‘నేను సైనికుడిని.. కేసీఆర్‌ ఓ బ్రోకర్‌’

Uttam Kumar Reddy Slams CM KCR - Sakshi

మీట్‌ది ప్రెస్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌ ఓ బ్రోకరని, ఆయనకు సోనియాగాంధీ గురించి మాట్లాడే అర్హత లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. సోమవారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన మీట్‌ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఏర్పడితే తమ జీవితాలు మారుతాయని, స్వాతంత్ర్య ఉద్యమ తరహాలో తెలంగాణ సమాజం పోరాడింది. కానీ అన్ని వర్గాలను కేసీఆర్ మోసగించాడు. యావత్ తెలంగాణ సమాజం ఛీ కొడుతున్నా.. మొండితనంతో ముందుకెళ్తున్నారు. కేసీఆర్ పాలనలో మీడియా అణిచివేయబడింది. పత్రికా స్వేచ్ఛకోసం పోరాడుతున్న జర్నలిస్టుల పోరాటం మాకు స్పూర్తిదాయకం. డబుల్, ట్రిపుల్ బెడ్ రూం, గెజిటెడ్ కమ్యునిటీల పేరుతో ఇన్నాళ్లు కేసీఆర్‌ జర్నలిస్టులను మోసం చేశారు. తమ ప్రభుత్వంలో జర్నలిస్టులకు పూర్తి సహకారం ఉంటుంది. 

కేసీఆర్‌ ఒక్కరే..
తెలంగాణ ఏర్పాటును ఎందరో వ్యతిరేకించారు. హైదరాబాద్ విషయంలో ఎంతో మెలిక పెట్టారు. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఏర్పడేది కాదు. ఈ మాటలు కేసీఆర్ కూడా అసెంబ్లీలో చెప్పారు. తెలంగాణ బిల్లు సమయంలో 543 మంది ఎంపీల్లో కేసీఆర్ ఒక్కడే టీఆర్ఎస్ ఎంపీ, అప్పటికే విజయశాంతి కాంగ్రెస్‌లో చేరారు.  ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేరు. కానీ అన్ని పక్షాలను ఒప్పించి కాంగ్రెస్‌ తెలంగాణను ఏర్పాటు చేసింది. మొన్న పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటును ఎలా తప్పుపట్టారో అందరూ చూశారు. తెలంగాణను తీవ్రంగా వ్యతిరేకించిన ఎంఐఎం ఇప్పుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులు. తెలంగాణ ఇచ్చినా.. తమ పార్టీ కొన్ని పొరపాట్లతో గత ఎన్నికల్లో అధికారం దక్కలేదు. కేవలం 33 శాతం ఓట్లతో కేసీఆర్ సీఎం అయ్యారు. భారతదేశంలో ఇంత దారుణంగా రాజకీయాలను భ్రష్టు పట్టించిన సీఎంలు లేరు. సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీలను కొని రాజకీయాలను దిగజార్చారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో స్పీకర్‌ పదవికి విలువే లేకుండా పోయింది.

నేను భారత సైన్యంలో ఉన్నా..
మిషన్ భగీరథలో 6% కమీషన్ తీసుకున్నది వాస్తవం కాదా? నేను ఒక అమ్మకు అబ్బకు పుట్టానా అని నిజామాబాద్‌లో కేసీఆర్ అన్నారు. నువ్వు దుబాయ్ బ్రోకర్గా ఉన్నప్పుడు నేను భారత సైన్యంలో ఉన్నా.. దొంగ వీసాలు, దొంగ పాస్ పోర్టులు అమ్నుకునే నువ్వా? నా గురించి మాట్లాడేది. నిమ్స్ లో కేసీఆర్ దొంగ దీక్ష అని నేను డాక్యుమెంట్లు కూడా విడుదల చేశా. మణిపూర్లో ఇరోమ్‌ షర్మిల ఇంజక్షన్లు తీసుకొని 20 ఏళ్లు బతికింది... అదే ఇంజక్షన్లు తీసుకున్నా ఆయన కూడా ఏం చచ్చేవాడు కాదు. నేను, నా భార్య ఇద్దరమే, మాకు పిల్లలు కూడా లేరు... తెలంగాణ సమాజమే మాకు పిల్లలు. మిషన్ భగీరథ క్రింద మొత్తం కోటి ఇళ్లలో ఒక లక్ష ఇళ్లకైనా.. కొత్తగా నీళ్లు ఇచ్చారా? కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఒక టూరిజం స్పాట్‌లా మార్చారు. అంతకు మించి కేసీఆర్‌ చేసింది ఏం లేదు.’  అని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top