అన్ని వర్గాలతో రాహుల్‌ ముఖాముఖి

Uttam reviews arrangements for Rahul Gandhi's visit - Sakshi

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

శంషాబాద్‌ క్లాసిక్‌ త్రీ కన్వెన్షన్‌లో ఏర్పాట్ల పరిశీలన  

శంషాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేరుగా వారిని అడిగి తెలుసుకుంటారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగే రెండురోజుల పర్యటనలో భాగంగా మహిళ లు, మైనార్టీ వర్గాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారులు ఇలా అన్నివర్గాల వారితో ముఖాముఖి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారన్నారు.

సోమవా రం పట్టణంలోని క్లాసిక్‌ త్రీ కన్వెన్షన్‌లో ఆయన కాంగ్రెస్‌ నేతలతో కలసి రాహుల్‌ గాంధీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంత రం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 13న మధ్యాహ్నం 2.30కి శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగనున్న రాహుల్‌ గాంధీ నేరుగా శంషాబాద్‌లోని క్లాసిక్‌ త్రీ కన్వెన్షన్‌కు చేరుకుంటారన్నారు. అక్కడ డ్వాక్రా సంఘాల మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో మహిళా సంఘాలు రుణాలు పొందడంలో ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై వారితో చర్చిస్తారని చెప్పారు. అనంతరం నాంపల్లి, శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.

ఓయూ విద్యార్థులతో భేటీ
ఈ నెల 14వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు వ్యాపార వర్గాలను కూడా రాహుల్‌ గాంధీ కలుస్తారని ఉత్తమ్‌ తెలిపారు. అంతకుముందు, పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, మాజీ మంత్రి సబితారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి శ్రవణ్, కార్తీక్‌రెడ్డితో కలసి ఆయన చర్చించారు.  

రాహుల్‌కోసం కొత్త బస్సు
సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకోసం కొత్త బస్సు సిద్ధమైంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్ని హంగులతో ఏర్పాటు చేసిన ఈ బస్సులోనే రాహుల్‌ పర్యటించనున్నారు. కేవలం ఆరు సీట్లు మాత్రమే ఉండే ఈ బస్సులో హైడ్రాలిక్‌ సిస్టం ద్వారా ఓపెన్‌ టాప్‌ స్టేజీ సౌకర్యం ఏర్పాటు చేశారు. బస్సుయాత్రలో భాగంగా రాహుల్‌ పలు నియోజకవర్గాల్లో జరిగే సమావేశాల్లో ఈ బస్సు నుంచే ప్రసంగించనున్నారు.

బస్‌ చుట్టూ సీసీ కెమెరాలు, లైట్లు ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా రాహుల్‌ ఆరుగురు ముఖ్యులతో సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఈ బస్సును ఉత్తమ్‌ పరిశీలించారు. కాగా, రాహుల్‌ పర్యటన ఏర్పాట్లకోసం రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నేతలతో ఉత్తమ్‌ గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. తాత్కాలికంగా నిర్దేశించుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఎక్కడెక్కడ సమావేశాలు ఏర్పాటు చేయా లనే దానిపై చర్చించారు. అనంతరం రాహుల్‌ పర్యటించే శంషాబాద్, నాంపల్లి ప్రాంతాలను టీపీసీసీ నేతలతో కలసి ఉత్తమ్‌ పరిశీలించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top