు 
వర్థన్నపేటలో ఒక్క డబుల్‌ బెడ్రూం కట్టించని సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌లకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటిని అందిస్తామని 2014లో అసెంబ్లీలో ఎన్నికల ముందు చెప్పి ఇప్పటికీ అందించలేదని విమర్శించారు. 

అవినీతిలో తెలంగాణ రెండోస్థానం 
దే«శంలో అత్యంత అవినీతి ఉన్న రాష్ట్రాల్లో 73 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఓ ప్రముఖ ఇంగ్లిష్‌ పత్రిక చేసిన సర్వేలో పేర్కొన్నట్లు ఉత్తమ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.6.75 లక్షల కోట్ల బడ్జెట్, రూ.2 లక్షల కోట్లను అప్పులు తెచ్చినా వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు. 

కనీసం ఊరికో ఉద్యోగమూ ఇవ్వలేదు 
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని, తన కుటుంబంలో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు కల్పించారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగా నే 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్, టీచర్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువతకు రూ.3 వేల భృతి చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

మా కార్యకర్తల జోలికి వస్తే అంతు చూస్తాం 
అధికార పార్టీ నేతలు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే అంతు చూస్తామని పీసీసీ చీఫ్‌ హెచ్చరించారు. అధికారులు న్యాయంగా, ధర్మంగా విధులు నిర్వర్తించాలి.. టీఆర్‌ఎస్‌ నేతలకు తొత్తులుగా ఉంటే మేం అధికారంలోకి వచ్చిన తరువాత వదిలి పెట్టబోమని హెచ్చరించారు. 

సోషల్‌ మీడియాను వినియోగించండి
టీఆర్‌ఎస్‌ నేతలు మిషన్‌ కాకతీయ, భగీరథ పేరుతో జనం మీదపడి దోపిడీ చేస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కొన్ని పత్రికలు, మీడియా ముందుకు రావడం లేదు కాబట్టి.. సోషల్‌ మీడియా ద్వారా వాటిని బయటకు తీయాలని కార్యకర్తలకు సూచించారు. సభలో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ మహిళ విభాగం ప్రధానకార్యదర్శి సీతక్క పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top